మురికివాడల పిల్లలు.. రాక్ స్టార్లయ్యారు.. !

మురికివాడల పిల్లలు.. రాక్ స్టార్లయ్యారు.. !

Friday November 06, 2015,

4 min Read

వారంతా మురికివాడల్లో చిత్తుకాగితాలు ఏరుకొనే పిల్లలు.. కానీ వాళ్లు పాడితే బిగ్ బీ అమితాబ్ కూడా మంత్రముగ్ధుడై చూస్తాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వారితో కలిసి స్టెప్పులేస్తాడు. అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబే, జర్మన్ స్కూల్ లాంటి ప్రముఖ పాఠశాలలు కూడా ఈ చదువురాని పిల్లలతో ప్రత్యేకంగా ప్రదర్శనలు ఇప్పించాయి. వాళ్ల కథ స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. అది రీల్ స్టోరీ అయితే ఇది రియల్ స్టోరీ. మరి ఈ మట్టిలో మాణిక్యాలను వెతికిపట్టుకొని రియల్ హీరోలుగా తయారుచేసిన అభిజిత్ జేజురికర్ గురించి, ధారావి రాక్స్ సృష్టిస్తున్న ప్రభంజనం గురించి మీరూ చదవండి.

image


ధారావి.. ఇది ఆసియాలోనే పెద్దదైన మురికివాడగానే అందరికీ తెలుసు. కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముంబై మహానగరం నడిబొడ్డున ఉన్న ఈ మురికివాడ ఇప్పుడు దేశం గర్వించదగిన రాక్ స్టార్లను తయారుచేస్తోంది. అకార్న్ (ACORN) పేరుతో ఇక్కడ నడిచే ఓ ఫౌండేషన్.. ఈ స్లమ్ రాక్ స్టార్స్ అద్భుత ప్రతిభకు వేదికైంది. పనికి రావని పక్కన పాడేసిన ప్లాస్టిక్ బ్యారెల్స్, డబ్బాలు, పెయింట్ క్యాన్లే వారి సంగీత వాయిద్యాలు. వాటితోనే అదిరిపోయే విన్యాసాలు చేస్తున్నారు. వినోద్ శెట్టి అనే వ్యక్తి ఈ ఫౌండేషన్ కు ఊపిరిపోశాడు. అభిజిత్ జేజురికర్ అనే వ్యక్తి ఇక్కడి పిల్లల్లోని ప్రతిభను వెలికితీసి, దానికి సానబెట్టి వాళ్లను స్టార్లను చేశాడు. పనికిరాని వస్తువులను సంగీత వాయిద్యాలుగా చేయడమే కాదు.. చిత్తు కాగితాలు ఏరుకొనేవారిని, ఫ్యాక్టరీలు, ఇళ్లలో పనిచేసే పిల్లలను రాక్ స్టార్లుగా మలిచిన ఘనత ఆయన సొంతం. ధారావి రాక్స్ అంటూ వంద మంది అలాంటి పిల్లలకు సమాజంలో ఓ స్టేటస్ ఇచ్చాడు.

అభిరుచి, అంకితభావం కలిపితే ధారావి రాక్స్

అభిజిత్ జేజురికర్.. కొన్నాళ్ల కిందటి వరకు ఓ సాధారణ వ్యక్తే. ఎస్సార్ గ్రూపులో మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా కెరీర్ ప్రారంభించడానికి ముంబై వచ్చాడు. ఆ తర్వాత ఎకనమిక్ టైమ్స్ పత్రికలోనూ పనిచేశాడు. చివరికి ఐఎన్‌ఎస్ టాల్క్స్ సంస్థకు కన్సల్టెంట్‌గా సెటిలయ్యారు. ఓవైపు ఈ పనులన్నీ చేస్తూనే మరోవైపు తనకెంతో ఇష్టమైన సంగీతంతో సమాజసేవకు పూనుకున్నారు. ‘కార్పొరేట్ కెరీర్ మొదలుపెట్టడానికే ముంబై వచ్చాను. కానీ నాకున్న నైపుణ్యంతో సమాజంలో ఎంతోకొంత మార్పు తీసుకురావాలన్నది ఆశయం. సంగీతంపై ఉన్న ప్రేమతో తరచూ బ్లూఫ్రాగ్‌కు వెళ్తుండేవాడిని. అక్కడే ఓ స్నేహితుని ద్వారా వినోద్ శెట్టిని కలిశాను’ అని చెప్పారు అభిజిత్. మురికివాడల్లోని పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తున్న అకార్న్(ACORN) ఫౌండేషన్‌కు డైరెక్టర్ అయిన వినోద్ శెట్టి.. అప్పటికే అభిజిత్ లాంటి మ్యుజీషియన్ కోసం ఎదురుచూస్తున్నారు. సంగీతం ద్వారా తన ఫౌండేషన్‌కు సాయం చేయాలని వినోద్ అడగడంతో దానికి వెంటనే అంగీకరించిన అభిజిత్.. అకార్న్‌తో చేతులు కలిపాడు. 

