హైదరాబాద్ రోడ్లపై ఉబర్ బైక్ రయ్ రయ్..!!

2017 జనవరి నుంచి రోడ్డెక్కనున్న బండ్లు!

హైదరాబాద్ రోడ్లపై ఉబర్ బైక్ రయ్ రయ్..!!

Wednesday December 14, 2016,

2 min Read

ఉబర్ కార్లతో పాటు ఇప్పుడు బైకులు కూడా హైదరాబాద్ రోడ్లపై దౌడు తీయబోతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఉబర్ టూ వీలర్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉబర్ బైక్ ట్యాక్సీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, కేటీఆర్, ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్ పాల్గొన్నారు. ఉబర్ బైక్ లను సీఎం కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించగా.. మంత్రి కేటీఆర్ కాసేపు బైక్ నడిపారు.

ఆల్రెడీ టీ-హబ్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఉబర్ కంపెనీ.. మెట్రో రైల్ తోనూ ఒక అగ్రిమెంట్ చేసుకుంది. టీ-హబ్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. హైదరాబాదులో ఉబర్ మోటో సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. నగర ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ఉబర్ మోటోను లాంఛ్ చేశామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉబర్ క్యాబ్స్ నడుస్తున్నాయన్న కేటీఆర్.. ఉబర్ మోటో కూడా సక్సెస్ అవుతుందని ఆకాంక్షించారు.

హైదరాబాద్ సిటీలో ఉబర్ మోటో లాంఛ్ చేయడం సంతోషంగా ఉందని ఉబర్ సీఈవో ట్రావీస్ కానన్ అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లాంటి మహా నగరాలకు మోటో సేవలు అవసరమన్నారు. పట్టణ ప్రాంతాల్లో రద్దీని తగ్గించడానికి కూడా ఉబర్ మోటో ఉపయోగపడుతుందని చెప్పారు.

image


జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, హెల్మెట్ సహా అన్ని సేఫ్టీ ఫీచర్స్ పక్కాగా ఉండే ఈ బైక్ టాక్సీ అత్యంత సేఫ్. నడిపే వాళ్లతో సహా వెనకాల కూర్చున్న వారికీ హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలి అనే నిబంధన ఫాలో అవుతున్నారు. రెండువైపులా ఫీడ్ బ్యాక్ ఇచ్చే ఫెసిలిటీ వుంది. ట్రిప్ డిటెయిల్స్ ఫ్రెండ్స్ కు షేర్ చేసే సదుపాయం కూడా వుంది. మొదటి 3 కిలోమీటర్లకు 20 రూపాయలు, తర్వాత ప్రతీ కిలోమీటరుకు 5 రూపాయల చొప్పున చార్జ్ చేస్తారు. హైదరాబాదులో ఇది అతి చవకైన పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఆప్షన్.

ఈ ఎంట్రీతో గ్లోబల్ ఎక్స్ పాన్షన్ కోసం ఉబర్ మరో అడుగు ముందుకు వేసినట్టయింది. ప్రస్తుతానికి ఉబర్ సేవలు 43 దేశాల్లోని 450 నగరాలకు విస్తరించాయి. అందులో మన దగ్గర 29 నగరాల్లో ఉబర్ సర్వీసులన్నాయి. యాప్ ద్వారా అత్యంత ఎక్కువ కవరేజ్ ఉన్నది కూడా మనదగ్గరే. 

ఇక బైక్ విషయానిక్స్తే ప్రస్తుతానికి బెంగళూరు, అహ్మదాబాద్, గూర్గావ్ లో అందుబాటులో ఉంది. వీటితోపాటు ఇండోనేషియా, వియత్నాంలోనూ సర్వీసులున్నాయి. ఇళ్ల నుంచి ఆఫీసులకు, మెట్రో స్టేషన్లకు, ఇంకా ఇతర ప్రదేశాలు మైల్ టు మైల్ మంచి కనెక్టివిటీ ఇవ్వడంలో ఉబర్ సక్సెస్ అయింది.