చలేస్తే శవాన్ని కౌగిలించుకుని నిద్రించిన చిన్నారిని చూశాక పుట్టిన ఆలోచనే 'గూంజ్'

పాత్రికేయ రంగంలోంచి సేవారంగంలోకొచ్చిన అన్షుగుప్తా..శవాలపై దుస్తులు సేకరించే వ్యక్తితో ఇంటర్వ్యూ..చలికి తట్టుకునేందుకు శవాన్ని పట్టుకుని నిద్రిస్తానన్న చిన్నారి..దుస్తుల ప్రాధాన్యత అర్ధం చేసుకున్న అన్షుగుప్తా..సోషల్ సిఈఓగా ఎదిగిన అన్షు..

చలేస్తే శవాన్ని కౌగిలించుకుని నిద్రించిన చిన్నారిని చూశాక పుట్టిన ఆలోచనే 'గూంజ్'

Saturday April 18, 2015,

3 min Read

వృధాగా పడుండే దుస్తులను సేకరించి పేదలకు అందించేందుకు గూంజ్ ఏర్పాటు అన్షు గుప్తా.. నగరాల్లో వృధాగా పోతున్న వస్తువులను.. గ్రామీణుల అవసరాలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి. ఈయన వయసు 41 సంవత్సరాలు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మధ్యతరగతి వ్యక్తి. పాత్రికేయ రంగాన్ని ప్యాషన్‌గా భావించి అడుగుపెట్టిన ఈయన.. మెల్లగా సామాజిక సేవలోకి వచ్చేశారు. నగరాల్లోని ఇళ్లలో ఉండే ఉపయోగించని దుస్తులను, పాత వస్తువులను పోగుచేసి... వాటిని పేదలకు పంచడాన్ని ఓ యజ్ఞంగా మార్చిన వ్యక్తి అన్షుగుప్తా. ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న గూంజ్ సంస్థకు 60 కలెక్షన్ సెంటర్లున్నాయి. వీటిలో దుస్తులతో పాటు, పాదరక్షలు, వంటసామాగ్రి, బ్యాగ్స్, బుక్స్ సహా ఇతర అవసరలన్నిటినీ కలెక్ట్ చేసి.. అవసరం ఉన్న పేదలకు అందిస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే నగరాల్లో వృధాగా పోతున్నవాటిని గ్రామాల్లో అవసరాలున్నవారికి చేర్చే వారధి నిర్మించారు అన్షుగుప్తా. 

అన్షు గుప్తా, గూంజ్ సిఈఓ

అన్షు గుప్తా, గూంజ్ సిఈఓ


సామాజిక సంస్థ ఏర్పాటు వెనక ప్రతీ మనిషికీ కూడు, గుడ్డ, నీరు అవసరం, దీన్నే ఫాలో అయ్యారు గుప్తా. "అయితే దుస్తులను ప్రాధమిక అవసరాల్లో ఎప్పుడూ గుర్తించడం లేదు మనం. కనీసం అభివృద్ధి సూచికల్లోనూ ఎక్కడా ఈ అంశం కనిపించదు. అయితే దీని ప్రాధాన్యత చాలా ఉంది. గృహ హింస నుంచి గ్లోబల్ వార్మింగ్ వరకూ 100-150 సమస్యలకు దుస్తులే మూలకారణమం"టారు అన్షు గుప్తా.

ఆలోచన ఇక్కడే మొదలైంది

గతంలో అన్షుగుప్తా పాత్రికేయ వృత్తిలో ఉండేవారు. ఒకసారి హబీబ్ అనే వ్యక్తిని గుప్తా ఇంటర్వ్యూ చేశారు. శ్మశానాల్లో తిరిగే ఈ వ్యక్తి.. శవాలపై ఉన్న దుస్తులను సేకరిస్తుంటాడు. ఆ సమయంలో హబీబ్ కూతురు చెప్పిన మాటలు వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. 

"నాకు రాత్రి పూట బాగా చలిగా ఉన్నపుడు... ఏదైనా శవాన్ని పట్టుకుని పడుకుంటాను. అప్పుడు నాకెలాంటి సమస్యా అనిపించదు. ఎందుకంటే అది ఎటూ కదలదు కదా" అందా చిన్నారి. ఆ సంఘటన గుప్తాను కలచివేసింది. వెంటనే 1999లో గూంజ్ అనే సంస్థను ప్రారంభించారు.(అప్పటికి రిజిస్ట్రేషన్ కాలేదు) అతని భార్య మీనాక్షి గుప్తా సహా బీరువాలో ఉన్న 67 జతలను తెచ్చి పేదలకు పంచేశారు.
గూంజ్ గోడౌన్ (వస్తు సేకరణ తర్వాత సెగ్రిగేషన్)

గూంజ్ గోడౌన్ (వస్తు సేకరణ తర్వాత సెగ్రిగేషన్)


ప్రత్యామ్నాయ వృత్తి కాదు

"గూంజ్ ఏ సమయంలోనూ ఓ సంస్థ కాదు. అది ఒక ఆలోచన, ఉద్యమం, మార్పునకు స్వాగతం పలికే ద్వారం, సమస్యలపై మాట్లాడేందుకు వేదిక అంతే" అంటారు గుప్తా. దీనిపైనే దృష్టి కేంద్రీకరించడంతో పాత్రికేయ వృత్తి, ఫోటోగ్రఫీలను ఆయన వెనక్కు నెట్టాల్సి వచ్చింది. అయినా సరే తన కెరీర్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదాయన.

