నచ్చిన పనిచేసుకుంటూ పోతే విజయం మీ వెంటే- శ్రద్ధాశర్మ

నచ్చిన పనిచేసుకుంటూ పోతే విజయం మీ వెంటే- శ్రద్ధాశర్మ

Thursday April 14, 2016,

2 min Read


"స్టార్టప్ కంపెనీలకు ఓటమి ఉండదు.. తాత్కాలికంగా అలా అనిపించినప్పటికీ.. ప్రయత్నలోపం లేకపోతే ఎప్పటికైనా విజయ తీరాలకు చేరుతారు" 

హైదరాబాదులో జరిగిన డిహెచ్ఐ ల్యాబ్స్ ఈవెంట్లో స్టార్టప్ కమ్యూనిటీని ఉద్దేశించి యువర్ స్టోరీ చీఫ్ ఎడిటర్ శ్రద్ధాశర్మ అన్న మాటలివి. 

పర్టిక్యులర్ గా ఇదే చేయాలి.. ఇది చేయకూడదు.. అనే మాటలు అసలు ఉపయోగించనని అన్నారామె. యువర్ స్టోరీ మొదలు పెడతానంటే తనని ఎంతోమంది ప్రొత్సహించారని గుర్తు చేసుకున్నారు. ఇవాళ యువర్ స్టోరీ ఈ స్థాయిలో ఉందంటే.. దానికి కారణం శ్రేయోభిలాషుల విలువైన సూచనలు, వారి సహాయ సహకారాలే అన్నారు శ్రద్ధాశర్మ. ఎదుటి వ్యక్తుల నుంచి ఎన్నో తెలియని విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.

స్టార్టప్ కమ్యూనిటీతో ఇంటరాక్షన్

ఈవెంట్ కు వచ్చిన స్టార్టప్ కమ్యూనిటీ అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధాన చెప్పారు శ్రద్ధాశర్మ. ఇజ్రాయెల్ స్థాయిలో టెక్నాలజీ స్టార్టప్స్ భారత్ లో ఎందుకు లేవు? అనే ప్రశ్నకు- అక్కడి పరిస్థితులు వేరు.. ఇక్కడి పరిస్థితులు వేరు అన్నారామె. ఇక్కడ ఇకో సిస్టంలో మార్పులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మనం దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఒక్క రోజులో మారిపోలేదని, అలాగే స్టార్టప్ సొల్యూషన్ కూడా ఒక్క రోజులో సాధ్యపడదని అన్నారు. వచ్చే రెండేళ్లలో అనూహ్య మార్పులు చూడొచ్చన్నారు.

యువర్ స్టోరీ ప్రారంభించడానికి కారణం

గెలిచినా ఓడినా సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి అంటారు శ్రద్ధాశర్మ. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీ స్థాపించేవారికి, స్థాపించిన వారికీ ఆ డోసు కాస్త ఎక్కువగానే కావాలంటారు. ఎన్నో విషయాలు సీరియస్ గా తీసుకుంటాం.. అయినా సరే, చిరునవ్వును పెదాల మీదనుంచి ఎప్పుడూ వదలొద్దంటారామె. మనం నవ్వితే ఆటోమేటిగ్గా ఎదుటి వారు కూడా నవ్వుతారనేది శ్రద్ధాశర్మ ఫిలాసఫీ. అలా అని ఊరికే ఉచిత సలహాలిచ్చే అలవాటు తనకి లేదన్నారు. మీడియా రంగంలోకి రావాలనుకున్నాను కాబట్టే యువర్ స్టోరీ ప్రారంభించానని చెప్పారు శ్రద్ధాశర్మ. 

image


కంటెంట్ మార్కెట్ కి డిమాండ్ 

ఈరోజుల్లో అందరికీ ప్రమోషన్ కంటెంట్ అర్థమవుతుందని శ్రద్ధాశర్మ అన్నారు. అడ్వర్టయిజింగ్ రంగంలో ఉన్నా, ఇతర కంటెంట్ రంగంలో ఉన్నవారు కూడా చాలా విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని అన్నారు. అన్నింటినీ అర్థం చేసుకుని కంటెంట్ డెవలప్ చేస్తే బాగుంటుందని చెప్పుకొచ్చారు. కంటెంట్ మార్కెట్ కి ఉజ్వల్ భవిష్యత్ ఉందన్నారు శ్రద్ధాశర్మ.

ఒరిజినల్ కంటెంట్ ని అందించిన వారిసంఖ్య తక్కువగా ఉంది. అడ్వర్టయిజింగ్ కంటెంట్, ఇతర కంటెంట్ కి మధ్య తేడాని తెలుసుకుని జాగ్రత్తగా డెవలప్ చేస్తే ఫలితాలు బాగుంటాయని శ్రద్ధాశర్మ వివరించారు.

ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు 

చాలాసార్లు ఫండింగ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన స్టార్టప్ లకు మీరిచ్చే సలహా ఏంటని అడిగిన ప్రశ్నకు...

“తొంబై తొమ్మిది సార్లు ఫెయిలైనా ఫరవాలేదు.. వందోసారి గెలుస్తాం“ అని జవాబిచ్చారు శ్రద్ధాశర్మ.

చాలా గొప్ప ఐడియాగా చెప్పుకొన్న స్టార్టప్స్ కూడా ఫండింగ్ విషయంలో ఫెయిలైన దాఖలాలు ఉన్నాయి. ఒకటీ రెండు సార్లు ఫండింగ్ రాకపోవచ్చు. మూడోసారి కచ్చితంగా వస్తుంది. టీంకి సర్దిచెప్పుకొని, వారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఫౌండర్ దే అని శ్రద్ధ అన్నారు. 

రిక్రూట్మెంట్ కోసం సోషల్ మీడియాని వాడుకోండి

సాధారణంగా ఎవరికైనా ఉద్యోగులు కావాలనుకుంటే- ఒకటీ రెండు సార్లు మెసేజ్ పెట్టేసి, దొరకట్లేదని ఆపేస్తారు. అదే మనం చేసే తప్పు. దొరకేవరకు వందసార్లు మెసేజ్ పెట్టినా తప్పులేదంటారామె. మనకు కావల్సిన దానికోసం ఎన్నిసార్లయినా ప్రయత్నించడంలో తప్పులేదు కదా అంటారామె.

సంస్థకు ఉద్యోగులు కావాలంటే ఓ రిక్రూటర్ ని హైర్ చేసుకుని, సీవీలు చూసి షార్ట్ లిస్ట్ చేసుకుని, ఇంటర్వ్యూలు చేయడం మానేయాలంటారు శ్రద్ధ. తను రోజులో చాలా రకాలైన మనుషులతో మాట్లాడుతుంటానని, ఐఐటి విద్యార్థులు, ఫ్యాషన్ నిపుణులు, స్టార్టప్ ఫౌండర్లు, ఐటీ ఉద్యోగులు... ఇలా సర్కిల్ పెంచుకుంటూ అన్ని రకాల వారిని రిక్రూట్ చేసుకుంటున్నానని అన్నారామె. ఇటీవలే ఓ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలో పనిచేసిన వ్యక్తిని యువర్ స్టోరీలో ఉద్యోగిగా తీసుకున్నట్లు చెప్పారామె.

“ మన ముఖంలో నవ్వులు లేనంత వరకు- ఎవరి ముఖంలో నవ్వులు చూడలేమని ముగించారు శ్రద్ధాశర్మ ”
image