ఫ్రీ మార్కెటింగ్‌ కోసం స్టార్టప్స్‌కు ఏడు సలహాలు

ఫ్రీ మార్కెటింగ్‌ కోసం స్టార్టప్స్‌కు ఏడు సలహాలు

Friday September 25, 2015,

6 min Read

మార్కెటింగ్ పైన నెలకు లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసే పెద్దపెద్ద బ్రాండ్లు చాలానే ఉన్నాయి. కానీ స్టార్టప్ అంటే పైసాపైసా మన అదుపులో ఉండాలి. స్టార్టప్ యజమానిగా మీకు ప్రతీ పైసా విలువ తెలిసుండాలి. స్టార్టప్ ఆంట్రప్రెన్యూర్ రాబడుల కోసం ఎక్కువ రోజులు వేచి చూడరు. అందుకే మార్కెటింగ్‌పై మీ ఖర్చుల్ని బాగా తగ్గించుకోవాలి. ఎంతలా అంటే మార్కెటింగ్ కోసం ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు విన్నది నిజమే. నిజంగా ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. మరి ఫ్రీగా మార్కెటింగ్ సాధ్యమని అనుకుంటున్నారా ? అందుకోసం నేను ఓ ఏడు సలహాలు చెబుతాను.


ఈ ఆర్టికల్ మొత్తం చదివే సమయం లేని వారు సారాంశాన్ని ఏడు వాక్యాల్లో తెలుసుకోండి.

1. మీ టార్గెట్ మార్కెట్ ఎవరు... కాంపిటీషన్ ఎలా ఉందో గుర్తించండి.

2. మీకు రాబోయే క్లైంట్లతో కలిసి స్టార్టప్ ఈవెంట్స్, స్టార్టప్ నెట్‌వర్క్‌లో పాల్గొనండి.

3. ఓ బ్లాగ్ రూపొందించి రాయడం మొదలుపెట్టండి.

4. Mailchimp తో ఫ్రీ ఇ-మెయిల్ మార్కెటింగ్ చేయండి.

5. LinkedIn పవరేంటో తెలుసుకొని వాడుకోండి.

6. ట్విట్టర్‌ని మీ బెస్ట్ ఫ్రెండ్‌గా మార్చేసుకోండి.

7. ఫ్రీ టూల్స్, కీవర్డ్ రీసెర్చ్ లాంటి వాటి గురించి తెలుసుకోండి.

image


ఇప్పుడీ అంశాలను వివరంగా తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకా నేనేమైనా పాయింట్స్ మిస్సైనట్టైతే ఆర్టికల్ చివర్లో నిర్మొహమాటంగా చెప్పండి.

1. మీ టార్గెట్ మార్కెట్ ఎవరు... కాంపిటీషన్ ఎలా ఉందో గుర్తించండి.

నా దృష్టిలో ఇది చాలా ముఖ్యమైన విషయం. మీ స్టార్టప్‌ని మార్కెట్ చేయడానికి ముందే ఈ విషయాల్ని తెలుసుకోవడం మంచిది. గతంలో నేను, ఇతర ఆంట్రప్రెన్యూర్స్ చేసిన తప్పుల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మీ టార్గెట్ కస్టమర్లు ఎవరు ? మీ లాంటి సేవలు/ఉత్పత్తులు ఇంకెవరు అందిస్తున్నారు ? అనే అంశాలపై స్పష్టమైన అవగాహన లేకుండా దేన్నీ ప్రారంభించలేమని నాకు అర్థమైంది. ఉదాహరణకు మీరు మీ క్లైంట్స్‌కి ఇన్వాయిసింగ్ టూల్ లేదా బల్క్ ఇ-మెయిలింగ్ సర్వీస్ ప్రారంభించాలనుకున్నప్పుడు మీకు ఎలాంటి క్లైంట్లు కావాలి, ఏ రంగం మీ టార్గెట్ అన్నదానిపై స్పష్టత ముఖ్యం. అంతేకాదు మీతో కలిసి పనిచెయ్యాలంటే బడ్జెట్ ఎంత ఉండాలో స్పష్టత ఉండాలి. స్టార్టప్ ఆంట్రప్రెన్యూర్స్‌గా మేము వచ్చే ప్రతీ క్లైంట్‌కి ఆహ్వానం తెలిపేవాళ్లం. కానీ క్లైంట్లను తప్పుగా ఎంచుకోవడం వల్ల జరిగే పరిణామాల గురించి ఎప్పుడూ ఆలోచించం. అందుకే మీ టార్గెట్ మార్కెట్లో లేని క్లైంట్లకు కుదరదని చెప్పడానికి ఏమాత్రం మొహమాటపడకూడదు. అదే విధంగా మీలాంటి సేవలు/ఉత్పత్తులను మిగతా కంపెనీలు ఎలా అమ్ముతున్నాయో నిత్యం తెలుసుకుంటూ ఉండాలి. వాటిని బేరీజు వేసుకుంటూ మీకంటూ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. ఓ వర్గం కస్టమర్లను టార్గెట్ చేయడం కష్టమే. కానీ ఆ విభాగంలో మీరు రాణించగలిగారంటే మీరు ట్రెండ్ సెట్టర్ అయిపోతారు. అందుకే లోతుగా అధ్యయనం చేసేందుకు కావాల్సినంత సమయం తీసుకోండి. ఇందుకు ఒక్కరూపాయి కూడా ఖర్చు కాదు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ వ్యాపారానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

