లండన్ ప్రజల హృదయాలు గెలుచుకున్న ఇండియన్

0

భారత సంతతికి చెందిన స్కాట్లాండ్ యార్డ్ పోలీస్ ఆఫీసర్ లండన్ ప్రజల హృదయాలు గెలుచుకున్నాడు. దట్టమైన పొగ, భీకరమైన మంటల్ని లెక్కచేయకుండా రెండు నిండు ప్రాణాలను కాపాడిన షాండ్ పనేసర్ కు లండనీర్స్ జయహో అన్నారు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన పోలీసులకు ఏటా లండన్ లో టోటల్ ఎక్స్‌ లెన్స్ ఇన్ పోలీసింగ్ అవార్డులు ఇస్తుంటారు. ఆ కేటగిరీలో పనేసర్ తో పాటు క్రెగ్ నికోల్సన్ అనే మరో ఆఫీసర్ కూడా పురస్కారం అందుకున్నారు. అవార్డు ఎంపికలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఓటు ద్వారా ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసులకు జనం ఓటేస్తారు.

సెప్టెంబర్ 2016. హిల్లింగ్డన్ లోని ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. అందులో ఇద్దరు మనుషులు చిక్కుకున్నారు. చుట్టూ మంటలు. దట్టమైన పొగ. విషయం తెలుసుకున్న పనేసర్, అతని కలిగ్ నికోల్సన్ అక్కడికి చేరుకున్నారు. అప్పటికీ ఫైర్ బ్రిగేడ్ రాలేదు. అయితే వీళ్ల దగ్గర ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదు. ఒకవేళ ధైర్యం చేసి లోపలికి వెళ్తే మళ్లీ తిరిగి వస్తారన్న నమ్మకం లేదు. పైగా లోపలున్న వాళ్లు కూడా ఏ సిట్యువేషన్‌లో ఉన్నారో తెలియదు. కానీ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అదొక్కటే వాళ్లను ముందుకు నడిపించింది.

పొగమూలంగా కళ్లు చిట్లించుకున్నా కనిపించనంత చీకటి. అడుగు వేయడనికి ధైర్యం చేయనంతగా అగ్ని కీలలు. క్షణకాలం ఆగి శ్వాస గట్టిగా పీల్చి ఒక్క ఉదుటున ఇంట్లోకి వెళ్లారు. షర్ట్ పైకి లాక్కుని ముక్కుకి అడ్డంగా పెట్టుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరు వ్యక్తులను భుజాన వేసుకుని మంటల్లోంచి రాకెట్ వేగంతో బయటకు వచ్చారు. నిమిషం ఆలస్యమైనా మంటల్లో చిక్కుకున్న మహిళ ప్రాణాలు పోయేవి. అప్పటికే ఆవిడ అపస్మారక స్థితిలో పడిపోయింది. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుంది.

ప్రాణాలకు తెగించి ఇద్దరు వ్యక్తులను కాపాడిన పోలీసులను ఉన్నత స్థాయి అధికారులు కొనియాడారు. వాళ్లు డిపార్టుమెంటుకే స్ఫూర్తిదాయకంగా నిలిచారని కమిషనర్ ప్రశంసల జల్లు కురిపించారు.   

Related Stories

Stories by team ys telugu