కేన్సర్ బాధితుల కాంతిరేఖ సుశాంత్ కోడెల

కేన్సర్ బాధితుల కాంతిరేఖ సుశాంత్ కోడెల

Sunday April 03, 2016,

3 min Read


భయం- అల్సర్ ఉన్నవాడినైనా చంపేస్తుంది. కానీ ఆశ- కేన్సర్ ఉన్నవాడిని కూడా బతికిస్తుంది. ఇది ఆ మధ్య వచ్చిన ఓ సినిమాలో డైలాగ్. నిజమే మనోధైర్యం ఉండాలేగానీ ఎలాంటి వ్యాధినైనా జయించొచ్చు. అలాంటి స్ఫూర్తినే రగిలించాడు సుశాంత్ కోడెల. కేన్సర్ మహమ్మారిని ఎదుర్కోవడమే కాదు.. అన్ కేన్స్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేసి కేన్సర్ బాధితుల్లో పోరాడే శక్తినిచ్చాడు.  

సుశాంత్ కోడెల. 23 ఏళ్లుంటాడు. అందరి కుర్రాళ్లలాగే భవిష్యత్‌పై ఎన్నో ఆశలు. సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్ విద్యార్థిగా ఏదో సాధించాలన్న తపన. ఎప్పటికైనా ఏదో సాధిస్తానన్న ఆశ ఉండేది. అయితే 2011లో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లో చేరిన కొన్నాళ్లకే అతని ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. మొదట్లో చిన్న కణితిలా వచ్చింది. ఆ తర్వాత ప్రాణాతకంగా మారింది. బయాప్సీ రిపోర్టులో కేన్సర్ అని తేలింది. వైద్య పరిభాషలో చెప్పాలంటే అడ్రెనల్ కొరిటికల్ కార్సినోమా. ప్రతి 15 లక్షల మందిలో ఒకరికో ఇద్దరికో మాత్రమే వస్తుంది. ప్రపంచంలో ఇలాంటి అరుదైన వ్యాధితో ఎంత మంది బాధపడుతున్నారో కూడా లెక్కలు లేవు. ః

కేన్సర్ అన్న మాట వినడంతో కాళ్ల కింద భూమి కంపించింది. సుశాంత్ వణికిపోయాడు. సుశాంత్ కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చీకట్లు ముసురుకున్నాయని అర్ధమైంది. నిరాశ ఆవహించింది. 

కోడెల సుశాంత్..

కోడెల సుశాంత్..


సుశాంత్ మానసికంగా ఎంత నరకం అనుభవించాడో అంతకంటే ఎక్కువ అతని ఫ్యామిలీ అనుభవించింది. చీటికీ మాటికీ డాక్టర్ల వద్దకు పరిగెత్తుకెళ్లడం. రిపోర్టులు తెచ్చుకోవడం. చికిత్స చేయించుకోవడం. క్రమంగా ఆశలు చిగురించాయి. పరిస్థితి మెరుగుపడింది. మండుటెండలో చల్లగాలి తాకినట్టు ఉపశమనం దొరికింది. చేజారిపోయిందన్న జీవితం వేలి కొసల మధ్య చిక్కుకున్న ఫీలింగ్. దాన్ని ఒడిసిపట్టుకోవాలి. నిలబెట్టుకోవాలి. చక్కదిద్దుకోవాలి. ధైర్యం చెప్పుకున్నాడు. గుండె దిటవు చేసుకున్నాడు. కమ్మేసిన నైరాశ్యంలోంచి ఆశ మిణుకుమిణుకుమంది. నిండా పాతికేళ్లుకూడా లేని జీవితం వ్యర్ధం కావొద్దు. ముఖ్యంగా తనలాంటి వాళ్లకు ఏదో చేయాలి. వాళ్లలో పోరాడే శక్తి నింపాలి. ఇదే ఆలోచన సుశాంత్ మనసులో నాటుకుంది. అడుగులు అటువైపు పడ్డాయి.

సుశాంత్ కోడెల..

సుశాంత్ కోడెల..


కేన్సర్‌పై యుద్ధం

యుద్ధం. మహమ్మారిపై యుద్ధం. కబళించే చావుని నిలువరించే యుద్ధం. కొత్త జీవితం కోసం యుద్ధం. ఎలా..? అర్ధం కాలేదు. దారి దొరకలేదు. ఆశయం బలంగా ఉంది. సంకల్పం వజ్రంలా మెరుస్తోంది. ఆశయం మిణుకుమిణుకుమంటోంది. ఒక వెలుగు లాంటి తోడు కావాలి. ఆ వెలుగు దారిపొడవునా దివిటీ పట్టాలి. సరిగ్గా ఆ సమయంలో జతకలిశాడు చిరాగ్ కుమార్. తనలాగే అతనూ కేన్సర్ తో పోరాడి జయించాడు. అతనికి తన ఆశయాన్ని, ప్రయత్నాన్నీ వివరించాడు సుశాంత్. ఇద్దరి అభిప్రాయాలూ కలిశాయి. నడక మొదలైంది. కేన్సర్ తో ఎవరు బాధపడుతున్నా వాళ్ల దగ్గరికి వెళ్తారు. వ్యాధి గురించి వారికి వివరిస్తారు. చికిత్స కోెసం అవసరమైతే ఆర్ధికంగా సాయం చేస్తారు. జీవితం మీద ఆశ కలిగేలా స్ఫూర్తి నింపుతారు. 