2. మీకు రాబోయే క్లైంట్లతో కలిసి స్టార్టప్ ఈవెంట్స్, స్టార్టప్ నెట్‌వర్క్‌లో హాజరవండి.

అలాంటి కార్యక్రమాలకైనా వెళ్లడం ఎప్పటికీ మంచిదే. మీరు అక్కడ డెసిషన్ మేకర్స్‌ని కలుసుకోవచ్చు. ఒకేసారి అన్ని చోట్లా ఉండకపోవచ్చు... కానీ నెలలో కనీసం మూడు ఈవెంట్స్‌లోనైనా పాల్గొనడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే మీరు కొత్తవాళ్లను కలుసుకోవచ్చు, మీ ఉత్పత్తి లేదా సేవ గురించి మీ ఆలోచనల్ని పంచుకోవచ్చు. వాటి గురించి ఓ అంచనాకు రావొచ్చు. సరైన కస్టమర్లు దొరకొచ్చు. గతంలో చాలామంది నా కస్టమర్లను కలుసుకోవడానికి స్టార్టప్ ఈవెంట్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పటికీ అలాంటి కస్టమర్లు ఆ ఈవెంట్లల్లో కనిపిస్తుంటారు. ఎందుకంటే వాళ్లంతా సమస్యల్ని పరిష్కరించగలిగే వ్యక్తులతో పనిచెయ్యడానికి ఇష్టపడుతుంటారు. అక్కడికొస్తే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనుకుంటారు. మీరు ఏదైనా పొందాలనుకుంటే చేతికి ఎముక లేనట్టుగా ఇతరులకు సాయం చేయండి. తిరిగి ఏమీ ఆశించకూడదు. మీరు ఎలాంటి వ్యాపారం చేసినా అనుభవజ్ఞుల నుంచి సలహాలు, సూచనలు అవసరం. మీరు చేయాలనుకున్న దానికి వాళ్లు సరైన మార్గాలను చూపించగలరు. ఇలాంటివారిని కలుసుకోగలిగే ఈవెంట్స్ సిటీలో వందలకొద్దీ జరుగుతుండటం అదృష్టంగా భావించాలి. ఇక్కడికి ఆంట్రప్రెన్సూర్స్ అంతా వారి అనుభవాలను, ఎదురైన కష్టాలను, నేర్చుకున్న పాఠాలను పంచుకుంటారు. కొత్త ఆంట్రప్రెన్సూర్స్ కి మార్గదర్శకులుగా నిలుస్తారు.

3. ఓ బ్లాగ్ రూపొందించి రాయడం మొదలుపెట్టండి

మీరు మీ సొంత బిజినెస్‌ను ప్రారంభించినప్పుడు రోజూ ఎంతో కొంత నేర్చుకుంటూ ఉంటారు. సవాళ్లను ఎదుర్కుంటూనే మీ వ్యాపారాన్ని నడిపించడానికి కావాల్సిన మెళకువల్ని తెలుసుకుంటారు. వాటిని మీరు కలిసిన వ్యక్తులతో పంచుకుంటూ ఉంటారు. మరి వాటిని ఓ బ్లాగ్ ద్వారా ప్రపంచంతో ఎందుకు పంచుకోరు ? బ్లాగ్‌ను రూపొందించుకోవడం చాలా సులువు. ఉచితం కూడా. మీరు చేయాల్సిందల్లా మీ ఆలోచనల్ని అక్షరాల రూపంలో మలచడమే. వారి వారి జీవితాల్లోంచి నిజాయితీగా అనుభవాల్ని, అభిప్రాయాల్ని పంచుకునేవారి బ్లాగ్స్‌కు మంచి పేరు, గుర్తింపు వస్తోంది. బ్లాగ్ ద్వారా ఇప్పుడున్న కొత్త వ్యక్తుల పరిచయం కలుగుతుంది. అయితే బ్లాగును నడపడంలో ఓపిక ఉండాలి. చాలామంది రాత్రికి రాత్రే అద్భుతాలు జరగాలనుకుంటారు. అలా జరగకపోయే సరికి బ్లాగింగ్ ఆపేస్తారు. బ్లాగింగ్ ని మీరు ప్రొఫెషన్‌గా మార్చుకోవాల్సిన అవసరం లేదు. అది మీ బిజినెస్‌కు బాగా ఉపయోగపడుతుంది. మీ వ్యాపారానికి కొత్త క్లైంట్స్‌ని, ఫాలోవర్స్‌ని సంపాదించుకోవచ్చు. wordpress.comలో మీ బిజినెస్ బ్లాగ్‌ని తక్కువ ఖర్చుతో రూపొందించుకోవచ్చు. మీ బిజినెస్ సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్స్‌ని పెంచుకోవడానికి బ్లాగ్ చాలా ఉపయోగపడుతుంది.

4. Mailchimp తో ఫ్రీ ఈమెయిల్ మార్కెటింగ్ చేయండి.

Mailchimp... స్టార్టప్ బిజినెస్‌కు ఇది దేవుడిచ్చిన వరం లాంటిది. ఇందులో ఫ్రీ ప్లాన్ కింద మీరు రెండు వేల మంది సబ్ స్క్రైబర్లతో ఇ-మెయిల్ లిస్ట్ తయారు చేసుకోవచ్చు. 12 వేల ఇ-మెయిల్స్ వరకు పంపవచ్చు. Mailchimpలో నాకు నచ్చే విషయం ఏంటంటే చాలావరకు మార్కెటింగ్ ఇ-మెయిల్స్ ఇన్ బాక్స్ లోకే వెళ్తాయి కానీ స్పామ్ ఫోల్డర్ లోకి కాదు. Mailchimp ద్వారా మీరు పంపిన ప్రతీ ఇ-మెయిల్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. ఎంత మంది మీ ఇ-మెయిల్ ఓపెన్ చేసి చూశారో, ఎంతమంది లింక్స్ పైన క్లిక్ చేశారో తెలుసుకోవచ్చు. అంతేకాదు మీ లిస్ట్ నుంచి ఎంతమంది అన్ సబ్ స్క్రైబ్ చేశారో కూడా తెలుస్తుంది. ఇవన్నీ ఉచితమే. మీ ప్రొడక్ట్‌ని, సర్వీస్‌ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరం.

5. LinkedIn పవరేంటో తెలుసుకొని వాడుకోండి.

ఆంట్రప్రెన్యూర్ గా మీరు LinkedInలో లేని వారిని చాలా అరుదుగా కలుస్తుంటారు. మీరు LinkedInలో ఉంటే మీ స్నేహితులు, మాజీ కొలీగ్స్, మీ రంగానికి సంబంధించిన ప్రముఖులు, స్టార్టప్ ఈవెంట్లల్లో మీరు కలిసిన వ్యక్తులతో టచ్‌లో ఉండొచ్చు. మా పరిశ్రమకు సంబంధించిన చాలామంది వ్యక్తుల్ని నేను LinkedInలో కలుసుకున్నాను. నా సందేహాలకు వాళ్లు ఎప్పుడూ స్పందించేవాళ్లు. చాలామంది సీఎక్స్ఓలు లింక్డ్ఇన్ లో ఉండటం వల్ల మీ వ్యాపారం వాళ్ల దృష్టిలో పడే అవకాశం ఉంది. సరైన మార్గంలో వారిని కలిసే అవకాశం ఉంటుంది. ఎవర్నీ ఇబ్బందిపెట్టాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరేదైనా ఆసక్తికరమైన ఉత్పత్తి తయారు చేస్తే... ధైర్యంగా మీరు ఎవరో ఒకరు సీఎక్స్ఓకు మర్యాదపూర్వకంగా ఓ అభ్యర్థన రాయొచ్చు. మీ ప్రొడక్ట్‌కు సంబంధించిన ఫీడ్ బ్యాక్ కోరవచ్చు. బీటా టెస్టర్లకు మీ ప్రొడక్ట్ అవసరమైతే వాళ్లే మీరు రేపటి కస్టమర్లు అవుతారు.

