రైలు ప్రయాణికుల వెతలు తీర్చే రైల్‌టిఫిన్‌.కాం

కూర్చున్న సీటు దగ్గరికే వేడివేడి ఆహారం రైలు లేటైనా డెలివరీ మాత్రం అనుకున్న టైంకే

రైలు ప్రయాణికుల వెతలు తీర్చే రైల్‌టిఫిన్‌.కాం

Saturday July 25, 2015,

3 min Read

అపరిచితుడు సినిమా గుర్తుందిగా! అందులో ట్రైన్‌ లో భోజనం చేసే ఒక సీన్ ఉంటుంది. సొట్లు పోయిన పళ్లెంలో ముక్కిపోయిన అన్నం. కర్చీఫ్ లాంటి అప్పడం. పసుపునీళ్లలాంటి సాంబారు. ముచ్చిక ఊడిపోయిన అరటిపండు. బలపం నీళ్లలాంటి మజ్జిగ- ఇవన్నీ చూసి విక్రమ్‌ శివాలెత్తుతాడు. తర్వాత టెండర్ దక్కించుకున్న క్యాటరర్‌ కు కుంభీపాకం శిక్ష వేస్తాడనుకోండి అది వేరే విషయం. ఆ సంగతి కాసేపు పక్కన పెడితే నిజంగా కూడా రైల్లో భోజనం దరిద్రంగా ఉంటుంది.

వాస్తవానికి ఇది ఇప్పటి సమస్య కాదు. కొన్నేళ్లుగా తిష్టవేసుకుని ఉంది. దీనికి తరుణోపాయం ఏం లేదా? ప్రత్యామ్నాయం ఎవరూ ఆలోచించరా? పియూష్ బోథ్రా చాలాసార్లు అనుకున్నాడు. లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడల్లా నరకం కనిపించేది. ఇదే విషయాన్ని ఒకసారి హర్షిత్ జైన్‌ తో పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి రైలు భోజనానికి ఆల్టర్నేట్ ఆలోచించారు. అలా పుట్టుకొచ్చిందే రైల్‌టిఫిన్.కాం

రైల్ టిఫిన్ టీం

రైల్ టిఫిన్ టీం


''రైల్‌ టిఫిన్ డాట్ కాం రైలు ప్రయాణికులకు నమ్మకమైన భాగస్వామి. ప్రస్తుతం ఈ రంగంలో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. ప్రయాణికుల సంఖ్యను బట్టి చూస్తే 0.01 శాతం మందికి కూడా సేవలందడం లేదు. అందుకే భవిష్యత్తులో మరింత మందికి క్వాలిటితో కూడిన భోజనం అందించే ఛాన్సుంది. ఇది ప్రారంభం మాత్రమే. మా ప్రయాణం ఇంకా చాలాదూరం సాగాల్సి ఉంది''- రైల్ టిఫిన్ డాట్ కాం

ఇండియన్ రైల్వేస్‌. రోజుకు కనీసం కోటి మందిని గమ్యస్థానాలకు చేరవేసే నెట్‌ వర్క్‌. ఆ రకంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద మార్కెట్. అనుకున్న కాన్సెప్టు వర్కవుట్ కావాలంటే ఎంతోకష్టం. అది ఒకప్పటి మాట. ఇప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు వచ్చాక అదేమంత కష్టం కాదనిపించింది ఇద్దరికి. టెక్నాలజీని నమ్ముకున్నారు. వీలైనంత సింపుల్‌గా ఆర్డర్ పూర్తి చేసేలా సైట్ డిజైన్ చేశారు. పీఎన్ఆర్ నెంబర్ ద్వారా కానీ.. కస్టమర్ కేర్‌ కి నేరుగా ఫోన్ చేయడం ద్వారా కానీ రైల్‌ టిఫిన్ డాట్ కాం కి ఆర్డర్ చేయవచ్చు. ఏంజిల్ ఫండ్‌ అందింది కానీ - సైట్‌ లాంఛ్ చేసేందుకు 5 నెలలు పట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 రైల్వే స్టేషన్లలో 3,500 ప్రయాణికులకు సేవలందిస్తోంది రైల్‌టిఫిన్ డాట్ కాం. కస్టమర్ల నుంచి ఊహించని రీతిలో రెస్పాండ్‌ వచ్చింది రోజురోజుకీ ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. ఇదంతా ముందు ఊహించలేదంటారు వ్యవస్థాపకులు.

