టీఎస్ఆర్టీసీ ఎంప్లాయి కూతురు.. మిస్ గ్లోబల్ ఇండియా టైటిల్ విన్నర్!

టీఎస్ఆర్టీసీ ఎంప్లాయి కూతురు.. మిస్ గ్లోబల్ ఇండియా టైటిల్ విన్నర్!

Saturday March 19, 2016,

2 min Read


మానస చిందమ్. అందరి అమ్మాయిల్లాగానే బిటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ కెరీర్ వైపు వెళ్లింది. 2013 లో సీబీఐటి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం కొట్టింది. కానీ సాఫ్ట్ వేర్ ఫీల్డ్ అంటే బొత్తిగా ఇంట్రస్ట్ లేదు. అయినప్పటికీ కొన్నాళ్లు టైం బీయింగ్ అన్నట్లు జాబ్ చేసుకుంటూ పోయింది. గతేడాది ఆఫీసులో జరిగిన ఓ ఈవెంట్ ఆమె జీవితాన్ని ఫ్యాషన్ ఫీల్డ్ వైపు తిప్పింది. 

సాంప్రదాయ కుటుంబం. పక్కా హైదరాబాదీ. నాన్న టీఎస్ ఆర్టీసీలో ఎంప్లాయ్. మోడల్ ఫీల్డ్ అనగానే మొదట నో అన్నారు. కానీ మానస వినలేదు. నాన్నను ఒప్పించడానికి ప్రయత్నించింది. కూతురు మాట మొత్తానికే కాదనలేకపోయాడు తండ్రి. ఎందుకంటే ఆమెను కొంత స్వతంత్రంగానే పెంచాడు కాబట్టి. కూతురి కాన్ఫిడెన్స్ తెలుసు కాబట్టి.. పెద్దగా తనని కన్విన్స్ చేయాల్సిన అవసరం రాలేదు. పైగా మానస స్కూలింగ్ దగ్గర్నుంచి ఇంజినీరింగ్ దాకా ఓటమి అంటే ఏంటో తెలియని అమ్మాయి. ఎందుకో అమ్మాయి ఎంచుకున్న రంగం మీద నాన్నకు కూడా ఎక్కడో ఒక మూల ఆశ. గెలుస్తుందనే నమ్మకం. 

మిస్ గ్లోబల్ ఇండియా టైటిల్ తో మానస

మిస్ గ్లోబల్ ఇండియా టైటిల్ తో మానస


మిస్ గ్లోబల్ ఇండియా కంటే ముందు ఫెమినా మిస్ ఇండియా పోటీ. మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. అక్కడ నెగ్గుకు రావడం మానస తరం కాలేదు. అయినా కుంగిపోలేదు. ఓటమే గెలుపుకు నాంది అనుకుంది. సరిగ్గా నెల వ్యవధిలో మిస్ గ్లోబల్ ఇండియా పోటీలకు సిద్ధం కావాలి. అందుకే గత పోటీల్లో చేసిన తప్పులను సవరించుకుంటూ ముందుకు సాగింది. దాదాపు 3నెలల కష్టం. చాలా రౌండ్లలో ఫిల్టర్ చేశారు. దేశ వ్యాప్తంగా 2వేల మంది అప్లై చేశారు. అందులోంచి 15మంది మాత్రమే ఫైనల్ వచ్చారు. పర్సనల్ ఇంటర్వ్యూ, టాలెంట్ రౌండ్, టెంపరరీ డ్యాన్స్, ఫోటో షూట్.. ఇలా చాలా రకాల ఎగ్జామిన్. చివరిగా గోవాలో జరిగిన చివరి షోలో మానస చెప్పిన సమాధానం న్యాయనిర్ణేతలకు నచ్చడంతో మిస్ గ్లోబల్ ఇండియా టైటిల్ కొట్టేసింది. విమెన్ కమ్యూనిటీని స్ట్రెంథెన్ చేయడానికి ప్రయత్నిస్తా అని మానస చెప్పిన సమాధానం టైటిల్ విన్నర్ ను చేసింది.

image


మిస్ గ్లోబల్ టైటిల్ మాత్రమే కాదు, సినిమా రంగానికి కొత్త టాలెంట్ పరిచయం చేసే సరికొత్త వేదిక. భవిష్యత్ లో వెండితెరపై వెలగబోయే తారలను తీర్చిదిద్దడమే మిస్ గ్లోబల్ లక్ష్యం. అందుకే మానస ఈ కాంపిటీషన్స్ ఎంచుకున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన వాళ్లని యాక్టింగ్ ట్రెయినింగ్ ఇచ్చి సినిమా ఆడిషన్స్ కి పంపుతారు. దీంతో పాటు వీడియో ఆల్బమ్ లో ఎలాంటి ఆడిషన్ లేకుండా అవకాశం ఇస్తారు. ఇప్పటికే ఇద్దరు డైరెక్టర్లు టచ్ లోకి వచ్చారని మానస అంటోంది. ప్రాజెక్టు కన్ఫర్మ్ అయిన తర్వాత గుడ్ న్యూస్ చెబుతానని చిరునవ్వులు చిందించింది.

భవిష్యత్ లక్ష్యాలు

మానసకి భవిష్యత్ లక్ష్యాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ చెప్పాలంటే ఈరోజు సరిపోదని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. లాక్మే ఫ్యాషన్ వీక్ లో వాక్ చేయబోతోంది. ఎంటీవి టాప్ మోడల్ షోలో షో స్టాపర్ గా కనిపించనుంది. తర్వాత మూవీ ప్రాజెక్టుల వైపు వెళ్తానంటోంది. సినిమాల్లో రాణించడమే ముందున్న లక్ష్యం అంటోంది మానస.

“చిన్ననాటి నుంచి నేనేం చేస్తానన్నా.. కాదనకుండా నన్ను ప్రోత్సహించిన మా పేరెంట్స్ వల్లనే నేనిక్కడిదాకా రాగలిగాను అని ముగించింది మానస”