మేమిద్దరం అభివృద్ధి యంత్రాలం

మేమిద్దరం అభివృద్ధి యంత్రాలం

Wednesday June 28, 2017,

2 min Read

ప్రధాని మోడీ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌ గా ముగిసింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాదం, రక్షణ, వ్యాపార రంగంతో పాటు పలు కీలక అంశాలపై నాలుగు గంటల పాటు మోడీ, ట్రంప్‌ చర్చించారు. వైట్ హౌస్ సమావేశం అనంతరం రోజ్ గార్డెన్ లో ట్రంప్, మోదీ సంయుక్త ప్రకటన చేశారు. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని నామరూపాల్లేకుండా చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉగ్రవాదులను వదలిపెట్టే ప్రసక్తిలేదన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు 

image


తన అమెరికా పర్యటన ఇరు దేశాల సంబంధాల్లో చరిత్ర సృష్టిస్తుందన్నారు ప్రధాని మోడీ. భారత్ అమెరికాలు ప్రపంచాభివృద్ధికి ఇంజిన్ లాంటివని, అమెరికా సక్సెస్ లో భారత్ పాత్ర ఉందన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టి శాంతి నెలకొల్పడానికి పరస్పరం సహకరించుకోవడానికి నిర్ణయించినట్లు చెప్పారు మోడీ. 

మోడీ, ట్రంప్‌ల తొలి సమావేశం ఆత్మీయంగా జరిగింది. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడేందుకు పునాది పడింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారు జామున ఒంటిగంటకు మోడీ వైట్‌ హౌస్‌కు చేరుకున్నారు. ట్రంప్‌, మెలినియా దంపతులు మోడీని ఆహ్వానించారు. షేక్ హ్యాండిచ్చి ఆత్మీయంగా పలుకరించారు. రెండు నిమిషాల పాటు మేయిన్‌ గేట్‌ దగ్గర యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఓవెల్‌ రూంకు చేరుకున్న మోడీ.. తనకు లభించిన గౌరవంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ గౌరవం తనకు లభించింది మాత్రమే కాదని ,125 కోట్ల భారతీయులదని చెప్పారు మోడీ. ట్రంప్ అధ్యక్షుడు కాకముందు 2014లో భారత్ వవచ్చినపుడు తన గురించి చేసిన వ్యాఖ్యలను ఎప్పటికీ మర్చిపోలేనని గుర్తు చేశారు. తర్వాత ఓవెల్‌ రూం ఆవరణలో ట్రంప్‌, మెలినియాతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు మోడీ.

ట్రంప్‌ సైతం మోడీపై ప్రశంసలు గుప్పించారు. ప్రపంచలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధానమంత్రిని వైట్‌ హౌస్‌లోకి ఆహ్వానించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాని చెప్పారు. రెండు దేశాల రాజ్యాంగాలు వీ ద పీపుల్‌ అనే మూడు పదాలతో ప్రారంభమవుతాయని, ఈ మూడు పదాలు ఎంత ముఖ్యమైనవో తామిద్దరికీ తెలుసన్నారు ట్రంప్‌.

వైట్‌ హౌజ్‌ లోని కేబినెట్‌ రూంలో భారత్‌- అమెరికా ప్రతినిధుల స్థాయి సమావేశం జరిగింది. మోడీ, ట్రంప్‌ పలు కీలక అంశాలపై చర్చించారు. మిలటరీ సామాగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నందుకు ట్రంప్‌ థ్యాంక్స్‌ చెప్పారు. ప్రధాని మోడీ స్పందిస్తూ అత్యంత పురాతన ప్రజాస్వామిక దేశం అమెరికా, అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ మైత్రి మరింత బలపడిందని మోడీ అన్నారు. అనంతరం వైట్‌హౌస్‌లోనే మోడీ, ట్రంప్‌ డిన్నర్‌ చేశారు. ఆ తర్వాత అమెరికా పర్యటన ముగించుకొని నెదర్లాండ్స్‌ బయల్దేరారు మోడీ.