2017కు ఆర్ధిక స్వాగతం పలుకుతున్న తెలంగాణ

ఫైబర్ టు ఫ్యాబ్రిక్ యాక్టివిటీ జరగాలన్నదే సర్కారు లక్ష్యం

2017కు ఆర్ధిక స్వాగతం పలుకుతున్న తెలంగాణ

Tuesday December 27, 2016,

5 min Read

సెక్టార్లవారీగా పెట్టుబడులు ఆహ్వానించడమే కాదు.. తెలంగాణ పది జిల్లాల్లో ఎక్కడెక్కడ వనరులన్నాయి.. వాటిని ఎలా వాడుకునే అవకాశం ఉందనే విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తోంది. పరిశ్రమలను ఒకచోట మాత్రమే ఏర్పాటు చేయకుండా రాష్ట్రం నలుమూలలా విస్తరించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫైబర్ టు ఫ్యాబ్రిక్.. ఎండ్ టు ఎండ్ యాక్టివిటీ జరగాలన్న లక్ష్యంతో తెలంగాణ సర్కారు ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది

ఉదాహరణకి ఆదిలాబాద్ లో సిమెంట్, సిరామిక్, పేపర్, కలప, అటవీ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయబోతోంది, కరీంనగర్ లో ఫర్టిలైజర్స్, గ్రానైట్, జౌళి, విత్తన శుద్ధి, ఐటీ లాంటి పరిశ్రమలకు అవకాశం ఇస్తోంది. నిజామాబాద్ లో ఫుడ్ ప్రాసెసింగ్, స్పైస్ పార్క్. ఇలా ప్రతీ జిల్లాలో రిసోర్స్ మ్యాపింగ్ చేస్తున్నారు. తద్వరా పారిశ్రామికేకరణకు ఎవరు ముందుకు వచ్చినా కేవలం హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులు పెట్టేలా కాకుండా తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు లభించే విధంగా పలు ప్రణాళికలు సిద్ధం చేశారు.

జిల్లాలు సెక్టార్లు మాత్రమే కాకుండా ఒక ఫోకస్డ్ ఎఫర్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో అనేక ముఖ్యమైన ప్రాజెక్టులు చేపట్టారు. అందులో ముఖ్యమైంది హైదరాబాద్ ఫార్మా సిటీ. మొత్తం 12వేల పైచిలుకు ఎకరాల్లో దీన్ని స్థాపించబోతున్నారు. అలాంటి ప్రాజెక్టును నిమ్జ్ గుర్తిస్తే కొన్ని ప్రోత్సాహకాలు అదనంగా కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి కాంప్రహెన్సివ్ క్లస్టర్ గా ఏర్పాటు చేయబోతున్నారు. ఇండియాలోనే ఇదే అతిపెద్ద ఫార్మాసిటీ కాబోతోంది. అచ్చం చైనాలోసి సుఝౌ, సింగపూర్ టువాస్ ఫార్మా పార్క్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబోతున్నారు. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీ ఉన్నట్టే కనిపించదు. కనీసం మందుల వాసన కూడా రాదు. అచ్చం అదే తరహాలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ యూనిట్ కాన్సెప్టులో ఏర్పాటు చేయబోతున్నారు. దానిద్వారా వ్యర్ధ పదార్ధాల విసర్జన అన్నమాటే ఉండదు.

సిటీ చుట్టు వచ్చే పరిశ్రమలన్నీ లివ్, వర్క్, లర్న్, అండ్ ప్లే అనే కాన్సెప్టులో టౌన్ షిప్స్ లాగా తయారు చేయాలనేది సర్కారు లక్ష్యం. దీనివల్ల కౌంటర్ మాగ్నెట్స్ డెవలప్ అవుతాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్యోగం చేసేవాళ్లంతా అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగుల పిల్లలు అక్కడే చదువుకుంటారు. అందులోనే ఫార్మా యూనివర్శిటీని కూడా నెలకొల్పబోతున్నారు. ఇది కాకుండా, జహీరాబాద్ నిమ్జ్ కోసం కేంద్ర నుంచి సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. దానికి అవసరమైన లాండ్ బ్యాంక్ సేకరిస్తున్నారు. 2,800 ఎకరాలు సమీకరించారు. మిగిలింది కూడా త్వరలోనే పూర్తి చేస్తారు.

