వీధి కుక్కల పాలిట దైవం ఈ ఢిల్లీ అమ్మాయి

వీధి కుక్కల పాలిట దైవం ఈ ఢిల్లీ అమ్మాయి

Monday May 29, 2017,

2 min Read

అల్లంత దూరం నుంచే ఆమె బండి శబ్దం విని వీధి కుక్కలు చుట్టూ మూగుతాయి. ఆమె రావడం ఒక గంట ఆలస్యమైతే బేలచూపులు చూస్తుంటాయి. కమ్మటి భోజనం ప్యాకెట్లు విప్పుతుంటే నాలుక బయటకు చాచి ఆత్రపడుతుంటాయి. వేడివేడి అన్నం కడుపునిండా తిని ఆమెను ప్రేమగా ఒరుసుకుంటాయి.

image


ఢిల్లీ చిత్తరంజన్ పార్క్ ఏరియాలో అంజలి కాకతి అనే యువతి గురించి చుట్టుపక్కల తెలియని వాళ్లు లేరు. వీధి కుక్కల కడుపు నింపే ఆమె జాలి హృదయానికి జేజేలు పలకని మనిషి లేడు. ఎఫ్‌ఐసీలో బిజినెస్ ఎనలిటిక్స్ గా పనిచేసే అంజలికి మూగజీవాలంటే వల్లమాలిన అభిమానం. ఇంట్లో పెట్ డాగ్ మూలంగా వీధి కుక్కల మీద కూడా అభిమానం పెరిగింది. ఇంట్లో సాకే కుక్కలకైతే ఏం కావాలన్నా పెడతాం. మరి స్ట్రీట్ డాగ్స్ పరిస్థితేంటి? దొరికింది తిని కడుపు మాడ్చుకునే వాటి దీనస్థితి చూసి ఆమె మనసు కరిగిపోయింది.

అలా 2006 నుంచి అంజలి వీధి కుక్కల కడుపునింపే పనిలో పడింది. మొదట్లో ఈమె చేస్తున్న పనికి అక్కడివాళ్లు అభ్యంతరం చెప్పారు. పట్టపగలు ఈ కుక్కల గోలేంటి అని కసురుకున్నారు. దాంతో అంజలి తన టైమింగ్‌ మార్చుకుంది. పొద్దున, సాయంత్రం ఆహారం ఇవ్వడం మొదలుపెట్టింది. నాలుగేళ్ల తర్వాత అంజలి చేసే మంచి పనికి గుర్తింపు వచ్చింది. ఈచ్ వన్ ఫీడ్ వన్ అనే నినాదాన్ని ఎత్తుకుంది.

మొదట్లో అంజలి కుక్కలకు కావాల్సిన ఆహారాన్ని తన సొంత కారులో తీసుకువచ్చేది. డ్రైవర్, అసిస్టెంట్ సాయంతో రోజూ ఫీడింగ్ ఇచ్చేది. కొన్నాళ్లకు కుక్కల సంఖ్య ఎక్కువ కావడంతో ఖర్చు కూడా పెరిగింది. దాంతో కారు బదులు స్కూటర్ తీసుకుని దానికి వెనకాల డబ్బా అమర్చి అందులో ఆహారం తీసుకొచ్చింది. వంట కోసం ఒకరిని నియమించుకుంది. అతను రోజూ సాయంత్రం వచ్చి ఆహారం వండి ప్యాక్ చేస్తాడు. దాన్ని పొద్దున్నే కుక్కలకు వేస్తారు. సౌత్ ఢిల్లీలోని సుమారు పది ప్రాంతాల నుంచి కుక్కలు వచ్చి వీళ్లిచ్చే ఆహారం తిని వెళ్తాయి. వాటి కడుపు నింపడం మాత్రమే కాదు.. కుక్కలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా బాగు చేయిస్తారు. వారంలో నాలుగుసార్లు మెడికల్ చెకప్ ఉంటుంది. దాంతోపాటు ఫేస్ బుక్ ద్వారా ఈచ్ వన్ ఫీడ్ వన్ నినాదాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్తోంది.

image


ప్రతీవారం 25 కేజీల బియ్యం బస్తాలు పది అవసర పడుతున్నాయి. అంత ఖర్చు అంజలి భరించలేకపోతోంది. ఆ విషయం ఫేస్ బుక్ ద్వారా తెలిసిన కొందరు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. రోజుకి ఎంత లేదన్నా 60 కుక్కలను పోషిస్తోంది.

ఈచ్ వన్ ఫీడ్ వన్ ఏడుగురు సభ్యులుగా రూపాంతరం చెందింది. కృష్ణ ఆశ్రమం, ఒక ఎన్జీవో తోడయ్యాయి. అనారోగ్యంగా ఉన్న కుక్కల బాగోగులు చూసేందుకు వాళ్లు ముందుకొచ్చారు. ఆకృతి కల్రా అనే సంస్థ నిధులివ్వడానికి ముందుకొచ్చింది. రోజు తప్పించి రోజు కనీసం ఐదు ఆడ కుక్కలకు మెడికల్ చెకప్ చేయిస్తారు ప్రి సర్జరీ బ్లడ్ టెస్ట్, స్టెరిలైజేషన్, పోస్ట్ ఆపరేటివ్ చెకప్, యాంటీ రెబిస్ వాక్సినేషన్ లాంటివి ఇప్పిస్తారు.

ఈచ్ వన్ ఫీడ్ వన్ ఇప్పుడు గువాహటిలో కూడా ఏర్పాటు చేయబోతోంది. అది తన సొంతూరు కూడా. దాంతోపాటు చిన్నపాటి ఆంబులెన్స్ కూడా రన్ చేయాలని భావిస్తోంది. దాంతో వీలైనన్ని వీధికుక్కలకు అవసరమైన వైద్య సేవలు అందించాలనేద అంజలి ముందున్న తక్షణ కర్తవ్యం. మనుషులుగా మనకు చేయడానికి అయినవాళ్లున్నారు. కానీ నోరు లేని మూగజీవాలను పట్టించుకునేదెవరు? భూమ్మీద ప్రతీ ప్రాణి బతకాలి.. ప్రతీ ప్రాణినీ బతకనివ్వాలి.. అదే అంజలి నమ్మిన సిద్ధాంతం.