ఆర్గానిక్ ఫుడ్ రెస్టారెంట్ ఎలా మొదలైందంటే..?

ఆర్గానిక్ ఫుడ్ రెస్టారెంట్ ఎలా మొదలైందంటే..?

Sunday April 17, 2016,

5 min Read


"ప్రార్థించే చేతుల కన్నా... సాయం చేసే చేతులు మిన్న" - మదర్ థెరిస్సా.

ఈ మాటల్ని అక్షరాలా నమ్ముతాడు అనూప్ పూనియా. నమ్మడమే కాదు ఆచరణలో పెట్టి చూపించాడు కూడా. పర్యావరణ కార్యకర్తల్లా నినాదాలు, ప్రసంగాలను ఇవ్వడం కాదు... పర్యావరణ పరిరక్షణలో తన వంతు కృషి చేస్తున్నారాయన. అసలు అనూప్ కెరీర్ పర్యావరణం వైపు నేరుగా అడుగులు వేయలేదు. ఎన్నెన్నో మలుపులున్నాయి. చాలా ట్విస్టులున్నాయి. తనకు ఎదురైన అనుభవాలన్నీ పర్యావరణ సమస్యలపై దృష్టిపెట్టేలా చేశాయి. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవాలన్న కసిని పెంచాయి. ఆ కసి, పట్టుదలతో ఇండియా యూత్ క్లైమేట్ నెట్ వర్క్(IYCN) లాంటి గ్రీన్ స్టార్టప్స్ కు మంచి పునాది వేశాయి. వాతావరణ మార్పు కోసం యువత చేపట్టాల్సిన చర్యల గురించి పనిచేసే స్టార్టప్ అది. ఆయనే తొలిసారి ఉదయ్ పూర్ లో ఫామ్ టు ఫుడ్ రెస్టారెంట్ ప్రారంభించారు. కొన్ని నెలల్లోనే ట్రిప్ అడ్వైజర్ లో మిల్లెట్స్ ఆఫ్ మెవార్ కు నెంబర్ వన్ రేటింగ్ వచ్చింది. అసలు అనూప్ ప్రయాణం ఎక్కడ మొదలైంది? తన ప్రయాణంలో ఒడిదుడుకులేంటీ? యువతకు స్ఫూర్తిగా ఎలా నిలిచారు? తెలుసుకుందాం..

అనూప్ పూనియా. పర్యావరణవేత్త. వాతావరణ కార్యకర్త. పర్యావరణ సమస్యల పరిష్కారమే లక్ష్యం. కాలేజీలో మార్కెటింగ్ డిగ్రీ చేస్తున్నప్పుడు ఆంట్రప్రెన్యూరియల్ జర్నీలో తొలి అడుగు పడింది. భారతీయ కళాకారులు తయారుచేసిన కళాఖండాలను వెబ్ సైట్ ద్వారా ఎగుమతి చేసే కంపెనీని ఒక సీనియర్ భాగస్వామ్యంతో ప్రారంభించారు. తనకు ఇష్టమైన మూడు (వర్తకం, పర్యావరణం, పొలిటికల్ ఎకానమీ) అంశాల కలయికే ఈ వెంచర్. దీనికోసం చాలా కష్టపడ్డాడు. అస్తవ్యస్తంగా ఉన్న అంతర్జాతీయ వర్తకంలో అడుగుపెట్టేందుకు ఆఫ్రీన్ పేరుతో మరో చిన్న స్టార్టప్ ని అనుబంధంగా ప్రారంభించారు. Indiamart.com, Alibaba.com లాంటి ఇ-ప్లాట్ ఫామ్స్ అనూప్ కు ఎంతో సపోర్ట్ ఇచ్చాయి. రెండేళ్లు అంతా బాగా నడిచింది. కానీ నిధుల కొరత వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. నిర్వహించింది కొద్దికాలమే అయినా... ఈ వెంచర్ ఎంతో అనుభవాన్నిచ్చింది. సొంతగా ఎంటర్ ప్రైజ్ నిర్వహించడానికి కావాల్సిన మెళకువలన్నీ నేర్పింది. భారతదేశంలోని చిన్న కళాకారులకు మద్దతుగా నిలిచానన్న సంతృప్తి మిగిల్చింది.

