ప్రైవేట్ స్కూళ్ల వృద్ధికి అప్పులు ఇస్తున్న 'వర్తన'

దేశంలో విపరీతంగా ప్రైవేటు పాఠశాలలు..దిగువ, మధ్యతరగతి కుటుంబాల్లోని చిన్నారులు చదివేది వీటిలోనే..నడిపే నాయకత్వం ఉన్నా.. నిధుల కొరతతో సౌకర్యాల లేమి..భవిష్యత్‌పై విజన్ ఉన్న ప్రైవేట్ స్కూల్స్‌కు అప్పులిస్తున్న వర్తన..

ప్రైవేట్ స్కూళ్ల వృద్ధికి అప్పులు ఇస్తున్న 'వర్తన'

Tuesday September 01, 2015,

4 min Read

భారతదేశ అల్పాదాయ వర్గాల్లోని యువతకు నాణ్యమైన విద్య అందించడం కోసం సాధారణ ప్రైవేటు స్కూల్స్‌కు పెట్టుబడులు సమకూర్చే మిషన్ వర్తన. బెంగళూరుకు చెందిన ఈ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థకు ఎస్సెన్షియల్ కేపిటల్ కన్సార్టియం నిధులు అందిస్తోంది. ఇందులో డాయిష్ బ్యాంకుకు చెందిన గ్లోబల్ సోషల్ ఫైనాన్స్ గ్రూప్‌తోపాటు స్పెయిన్‌కు చెందిన ఓ ఛారిటీ సంస్థ, నేత్రి ప్రైవేట్ ఫౌండేషన్‌ కూడా ఉంది. ఈ మిషన్ కోసం 2 మిలియన్ల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (షేర్లు, ఈక్విటీలుగా మార్చుకునేందుకు వీలు లేని డిబెంచర్లు) వర్తనకు కేటాయించింది కన్సార్టియం. డాయిష్ బ్యాంకుకు చెందిన గ్లోబల్ సోషల్ ఫైనాన్స్ గ్రూప్‌ ఈ వర్తన మిషన్‌ని నిర్వహిస్తోంది.

దేశీయ మార్కెట్లో వచ్చే పెను మార్పులను ఈ కన్సార్టియం పరిశీలిస్తూ.. వర్తనకు తగిన సూచనలు చేస్తుంది. వీరు అప్పులు ఇచ్చే వ్యాపారంలో ఉండడంతో.. నిధుల రాకపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని చెబ్తున్నారు.

“ఈసీసీ, నేత్రి ఫౌండేషన్‌లు ఇచ్చిన పెట్టుబడిని కాపాడాల్సిన అవసరం మాపై ఉంది. రుణాల కోసం డిమాండ్ పెరుగుతున్న కొద్దీ... ఎక్కువ స్కూల్స్‌కు మేం సర్వీసులు అందించగలుగుతున్నామని అర్ధం. వర్తనకు నిధులు వచ్చే దారులను కూడా మరింతగా పెంచుకోవడం చాలా ముఖ్యం. దీనితోపాటు ఎన్‌బీఎఫ్‌సీ వ్యాపారం సమర్ధంగా నడవాలంటే దీర్ఘకాలిక సంబంధాలు అవసరం” అంటున్నారు వర్తన సీఈఓ స్టీవ్ హార్డ్‌గ్రేవ్.

2013 నుంచి ఇప్పటివరకూ... ఓ రౌండప్

2013 జనవరిలో వర్తన ప్రారంభమైంది. అదే ఏడాది మే నెలో అసియాన్స్ వెంచర్ ల్యాబ్ ఇందులో పెట్టుబడులు పెట్టింది. 2014 ఆగస్ట్‌లో ఒమిడియార్ నెట్వర్క్, ఎల్‌జీటీ ఫిలాంత్రోపీ, ఎలివర్ ఈక్విటీల నుంచి సిరీస్ ఏ ఫండింగ్‌గా ₹27 కోట్ల నిధులు సమీకరించారు.

ప్రారంభంలో 10మంది టీం మెంబర్స్ ఉండగా... 30 లోన్ అకౌంట్స్ ఉండేవి. ఇప్పుడు వర్తన లోన్ పోర్ట్‌ఫోలియో ₹రూ.65 కోట్లకు చేరింది. 20నగరాల్లోని మొత్తం 800లకు పైగా పాఠశాలలకు రుణాలు మంజూరు చేశారు. అంతే కాదు... వర్తన టీం కూడా ఇప్పుడు సెంచరీ దాటిపోయింది. ఇతర రంగాలు, విభాగాల్లో విస్తరించేందుకు బదులుగా.. ఎడ్యుకేషన్‌లోనే మరింత లోతుగా పరిశోధనలు చేసి, విస్తారమైన నెట్వర్క్‌ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

“అనుక్షణం సవాళ్లు ఎదురయ్యే వాతావరణం ఉన్న స్టార్టప్‌లో.. ప్రత్యేకించి కొన్ని విభాగాలపై ఫోకస్ అవసరం. కొన్నేళ్లపాటు ఈ తరహా స్కూల్ లోన్స్‌పైనే పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాం. మా సేవలు, విధానాలు మరింత సౌకర్యవంతంగా మారేలా కృషి చేస్తాం. అంతేకాదు... తగిన స్కూళ్లనే ఎంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం ''.
image


ఎలాంటి స్కూల్స్‌కి లోన్స్ ఇవ్వరు ?

ప్రస్తుతం కొత్తగా స్కూల్స్ ప్రారంభించడానికి వర్తన సంస్థ... ఎటువంటి లోన్స్ ఆఫర్ చేయడం లేదు. ఇప్పటికే కొన్ని బ్రాంచ్‌లు నిర్వహిస్తూ... విస్తరణ కోసం కొత్తగా శాఖలు ప్రారంభించేటప్పుడు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే.. పాఠశాలల కోసం రుణం ఇవ్వడంలో అంత కఠినమైన రూల్స్ లేవు. కనీసం రెండేళ్ల నుంచి నడుస్తూ ఉండాలి, కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వహించగలగాలి, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్ధ్యం కలిగి ఉండాలంతే.

ఇలాంటి వ్యాపారం నిర్వహించడానికి కేవలం ఓ డెస్క్ ఏర్పాటు చేసుకుని.. లెక్కలు వేసుకుంటే సరిపోదు. రీపేమెంట్ విషయంలో అంచనాకు రావాలంటే... స్కూల్‌ని సందర్శించడంతోపాటు.. ఆ ప్రాంతంలోనూ సంచరించాలి. ఆ పాఠశాలను నడిపే వ్యక్తికి తగిన విజన్ ఉంటేనే.. రుణం అందిస్తామంటారు స్టీవ్.

“ ఆయా పాఠశాలలకు అర్హతలు నిర్ణయించడం చాలా క్లిష్టమైన విషయం. స్కూల్ విజయం కోసం పాటుపడడంతో పాటు.. తల్లిదండ్రులతో కలిసి విద్యార్ధులకు మంచి చదువును అందించగలగాలి, అది కూడా భరించగలిగే స్థాయిలో ” అంటున్నారు స్టీవ్.

వర్తన ఇచ్చే రుణాలు రెండు రకాలు. మొదటివి సెక్యూర్డ్ లోన్స్.. ₹5 లక్షలకు పైబడిన లోన్స్ ఈ కేటగిరీలో ఉంటాయి. ఈ తరహా రుణాలకు గరిష్ట పరిమితి ₹50లక్షలు. రెండోవి అన్‌సెక్యూర్డ్ లోన్స్. గరిష్టంగా ₹5 లక్షల వరకూ మూడేళ్ల కాలపరిమితి గల రుణాలివి. ఇలా లోన్ తీసుకోవడానికి తగిన కారణాలు ఉండాలి. విద్యార్ధుల కోసం కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం, ప్రాథమిక స్థాయి ఫర్నీచర్, విద్యా సంబంధిత మెటీరియల్ కొనుగోలు చేయడం, బిల్డింగ్‌కి మరమ్మత్తులు, స్మార్ట్ క్లాస్‌రూమ్స్ ఏర్పాటు, స్కూల్ బస్సులు, అదనపు క్లాస్‌రూమ్‌ల నిర్మాణం వంటివాటికి రుణమంజూరు చేస్తారు.

సహజంగా తమకు ఏ తరహా రుణాలు కావాలనే అభ్యర్ధనలు వస్తాయో స్టీవ్ చెబ్తున్నారు. లోన్ అమౌంట్‌ని పరిగణిస్తే... స్కూల్ విస్తరణలో భాగంగా కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం ఎక్కువ మొత్తంలో రుణం కావాలని అడుగుతుంటారు. ఎక్కువ సంఖ్యలో వస్తున్న అభ్యర్ధనల ప్రకారం చూస్తే... విద్యా సంబంధిత ఎక్విప్‌మెంట్, ఫర్నిచర్, బాలికల కోసం రెస్ట్‌రూమ్‌ల నిర్మాణం కోసం రుణాలు కోరుతుంటారని స్టీవ్ చెబ్తున్నారు.

ఇండియాలోనే ఎందుకీ వర్తన?

