కార్ పూలింగ్ తో సమాజ సేవ చేస్తున్న సాఫ్ట్ వేర్ శ్రీమంతులు..!!

కార్ పూలింగ్ తో సమాజ సేవ చేస్తున్న సాఫ్ట్ వేర్ శ్రీమంతులు..!!

Saturday October 29, 2016,

3 min Read

కార్ పూలింగ్ అంటే కేవలం ఇంధనం ఆదా చేయడమేనా..? కార్ పూలింగ్ అంటే జస్ట్ ట్రాఫిక్ తగ్గించడమేనా..? అంతకు మించి ఏమీలేదా? అంటే చాలా వుందంటోంది టెక్కీరైడ్ అనే కార్ పూలింగ్ హైక్. ఆదా చేసిన డబ్బుతోపేద విద్యార్ధులకు అండగా నిలుస్తోంది. సొంతలాభం కొంతమానుకుని తోటివారికి సాయపడదాం అనే కాన్సెప్టులో టెక్కీరైడ్ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తోంది. రెండేళ్లుగా సమాజసేవ చేస్తున్న సాఫ్ట్ వేర్ శ్రీమంతులపై యవర్ స్టోరీ స్పెషల్ రిపోర్ట్.

కార్ పూలింగ్. ఈ మధ్య బాగా వినిపిస్తున్న పదం. మండిపోతున్న పెట్రోల్ రేట్లు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రాఫిక్.. ఊపిరితిత్తులను నమిలేస్తున్న పొల్యూషన్.. వీటన్నిటి నుంచి ఉపశమనమే కార్ పూలింగ్. సొంత వెహికిల్లో ఆఫీసుకుకు వెళ్లాలంటే ఖర్చుతో కూడిన పని. అలాగని ఆటోలు, టాక్సీల్లో ప్రయాణిద్దాం అనుకుంటే ఛార్జీల మోత. రద్దీగా ఉండే సిటీ బస్సుల్లో ట్రావెల్ చేయాలంటే ఎక్కడలేని చిరాకు, అసహనం. ఇలాంటి పరిస్థితుల్లో.. సొంత వాహనాన్నే ఉపయోగిస్తూ, పెట్రోల్ ఖర్చును ఆదా చేసుకోవటాని ఉపయోగపడే చక్కటి మార్గం.. కార్ పూలింగ్.

కార్ పూలింగ్ అంటే ఒక కారు ప్రయాణాన్ని ఇతరులో పంచుకోవటమే. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతిరోజూ ఆఫీసుకు ఒకే రూట్లో ట్రావెల్ చేస్తున్నట్లయతే, అదే రూట్లో వచ్చే కలిగ్స్ ను, తెలిసిన వ్యక్తులను పికప్, డ్రాప్ చేయటం. వారి ద్వారా కొంత మొత్తాన్ని కలెక్ట్ చేసుకోవడం. ఇలా చేయటం వల్ల పెట్రోల్ ఖర్చును సగానికి తగ్గించుకోవచ్చు. ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే కార్ పూలింగ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

image


సరిగ్గా ఇలాంటి కాన్సెప్టుతో వచ్చిందే హైదరాబాద్ కు చెందిన టెక్కీరైడ్ కార్ పూలింగ్ సర్వీస్. అయితే ఇది కూడా అన్ని గ్రూపుల్లాంటిదే అనుకుంటే పొరపాటే. టెక్కీరైడ్ కేవలం షేరింగ్ కోసమే పరిమితం కాలేదు. వీళ్ల మనీ సేవింగ్ వెనుక ఒక గొప్పసామాజిక బాధ్యత కూడా ముడిపడి వుంది. గ్రూప్ అడ్మిన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన రఘు ఆలోచనకు ప్రతిరూపమే ఈ సోషల్ సర్వీస్ కాన్సెప్ట్. సొంతలాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్ అనే సిద్ధాంతాన్ని నమ్మి.. గ్రూప్ క్రియేట్చేశాడు రఘు. మొదట ఏడుగురితో మొదలైన టెక్కీ రైడ్ ప్రయాణం.. నేడు 450కి చేరింది. ఈ గ్రూప్ క్రియేట్ కాకముందు సభ్యులంతా 200 కార్లు, వంద బైక్లు, క్యాబులు, బస్సుల్లో జర్నీ చేసేవారు. ఇప్పుడు గ్రూప్ లో చేరాక 80నుంచి 100 కార్లలో ఆఫీసుకు వెళ్తున్నారు. గ్రూప్ లోని వ్యక్తి కారులో స్టార్ట్ అయ్యేటపుడు స్టార్టింగ్ పాయింట్ తో పాటు, ఎండింగ్ పాయింట్ రూట్ ని గ్రూప్ లో పోస్ట్ చేస్తాడు. అ టైమ్ లో ఆ రూట్లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్లు తామున్న పాయింట్ ని పోస్ట్ చేస్తారు. అలా ఒకే రూట్లో వెళ్లేవాళ్లంతా రైడ్ షేర్ చేసుకుని ఆఫీసుకు వెళ్తారు.

అంతకుముందు ఒకరికి పదివేల ఖర్చొస్తే.. ఇప్పుడు 3 నుంచి 4వేల మాత్రమే అవుతున్నాయి. పైగా టైం కూడా బోల్డంత సేవ్ అవుతోంది. పర్యావరణానికి తమవంతు సాయం చేసిన వాళ్లవుతున్నారు. డ్రైవింగ్ స్ట్రెస్ చాలా వరకు తగ్గింది. ఫుయెల్ వాడకం కూడా మినిమం అయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడి నుంచి దూరమయ్యారు. ఇతర కార్ పూలింగ్ గ్రూపుల్లో మహిళ సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే సర్వీస్ షేరింగ్ ఇచ్చినా, తీసుకున్నా, అపరిచిత వ్యక్తులతో ప్రయాణించాల్సి ఉంటుంది. భద్రతాపరంగా ఇదొక పెద్ద సమస్య. కానీ టెక్కీ రైడ్ లో అలాంటి భయాలేమీ లేవు. మహిళల భద్రతకు పూర్తి భరోసా ఇస్తుందీ గ్రూప్. సెక్యూరిటీ విషయంలో గ్రూప్ మెంబర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెహికిల్ ఎక్కినప్పటి నుంచి దిగేవరకు గ్రూప్ లో ఆప్డేట్స్ పెడుతుంటారు. దీంతో అడ్మిన్ మెంబర్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. టెక్కీరైడ్ పేరుతో త్వరలోనే ఒక మొబైల్ ఆప్లికేషన్ రాబోతోంది. అన్నట్టు జాబ్ ఆఫర్స్, ఇతరాత్ర సమాచారం వుంటే కూడా గ్రూప్ లో అప్ డేట్ అవుతుంటాయి.

image


కాసేపు ఇదంతా పక్కన పెడితే, కార్ పూలింగ్ ద్వారా సేవ్ చేసిన డబ్బుతో టెక్కీరైడ్ సమాజ సేవ చేయడం ఇక్కడ అభినందించాల్సిన విషయం. సాధారణంగా సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ వారంలో ఐదు రోజులు పగలూ రాత్రి షిఫ్టుల్లో నలిగిపోతారు. శని ఆదివారాలు మాత్రం సేదతీరుతారు. కానీ ఈ గ్రూప్ సభ్యులు అలా కాదు. సినిమాలు, షికార్లు పక్కన పెట్టి సమాజానికి ఏదో రకంగా సాయపడుతున్నారు. అది నచ్చి గ్రూపులో చాలామంది యాడవుతున్నారు. నిజానికి కార్ పూలింగ్ గ్రూపులు సిటీలో చాలానే ఉన్నాయి. అవన్నీ పక్కా మనీ సేవింగ్ కాన్సెప్టుతో నడుస్తున్నవే. కానీ టెక్కీ రైడ్ ఉద్దేశం వెనుక ఒక మంచి సోషల్ కాజ్ ఉండటం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ గ్రూప్ సభ్యులు మూడు నెలలకోసారి విలేజ్ రైడ్ నిర్వహిస్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. పూలింగ్ ద్వారా సేవ్ అయిన మొత్తాన్ని ఒకదగ్గర చేర్చి పేద విద్యార్ధులకు సాయం చేస్తారు. ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి స్కూల్లో విద్యార్ధులకు ఏవైతే అవసరమో అవి సరఫరా చేస్తారు. స్టేషనరీ, కుర్చీలు, బెంచీలు, బుక్స్, బ్యాగ్స్, షూస్ వగైరా వగైరా అన్నమాట . ఇప్పటిదాకా నాలుగు గ్రామాల్లో పర్యటించి విద్యార్ధులకు చేతనైన సాయం చేశారు. నల్గొండ జిల్లాలోని 2గ్రామాల్లో, వరంగల్ జిల్లాలోని ఒక ఊరిలో, మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక విలేజ్ లో విద్యార్ధులకు మెటీరియల్ అందజేశారు. ఇప్పటిదాకా ఎనిమిదిన్నర లక్షల విలువైన ఐటెమ్స్ విరాళంగా ఇచ్చారు.

image


మొన్ననే టెక్కీరైడ్ విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. గ్రూప్ సభ్యులంతా గర్వంగా సెకండ్ యానివర్సరీ జరుపుకున్నారు. దీనికి రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వచ్చిన అతిథులంతా గ్రూప్ సభ్యులను మనసారా అభినందించారు. కార్ పూలింగ్ గ్రూపులన్నీ వీళ్లను స్ఫూర్తిగా తీసుకుంటే సమాజానికి మరింత తోడ్పడిన వాళ్లవుతారని పలువురు అభిప్రాయపడ్డారు.