"కొన్ని కారణాల వల్ల నిరాశ నిస్పృహలు కలిగాయి. సంక్షేమం విషయంలో కార్పొరేట్ ప్రాసెస్ ఆలస్యం కావడం నన్ను మనోవ్యథకు గురిచేసింది. అవి పూర్తయ్యేవరకు ఎదురుచూసేంత ఓపిక, సహనం లేకపోవడం వల్ల చికాకు కలిగేది. సరిగ్గా ఆ సమయంలోనే వాతావరణ మార్పు సమస్య తీవ్రతపై దృష్టిపెట్టాలనిపించింది" అంటారు అనూప్.

image


నేషనల్ యూత్ క్లైమేట్ యాక్షన్ ప్లానింగ్

2008లో యువత కోసం క్లైమేట్ ఛేంజ్ అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్ కు అప్లై చేయడం అనూప్ జీవితంలో మరో మలుపు. అక్కడ వేర్వేరు రంగాలకు చెందిన చాలామంది యువతీ యువకులను కలుసుకున్నారాయన. అక్కడ పర్యావరణ కార్యకర్తల సేవలు ఆకట్టుకున్నాయి. అబ్బురపరిచాయి. వాళ్లందరితో కలిసి పనిచేస్తున్న సమయంలో IYCN ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. సహచరుడు కార్తికేయ సింగ్ తో కలిసి IYCN ప్రారంభించారు. వాతావరణ సమస్యల్ని పరిష్కరించాలన్న ఆసక్తి ఉన్న 21 నుంచి 28 ఏళ్ల యంగ్ అండ్ ఎనర్జిటిక్ యూత్ తో ఏర్పాటు చేసిన నెట్ వర్క్ అది. శక్తిమంతులు, సాహసవంతుల కలయిక ఆ బృందం. వాతావరణ మార్పుపై తాము పని చెయ్యడమే కాకుండా మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారా యువతీయువకులు.

2009లో భారతదేశంలోని ఆరు నగరాల్లో నెట్ వర్క్ విస్తరిస్తే... 2011 నాటికి 18 పెద్ద పెద్ద నగరాలకు విస్తరించిందీ సంస్థ. పెట్రోలియం, కెమికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ చేసినవాళ్లు పీజీలో పర్యావరణ, ఇంధన అంశాలను ఎంపిక చేసుకోవడం విశేషం. చాలామంది స్కూల్ విద్యార్థులు గ్రీన్ బిల్డింగ్స్ నిర్మించేందుకు ఆర్కిటెక్చర్ నేర్చుకున్నారంటే ఈ సంస్థ ఎంతలా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు వాతావరణ సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రొఫెషనల్ వెంచర్స్ ప్రారంభించారు.