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఫీజులు భరించగలిగే స్థాయిలో ఉండే ప్రైవేట్ స్కూల్స్ అవసరం చాలా ఉంటుంది. అయితే.. భారత్‌నే ఎంచుకోవడానికి తగిన కారణాలున్నాయంటున్నారు వర్తన కో ఫౌండర్స్ స్టీవ్, బ్రిజేష్‌లు.

“అత్యధిక జనాభా విషయంలో భారత్‌కు పోటీ వచ్చే దేశం... మరేదీ లేదు. జనాభా లెక్కల ప్రకారం ఇండియా కంటే చైనాలో ఎక్కువైనా... పాఠశాలకు వెళ్లే పిల్లల ఏజ్ గ్రూప్‌ అధికంగా ఉన్నది ఇక్కడే. భారత్‌లో 40కోట్లకు పైగా స్కూల్స్‌కు వెళ్లే చిన్నారులు ఉన్నార”ని చెప్తున్నారు స్టీవ్.
image


ఇక్కడి జనాభాలో అత్యధిక భాగం తక్కువ వేతనంతో ఇబ్బందులు పడుతున్నవారే. 40కోట్ల పిల్లల జనాభాలో అత్యధిక శాతానికి తగిన స్థాయిలో ఫీజులుండే ప్రైవేట్ స్కూల్స్ అవసరమన్న స్టీవ్... మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించారు. గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో ప్రైవేట్ స్కూల్స్ హవా బాగా పెరిగింది. పిల్లలకు చదువు చెప్పించడంపై తల్లిదండ్రుల్లోనూ ఆలోచనా విధానాలు మారాయి. ఇదంతా తక్కువగా ఫీజులుండే ప్రైవేట్ స్కూల్స్ రావడంతోనే. ఇండియాలో కనిపించినన్ని ప్రైవేట్ స్కూల్స్ ప్రపంచంలో మరెక్కడా ఉండవంటున్నారు స్టీవ్.

పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు తల్లిదండ్రులు విపరీతంగా కష్టపడుతున్నారు. ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే.. తమ చిన్నారులకు చదువు ప్రాధాన్యత తెలియచేస్తున్నారు. మొదటి ప్రాధాన్యం చదువుకే ఇవ్వాలనే భావన పేరెంట్స్‌లో ఉంది” అని చెప్పారు స్టీవ్.

భవిష్యత్‌పై వర్తన వ్యూహాలు

పాఠశాలలతో సుదీర్ఘమైన సంబంధాలు కొనసాగించాలని వర్తన భావిస్తోంది. మెరుగైన విద్య అందించడం, ఉత్తమమైన ఫలితాలు సాధించేందుకు వీలుగా స్కూల్స్ అభివృద్ధి చెందేలా ప్రయత్నించనున్నారు. “ చక్కగా నిర్వహించగలిగే యాజమాన్యం ఉన్న మంచి పాఠశాలలను వెతికేందుకు చాలా కష్టపడుతున్నాం. విద్యను మరింత నేర్పుగా, నాణ్యంగా తీర్చిదిద్దే వారిని.. ఈ స్కూల్స్‌కు జత చేయడం ద్వారా.. ఇరు వర్గాలకు మేలు చేసినట్లవుతుందం”టూ తమ భవిష్యత్ వ్యూహాన్ని వివరించారు స్టీవ్.

విద్యారంగంలో సానుకూల ప్రభావాన్ని కనపరిచేందుకు వినూత్నమైన విధానానికి వీరిద్దరూ నాంది పలికారని చెప్పొచ్చు. చిన్నతనం నుంచే ప్రతిభావంతులుగా మారిన చిన్నారులు... ఫ్యూచర్‌లో తమకు తగిన కెరీర్‌ను సులభంగా నిర్ణయించుకోగలుగుతారు. టీచర్లకు తగిన వసతులు, సాధనాలు, పరికరాలు అందుబాటులో ఉండడంతో... మరింత సమర్ధంగా విద్య నేర్పే అవకాశం ఉంటోంది. వర్తన దగ్గర నుంచి రుణం సేకరించిన స్కూల్స్‌లో డ్రాపౌట్స్ చాలా తక్కువగా ఉండడం గమనించాల్సిన విషయం.

2020నాటికి దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించుకునేందుకు వర్తన సంస్థ ప్రయత్నిస్తోంది. అలాగే 40వేల స్కూల్స్‌కు రుణాలు ఇవ్వడం ద్వారా... 2కోట్ల మంది స్టూడెంట్స్‌కు మెరుగైన విద్యా సౌకర్యాలు అందించే లక్ష్యాన్ని నిర్ణయించుకుంది వార్తన.

వెబ్‌సైట్