ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఎదగడమే ఫిటర్నిటీ లక్ష్యం

ఫిట్నెస్ కోసం వర్కవుట్స్ మొదలుపెట్టాలా ?ఎలాంటి ఎక్విప్‌మెంట్ ఉపయోగించాలో తెలుసా ?ఫుడ్ విషయంలో న్యూట్రిషనిస్ట్ సలహా కావాలా ?ఫిట్‌నెస్‌పై ఏం కావాలన్నా మేం రెడీ అంటున్న ఫిటర్నిటీ

	ఫిట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఎదగడమే ఫిటర్నిటీ లక్ష్యం

Monday June 08, 2015,

4 min Read

ఫిటర్నిటీ.కాం ప్రారంభానికి తన వ్యక్తిగత ఫిట్‌నెస్ అవసరాలను పూర్తి చేసేందుకు పడ్డ పాట్లే స్ఫూర్తి అంటారు నేహ. ఫిట్‌నెస్ ప్రేమికులు, ఔత్సాహికుల కోసం వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఓ సంస్థ ఏర్పాటు చేయాలని భావించారామె. సాధారణంగా ఇలాంటి వారు 4రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నేహ.

నేహ మొత్వాని... ముంబైలో పుట్టి, పెరిగారామె. నర్సీ మొంజీ కాలేజ్‌లో మేనేజ్మెంట్ స్టడీస్‌లో పట్టభద్రురాలు. యాక్సిస్ రిస్క్ కన్సల్టింగ్(జెన్‌పాక్ట్)లో కొంతకాలం పని చేశాక.. వెలింగ్‌కర్ ఇనిస్టిట్యూట్‌ నుంచి హ్యూమన్ రీసోర్సెస్‌లో ఎంబీఏ పూర్తి చేశారు నేహ. Aon Hewittలో మూడేళ్లపాటు పెర్ఫామెన్స్ మేనేజ్మెంట్, బిజినెస్ ప్రాసెస్ పునర్ వ్యవస్థీకరణ, టాలెంట్ ఎంపిక వంటి కార్యకలాపాలు నిర్వహించారు. ఈ సమయంలోనే ఓ సొంత కంపెనీ ఏర్పాటు చేసుకోవాలనే కోరిక మొదలైంది.

నేహ మొత్వాని, ఫిటర్నిటీ ఫౌండర్

నేహ మొత్వాని, ఫిటర్నిటీ ఫౌండర్


ఫిట్నెస్ యాక్టివిటీలపై సమగ్ర సమచారం అందుబాటులో లేకపోవడం, వర్కవుట్స్‌పై సమాచారం సేకరించడంలో ఇబ్బందులు, న్యూట్రిషన్, స్పోర్ట్స్‌లను ఎంచుకోవడం... ఈ నాలుగు అంశాల్లోనూ చాలా గందరగోళం ఏర్పడుతుంది. ఇలాంటి అవసరాల కోసం జస్ట్ డయల్ వంటి స్థానిక సెర్చ్ ఇంజన్లనో, ఎవరైనా చెబ్తేనో... ఆయా ఫిట్నెస్ సెంటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వాటిపై పూర్తిస్థాయి భరోసా లేకపోయినా నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. తమకు నచ్చినదాన్ని ఎంచుకునే వరకూ... పలు ప్రయోగాలు చేయాల్సి వస్తోంది. ఇన్ని ఇబ్బందులున్న ఈ ఫిట్‌నెస్ రంగంలో జొమాటో వంటి సంస్థను నేనెందుకు ప్రారంభించకూడదు అనుకున్నారు నేహ.

ఫిట్నెస్ కోసం ఎంత తహతహలాడినా... చాలా మందికి అందుతున్న సమాచారం అరకొర మాత్రమే. అది కూడా పూర్తిగా నమ్మదగనిదిగా ఉండడం లేదు. సైంటిఫిక్‌గా నిరూపితమైన, అనుభజ్ఞులు చెప్పే వివరాలు అందరికీ అందుబాటులో లేవు. దీనిపై అంతగా సమాచారం కూడా అందుబాటులో లేకపోవడం, ఫిట్‌నెస్‍పై తమకు తగ్గట్లుగా ఆలోచనలున్నవారిని వెతికిపట్టుకోవడం కూడా చాలా కష్టం.

ఈ సమస్యలే ఫిటర్నిటీ ప్రారంభానికి దారి తీశాయంటారు నేహ. అన్ని రకాల ఫిట్‌నెస్‍ పరిష్కారాలకు ఇది దారి చూపేలా ఉండాలని భావించారు ఆమె. విశ్వసనీయమైన సమాచారం, కమ్యూనిటీ ఫ్లాట్‌ఫాం, ఈ స్టోర్... ఇవన్నీ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.

“మరి కొన్నేళ్లలో ఫిట్‌నెస్‍ మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందనుంది. ఫిటర్నిటీ.కాంకు ఇదో మంచి అవకాశం. ఫిట్‌నెస్‍ ఆప్షన్స్, సోషల్ యాక్టివిటీ, నమ్మదగ్గ ఉత్పత్తులు-సేవలు లభించే మార్కెట్ ప్లేస్ కావడంతో... మా కంపెనీ అభివృద్ధికి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి” అంటున్నారు నేహ.

