బొమ్మ కనిపించేంత బిజినెస్ ఉంది

భారత్‌లో బొమ్మల వ్యాపార సామర్ధ్యం రూ. 8500 కోట్లుఇప్పటికీ అంతంతమాత్రంగానే ఇక్కడి పరిశ్రమదీన్నే అవకాశంగా మలుచుకున్న షితిజ్ మల్హోత్రా, ప్రియాంక ప్రభాకర్‌క్లిక్ అయిన కాన్సెప్ట్ సెల్లింగ్, రిటర్న్ గిఫ్ట్ కల్చర్

బొమ్మ కనిపించేంత బిజినెస్ ఉంది

Sunday April 12, 2015,

3 min Read

ఆటలంటే అందరికీ మోజే. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ప్రపంచం మొత్తం గేమింగ్ అంటే పడిచస్తారని చెప్పొచ్చు. అందులోనూ చిన్నపిల్లలకు ఆటలంటే ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ఆధారిత ఈ-లెర్నింగ్ కాన్సెప్ట్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మన దేశంలోనూ ఆటలకు చదువును జోడించి.. విద్యార్ధుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే టాయ్స్‌కి గిరాకీ బాగానే పెరిగింది. మన దేశ బొమ్మల పరిశ్రమ మార్కెట్ విలువను రూ.8500 కోట్లకు పైగానేనని అంచనా వేసింది అంతర్జాతీయ స్పోర్ట్స్ ఫెయిర్ నిర్వహించిన స్పీల్‌వారెన్‌మెస్సె. ఇంతటి భారీ మార్కెట్ ఉన్న ఇండియన్ టాయ్ మార్కెట్‌లో ఫిషర్ ప్రైస్, ప్లేస్కూల్ వంటి విదేశీ కంపెనీలు ఇప్పటికే పాగా వేశాయి. వీటికి తోడు చైనా నుంచి మన దేశానికి ముంచెత్తుతున్న వాటి సంగతి చెప్పక్కర్లేదు. మరోవైపు ఇటలీ నుంచి కూడా ఈ-లెర్నింగ్ టాయ్స్ విపరీతంగా దిగుమతి అవుతున్నాయి.

వేల కోట్ల వ్యాపార సామర్ధ్యం ఉన్నా....

మన దేశంలో బొమ్మల వ్యాపారానికి వేల కోట్ల వ్యాపార సామర్ధ్యం ఉన్నా.. ఇప్పటికీ సంస్థాగత రూపాన్ని సంతరించుకోలేదు. ఈ రంగంలో మేమున్నాం... సత్తా చాటుతామనే కార్పొరేట్ కంపెనీయే కాదు... కనీసం ఓ మోస్తరు సంస్థ కూడా చెప్పుకోతగ్గది లేదు. మరోవైపు డిమాండ్ ఊపందుకుంటోంది. చిన్నా చితకా కంపెనీలు తక్కువ ఖర్చుతో ఆటబొమ్మల తయారీ చేస్తున్నా... అవేవీ ఇంపోర్ట్ చేసుకున్న వాటితో పోటీ పడే స్థాయిలో లేకపోవడం గుర్తించదగ్గ అంశం. సరిగ్గా ఈ పాయింట్‌ని పట్టుకున్నారు ఇద్దరు ఔత్సాహిక వ్యాపారవేత్తలు.

షితిజ్ మల్హోత్రా, ప్రియాంక ప్రభాకర్‌లు కోకోమోకో కిడ్స్ పేరుతో.. ఈ-లెర్నింగ్ టాయ్స్ తయారీపై దృష్టి సారించారు. రెండేళ్లలో ఈ కంపెనీ 25కుపైగా చిన్నారుల గేమ్స్ డిజైన్ చేసింది. వీటిలో కొన్ని 2015 ఫిబ్రవరిలో జర్మనీలోని నర్న్‌బెర్గ్‌లో నిర్వహించిన స్పీల్‌వారెన్‌మెస్సె ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్‌లో ప్రదర్శించారు కూడా. భారతీయ సాంప్రదాయాన్ని, సంస్కృతిని మేళవించి... వినూత్న తరహాలో రూపొందించిన వాటికి అక్కడ ఊహించని స్థాయిలో స్పందన లభించింది. ఈ ప్రదర్శన తమ అంచనాలను అందుకునేలా, ఆశయసాధనలో మరిన్ని అడుగులు పడేలా చేసిందంటారు షితిజ్ మల్హోత్రా.


తన సహచరులతో షితిజ్ మల్హోత్రా

తన సహచరులతో షితిజ్ మల్హోత్రా


కోకోమోకోకి ముందు....

కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయిన షితిజ్ పూనేలోని ఓ కన్సల్టింగ్ కంపెనీలో విధులు నిర్వహించేవారు. తర్వాత తన స్కూల్ ఫ్రెండ్‌తో కలిసి ఈ లెర్నింగ్ కంపెనీ ప్రారంభించారు. కార్పొరేట్ కంపెనీల కోసం ఐడియాలు రూపొందించడం ప్రారంభించారు. లుఫ్తాన్సా, మెర్సెడెజ్, లోరియల్ వంటి బహుళజాతి సంస్థలకు లెర్నింగ్ కంటెంట్ అందించేవారు. ప్రారంభంలో ఇది లాభదాయకంగానే ఉన్నా... ఉత్పత్తుల తయారీపై ఉన్న మక్కువతో ఆ వ్యాపారాన్ని వదిలేశారు. ఫ్రెష్ లైమ్ మీడియా ఇప్పటికీ తన పూర్వ భాగస్వామి లాభాలతోనే నడుపుతున్నారని చెబ్తున్నారు షితిజ్ మల్‌హోత్రా.