IYCN ద్వారా స్థానిక ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. బెంగళూరులో వేస్ట్ మేనేజ్ మెంట్, చెరువుల పరిరక్షణ కోసం పనిచేస్తే, హైదరాబాద్ చాప్టర్ రసాయనాలు లేని గణేషుని విగ్రహాల తయారీపై దృష్టిపెట్టింది. అమర్ నాథ్ యాత్రలో ప్లాస్టిక్ బాటిళ్లను కొని పారెయ్యకుండా వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసింది జమ్మూ కాశ్మీర్ చాప్టర్. వీరి సేవలకు అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కింది. అంతే కాదు... పార్లమెంట్ సాక్షిగా కేంద్రమంత్రి ప్రశంసలు అందుకుంది. మాజీ పర్యావరణ శాఖ మంత్రి జైరామ్ రమేష్ పార్లమెంట్ లో మాట్లాడుతూ వాతావరణ సమస్యల పరిష్కారానికి IYCN యువత పోషిస్తున్న పాత్రను ప్రస్తావించారు. అంతేకాదు... వీరి ప్రయత్నాలకు రక్షణ దళాల నుంచీ స్పందన లభించింది. తమ పరిసరాలను వాతావరణ అనుకూలంగా మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆయా దళాలు సాంకేతిక సలహాలు అడిగాయి. వాతావరణ కార్యకర్తగా సేవలందించడం, ప్రశంసలు పొందడం సులభమే కానీ... అవసరాలు తీరడానికి డబ్బులెలా సంపాదించాలి? ఇదీ వీరి ముందున్న సవాల్. ఈ ప్రశ్నే గ్రీన్ స్టార్టప్ ప్రారంభించాలన్న ఆలోచనకు బీజం వేసింది. ఇన్నాళ్లూ విద్యార్థులకు బోధించిన పాఠాలను అమలు పర్చాల్సిన సమయం వచ్చింది. అలా ఫామ్ టు టేబుల్ రెస్టారెంట్ ఉదయ్ పూర్ లో ప్రారంభమైంది.

image


మిల్లెట్ పవర్

త్వరగా డబ్బు సంపాదించేందుకు ఆ సమయంలో వేరే ఇకో-క్లైమేట్ బిజినెస్ ఐడియా లేకపోవడంతో ఈ వ్యాపారంలో అడుగుపెట్టారు. కొండంత విశ్వాసంతో ముందుకెళ్లారు. అనూప్ సహచరులు చేసిన వంటకాలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా పర్యాటకులను ఆకట్టుకుంది. దీంతో ఆరు నెలల్లో వ్యాపారం పుంజుకుంది. అలా 'మిల్లెట్స్ ఆఫ్ మెవార్' పట్టాలెక్కింది. భారతీయ కస్టమర్లతో పాటు ఫారినర్లను ఆకట్టుకోవడమే వీరి ప్రత్యేకత. వీరి వంటకాలను తినిమెచ్చుకున్న వాళ్లంతా వెంటనే ట్రిప్ అడ్వైజర్ లో రివ్యూలు పోస్ట్ చేశారు. అవి చాలా పేరు తెచ్చిపెట్టాయి. ప్రారంభించిన నాలుగు నెలల్లోనే 'మిల్లెట్స్ ఆఫ్ మెవార్' ఉదయ్ పూర్ లోని నెంబర్ వన్ రెస్టారెంట్ గా ట్రిప్ అడ్వైజర్ లో పేరు తెచ్చుకుంది. అంతే కాదు... లాభాల వెంట పరుగులు తీసింది ఈ రెస్టారెంట్. ఆరోగ్యకరమైన తృణధాన్యాలతో తాము అందించే స్థానిక, సేంద్రీయ, సంప్రదాయ వంటకాల వల్లే పేరొచ్చిందంటారు అనూప్. కేవలం వంటకాలే కాదు... హోటల్ డెకరేషన్, హ్యాండ్ మేడ్ పెయింటింగ్, కళాఖండాలన్నీ అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండటం పర్యాటకులు రెస్టారెంట్ కు క్యూకట్టేలా చేశాయి.