5 నగరాల్లో ఆరొందలమందిని సర్వే చేసి, పూర్తిస్థాయి మార్కెట్ రీసెర్చ్ చేయించుకున్నారు నేహ. ఈ సర్వే రిపోర్టుల ఆధారంగానే ఫిటర్నిటీకి పునాదులు పడ్డాయి. త్రిపుల్ఈ కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చారు. ఎక్సర్‌సైజ్ (వర్కౌట్స్), ఈట్(సరైన ఆహారం తీసుకోవడం), ఎక్స్‌ప్లోర్(మానసిక స్థిరత్వం) ద్వారా ముందస్తుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే అంశంపై ఆధారపడి... వెంచర్ ఏర్పాటు చేశారు. నిజానికి సరైన ఫిట్నెస్‌ ప్రోగ్రాంలను ఎంచుకోవడం పెద్ద సమస్య. అందుకే ఫైండర్ సర్వీసు మొదలుపెట్టాల్సి వచ్చింది. అనేక ఫిల్టర్స్ గల ఓ సెర్చ్ ఇంజిన్ ద్వారా... తగిన వర్కవుట్‌ని ఎంచుకోవచ్చు. అదే సమయంలో జిమ్ సెంటర్స్, స్టూడియోస్, ట్రైనర్స్, న్యూట్రిషనిస్టులు, స్పోర్ట్స్ సెంటర్ల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి... అందరికీ అందుబాటులో ఉంచామం”టారు నేహ.

ఫిట్నెస్ విషయంలో విశ్వసనీయత చాలా ముఖ్యం. అందుకే అనుభవజ్ఞుల నుంచి విలువైన సమాచారాన్ని సేకరించి... అంతర్గత ఎడిటోరియల్ టీం ద్వారా కంటెంట్ తయారు చేయిస్తున్నారు. భారతీయుల అవసరాలకు తగినట్లుగా నిపుణులైన వాలంటీర్ల నుంచి సేకరించిన డేటా... వెంచర్ ప్రారంభానికి ఎంతో సహాయపడిందంటారు నేహ.

కస్టమర్లలో రెండు రకాల టార్గెట్ గ్రూపులున్నాయని గుర్తించారు ఆమె.

  • a. ఫిట్‌గా ఉండాలనే భావన ఉన్నా... తగిన వసతులు లభ్యం కానివారు
  • b. ఇప్పటికే కొన్ని వర్కవుట్స్ చేస్తున్నా... మరింతగా తమ ప్రయత్నాలను పెంచుకోవాలని అనుకునేవారు

18-25, 26-45 వయసుల మధ్యలో ఉండేట్లుగా కస్టమర్లను రెండు గ్రూపులాగా చేసుకున్నారు. మెట్రో, టైర్-1, టైర్-2 సిటీల నుంచి కస్టమర్లు ఎక్కువగా ఉంటారు.


ఫిటర్నిటీ టీం ఇదే

“ఫైండర్ సర్వీసు మాకు చాలా ప్రధానమైనది. సరైన ఫిట్నెస్ సర్వీసును ఎంచుకోవడానికి ఇదో మార్కెట్ ప్లేస్. ఫిట్నెస్‌పై పూర్తి స్థాయి ఫోకస్ చేసిన ఏకైక ప్లాట్‌ఫాం ఇదే. ఫోటోలు, వీడియోలు, రేటింగ్స్, యూజర్ రివ్యూలతో.. పూర్తి స్థాయి సమాచారం అందుబాటులో ఉంటుంది. కస్టమర్లను పెంచుకునేందుకు జిమ్ ఓనర్లు, ట్రైనర్లు, న్యూట్రిషనిస్టులు ఫిటర్నిటీ.కాంను ఉపయోగించుకుంటున్నార”ని చెబ్తున్నారు నేహ.


టీం ఫిటర్నిటీ

టీం ఫిటర్నిటీ


ఫోన్ ద్వారా ట్రయల్స్ బుక్ చేసుకోవడం, డీల్స్ అందించడం, కాంబో ప్లాన్స్, సరైన ప్రోడక్ట్స్ అందించడం ద్వారా కస్టమర్లకు పూర్తి స్థాయి సంతృప్తి కలిగించేందుకు ప్రయత్నిస్తోంది ఫిటర్నిటీ. ఈ టీంలో ఐఐఎం-సీలో పట్టభద్రులైన చైతన్య పాడి టెక్నాలజీ విభాగానికి హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాపారాభివృద్ధికి జయం వోరా కృషి చేస్తున్నారు. కంటెంట్ రాయడం, నిర్వహణ బాధ్యతలను ఎడిటర్ యూతి భన్సాలి చూస్తున్నారు. ఇక మార్కెటింగ్ కార్యకలాపాలను మితేష్ అగారియా నిర్వహిస్తున్నారు.

ఫిటర్నిటీ ఫిట్‌గా ఉండేందుకు ఆదాయం ఎలా ?

ఈ స్టార్టప్ వెంచర్ 3 రకాలుగా ఆదాయమార్గాలను వెతుక్కుంది.

a. బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు ఫిట్నెస్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా క్లాసిఫైడ్‌లను లిస్టింగ్ చేయడం

b. తమ భాగస్వాముల కోసం అడ్వర్‌టైజింగ్, ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం

c. ఈ-కామర్స్, ఫిట్నెస్ సేవలు-ఉత్పత్తులను విక్రయించడం(ఫిటర్నిటీలో ఫిట్నెస్‌కు సంబంధించిన 20వేలకు పైగా ఉత్పత్తులు, సేవలు అందుబాటులో ఉన్నాయి)

రిజిస్టర్ల్ యూజర్ల సంఖ్య - 25వేలకుపైగా యాక్టివ్ మెంబర్లు

ఆదాయం - ఫైండర్ ప్లాట్‌ఫాంలో లిస్టింగ్స్, ఈ-స్టోర్ ద్వారా రూ. కోటికి పైగా

అంచనా - ఏడాదిలో రూ. 12 కోట్ల ఆదాయాన్ని అందుకోవడం

ఫిటర్నిటీలో వాట్ నెక్ట్స్

పూర్తి స్థాయి సమాచారం, ప్రోడక్టులతో త్వరలో మొబైల్ యాప్ రిలీజ్ చేయనుంది ఫిటర్నిటీ. అలాగే ముంబైలో ప్రారంభమైన ఈ సంస్థ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మరిన్ని గ్రూపులతో భాగస్వామ్యం చేసుకుని వారిని బోర్డ్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్రాండ్ బిల్డింగ్ ఈవెంట్లు నిర్వహించడమే కాకుండా తమ టీంను విస్తరించుకునే యోచన కూడా ఉంది.


ఫిటర్నిటీ ఫైండర్

ఫిటర్నిటీ ఫైండర్


అదే రంగానికి చెందిన ఇతర విభాగాలతో కలిసి అభివృద్ది చెందాలనే(MOAT strategy) వ్యూహం రచిస్తున్నారు. “ ప్రస్తుతం అనేక ఈకామర్స్ కంపెనీలు ఫిట్నెస్ ప్రోడక్టులను విక్రయిస్తున్నాయి. అయితే తగిన సర్వీసు ఎంచుకునే అవకాశమిచ్చే సెర్చ్ ఇంజిన్ గల ఏకైక మార్కెట్ ప్లేస్ ఫిటర్నిటీ మాత్రమే. మొత్తం 30వేలకు పైగా సర్వీసులు, ఉత్పత్తులు మా దగ్గర అందుబాటులో ఉన్నాయం”టున్నారు నేహ.

– వర్క్, ఫుడ్, హాట్‌స్పాట్ వంటి ప్రదేశాలను కవర్ చేయడం

– ఫైండర్ సర్వీసును హ్యాండీగా ఉండేందుకు మొబైల్‌లోకి తేవడం

– ప్రత్యేక కమ్యూనిటీలు, వర్కవుట్లను లిస్టింగ్ చేయడం

– హెల్త్, ఫిట్‌నెస్ ఈవెంట్లతో కలిసి మరింతమంది ఫిట్నెస్ ఔత్సాహికులను ఆకర్షించడం

ఫిట్నెస్‌పై యువర్ స్టోరీ

అంచనాల ప్రకారం 2015లో హెల్త్, ఫిట్నెస్ మార్కెట్ విలువ లక్ష కోట్లకు పైగానే. ప్రస్తుతం ఇది 25శాతం సగటు వార్షిక వృద్ధి రేటు సాధిస్తోంది. ఆదాయ స్థాయిలు పెరుగుతున్న యువ జనాభా పెరగడం, ఆరోగ్యం-అప్పియరెన్స్ వంటి అంశాలపై అవగాహన ఊపందుకోవడం, మారుతున్న లైఫ్‌స్టైల్స్‌తో నిలకడైన ఆరోగ్యం కోరుకోవడం వంటి కారణాలతో... ఫిట్నెస్ మార్కెట్‌కు విస్తరిస్తోంది. ఇవన్నీ ఫిటర్నిటీకి అవకాశాలుగా మారాయి. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వారి సంఖ్య పెరిగిన కొద్దీ... ఇలాంటి మార్కెట్ ప్లేస్‌లకు వ్యాపారం వృద్ధి చెందుతుంది.

ప్రస్తుతం ఫిటర్నిటీకి 500లకు పైగా తమ సేవలను రిజిస్టర్ చేసుకున్న బి2బి పార్ట్‌నర్స్ ఉన్నారు. ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది కూడా. జిమ్ ఓనర్లు, ట్రైనర్లు ఫిటర్నిటీ.కాంను ప్లాట్‌ఫాంగా చేసుకుని తమ బ్రాండ్ వృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫిట్నెస్ రంగానికి జొమాటోగా.... ఫిటర్నిటీ ఎదగడానికి అన్ని రకాల అవకాశాలూ ఉన్నాయి.

వెబ్‌సైట్‌ కోసం క్లిక్ చేయండి : http://www.fitternity.com/