ముంబై, సూరత్, భీవండికి వలస పోయిన నేత కార్మికులను తిరిగి రప్పించి వారికి ఉపాధి కల్పించేలా.. ఆజంజాహి మిల్లుకు ప్రత్యామ్నాయంగా వరంగల్ శివార్లలో 2000 ఎకరాల్లో మెగా టెక్స్ టైల్ క్లస్టర్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే 1200 ఎకరాల పైచిలుకు భూమిని సేకరించారు. త్వరలోనే దానికి శంకుస్థాపన జరగనుంది.

తెలంగాణలో 60 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరుగుతోంది. అందులో కేవలం 10 లక్షలు మాత్రమే వినియోగిస్తున్నారు. మిగిలిన 50 లక్షలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఇక్కడ పండించే నాణ్యమైన పత్తి మరెక్కడా దొరకదని స్వయానా జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులే చెప్తున్నారు. అదంతా తెలంగాణ రాష్ట్రమే సద్వినియోగం చేసుకునేలా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. అదొక్కటే కాదు.. అందులో టెక్స్ టైల్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

image


కేంద్రం తీసుకున్న మేకిన్ ఇండియా నినాదానికి మద్దతుగా మాన్యుఫ్యాక్చరింగ్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నదే టీఎస్ సర్కారు ప్రధాన ఉద్దేశం. సెక్టార్ ఏదైనా స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆ ఉద్దేశంతోనే ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో మెడికల్ డివైజెస్ పార్కుని ఏర్పాటు చేయబోతున్నారు. సుమారు 200 ఎకరాల్లో ప్రస్తుత సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ దగ్గర దీన్ని నెలకొల్పబోతున్నారు.

ప్రస్తుతానికి రెండుచోట్ల ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ పార్కులు ఉన్నాయి. అందులో ఒకటి రావిర్యాలలో ఉంటే, మరొకటి మహేశ్వరంలో ఉంది. ఈ మధ్యనే మూడు మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు వచ్చాయి. సెల్ కాన్, మైక్రోమాక్స్, డేటావిండ్ అనే మొబైల్ కంపెనీలతో పాటు కన్స్యూమర్ ఎలక్రానిక్స్ కంపెనీ థామ్సన్ ఆపరేషన్స్ మొదలుపెట్టింది. ఇందులో మైక్రోమాక్స్ మొదట మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ కోసమనే ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు చైనాలో ఉన్న ఆర్ అండ్ డీ సెంటర్ ను కూడా ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. మిగతా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేయబోతున్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు తగిన ప్రోత్సాహం కల్పించాలన్న ఉద్దేశంతో సుల్తాన్ పూర్ దగ్గర 50 ఎకరాల్లో దాదాపుగా 30 శాతం కంటే తక్కువ మార్కెట్ వేల్యూతో ఒక ప్రత్యేకమైన పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది.

స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతంలో మెగా లెదర్ పార్కును ఏర్పాటు చేయబోతున్నారు. దాన్ని ఇతర మినీ లెదర్ పార్కులకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దాంతోపాటు ఫర్నిచర్ పార్క్ కూడా నెలకొల్పాలని భావిస్తున్నారు. దానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఇటు ఆటోమొబైల్ రంగంలో మైక్రో, స్మాల్ ఇండస్ట్రీలకు ప్రయోజనం కలిగేలా దాదాపు ఏడు చోట్ల ఆటోనగర్ లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్, ఖమ్మం, రామగుండం, మిర్యాలగూడ, మంచిర్యాల, కామారెడ్డి, వికారాబాద్ లో ఆటోనగర్ల ఏర్పాటు కోసం 25-30 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నారు. దీనివల్ల ఐటీఐ, డిప్లొమా చదువుకున్న యువతకు పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

రూరల్ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం మరింతగా ఆలోచిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను నోటిఫై చేశారు. ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ముఖ్యమైంది. అందులో భాగంగానే ఇప్పటికే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బుగ్గపాడు గ్రామంలో 60 ఎకరాల స్థలంలో ఫుడ్ పార్కుని ఏర్పాటు చేశారు. మరొకటి నిజామాబాద్ లో ఉంది. ఇంకోటి మహబూబ్ నగర్ అలంపూర్ ప్రాంతంలో రాబోతోంది. ఇక కొత్త ప్రతిపాదనల విషయానికొస్తే జనగామ, రంగారెడ్డి, సిరిసిల్ల, మెదక్ లో కూడా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.

సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను తీర్చిదిద్దేలా మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ లో సీడ్ ప్రాసెసింగ్ సెక్టార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 80 ఎకరాల నుంచి 250 ఎకరాల్లో ఇవి రాబోతున్నాయి.

సమగ్ర పారిశ్రమిక విధానం ఉండాలనే ఆలోచనతో ఆరు ఇండస్ట్రియల్ కారిడార్స్ కావాలని కేంద్రానికి ప్రతిపాదించారు. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్ పూర్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-మంచిర్యాల, హైదరాబాద్-నల్గొండ, హైదరాబాద్-ఖమ్మం. ఇందులో మొదటి దశగా హైదరాబాద్- వరంగల్ తీసుకుంటున్నారు. ఇందులో ఐదు క్లస్టర్లను గుర్తించారు. భువనగిరి ఏరియాలో ప్లాస్టిక్ లేదా ప్యాకేజింగ్.. కాదంటే గ్లాస్ ఇండస్ట్రీని పెట్టబోతున్నారు. ఆలేరు-జనగామ మధ్యలో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ గానీ, ఇంజినీరింగ్ సెక్టార్ ను గానీ నెలకొల్పాలనే ఆలోచనలో ఉన్నారు. రాంపూర్-మడికొండ ప్రాంతంలో ఇప్పటికే సైయంట్ ఐటీ పార్క్ ఉంది. దాంతోపాటు త్వరలో నిజామాబాద్, ఖమ్మంలో కూడా ఐటీ పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు. హుజూరాబాద్-జనగామలో ఐటీ కంపెనీ రాబోతోంది. స్టేషన్ ఘన్ పూర్ లో లెదర్ ఇండస్ట్రీ లేదంటే స్పిన్నింగ్ ఇండస్రీ పెట్టబోతున్నారు. శాయంపేట ప్రాంతంలో మెగా టెక్స్ టైల్ పార్క్ రాబోతోంది.

రెడ్/ఆరెంజ్ ఇండస్ట్రీస్ (కాలుష్యకారక పరిశ్రమలు) తరలింపు విషయంలో గతంలో ఇచ్చిన జీవోకి కట్టబడి వుందని ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలి 1500 పరిశ్రమలను షిఫ్ట్ చేస్తున్నారు. ఇందుకోసం 19 చోట్ల లాండ్ బ్యాంక్ గుర్తించారు. అన్ని చోట్లా ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పి, ఎలాంటి కాలుష్యం లేదని తేలిన తర్వాతనే కంపెనీలను తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది.

స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే కార్యక్రమంలో భాగంగా టాస్క్, న్యాక్ లాంటి సంస్థలతో వేలాదిమందికి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నారు. టీ- ప్రైడ్ కింద 35 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అయితే మరో ఐదు శాతం అదనంగా.. మొత్తం 40 శాతం రాయితీ ఇస్తున్నారు. ఈ రెండున్నరేళ్లలో 11,679 ఇన్సెంటివ్ ప్రతిపాదనలు వస్తే అందులో రూ. 1230 కోట్ల సబ్సిడీని మంజూరు చేశారు. ఇప్పటిదాకా జరిగిన 342 యూనిట్ల కేటాంపుల్లో ఎస్సీలకు 62 యూనిట్లు, ఎస్టీలకు 25, మహిళా ఆంట్రప్రెన్యూర్లకు 31 యూనిట్లు కేటాయించారు. తెలంగాణలో ఇండస్ట్రీ సిక్ అవడానికి వీల్లేదని భావించి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్ ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం.

పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనడమే కాకుండా టాప్ ఫైవ్ కంపెనీల్లో నాలుగింటిని హైదరాబాదుకు రప్పించగలిగారు. 56వేల కోట్లున్న ఐటీ ఎగుమతులు నేడు 75వేల కోట్లు అయ్యాయి. వచ్చే రెండున్నరేళ్లలో ఆ సంఖ్యను రెట్టింపు చేయాలనేది ప్రభుత్వ సంకల్పం.