రూ. 3,500 జీతం నుంచి మినిమం గ్యారెంటీ హీరో స్థాయికి..!

బిలో యావరేజ్ స్టూడెంట్ నేచురల్ స్టార్ ఎలా అయ్యాడు..?అంత పెద్ద సినిమా చేసినా జీతం మాత్రం రూ.3500 ఎందుకు..?రేడియా జాకీ అవకాశం ఎవరిచ్చారు..?రోజంతా కూర్చోబెట్టిన టీవీ ఛానల్ మేనేజర్‌పై సాధించిన విజయం ఏంటి..?నాని జీవితంలో బయటకు తెలియని కొన్ని వాస్తవాలు..!యువర్ స్టోరీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..!!

11


నాని.. (ఘంటా నవీన్‌బాబు) మన పక్కింటి కుర్రాడు, పెద్దగా హీరో లుక్స్... అద్భుతమైన ఫిజిక్ లేని ఓ సాధారణ జెంటిల్‌మెన్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు టాప్ హీరోలతో పోటాపోటీగా పేరు సంపాదించుకున్న యంగ్ జనరేషన్ హీరో. అయితే ఈ స్థాయికి రావడం వెనుక చాలా పెద్ద సినిమానే ఉందంటారు నాని. చదువులో బిలో యావరేజ్ స్టూడెంట్‌ స్థాయి నుంచి మినిమం గ్యారెంటీ హీరో అనే ట్యాగ్ లైన్ తెచ్చుకోవడానికి నాని బాగానే కష్టపడ్డారు. కేవలం రూ.3500తో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన స్థాయి నుంచి కోట్ల రూపాయల సినిమా ప్రాజెక్టును అవలీలగా డీల్ చేయగల రేంజ్‌కు ఎదగడం వెనుక ఏం జరిగిందో చెప్పారు నాని. ఇంతవరకూ పెద్దగా ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను యువర్ స్టోరీ టీంతో పంచుకున్నారు.

'' నేను అకడమిక్స్‌లో వీక్. నాకు సినిమాలంటే పిచ్చి. కరెంట్ పోతే ఓ సునామీ వచ్చినంత బాధ. కార్లు, బైకులకంటే సినిమాలే ఇష్టం. ఇంట్లో వాళ్ల బలవంతంలో ఇంటర్, డిగ్రీలు చదివాను కానీ మనసుపెట్టలేదు. మార్క్స్ కూడా పెద్దగా రాలేదు''

చదువులో అంతంతమాత్రంగా ఉన్న నానీని ఇంట్లో వింతగా చూసేవారు. ఎందుకుంటే వీళ్లది పెద్ద ఫ్యామిలీ కావడంతో 18 మంది కజిన్స్ వరకూ ఉండేవాళ్లు. వాళ్లలో 17 మంది బాగా చదువుకుని ఇప్పుడు అందరూ యూఎస్‌లో సెటిల్ అయిన వాళ్లే. ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయంలో సినిమాల్లోకి రావాలని బలంగా నిర్ణయించుకున్నారు. అయితే వచ్చాక ఏం చేయాలి ? అనే సంధిగ్ధం. మొదట్లో హీరోగా ట్రై చేద్దామనుకున్నా.. అంత సీన్ లేదని లోలోపలే అనుకునేవాడు. ఎందుకంటే ఇండస్ట్రీలో హీరో అనే పదానికి డెఫినిషన్ వేరు. తనలాంటి యావరేజ్ యూత్‌కు సినిమాల్లో ఛాన్స్ దొరకదని మైండ్‌లో బలంగా ఫిక్స్ అయిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అడుగుపెట్టాలనుకున్నారు. ఎందుకంటే అక్కడ అందంతో సంబంధం లేదనే ఏకైక ఆలోచనతో. కొంత మంది తెలిసిన వాళ్లను, తెలియని వాళ్లను పట్టుకుని నానా తిప్పలు పడి ఎలాగోలా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌ లోకి దిగాడు. ఒక సినిమా ఆఫీసు చుట్టూ తిరిగి వాళ్ల సహనాన్ని పరీక్షించాడు. చివరకు కొన్ని నెలల తర్వాత రాధాగోపాళం అనే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాడు.

"మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పుడు నా జీతం రూ.3500. అది ఎందుకూ సరిపోయేది కాదు. అది సరిపోదని ఇచ్చే వాళ్లకూ తెలుసు. కానీ వీళ్లకు సినిమాలంటే పిచ్చి. ఎలా అయినా, ఎంత ఇచ్చినా చేస్తారనే ధీమా వాళ్లది. అలా కొన్నేళ్లు నానా తంటాలు పడ్తూనే పని నేర్చుకున్నా. లైటింగ్ దగ్గర నుంచి కెమెరా లెన్సుల వరకూ ప్రతీదీ తెలుసుకున్నా. స్క్రిప్ట్ నుంచి సినిమా రిలీజ్ వరకూ అన్నింటిపైనా అవగాహన పెంచుకున్నా".

అంతా వచ్చేసిందనే ఓవర్ కాన్ఫిడెన్స్

మూడు, నాలుగు సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే సరికి అంతా వచ్చేసింది, మొత్తం తెలిసిపోయాయని అనుకున్నా కానీ అంత సీన్ లేదని తర్వాత అర్థమైంది అంటారు నాని. ఎందుకంటే ఒక స్క్రిప్ట్‌ పనిపై కూర్చున్నప్పుడు నెలలు తరబడి ఒక్క అక్షరం ముక్క ముందుకు కదలలేదని అప్పుడు పడిన వేదన చెప్పలేనిదని గుర్తుచేసుకుంటారు.

'' నా ఫ్రెండ్, ఇప్పటి డైరెక్టర్ నందినీ రెడ్డి నా కష్టాన్ని చూసి రేడియా జాకీ ఆఫర్ ఇచ్చింది. అప్పట్లో తను కూడా ఓ ఆన్ లైన్ రేడియో సంస్థలో పనిచేసేది. నన్నూ పనిచేయమని పిలిస్తే భయంభయంగానే వెళ్లా. కొంతకాలం రేడియో జాకీగా పనిచేస్తూ.. వాయిస్ మాడ్యులేషన్, డిక్షన్, భాషపై పట్టు సంపాదించా. అప్పుడు నాకు వచ్చిన జీతం రూ. 17 వేలు. నా కెపాసిటీకి చాలా ఎక్కువే వస్తోందే అంటూ లోలోపల నవ్వుకున్న రోజులూ ఉన్నాయ్ ".

ఇలా హీరో అయ్యా

ఓ సారి ఓ యాడ్ ఫిల్మ్ షూట్ జరుగుతోంది. ఆ టైంలో అక్కడకు రావాల్సిన వాళ్లు రాకపోతే... నానీనే నేను నాలుగు ముక్కలు స్క్రిప్ట్ రాసి.. యాక్ట్ చేసి చూపించాడు. ఎందుకనో వాళ్లకు అది నచ్చింది. ఒరిజినల్‌గా కూడా తననే చేయమని బలవంత పెట్టడంతో అప్పటికి అయిందనిపించినట్టు చెప్తారు. అనుకోకుండా ఈ యాడ్ ఫిల్మ్ ఎడిట్ అవుతున్న ప్లేస్‌కు డైరెక్టర్ మోహన క్రిష్ణ వచ్చారు. కుర్రాడు ఎవరో లేతగా, ఎనర్జిటిక్‌గా ఉన్నాడని కాన్ఫిడెన్స్ వచ్చాక అష్టాచెమ్మా సినిమాలో హీరోగా మొదటి సినిమాకు అవకాశాన్ని ఇచ్చారు. అలా అనుకోకుండా హీరో అయ్యానంటూ గుర్తుచేసుకుంటారు నానీ.