మరి రైలు లేటయితే ?

రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడం కామన్ గా ఉండే సమస్య. మరి అలాంటప్పుడు ప్యాసింజర్ ఇచ్చిన ఆర్డర్ పరిస్థితేంటి? దీనికీ సొల్యూషన్ ఆలోచించారు. ఈ సమస్య ఎదురవుతుందని తెలిసి- ట్రైన్ షెడ్యూల్‌ని ట్రాక్ చేసే వ్యవస్థని ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే కస్టమర్ తినే టైంను, వండిన వంటను వేస్ట్ చేయడం ఇష్టం లేదంటారు నిర్వాహకులు. ఉదాహరణకు ఒక ట్రైన్ 3గంటలు ఆలస్యంగా నడుస్తుంటే... ఆ కస్టమర్‌కి అనుకున్న స్టేషన్ కంటే ముందు స్టేషన్‌ లోనే ఆహారం అందిస్తారు. అప్పుడు రైలు లేటయినా ప్యాసింజర్‌కు ఎలాంటి అసౌకర్యం ఉండదంటున్నారు.

కస్టమర్ కోరిన విధంగా ...

కస్టమర్లు ఏ రోజుకారోజు విస్తరించే బిజినెస్ ఇది. అందుకే ఆ వ్యాపారాన్ని వదిలేసేందుకు నిర్వాహకులు సిద్ధంగా లేరు. విక్రేతలకు-కస్టమర్లకు వారధిగా ఉంటూ ఇద్దరికీ ప్రయోజనం కలిగేలా పనిచేస్తోంది సంస్థ. పైగా అనుకున్న టైంకి కచ్చితంగా ఆహారం ఇవ్వగలగడంతో కస్టమర్లకు నమ్మకం కలిగింది. వేడికి వేడి- క్వాలిటీకి క్వాలిటీ. ప్యాసింజర్లు కూడా హ్యాపీ. ఈ విషయంలో సక్సెస్ ఒకదిరి కాదు.. ఇద్దరిది కాదు. మొత్తం 15మంది టీం వర్క్‌ అంటారు హర్షిత్. కస్టమర్ సర్వీసుని, వెండర్ మేనేజ్‌ మెంట్‌ ని సక్సెస్‌ ఫుల్‌ గా నడిపిస్తున్న టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారాయన.

రేపటి కోసం ప్రణాళికలు

డిజిటల్, సోషల్ మార్కెటింగ్‌లను ఉపయోగించుకుని డెవలప్ కావాలన్నది రైల్ టిఫిన్ డాట్ కాం సంస్థ మార్కెటింగ్ వ్యూహం. కస్టమర్ల అభిప్రాయాలు, రేటింగ్‌ ల ఆధారంతో వెబ్‌ సైట్, మొబైల్ యాప్‌ లను మరింత సౌకర్యంగా తీర్చిదిద్దే ప్రణాళిక కూడా ఉంది. విక్రేతలు అందించే ఆహారానికి రేటింగులు తీసుకుని మరింత నాణ్యమైన ఫుడ్ అందించేందుకు ప్రయత్నిస్తోంది సంస్థ.

మమ్మల్నే ఎందుకు ఎంచుకోవాలి ?

పోటీ సంస్థలు ట్రావెల్ ఖానా, కమ్‌ సమ్‌ లతో పోల్చితే.. రైల్ టిఫిన్ ఒక్కటే ఫుడ్ డెలివరీపై గ్యారంటీ ఇస్తోంది. నిర్వహణలో కూడా చాలా ఈజీగా ఉండే మార్గాన్ని ఎంచుకోవడం సంస్థకు కలిసొచ్చే అంశం.


"స్టేషన్‌లో రైలు ఆగేది 2 నుంచి 5 నిమిషాలే. ఆ తక్కువ సమయంలోనే ఫ్రెష్ ఫుడ్ అందించాలి. ఇది నిజంగా కత్తి మీద సాము లాంటిదే. అయినా సరే మేం విజయవంతంగా పనిచేస్తున్నాం. దాంతోపాటు చెప్పిన టైంకి గ్యారంటీగా ఫుడ్ డెలివరీ చేయడం మా సంస్థకు మరింత మంచి పేరు తెస్తోంది" అని పీయూష్ గర్వంగా చెప్తున్నారు.