ఏ ఆడపడుచూ బహిష్టు సమయంలో బాధపడొద్దని ఇలా చేస్తున్నాడు..

ఏ ఆడపడుచూ బహిష్టు సమయంలో బాధపడొద్దని ఇలా చేస్తున్నాడు..

Friday December 02, 2016,

3 min Read

నమ్ముతారో నమ్మరో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో యుక్తవయసు వచ్చిన అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో ఇంకా పాతబట్టలనే వాడుతున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే దేశంలో కేవలం 6శాతం మందికి మాత్రమే శానిటరీ నాప్కిన్స్ గురించి తెలుసు. అదే యూరప్ లో అయితే 96 శాతం ఆడవాళ్లకు వాటి పట్ల అవగాహన ఉంది. సరైన శానిటరీ ప్రొటెక్షన్ లేక గ్రామాల్లోని మహిళలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇన్ఫెక్షన్, ఇన్ఫెర్టిలిటీ వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడి చనిపోతున్నారంటే మనసు చివుక్కుమంటుంది. కేవలం నాప్ కిన్స్ వాడటం తెలియక గ్రామాల్లో అమ్మాయిలు బడి మానేస్తున్నారు. రూరల్ ఏరియాలో బాలికల డ్రాపవుట్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ సమస్య కంటికి చిన్నగానే కనిపించొచ్చు. కానీ దీని పర్యావసానాలు భవిష్యత్తులో ఘోరంగా ఉంటాయి. అందుకే మురుగనాథం వంటి వాళ్లు నాప్కిన్ వాడకం పట్ల మహిళల్లో అవగాహన పెంచేందుకు మడమతిప్పని ఉద్యమాన్ని చేపట్టారు. ఆ కోవలోకే వస్తారు శ్యాం సుందర్ బడేకర్.

గుజరాత్ వడోదరకు చెందిన శ్యాం సుందర్ బట్టలకు వేసే రంగులు, కెమికల్స్ అమ్మే వ్యాపారి. అదొక్కటే కాదు.. గ్రామీణ భారతంలో ఏ ఆడపడుచూ బహిష్టు సమస్యతో బాధపడొద్దని నడుం కట్టిన ఉద్యమకారుడు. కేవలం రెండున్నర రూపాయలకే శానిటరీ ప్యాడ్స్ అందించడమే కాదు.. వాటిని వాడి ఎక్కడో చెత్తకుప్పలో పడేయకుండా, డిస్పోజ్ చేసే ఒక కూజాలాంటి పరికరాన్ని కూడా అదే ధరకు అందిస్తున్నాడు.

ఎందుకంటే ఒకసారి నాప్కిన్ వాడి పడేసిన తర్వాత అది భూమ్మీద కొన్ని వందల ఏళ్లపాటు నాశనం కాకుండా ఉంటంది. సింథటిక్ మెటీరియల్ తో చేయడం వల్ల 500-800 సంవత్సరాల దాకా అది డీ కంపోజ్ కాదు. పట్టణ ప్రాంతాల్లో ఒక మహిళ తన జీవిత కాలంలో 10వేల నాప్కిన్లను వాడి పారేస్తుంది. ఆ లెక్కన 58,500 మిలియన్ల మహిళలు ఏడాదికి తలా పదివేల ప్యాడ్లను వాడి అడ్డగోలుగా పారేస్తున్నారు. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు అన్నీ ఇన్నీ కావు. ఆ సమస్యకంటే ఈ సమస్య చాలా తీవ్రమైంది. అందుకే శ్యాంసుందర్ దీనికీ ఓ పరిష్కారం కనిపెట్టాడు.

మట్టితో ఒక ఎర్రటి కూజా లాంటిది తయారు చేశాడు. పైన సన్నటి రంద్రం.. దానిపై ఒక మూత. చూడ్డానికి నీళ్ల కుండలా ఉంటుంది. నాప్కిన్ వాడిన తర్వాత దాన్ని అందులో వేయాలి. కొంచెం ఎండుగడ్డి, పుల్లలు వేసి అంటుపెడితే చాలు నాప్కిన్ బస్మీపటలం అయిపోతుంది. పొగ పోవడానికి కింద సన్నటి రంద్రం ఉంటుంది. దీనికి అశుద్ధనాశక్ అని పేరు పెట్టాడు. నాలుగేళ్లుగా దీన్నొక ఉద్యమంలా చేపట్టాడు. ఇప్పటిదాకా 1800 యూనిట్ల దాకా ఇవ్వగలిగాడు. సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నడిచే సుమారు 500 ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేశాడు.

image


శ్యాంసుందర్ తయారుచేసిన అశుద్ధనాశక్ వాస్తవానికి ఒక ఎలక్ట్రికల్ ప్రాడక్ట్. అది కొనాలంటే ఎంత లేదన్నా 18వేల నుంచి 20 వేలు అవుతుంది. 50 రూపాయలు పెట్టి ప్యాడ్స్ కొనలేని పేద మహిళలు ఇక అదేం కొంటారు. అందుకే శ్యాంసుందర్ మేథోమథనం చేసి దానికి ప్రత్యామ్నాయంగా కుండలాంటి పరికరాన్ని కనిపెట్టాడు. పైగా దీని వాడకం కూడా సింపుల్. వాడిన ప్యాడ్ ని అందులో పడేసి కొంత ఎండుగడ్డి లేదంటే ఎండిపోయిన చెత్తను వేసి తగలబెట్టడమే. ఆ బూడిద పొలాల్లో ఎరువుగా కూడా వాడొచ్చంటాడు శ్యాంసుందర్.

శ్యాంసుందర్ భార్య స్వాతి బడేకర్ కూడా భర్త అడుగుజాడల్లో నడుస్తోంది. 2010లో వాత్సల్య అనే ఎన్జీవోని స్థాపించి శానిటరీ ప్యాడ్ల వాడకంపై గ్రామాల్లో అనేకమంది మహిళలను చైతన్యవంతుల్ని చేసింది. కేవలం బహిష్టు మూలంగా గుజరాత్ లో ఎంత మంది బాలికలు స్కూల్ మానేశారో తను కళ్లారా చూసి తట్టుకోలేకపోయింది.

శ్యాంసుందర్ కేవలం నాప్కిన్లను అతి తక్కువ ఖరీదుకు అందివ్వడమే కాదు.. అవి తయారు చేసే మెషీన్లను నిరుపేద మహిళలకు అందజేసి వారిని ఆర్ధికంగా నిలదొక్కకునేలా చేయూతనిస్తున్నాడు. వడోదర జిల్లాలో ఇప్పటిదాకా 20 యంత్రాలను మహిళలకు ఇచ్చి వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేశాడు . ఒక్కో మెషీన్ మీద 8-10 మంది మహిళలకు ఉపాధి దొరుకుతుంది.

ఈ క్రమంలో ఎదురైన ఎన్నో సవాళ్లను నిలదొక్కుకుంటూ శ్యాం సుందర్ తనదైన లక్ష్యంవైపు దూసుకుపోతున్నాడు.