"అష్టా చెమ్మా సినిమా పూర్తైన తర్వాత కూడా నా పై నాకు నమ్మకం లేదు. పోనీలే ఒక్క సినిమా అయినా హీరోగా చేశా. నా ఫోటోతో ఉంటే డివిడి ఇంట్లో ఉంటుంది చాలు. పెద్దయ్యాక నా పిల్లలకు చూపించి.. మీ నాన్న హీరోగా చేశాడ్రా.. అని చెప్పుకునేందుకైనా పనికొస్తుందని అనిపించిన రోజులున్నాయ్ ".

రిస్క్ తీసుకోకపోవడం మరణంతో సమానమే

అన్నీ వదిలేసి, ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకున్నా ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన నాని ఇక్కడే తన జీవితం అనుకున్నారు. కష్టమో, నష్టమో, నిష్టూరమో ఏదైనా అక్కడే అని బలంగా నిశ్చయించుకున్నారు. అంత రిస్క్ తీసుకుని మనసుకు నచ్చిన ఫీల్డ్‌లోకి దిగిన తర్వాత ఇంకా సేఫ్ బెట్ ఆడడం మూర్ఖత్వమని భావిస్తారు. '' రిస్క్ తీసుకోలేకపోతే ఎందులోకి అడుగుపెట్టొద్దు, ఒకసారి లోపలికి దిగిన తర్వాత ఇక సేఫ్ గేమ్ ఆడడంలో అర్థం లేదు. రిస్క్ తీసుకుంటేనే జీవితాన్ని ఎంజాయ్ చేస్తాం. మనకు నచ్చని సినిమాను రోజూ పదే పదే ఏం చూస్తాం.. సాధ్యమేనా ? " అంటారు.

పట్టించుకోని వాళ్లే ఎదురొచ్చి స్వాగతం చెప్పారు

'' నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగింది. ఓ బీటా టేప్‌ను ఇవ్వడానికి ఓ ఛానల్ మేనేజర్‌ దగ్గరికి ఉదయం 7 గంటలకు వెళ్లా. గంట గంటకూ అతను అటూ ఇటూ తిరుగుతున్నాడు కానీ.. కనీసం పట్టించుకోలేదు. నాలుగు అడుగులు వేస్తే ఆ టేప్ వచ్చి తీసుకెళ్లొచ్చు. బాగా ఇన్‌సల్ట్‌గా ఫీలయ్యా. లోలోపల కుమిలిపోయినా బయటకు వెళ్లలేదు. ఒకవేళ కాసేపు ఎటైనా వెళ్లి తినొద్దామంటే అతను వెళ్లిపోతాడేమోననే భయం. సాయంత్రం 7 వరకూ అక్కడే కూర్చున్నా తిండీతిప్పలు లేకుండా. అయితే ఈ మధ్య మళ్లీ అదే స్టూడియోకు వెళ్లినప్పుడు ఆ మేనేజర్ వచ్చి లిఫ్ట్ డోర్ దగ్గర నిలుచుని మరీ నన్ను రిసీవ్ చేసుకున్నాడు. అతనికి గుర్తులేదు కానీ నాకు బాగా గుర్తు. సడన్‌గా ఎందుకో నాకు తెలియని ఆనందం " 

పాతికేళ్ల తర్వాత కూడా సినిమా సెట్ లోనే ఉండాలనేది నా తాపత్రయం. సినిమా అంటే నాకు అంత పిచ్చి. ఏదోదో గొప్పగొప్ప స్టార్ బిరుదులు, భారీ కమర్షియల్ సినిమాలు చేసేయాలని కూడా లేదు. నాకు మనసుకు నచ్చిన సినిమాలు, నా లోని ప్రేక్షకుడు నచ్చేలా సినిమాల్లో నటించడమే నా లక్ష్యం. త్వరలో రిలీజ్ కాబోయే మజ్నూ సినిమా తనలోని ప్రేక్షకుడికి నచ్చిందని, అందరూ హ్యాపీగా చూడదగిన మూవీ అంటూ ముగించారు నాని.