మన రైతుల కష్టాలు తీర్చడానికి ముందుకొచ్చిన జర్మన్ స్టార్టప్  

1

ఈరోజుల్లో వ్యవసాయం అనుకున్నంత ఈజీకాదు. సకాలంలో వర్షాలు పడాలి. పెట్టుబడికి డబ్బులు కావాలి. దున్నడం దగ్గర్నుంచి కూలీల మీదుగా పంట మార్కెట్ చేరేదాకా రైతు పడే తిప్పలు అన్నీఇన్నీ కావు. ఒకపక్క పంటమీద చీడపీడలు.. పంట తర్వాత మార్కెట్లో దళారులు. అన్నదాతను జలగల్లా పీల్చేస్తుంటారు. అప్పుల బాధలు తట్టుకోలేక ఎందరో రైతులు తనువు చాలించిన ఘటనలు రోజూ ఏదోమూల చూస్తునే ఉంటాం. ముఖ్యంగా భారతదేశంలో అన్నదాతల పరిస్థితి అనుకున్నంత హాపీగా లేదు. దశాబ్దాలుగా అన్నదాత పంటమీద దిగులుతోనే బతుకీడుస్తున్నాడు.

రైతులు పడే కష్టాల మీద రీసెర్చ్ చేసిన జర్మనీకి చెందిన స్టార్టప్.. అన్నదాతల సమస్యలు తీర్చేందుకు ముందుకొచ్చింది. పీట్ సంస్థకు చెందిన ప్రతినిధులు గత కొన్నేళ్లుగా 30వేల మంది రైతులతో కలిసి పరిశోధన చేస్తున్నారు.

పీట్ ప్రస్థానం 2015లో దక్షిణ అమెరికా నుంచి మొదలైంది. ఇక్రశాట్ ద్వారా పీట్ ఇండియాలోకి ప్రవేశించింది. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల్లో ప్లాంటిక్స్ యాప్ విడుదల చేసింది. 30వేల మంది యూజర్స్ ఉన్నారు. వచ్చే ఏప్రిల్ లో తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ప్లాంటిక్స్ అనవసరంగా పురుగు మందులు, ఎరువులు వాడాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గించి లాభాలు పెంచుతుంది. ప్లాంటిక్స్‌ యాప్‌ ద్వారా రైతులే స్వయంగా పంటలకు వాడాల్సిన ఎరువులు, పురుగు మందులను తెలుసుకొంటారు.

త్వరలోనే యాప్‌ తెలుగు, హిందీ వెర్షన్‌ లో రాబోతోంది. దీనివల్ల రైతులు ఇంకా సులువుగా అర్ధం చేసుకోవడానికి అవకాశం ఉంది.

టెక్నాలజీ పుణ్యమాని ఇప్పుడిప్పుడే రైతులు సంతోషంగా ఉన్నారు. పంట చీడపీడలను తెలుసుకునేందుకు టెక్నాలజీ సపోర్టు ఎంతో ఉపయోగకరంగా ఉందంటారు గుంటూరుకి చెందిన రైతు సూర్యనారాయణరెడ్డి.

రైతులకు ఇచ్చే కౌన్సెలింగ్ సంగతి పక్కన పెడితే పీట్ టెక్నాలజీ పెద్ద ఎత్తున మొక్కల వివరాలను, ఎరువుల డేటాను సేకరిస్తోంది. ప్రతీ పిక్చర్ తో పాటు లొకేషన్, టైం స్టాంప్ ఉండేలా చూస్తోంది. పంట ఏదైనా, స్థలం ఎక్కడైనా రియల్ టైం మానిటరింగ్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ వివరాల్నీ అగ్రి బేస్డ్ కంపెనీలకు వెళ్తాయి. తద్వారా వాళ్లకు పంట చీడపీడల మీద అవగాహన పెరుగుతుంది. అది ఆటోమేటిగ్గా రైతుకే మేలు జరుగుతుంది.

ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఇండియాలో 395 మిలియన్ల ఎకరాల భూమికి సాగుకి అనుకూలంగా ఉంది. కానీ సాగులోకి వచ్చింది మాత్రం 215 మిలియన్ ఎకరాలే. వ్యవసాయ రంగం మార్కెట్ 500 బిలియన్ డాలర్లుగా ఉంది. 30కి పైగా స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. వీ- డ్రోన్స్, కిసాన్ నెట్ వర్క్,క్రోఫార్మ్ లాంటి సంస్థలు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. సప్లయ్ చైన్ టెక్నాలజీ సాయంతో దిగుబడి పెంచాయి.

Related Stories