సోషల్ సీఈఓ

లాభాల కోసం నడిచే ఈ సమాజంలో.. ఉద్యోగులు, వాలంటీర్లతో సంస్థను నడిపిస్తున్నారు."ప్రజల ఆలోచనల్లోనూ, దృక్పధాల్లోనూ చాలా మార్పులు రావాల్సి ఉంది. ఇప్పటికీ మేమెలాంటి లక్ష్యాలు నిర్ణయించుకోలేదు. మాకున్న వనరులు చాలా తక్కువ. మేం ప్రయాణించాల్సిన దూరానికి లక్ష్యాన్ని ఇప్పట్లో నిర్దేశించలేం"అంటున్నారు అన్షు గుప్తా.

గూంజ్ వలంటీర్లతో అన్షు

గూంజ్ వలంటీర్లతో అన్షు


కోరుకుంటున్న మార్పులు

ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని ప్రజలకు పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తోంది గూంజ్. ఇదే సమయంలో ఇచ్చేవారి గొప్పదనం కంటే తీసుకునేవాళ్ల విజ్ఞత, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యతపైకి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు గుప్తా."దుస్తులు చాలా పెద్ద విషయం. దీన్ని అత్యవసరాల వంటి జాబితాలో ఖచ్చితంగా చేర్చాల్సిందే"అన్నది ఈయన వాదన.

గత 17 ఏళ్లుగా ఈ ప్రయత్నంలో గుప్తా ఎంతో సమయాన్ని వెచ్చించారు. తన టీంను, వాలంటీర్లనే ఆస్తిగా భావిస్తారాయన. తన విద్యార్హతలు ఈ రంగంలో పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. పాత్రికేయ రంగంలో చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి భూతద్దంలో చెప్పే తత్వం మాత్రం కొంత ఉపయోగపడిందనే అంటారు అన్షు గుప్తా.

అవార్డుల కన్నా ఆత్మసంతృప్తే మిన్న

అవార్డుల కన్నా ఆత్మసంతృప్తే మిన్న


ఉదారంలో విషాదం

ముంబై వరదల్లో గూంజ్ గోడౌన్ పూర్తిగా ధ్వంసమయింది. టన్నుల కొద్దీ వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఉద్యోగులు, వాలంటీర్లు చూపిన చొరవ అసామాన్యం. అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ప్రదేశాన్ని అన్వేషించి, అక్కడికి ఆ సరుకంతా రవాణా చేసేందుకు చాలా కష్టపడ్డారు. పెరుగుతున్న రవాణా ధరలు కూడా ఈ సంస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నా... వ్యాపారదృక్పథంతో కాకుండా ఖర్చులను భాగస్వాములందరూ పంచుకునేందుకు ముందుకురావడం విశేషం.

ఇలాంటి వినూత్న ఆలోచనే ఎంతో మందిని ఆలోచింపజేశాయి

ఇలాంటి వినూత్న ఆలోచనే ఎంతో మందిని ఆలోచింపజేశాయి


గూంజ్ గర్వంగా చెప్పుకునే స్థాయి ఇది

ప్రస్తుతం గూంజ్ 21 రాష్ట్రాల్లో 250మందికి పైగా భాగస్వామ గ్రూపుల సహాయంతో నడుస్తోంది. దేశవ్యాప్తంగా 10ప్రాంతాల్లో కార్యాలయాలుండగా 150మంది ఉద్యోగులు, వేలకొద్దీ వాలంటీర్లు తమ సేవలందిస్తున్నారు. ప్రతీ నెలా 80-100 టన్నుల వస్తువులను సరఫరా చేస్తుంటారు. దీని విలువ దాదాపు రూ. 4 కోట్లుంటుందని చెప్తే నమ్మగలరా ?

"మౌలిక వసతులు మార్చినంత మాత్రాన ఒక వ్యక్తి ఒక దేశాన్ని మార్చలేడు. ప్రజల్లో మార్పొచ్చినపుడు ఇది సాధ్యం. ఇది నా కెరీర్. చిన్న స్థాయిలోనే ఎక్కువ కార్యకలాపాలు చేయాలనుకుంటున్నాం. చేసి చూడండి- చేస్తూనే ఉండండి.. అని ప్రజలకు నేను చేసే విన్నపం"- అన్షుగుప్తా