6. ట్విట్టర్‌ని మీ బెస్ట్ ఫ్రెండ్‌గా మార్చేసుకోండి

ఈ విషయాన్ని చెప్పే మొదటి వ్యక్తి నేనే కాదు. దీనిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీ భావాన్ని వ్యక్తం చేయడానికి కేవలం 140 అక్షరాలే ఉన్నా ట్విట్టర్‌లో మీ ఉనికి ఉండాల్సిందే. ట్విట్టర్‌లో ఉచితంగా నేను చేసిన మార్కెటింగ్ పోస్టులతోనే చాలామంది కొత్త సబ్ స్క్రైబర్లను కలుసుకోగలిగాను. ఆడియన్స్‌ని ఆకట్టుకోవడానికి మీరు చేయాల్సిందల్లా ఆకట్టుకునే ట్యాగ్ లైన్స్, హాష్ ట్యాగ్స్ పోస్ట్ చేయడమే. చూస్తుండగానే ప్రపంచమంతటి నుంచి కొత్తవాళ్లు మిమ్మల్ని ఫాలో అవుతుంటారు. ట్వీట్స్ షేర్ చేసుకుంటారు. ఇవి మీ నెట్‌వర్క్‌ను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రొడక్ట్ ఫీడ్ బ్యాక్‌తో మీరు మరికొంత మందిని కలుసుకోవడానికి సాయాన్ని కోరవచ్చు. అయితే మీ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉండాలి. ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ పోస్ట్ చేస్తూ జనాన్ని విసిగించొద్దు.

7. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం ఫ్రీ టూల్స్, కీవర్డ్ రీసెర్చ్ లాంటి వాటి గురించి తెలుసుకోండి.

చివరగా... చాలామంది స్టార్టప్ ఆంట్రప్రెన్యూర్స్ అసలు ఈ విషయాన్నే పట్టించుకోరు. కోరుకున్న ఆడియన్స్‌ని ఆన్ లైన్‌లో ఎలా చేరుకోవాలో వారికి తెలియదు. వారి వెబ్ సైట్ ద్వారా కస్టమర్లను ఆకర్షించడంలో, పొందడంలో విఫలమవుతుంటారు. మీ వెబ్ సైట్‌ని గమనించకపోయినా, ఎప్పటికప్పుడు అప్ డేట్ చెయ్యకపోయినా మీకు ఎలాంటి లీడ్స్, సేల్స్ లభించవు. ఆన్ లైన్‌లో మీ వెబ్ సైట్ సక్సెస్‌ఫుల్‌గా రాణించాలన్నా, విఫలం కావాలన్నా డిజైన్, యూజర్ల అనుభవల్లాంటివి ప్రభావితం చేస్తాయి. ప్రజలు వేటి కోసం వెతుకుతున్నారో తెలుసుకునేందుకు కొన్ని ఉచిత టూల్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీ కంటెంట్ స్ట్రాటజీని మార్చుకోవచ్చు. ఇందులో మీకు ఇతరుల సాయం ఏమాత్రం అవసరం లేదు.

1. గూగుల్ సెర్చ్ కన్సోల్ (గతంలో గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్)- ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీ వెబ్ సైట్‌ని వెరిఫై చేయండి. మీ వెబ్ సైట్ కి సంబంధించిన సెర్చ్ టెర్మ్స్‌ని పరిశీలించండి.

2. గూగుల్ అనలిటిక్స్‌లో అకౌంట్ రూపొందించుకోండి. మీ వెబ్ సైట్ ట్రాఫిక్ సోర్స్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మీ వెబ్ సైట్‌ని చూసిన డివైజ్‌లు, బ్రౌజర్ల వివరాలు, ఏ ప్రాంతం నుంచి ఓపెన్ చేశారో లాంటి వివరాలన్నింటినీ తెలుసుకోవచ్చు.

3. గూగుల్ కీవర్డ్ ప్లానర్‌ని ఎక్కువగా గూగుల్ యాడ్ వర్డ్స్ కోసం ఉపయోగిస్తారు. అయితే దీన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సరైన కీవర్డ్స్ రూపొందించి మీ కంటెంట్ స్ట్రాటజీలో ఉపయోగించండి.

4. WooRank Free application- దీని ద్వారా మీ వెబ్ సైట్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్కోర్ తెలుసుకోవచ్చు. తద్వారా మీ వెబ్ సైట్ ని మరింతగా మెరుగుపర్చుకోవచ్చు.

స్టార్టప్ బిజినెస్ మీకు చాలా అనువుగా ఉంటుంది. ఇందులో ఎన్ని ప్రయోగాలైనా చేయొచ్చు. పెద్దగా నష్టం కూడా ఉండదు. మీ పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. నేను కూడా ఇలాగే ప్రయోగాలు చేస్తూ, కొన్నిసార్లు విఫలమవుతూ చాలా నేర్చుకున్నా. నేనే కాదు... చాలామంది స్టార్టప్ ఆంట్రప్రెన్యూర్స్ ఇలాగే నేర్చుకుంటారు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం తద్వారా విజయాన్ని సొంతం చేసుకోవడం ముఖ్యమైన అంశాలు. ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని ఆశిస్తున్నాను.

రచయిత: వినీత్ ఖురానా, విప్రాసాఫ్ట్ కో-ఫౌండర్. ట్విట్టర్: @VineetKhurana

గమనిక: ఈ ఆర్టికల్ లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆలోచనలు రచయిత వ్యక్తిగతమైనవి. వీటితో యువర్ స్టోరీకి సంబంధం లేదు.