చెట్లకు ప్రాణప్రతిష్ట చేసే మహాయాగాన్ని తలకెత్తుకున్న వట ఫౌండేషన్

చెట్లకు ప్రాణప్రతిష్ట చేసే మహాయాగాన్ని తలకెత్తుకున్న వట ఫౌండేషన్

Saturday July 29, 2017,

3 min Read

రహదారులు అభివృద్ధి సూచికలు! అంతమాత్రం చేత వాటికి అడ్డమొచ్చిన చెట్లు అభివృద్ధి నిరోధకాలు కావు! అవి కూడా మనిషి మనుగడకు మూలాధారాలే!! ప్రాణవాయువు ఇచ్చే చెట్లను నరకడమంటే, మన సమాధికి మనమే పునాది తవ్వుకున్నట్టే ! ఈ మాటలు అందరూ చెప్తారు! కానీ పాటించేవాళ్లు కొందరే ఉంటారు. ఆ కొందరిలో సమ్‌ థింగ్ స్పెషల్ హైదరాబాదుకి చెందిన వట ఫౌండేషన్.

image


చెట్లు నరకాలన్న ఆలోచన ఎంత క్రూరమైందో సమస్త మానవాళికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కాంక్రీట్ అరణ్యంలో కూరుకుపోయి పచ్చిగాలి కోసం విలవిల్లాడుతుంటే వృక్షాల విలువేంటో మెల్లమెల్లగా బోధపడుతోంది. అభివృద్ధి జరగాల్సిందే. దాన్ని అడ్డుకునే సవాలే లేదు. అంతమాత్రం చేత రోడ్డుకి అడ్డంగా ఉందని చెట్టుని నరకడం దారుణం. ఇలాంటి ఘోరాలు గతంలో ఎన్నో కళ్లముందే జరిగాయి. ఇకపై జరగాడానికి వీల్లేదు. చెట్టు కొమ్మపై గొడ్డలి వేటు పడటానికి వీల్లేదు. దాన్ని కూకటివేళ్లతో పెకిలించి, వేరేచోట నాటితే సరిపోతుంది. ఇదే లక్ష్యంతో ఏర్పడింది వట ఫౌండేషన్. 

చెట్టుని తీసేయాల్సి వస్తే వాళ్లకు చెప్పండి చాలు.. దాన్ని పూవుల్లో పెట్టి ఎత్తుకెళ్లి వేరేచోట నాటుతారు. నాటడమే కాదు, అది ఇగురు వేసేదాకా కంటికి రెప్పలా కాపాడతారు. వందల ఏళ్ల నాటి వృక్షమైనా సరే, సింపుల్‌గా తీసుకెళ్లి వేరే చోట పాతిపెడతారు. చెట్లకు ప్రాణప్రతిష్ట చేసే మహాయాగాన్ని తలకెత్తుకున్న వట ఫౌండేషన్ 2010లో ఏర్పాటైంది. ముగ్గురు మిత్రులు కలిసి దీన్ని స్థాపించారు.

నిత్యం ఏదో ఒక కారణంతో ఏటా వందలాది చెట్లు నేలరాలిపోతున్నాయి. ఫ్లయ్ ఓవర్ పేరుతోనో, రోడ్ వైడెనింగ్ కారణంతోనో, ఏదో ఒకచోట చెట్టుని నిలువునా కొట్టేస్తున్నారు. దీనికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడాలి. ఇకపై ఏ చిన్నచెట్టు కూడా నిష్కారణంగా నేలరాలి పోవద్దు. ఈ సంస్థ ఏర్పడ కొత్తలో హైదరాబాదులో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి కడుతున్నారు. దాని మూలంగా 16 చెట్లు తీసేయాల్సివచ్చింది. ఆ విషయం తెలుసుకున్న ఫౌండేషన్ సభ్యులు ఆ చెట్లను జాగ్రత్తగా పెకిలించి, వేరేచోట నాటారు. అందులో 13 వృక్షాలు బతికాయి. దాంతో సంస్థలోని సభ్యలకు నమ్మకం పెరిగింది. 

image


ఆ మధ్య బొటానికల్ గార్డెన్లో 72 చెట్లను బతికించారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లైన్లో 300 చెట్ల కోసం ఉద్యమించారు. ఈ మధ్యనే కేపీహెచ్‌బీ నుంచి 92 చెట్లను మణికొండలో పునఃప్రతిష్టించారు. అందులో 70 దాకా బతికాయి. నాటడం ఒక్కటే కాదు.. అవి చిగుళ్లు వేస్తున్నాయా లేదా అన్నది కూడా చూస్తారు. ఒక చెట్టుని రీ-లొకేట్ చేయడమంటే వంద మొక్కలను బతికించినట్టే అంటారు వట ఫౌండేషన్ ట్రస్టీ ఉదయ్ కృష్ణ.

ప్రాక్టికల్‌గా చూస్తే.. రావి, మర్రి చెట్ల వంటి వాటిని మాత్రమే రీ లొకేట్ చేయగలం. మిగతా చెట్ల విషయంలో రిస్క్ ఎక్కువ. కానీ వట ఫౌండేషన్ మాత్రం అదీఇదీ అని తేడాలేదు. తొలగించాల్సి వచ్చిన ప్రతీ చెట్టునీ తరలిస్తాం, బతికిస్తాం అంటున్నారు. అది కూడా సొంత ఖర్చులతోనే. బాటిల్ బ్రష్, పెల్టోఫారమ్ లాంటి విదేశీ జాతి చెట్లు ఒకసారి పెకిలిస్తే బతకవు. అలాంటి వాటిని కూడా వేరే చోటికి తరలించి ప్రాణం పోశారు. 

త్వరలో సాగర్ రింగ్ రోడ్డులో 300 చెట్లను వేరేచోటికి షిఫ్ట్ చేయబోతున్నారు. దీనికయ్యే ఖర్చంతా ఫౌండేషన్ సభ్యులే జేబునుంచి భరిస్తున్నారు. చెట్ల తరలింపు ప్రక్రియ ఖర్చుతో కూడుకున్నది. ఒక్కో చెట్టుకి మూడు నుంచి నాలుగు వేలు అవుతుంది. కాబట్టి తలా ఒకచెట్టో, రెండు చెట్లో అడాప్ట్ చేసుకుంటామని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. జేసీబీలు, డీసీఎంలు, క్రెయిన్లు, లేబర్ ఖర్చులే అధికంగా వుంటాయని చెప్తున్నారు. ఒక చెట్టుని రీలొకేట్ చేయాలంటే.. మూడు నాలుగు వారాలు పడుతుంది. అర్జెంట్ అనుకుంటే పది రోజుల్లో చేసేస్తాం అంటున్నారు ఫౌండేషన్ సభ్యురాలు సమీష

image


చెట్టు తోడు లేక మనిషి కష్టాలు కోరి తెచ్చుకుంటున్నాడు. అడవుల్లేక ఊహించని అనర్థాలు జరుగుతున్నాయి. ఆకుపచ్చని కల శాశ్వతంగా చెదరిపోకముందే మేల్కోవాలి. తెలంగాణ సర్కారు తలపెట్టిన హరితహారం ఒకవైపు.. అదే స్ఫూర్తితో వట ఫౌండేషన్, అప్పారి రామచంద్ర లాంటి వాళ్లు చేస్తున్న హరిత యజ్ఞం మరోవైపు! వెరసి కనుమరుగైపోయిన నందనవనాలు మళ్లీ వస్తాయనడంలో సందేహం లేదు.