వ్యర్థాల నుంచి విద్యుత్, తాగునీరు...! రాబోయే రోజుల్లో ఇదో అద్భుత వ్యాపారం

వ్యర్ధాల నుంచి విద్యుత్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రుల చర్చచెత్తను శక్తి వనరుగా ఉపయోగించుకోవాలని నిర్ణయంలిక్విడ్ వేస్ట్‌ను తాగునీరుగా మారుస్తున్న సింగపూర్పారిశుధ్యాన్ని పాఠ్యాంశంగా చేయాలనే ప్రతిపాదన

0

స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా 2015 మే నెలలో చండీఘడ్‌లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీటింగ్ జరిగింది. దేశంలో పెరిగిపోతున్న చెత్తను తగ్గించడానికి.. దాన్ని శక్తిగా మార్చాలని ముఖ్యమంత్రుల ప్యానల్ భావించింది. చెత్త నుంచి విద్యుత్ తీసే ప్రణాళికపై ఓ కార్యాచరణ, నివేదిక రూపొందించి జూన్ నెలాఖరు నాటికి ప్రధానికి అందచేయాలని ఈ మీటింగ్‌లో నిర్ణయించారు.


పీటీఐ కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహరాష్ట్ర, మిజోరం, హర్యానాలతో పాటు మరో ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రుల సబ్ గ్రూప్ ఈ తరహా మీటింగ్ నిర్వహించడం ఇదో రెండోసారి. మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు. “ చెత్తను శక్తివనరులుగా మార్చే డెవలపర్లు మన దేశంలో చాలామంది ఉన్నారు. వారే కలెక్ట్ చేసి, డంప్ చేసి పవర్ ప్లాంట్‌కు సరఫరా చేసే విధానంపై ఆలోచిస్తున్నాం” అన్నారు చంద్రబాబు.

హైడ్రో, సోలార్, థర్మల్... ఇలా విద్యుత్ ప్లాంట్ రకాన్ని అనుసరించి ఆయా సంస్థలకు టారిఫ్ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా చెప్పారు చంద్రబాబు. “ మేం స్థిరమైన, లాభదాయకమైన మోడల్స్ రూపొందించబోతున్నాం. వ్యర్దాలను శక్తిగా మార్చి ప్రజలకు అందించడం ఇరువిధాలా లాభదాయకంగా ఉంటుంది. లిక్విడ్ వేస్ట్‌ను కూడా శుద్ధి చేసి తాగునీరుగా మార్చే టెక్నాలజీ ఇప్పుడు సింగపూర్‌లో ఉపయోగిస్తున్నార”ని చెప్పారు చంద్రబాబు.

చండీఘడ్ మీటింగ్‌కు మునుపు ఢిల్లీలో ముఖ్యమంత్రుల భేటీ జరగ్గా... తరువాతి మీటింగ్‌ను బెంగుళూరులో జరపాలని నిర్ణయించారు.

“ఈ మీటింగ్ చాలా ఫలప్రదంగా ముగిసింది. కేంద్రం నుంచి 3 విభాగాలకు చెందిన ప్రతినిధులు తమ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే సాంకేతిక నిపుణుల బృందం కూడా ఒక ప్రజెంటేషన్ అందించింది. మెంబర్లందరూ తమ అద్భుతమైన ఆలోచనలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కేవలం నివేదిక రూపకల్పనకే పరిమితం కాకుండా.. పరిష్కారాల కోసం ప్రయత్నాలు జరిగాయి”- ఏపీ సీఎం.

వ్యర్ధాల నుంచి విద్యుత్ ఉత్పత్తిపై ఓ ఉదాహరణ కూడా చెప్పారు చంద్రబాబు. ఢిల్లీలోని ఓఖ్లాలో 20మెగావాట్ల విద్యుత్ చెత్త నుంచే ఉత్పత్తి అవుతోంది. “ ఓఖ్లా ప్రాజెక్ట్ విజయవంతంగా పని చేస్తోంది. ప్రపంచం మొత్తం ఇప్పుడీ అంశానికి ప్రాధాన్యతనిస్తోంది. చైనా, యూఎస్, జపాన్‌లలోనూ ఈ తరహా ప్రాజెక్టులు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయన్నారు” చంద్రబాబు.

పారిశుధ్యాన్ని ఓ పాఠ్యాంశంగా స్కూల్ స్థాయి నుంచే విద్యార్ధులకు నేర్పాలని ఈ ముఖ్యమంత్రుల భేటీలో హర్యానా ముఖ్యమంత్రి లాల్ ఖట్టార్ ప్రతిపాదించారు. దీనితో పిల్లలకు చిన్ననాటి నుంచే తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే అవగాహన, బాధ్యత ఏర్పడుతాయన్నారు ఖట్టార్.

వ్యర్ధాల నిర్వహణపైనా ఈ మీటింగ్‌లో సుదీర్ఘంగా చర్చించారు.“ ఈ అంశంపై కొంత ప్రాథమిక చర్చ జరిగింది. కేంద్రం కూడా ఈ విషయంపై తీవ్రంగా ఆలోచిస్తోంది. విద్యుత్ విభాగానికి చెందిన సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ దీనిపై తీవ్రంగా శ్రమిస్తోంది”అన్నారు చంద్రబాబు. వ్యర్ధాల నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్ ధర... ఒక్కో యూనిట్‌కు ఇప్పుడున్న స్థాయి నుంచి బాగా తగ్గే అవకాశాలున్నట్లు చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి. ఈ ప్రాజెక్టులు వాణిజ్యపరంగా లాభదాయకమేనని భరోసా ఇచ్చారు.

Image Credit : Shutterstock