సంగారెడ్డిలో మహిళా ఆంట్రప్రెన్యూర్ల కోసం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్

0

మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. టీఎస్ ఐపాస్ చట్టంలో మహిళా ఆంట్రప్రెన్యూర్లకు పెద్దపీట వేశామని గుర్తు చేశారు. మహిళా సాధికారతకు ఉపయోగపడే పరిశ్రమలకు సర్కారు సహకారం ఉంటుందని ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా నందిగామలో అబ్దుల్ కలాం ఎలీప్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా ఆంట్రప్రెన్యూర్లు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లాలోని నందిగామలో 83 ఎకరాల్లో నెలకొల్పే అబ్దుల్ కలాం ఎలీప్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో 200 వరకు పరిశ్రమలు రాబోతున్నాయి. వీటిలో పది వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పించబోతున్నారు.

నాయకులు మారితే, ఆలోచనలు మారితే ఆ రాష్ట్రం ఎంత పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తుందో చెప్పడానికి టీఎస్ ఐపాసే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా టీఎస్ ఐపాస్ చట్టంలో మహిళలకు పెద్దపీట వేశామన్న కేటీఆర్.. వారికి పది శాతం ఇన్వెస్ట్ మెంట్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు. మహిళా ఆంట్రప్రెన్యూర్ల కోసం గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును తీసుకొచ్చిన ఎలీప్ సంస్థను అభినందించారు. ఈ పార్కు కోసం ప్రభుత్వమే 40 వేల చదరపు అడుగుల సముదాయాన్ని నిర్మించి ఇస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో తనకూ భాగస్వామి కావాలని ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చెప్పారు. మహిళల కోసం ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇతర జిల్లాల్లో కూడా ఇలాంటి పార్కులు రావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ పార్కులో పది వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎలీప్ సంస్థను ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అభినందించారు.

మంత్రి కేటీఆర్ అందించిన తోడ్పాటు వల్లే ఇండస్ట్రియల్ పార్కు కల సాకారమైందని ఎలీప్ అధ్యక్షురాలు రమాదేవి చెప్పారు. తన 25 ఏళ్ల కెరీర్లో కేటీఆర్ లాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడిని చూడలేదని ప్రశంసించారు. వాట్సాప్ లో సాయం అడిగినా స్పందించే ఏకైక మంత్రి కేటీఆర్ ఒక్కరేనని రమాదేవి కొనియాడారు.

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు రాకతో నందిగామ పరిసర ప్రాంతాల ప్రజలు సంబర పడుతున్నారు. పది వేల మంది యువతీ యువకులకు ఉపాధి దొరకడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Stories