బన్యన్ రూట్స్

ఉదయ్ పూర్ కు చెందిన మరో స్నేహితుడు 'బన్యన్ రూట్స్' పేరుతో స్థానిక రైతుల నుంచి సేంద్రీయ పంటల్ని సేకరించే సంస్థను ప్రారంభించారు. 'బన్యన్ రూట్స్' దగ్గర 'మిల్లెట్స్ ఆఫ్ మెవార్' పెద్దమొత్తంలో సరుకులు కొంటోంది. 'బన్యన్ రూట్స్'లో ఉత్పత్తులు పెరుగుతున్నకొద్దీ హోటల్ లో మెనూ కూడా పెరిగింది. వచ్చిన ఆదాయంలో కొంత ఖర్చుచేసి రైతులకు సేంద్రీయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నారు. కస్టమర్లకు వండిన ఆహారంతోపాటు సరుకులనూ సప్లై చేస్తున్నారు. కొన్నాళ్లకు కేవలం ఈ రెస్టారెంట్ లో తినడానికే ఉదయ్ పూర్ వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడం విశేషం. ఇవన్నీ చూసి గ్రీన్ బిజినెస్ చేయడం అంత సులువా అని అనుకోవచ్చు. కానీ అస్సలు కాదంటారు పూనియా.

"ఉత్పత్తికి చాలా ఖర్చవుతోంది. కస్టమర్లను నిలుపుకోవడం అసాధ్యమవుతుంది. అందుకే మేము మా కస్టమర్లను మా స్నేహితుడి కోసం పంటలు పండిస్తున్న రైతుల దగ్గరకు తీసుకెళ్లాం. పంటలు ఎలా పండిస్తున్నారో చూపించాం. దీని వల్ల మొత్తం ప్రక్రియ ఎలా ఉంటుందో వాళ్లకు అర్థమవుతుంది" అని అంటారాయన.

నడుస్తూ... నడిపిస్తూ...

ఈ వెంచర్ ప్రారంభించి నాలుగేళ్లవుతోంది. మార్కెటింగ్ కోసం పెద్దగా కష్టపడట్లేదు. పర్యాటకులే ప్రచారం చేస్తున్నారు. అయితే వాతావరణ సమస్యలపై దృష్టిపెట్టడం పూనియాకు సాధ్యం కావట్లేదు. దీంతో రెస్టారెంట్ వ్యవహారాలను భాగస్వామ్యులకు అప్పగించి ముందుకెళ్తున్నారాయన. 2014లో గౌరీ గుప్తా ముంబైలో మరో గ్రీన్ స్టార్టప్ ప్రారంభించేందుకు సాయం చేశారు అనూప్. ఇంట్లోనే పోషక పదార్థాలను తయారు చేసి అమ్ముతున్నారు గౌరీ. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేంద్రీయ ఉత్పత్తులు, తృణధాన్యాలను సేకరిస్తున్న పూనియా... గౌరికి సాయం చేస్తున్నారు. ముంబైలో ఫుడ్ అండ్ బేకరీ కమర్షియల్ కిచెన్ యూనిట్ ప్రారంభించారు గౌరీ. ఇప్పుడు ఆమె వ్యాపారం బాగా సాగుతోంది. గింజలు, డ్రైఫ్రూట్స్, బెల్లం లాంటి సహజ పదార్థాలతో ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నారు. ఎలాంటి రసాయనాలు ఉయోగించట్లేదు. ఐదురకాల ఎనర్జీ బార్స్, మూడు రకాల అల్పాహారాలు, లడ్డూలు తయారు చేసి www.gourigupta.com ద్వారా అమ్ముతున్నారు.

image


మరోవైపు పూనియా వాతావరణ సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. ఇటీవల ప్యారిస్ లో యూఎన్ క్లైమేట్ సమ్మిట్ లో పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు... అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా చేదోడువాదోడుగా నిలిచేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావరణ సమస్యలపై సృజనాత్మకంగా ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ ఆలోచనల్లోంచే గ్రీన్ వెడ్డింగ్స్, ఈవెంట్స్ మేనేజ్ మెంట్, కేఫ్స్ లాంటి కొత్త ఐడియాలు పుట్టుకొచ్చాయి. తనలా ఆలోచించేవారికి ఉపయోగకరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. క్లైమేట్ పాలిటిక్స్ లో అడుగుపెట్టిన గ్రీన్ హీరో అనూప్ పూనియాకు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుందాం.