పెద్ద దిక్కును కోల్పోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ

పెద్ద దిక్కును కోల్పోయిన తెలుగు సినిమా ఇండస్ట్రీ

Wednesday May 31, 2017,

2 min Read

దాసరి నారాయణరావు. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు.. నటుడు.. నిర్మాత. 50 ఏళ్లుగా సినీవినీలాకాశంలో వెలుగు వెలిగిన ధృవతార. తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డగా, ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదు కిమ్స్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. అన్నవాహిక, కిడ్నీలు, లంగ్స్ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన దాసరికి ఆమధ్యే సర్జరీ జరిగింది. మళ్లీ ఇన్ ఫెక్షన్ సోకడంతో మరోసారి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే కన్నుమూశారు.

image


పశ్చిమగోదావరి జిల్లాలోని సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దాసరి నారాయణరావు నాట‌క‌రంగం నుంచి సినీ రంగానికి వ‌చ్చారు. ఎన్నో గొప్పగొప్ప సినిమాలు తీసి కీర్తిప్రతిష్ఠలు మూటగట్టుకున్నారు. ఎన్టీరామారావు, అక్కినేటి వంటి అగ్రనటులతో సినిమాలు తీసి జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు.

తాత మనవడు చిత్రంతో దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన దాసరి- 151 చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా 53 సినిమాలను నిర్మించారు. 250కిపైగా చిత్రాలకు మాటలు, పాటలు అందించారు. వర్తమాన, సామాజిక, రాజకీయ అంశాలే ప్రధాన ఇతివృత్తంగా చిత్రాలను తెరకెక్కించి మెప్పించగలిగారు.

రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది అవార్డులు, 6 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్న దాసరి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. దర్శకరత్న దాసరిని ఆంధ్రా విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది.

చిత్ర పరిశ్రమలో టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందుండే దాసరి నారాయణరావు అనేక మంది హీరోలను, హీరోయిన్లను, దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. స్వర్గం-నరకం చిత్రంతో మోహన్ బాబును తెరమీదికి తీసుకొచ్చారు. ఆర్.నారాయణమూర్తికి అవకాశం ఇచ్చింది కూడా దాసరే. 

సినీవినీలాకాశంలో ధృవతారగా పేరుతెచ్చుకున్న దర్శకరత్న దాసరి.. చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడి ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగింది. దాసరి లేని లోటు పరిశ్రమకు ఎప్పటికీ తీరనిది అని సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. కళామతల్లికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.