తర్వాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ భారత్‌లో నిర్వహించిన బయో డిజైనింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు షితిజ్. వైద్య సేవల రంగంలో వినూత్న మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించిన వీరు... రోగులను స్ట్రెచర్‌ పైనుంచి బెడ్ మీదకు సులభంగా మార్చడం కోసం ఓ వినూత్న ఉత్పత్తి సిద్ధం చేశారు. దీన్ని ఎంజీఎం అనుబంధ సంస్థ కొనుగోలు చేయడం విశేషం. ఈ సమయంలో డిజిటల్ మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్రియాంక పరిచయం... కొత్త మలుపు తిప్పింది. పిల్లల ఆట వస్తువుల తయారీలో అభివృద్ధికున్న అవకాశాలను బేరీజు వేసుకుని... వినూత్నమైన ఆటబొమ్మల తయారీ చేసేందుకు ప్రణాళికలు రచించారు. రెండున్నరేళ్ల క్రితం ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టి... సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన ఉత్పత్తులు విక్రయించేవారు.

లోటుపాట్లను సవరించుకుని ముందడుగు

ట్రావెలర్ కిడ్స్‌గా ప్రారంభమైన ఈ సబ్‌స్క్రిప్షన్ విధానంలో మళ్లీ మళ్లీ చెల్లింపులు చేయాల్సి రావడంతో వ్యాపారం ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. ఈ సమయంలో ఎడ్యుకేషనల్ గేమ్స్‌ను బాక్స్‌ల రూపంలో అందించారు. ముఖ్యంగా భూమి ఆధారిత ఆటలుండేవి. బాక్సుల్లో ప్రపంచ పటాలు, స్టిక్కర్లు, ప్లే పాస్‌పోర్టులు, వీసాలు, ప్రపంచ వింత ప్రతిరూపాలు, భాషాసంబంధిత స్టిక్కర్లుండేవి. అయితే సబ్‌స్క్రిప్షన్ తరహాలో అభివృద్ధికున్న పరిమితులు దృష్టిలో పెట్టుకుని.. పూర్తి స్థాయిలో విక్రయం అంటే వన్ టైం పేమెంట్ విధానంలో రావాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు.

కాన్సెప్ట్ సెల్లింగ్‌లోకి రావాలనే ఆలోచన రాగానే.. ఈ-రిటైలింగ్ ప్లాట్‌ఫామ్ వీరికి స్వాగతం పలికిందని చెప్పాలి. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి సంస్థల ద్వారా ఆన్‌లైన్ అమ్మకాలతో పాటు.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పూనేల్లో నేరుగా విక్రయాలు కూడా జరిపారు. రూపకల్పన, తయారీ రంగంలోకి మారిపోయాక.. ముందే బల్క్‌గా ఉత్పత్తులు సిద్ధం చేయడంపై అనుమానాలుండేవంటారు షితిజ్ నవ్వులాటగా.

కొత్త బ్రాండ్‌తో ఊపందుకున్న వ్యాపారం

ఎప్పుడైతే కాన్సెప్ట్ సెల్లింగ్ మొదలైందో దానికి కోకోమోకో కిడ్స్ పేరుతో కొత్త బ్రాండ్ మొదలైంది. తాము తయారు చేసే వస్తువులన్నీ విద్యార్ధుల్లో ఆలోచనా శక్తి పెంచేవే కావడంతో... తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఎంక్వైరీలు వచ్చేవని చెబ్తారు వీళ్లు. రిటర్న్ గిఫ్ట్‌లుగా వీటినిచ్చేందుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందన్నది వివరణ. ఈ రిటర్న్ గిఫ్ట్ సంస్కృతి తమ వ్యాపారాన్ని పరుగులు పెట్టించదన్నది వీళ్ల నమ్మకం కూడా.

ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న బొమ్మలు స్టాండర్డ్స్‌ని అందుకునేలా లేవు. అదే సమయంలో విదేశీ వస్తువుల ధరలు అందుబాటులో లేవు. వాటిలో చాలావరకూ మన సంస్కృతికి దూరంగా ఉండేవే. ఈ సమస్యలన్నిటికీ సమస్యలకు పరిష్కారంగా కోకోమోకో కిడ్స్‌ని తీర్చిదిద్దేందుకు షితిజ్, ప్రియాంకలు చాలానే కృషి చేశారు. రూ.50 నుంచి తమ ప్రోడక్ట్స్ ఉంటాయని చెబ్తున్నారు. ఏడాదిలోనే వీటికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రావడంతో.. మరిన్ని గేమ్స్ రూపకల్పన జరుగుతోంది. రిటైల్, ఆన్‌లైన్ రంగాల్లో మరింతగా పుంజుకునేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లేందుకు... ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టాయ్ ఫెయిర్స్‌ని వారధులు చేసుకుంటున్నామంటున్నారు ఈ వ్యాపార ద్వయం.