దేశంలో చాలా మందికి ఇప్పటికీ కేన్సర్ మీద సరైన అవగాహన లేదు. ఆసుపత్రుల వివరాలు తెలియవు. ఆర్ధిక ఇబ్బందుల మూలంగా చికిత్సకు దూరంగా ఉంటారు. కేన్సర్ సోకిందన్న విషయాన్ని బయటకు చెప్పరు. జంకుతారు. సమాజం చిన్నచూపు చూస్తుందేమోనని భయపడతారు. ఉద్యోగం పోతుందేమోనని, పెళ్లి జరగదేమనని, పిల్లలకు సోకుతుందేమోనన్న భయం వారిని అలా చేస్తుంది.

ఓ క్యాన్సర్ అవగాహన సదస్సులో మాట్లాడుతున్న సుశాంత్

ఓ క్యాన్సర్ అవగాహన సదస్సులో మాట్లాడుతున్న సుశాంత్


ఈ కష్టనష్టాలన్నీ తెలుసుకాబట్టి.. వాళ్ల తరుపున పోరాడాలని నడుం బిగించారు. అన్‌కేన్సర్ ఇండియా పేరుతో కేన్సర్ బాధితులను ఆదుకునేందుకు 2013లో ఓ సంస్థను ప్రారంభించారు. క్యాన్సర్ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చేవారి కోసం లైవ్‌స్ట్రాంగ్ ఫౌండేషన్ బిగ్ సీ కాంపిటేషన్‌ను నిర్వహిస్తోంది. ఇందులో అన్‌కేన్సర్ ఇండియా మోడల్‌కు టాప్ ఫైవ్ గ్లోబల్ ఇన్నోవేషన్స్‌లో చోటు దక్కింది. వీరు చూపిన పరిష్కారాలు అత్యంత ప్రభావవంతమైనవని బిగ్ సీ గుర్తించింది. రన్నరప్ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు అన్‌కేన్సర్ ఇండియాకు స్ఫూర్తి నింపిందనడంలో సందేహం లేదు. కేన్సర్‌ను జయించాలంటే చికిత్స చేయించుకోవడం ఒక్కటే సరిపోదు. వారి కన్నీళ్లను తుడవాలి. వారి కష్టాలను వినాలి. గుండె బరువును ఎత్తుకోవాలి. అప్పుడు ఒక్క కేన్సరేంటి.. దాని జేజమ్మలాంటి వ్యాధినైనా జయించొచ్చు. ఓ అధ్యయనంలో తేలిందదే.

బాధితులకు సాయం..

కేన్సర్ పేషెంట్/ కేన్సర్ నుంచి కోలుకున్న వారికి సాయం చేస్తున్నవారంతా అన్‌కేన్సర్ ఇండియా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ లేదా ఫేస్‌బుక్ పేజీలో ఒక్కసారి రిజిస్టర్ అయితే చాలు. వ్యాధితో బాధపడుతున్న, చికిత్స పొందుతున్నవారి అనుభవాలను తెలుసుకోవచ్చు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆంకాలజీ స్పెషలిస్టుల వివరాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. కేన్సర్ బాధితుల ప్రశ్నలకు వీరు కూడా సమాధానాలిస్తారు. 

2022 కల్లా క్యాన్సర్‌తో బాధపడేవారి సంఖ్య 22 మిలియన్లకు చేరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో పెరుగుతున్న ఖర్చులు, మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకుని, దాన్ని ఎదుర్కొనేందుకు అన్‌కేన్సర్ ఇండియాలంటి సంస్థల సహకారం ఎంతో అవసరం.

‘‘క్యాన్సర్‌తో పోరాడుతున్న ప్రతి ఒక్కరికి పూర్తి సహకారం అందించడం.. ఆ వ్యాధిని జయించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం.. క్యాన్సర్‌ను జయించినవారిని మిషన్‌లో భాగస్వాములను చేయడం.. ఇదే మా ప్రధాన లక్ష్యం అంటారు సుశాంత్.

ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అందుకే, వాస్తవ అంచనాలు తెలియకుండానే అన్‌క్యాన్సర్ ఇండియాను ప్రారంభించాం అంటారు సుశాంత్. డీబీఎస్ బ్యాంక్ వీరిని ఎంతగానో నమ్మింది. ఈ ప్రయాణంలో వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచింది. సరైన బాధితులను కలుసుకునేందుకు, నిధులను సమకూర్చుకునేందుకు సహకరిస్తోంది. అలాగే టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ కూడా ఇన్‌క్యూబేషన్ సెంటర్ సహకారం అందిస్తోంది. కొత్త కొత్త ఆలోచనలను ఈ రెండు సంస్థలు ఆహ్వానిస్తున్నాయి. సోషల్ ఎంట్రప్రైజెస్‌పై ఆసక్తి, పెట్టుబడులు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ వాతావరణం దేశంలో మరిన్ని సోషల్ ఎంట్రప్రైజెస్ ఏర్పాటుకు సహకరిస్తాయని సుశాంత్ నమ్మకంతో ఉన్నారు. 


(ఈ ఆర్టికల్‌ను స్పాన్సర్ చేసిన వారు డీబీఎస్ బ్యాంక్)