దట్టమైన అడవిలో బాహ్యప్రపంచానికి తెలియని ద్రోణాచార్యుడు

0

విలువిద్య. ఒక ప్రాచీనకళ. పురాణేతిహాసాల్లో రాజుల నుంచి భటుల దాకా విల్లంబులు చేతబూని యుద్ధం చేసిన వారే. మత్స్య యంత్రాన్ని కొట్టిన అర్జునుడి గురించి అందరికీ తెలుసు. ద్రోణుడు తిరస్కరించినా, గురువు విగ్రహాన్ని మట్టితో మలిచి దాని ఎదురుగా ప్రాక్టీస్ చేసి జయహో అనిపించిన ఏకలవ్యుడి కథా అందరికీ పరిచయమే. తిరుగులేని రామబాణం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విప్లవ వీరుడు అల్లూరి విల్లంబులు చేతబూనే కదా బ్రిటిష్ వారిని గడగడలాడించాడు.

నానాటికీ అంతరించి పోతున్న ఈ ధనుర్విద్యా ప్రదర్శనను జాతీయ, అంతర్జాతీయ క్రీడగా తీర్చిదిద్ది పూర్వవైభవం తేవడం హర్షించాల్సిన విషయం. అలాంటి విలువిద్యలో ఆరితేరి ఎందరో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నది ఎక్కడో దట్టమైన అడవిలో ఉన్న ఒక చిన్న గూడెంలో నివసించే ఆదివాసీ అని చాలా కొద్దిమందికి తెలుసు.


ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బిలాస్ పూర్ జిల్లాలో ఉంది శివత్రయ్ అనే ఆదివాసీ గూడెం. చుట్టూ దట్టమైన అడవి. ఏ రోడ్డుసదుపాయమూ లేదు. బాహ్యప్రపచంతో సంబంధాలు అంతంతమాత్రం. గూడెంలో ఉన్న ఆడామగా అందరిదీ ఒకటే ఆయుధం. విల్లు-బాణం. అదే వారి జీవనాధారం. ఐత్వారీ రాజ్ గూడెంలో పెద్ద. అతనే అందరికీ ధనుర్విద్యలో మెళకువలు నేర్పేది. సొంత గూడెం ప్రజలకే కాదు.. ఇప్పటిదాకా ఒక యాభైమందిని అర్చరీలో నేషనల్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దాడు.

స్థానిక జిల్లా యంత్రాంగం శివత్రయ్ ప్రాంతంలో ఓ అర్చరీ అకాడమీ పెట్టి, ఔత్సాహికులందరికీ విలువిద్యలో శిక్షణ ఇప్పించాలని భావిస్తోంది. ఐత్వారీ రాజ్ చేత మెళకువలు నేర్పించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయాలని సంకల్పించింది. ఐత్వారీ సేవలు ధనుర్విద్యా క్రీడకు ఎంతో అవసరమని భావించిన అధికారులు, అక్షరాలు తెలియని ఆదివాసీనే ఆదిగురువుగా ఎంపిక చేసుకుంది. దట్టమైన అడవిలో బాహ్యప్రపంచానికి తెలియని ఈ ద్రోణాచార్యుడి శిష్యరికంలో మరెంతోమంది అద్భుతమైన క్రీడాకారులు తయారుకావాలని ఆశిద్దాం..

Related Stories