‘తొలిసారి ముతుంగాలోని జేవియర్స్ ఇన్‌స్టిట్యూట్లో ఆ పిల్లలను కలిశాను. వారి నేపథ్యం తెలుసుకున్నాక నా నోట మాట రాలేదు. ఎలాగైనా వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయించకున్నాను’ అని అభిజిత్ తన అనుభవాలను పంచుకున్నాడు. తన అభిరుచికి ఆ పిల్లల అంకితభావం తోడైంది. ఆ ఫలితమే ‘ధారావి రాక్స్’.

image


మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన అభిజిత్

ధారావిలాంటి మురికివాడ నుంచి ఇలాంటి జెమ్స్‌ను ఎలా తయారుచేశారు ? అభిజిత్‌కు తరచూ ఎదురయ్యే ప్రశ్నఇది. దానికి అతని సమాధానం కూడా చాలా సింపుల్. ‘మురికివాడల నుంచే ఇలాంటి నైపుణ్యం బయటపడేది. డబ్బున్నవాళ్లు తమ పిల్లల ప్రతిభను సానబెట్టడానికి ఎంతో ఖర్చు చేస్తుండొచ్చు. కానీ దేవుడు మాత్రం అందరికీ సమానమైన ప్రతిభనే ప్రసాదించాడు. ఈ పిల్లలతో ఒక్కరోజు గడిపినా ఆ విషయం తెలుస్తుంది. ఇందులో కొందరు అద్భుతంగా పాడగలరు. మరికొందరు డ్యాన్స్ చేయగలరు. ఇంకొందరు నటించగలరు. ఇంతటి టాలెంట్ మా దగ్గర ఉంది కాబట్టే 40 నిమిషాల పాటు మంచి ఎనర్జీతో ప్రదర్శనలు ఇవ్వగలుగుతున్నాం’ అని అభిజిత్ చెబుతున్నాడు. అందులోనూ పనికిరాని ప్లాస్టిక్ డ్రమ్ములు, డబ్బాల నుంచే అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తున్నారు ఈ స్లమ్ రాక్ స్టార్స్. ఇది కూడా అభిజిత్ ఆలోచనే. ‘రీసైకిల్, రీ యూజ్, రెస్పెక్ట్’ అన్నదే తమ ఫౌండేషన్ నినాదమని అతనంటాడు.

image


పాప్ అయినా.. ర్యాప్ అయినా.. అదుర్స్

మురికివాడల్లో పెరిగిన ఈ పిల్లలు ఎప్పుడూ స్కూల్ మొహం కూడా ఎరుగరు. కానీ స్టేజ్ పై వీళ్లు పాడుతుంటే పాప్ స్టార్స్‌కు ఏమాత్రం తీసిపోరు. అది పాప్ అయినా.. ర్యాప్ అయినా వీళ్ల ముందు దిగదుడుపే. ఎంతో క్లిష్టమైన ర్యాప్‌ను సైతం రప్ఫాడిస్తారు. ఒక్క ఇంగ్లిష్ ముక్క కూడా రాని వీరు అలా పాడటం చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే. చెన్నైలో ఓ ప్రదర్శన కోసం ఎంతో పాపులర్ అయిన ‘కొలవెరి డీ..’ పాటను అచ్చం సౌత్ స్టైల్లో పాడి అబ్బుర పరచడం ధారావి రాక్స్ కే సాధ్యమైంది.

image


బిగ్ బీ ముందు మరుపురాని షో

దేశవ్యాప్తంగా వందకుపైగా షోలు చేసినా.. తమ జీవితంలో మరుపురానిది మాత్రం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముందు ఇచ్చిన ప్రదర్శనే అంటాడు అభిజిత్. వీళ్ల గురించి తెలుసుకున్న అమితాబ్.. వారిని స్వయంగా ఇంటికి పిలిపించుకోవడం గమనార్హం. అంతేకాదు కండలవీరుడు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోలోనూ ధారవి రాక్స్ తమ సత్తా ప్రపంచానికి చాటారు. సల్లూ భాయ్ కూడా ఈ వండర్ కిడ్స్‌తో స్టెప్పులేశాడు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు విశాల్, శేఖర్, శాంతను మోయిత్రా, సింగర్ ఉషా ఉతుప్‌లతో కలిసి పనిచేశారు. ఎంతోమంది అమెరికన్లు, యురోపియన్లు తమపై డాక్యుమెంటరీలు చిత్రీకరించారని అభిజిత్ చెబుతున్నాడు. ఇదంతా సోషల్ మీడియా వల్లే సాధ్యమైందని చెప్పాడు. 

ఏడాదికోసారి తమ ఫౌండేషన్ కోసం కూడా వీళ్లు ఓ ఈవెంట్ నిర్వహిస్తారు. ఫండ్ రైజర్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని అకార్న్ ఫౌండేషన్‌కు ఇచ్చేస్తారు. ఈ గ్రూపులో ఉన్న చిన్నారుల పేరు మీద కూడా రికరింగ్ బ్యాంక్ అకౌంట్స్ తెరిచారు. వారు మేజర్లుగా మారిన తర్వాత తమ కష్టార్జితాన్ని వాడుకుంటారు. మొదట్లో 20, 30 మంది పిల్లలున్న ధారావి రాక్స్ లో ప్రస్తుతం వంద మంది ఉన్నారు. వీరి జీవితాల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వారి ఆత్మవిశ్వాసం ఆకాశాన్నంటుతోంది. వారు క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మెలుగుతున్నారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే అభిజిత్ ఇచ్చే సమాధానం ఒక్కటే. ‘అభిరుచి, అంకితభావం వల్లే ఇది సాధ్యమైంది. ప్రతి నిమిషంలోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. వాళ్లను క్రమశిక్షణలో పెట్టడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో కూడా నేర్పాల్సి వచ్చింది. దీని కోసం మొదట్లో నేను కఠినంగా వ్యవహరించా. దానికి తగిన ఫలితం దక్కింది. ఇప్పుడు సమాజంలో వారికో గౌరవం, గుర్తింపు దక్కింది. ఇంతటి విజయం సాధించినా.. వారింకా అణిగిమణిగే ఉంటున్నారు’ అని అభిజిత్ ముగించాడు. 

ఈ స్లమ్ రాక్ స్టార్స్ భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.