బెగ్గర్ టు ఇంటర్నేషనల్ బుక్ రైటర్

బెగ్గర్ టు ఇంటర్నేషనల్ బుక్ రైటర్

Wednesday March 25, 2015,

8 min Read

నేటి బాల‌లే రేప‌టి పౌరులు.. అనే మాట వినేఉంటాం. కానీ ఓ కుర్రాడు మాత్రం నేటి వీధి బాల‌లే రేప‌టి వ్యాపారుల‌ని నిరూపించాడు. ఒక్క వ్యాపార‌మే కాదు అంత‌ర్జాతీయ కీర్తి గ‌డించ‌గ‌లిగే సామ‌ర్ధ్య‌మున్న ర‌చ‌యిత‌లు కూడా కాగ‌ల‌ర‌ని ప్రూవ్ చేశాడు. అత‌డి పేరే అమీన్ షేక్. ఇంట్లో స‌వ‌తి తండ్రి కొట్టే దెబ్బ‌లు త‌ట్టుకోలేక‌.. ఐదో ఏటే ఇల్లు ఒద‌లాల్సి వ‌చ్చింది. ఇల్లు ఒద‌ల‌డ‌మైతే ఈజీయేగానీ త‌ర్వాత ఎక్క‌డుండాలి? చ‌దువు సంధ్య ఎలా? అన్న ప్ర‌శ్న‌లు వెంటాడుతున్నా బ‌య‌ట‌కొచ్చేశాడు. అలాగని వేరే దారి లేదు. ఇంట్లో ఆ టార్చ‌ర్ త‌ట్టుకోడం క‌న్నా రైల్వేస్టేష‌న్లో బెగ్గ‌ర్ గా బ‌తక‌డ‌మే బెట‌ర‌నుకున్నాడు అమీన్.

ఇంట్లోంచి బ‌య‌టికొచ్చిన కొన్నాళ్ల‌కే అత‌నికి ప‌రిస్థితేమిటో పూర్తిగా అర్ధ‌మైంది. నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లాలంటే నాలుగు పూట‌లా ఒళ్లు ఒంచాల్సిందే. దీంతో చేసేది లేక మార్కెట్ లో అడుక్కు తిన‌డం. చిన్నా చిత‌కా వస్తువుల‌ను అమ్మ‌డం.. రైళ్ల‌లో పాట‌లు పాడ్డం షురూ చేశాడు. అత‌ని గొంతేమో భ‌యంక‌రంగా ఉంటుంది. ఆ గొంతుతో ఎలుగెత్తి పాడుతుంటే వినే వాళ్ల చెవులు చిల్లులు ప‌డిపోతుంటాయి. అందుకే అత‌ని చేత పాట ఆపించ‌డానికా అన్న‌ట్టు పైస‌లు వేసేవాళ్లు ప్ర‌యాణికులు. ఒక్కోసారి మ‌న మైన‌స్ పాయింటే ప్ల‌స్ గా మారుతుంద‌నుకుని.. అందిన చిల్ల‌ర డ‌బ్బుల‌తో ఆ రోజు ఫుడ్డు లాగించేసేవాడు. ఇలా అమీన్ జీవితం అష్ట‌క‌ష్టాల‌తో అత్యంత అన్యోన్యంగా గ‌డుపుతూ సాగిపోయేది.

అమీన్, పుస్తక రచయిత, ఆంట్రప్రెన్యూర్

అమీన్, పుస్తక రచయిత, ఆంట్రప్రెన్యూర్


పది గంటల పనికి 2 రూపాయల కూలీ

ఇలా ఎన్నాళ్లు అస్థిరంగా బ‌త‌క‌డమ‌ని ఆవేద‌న చెందిన అమీన్ ఓ టీ షాప్ లో చేరాడు. ప‌ది గంట‌లు క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే జ‌స్ట్ రెండు రూపాయ‌లు ఇచ్చేవాడు ఓన‌రు. రెండు రూపాయ‌లు ఎంత క‌ష్ట‌ప‌డితే వ‌స్తాయో అత‌నికి తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలీదు. ప‌గ‌టి వేళ టీ షాపుల్లో ప‌ని చేస్తూ గ‌డిచిపోయింద‌ని సంతోషించే లోగా రాత్రి ప్ర‌త్య‌క్ష న‌ర‌కాల‌ను చూడాల్సి వ‌చ్చేది. వీధి బాల‌ల బ‌తుకెంత దుర్భ‌ర‌మో తెలిసి వ‌చ్చేది. అనేక ర‌కాల వేధింపులు వాళ్ల‌ను వెంటాడుతుంటాయి. ఆ స‌మ‌యంలో త‌ల్లిదండ్రుల మ‌ధ్య మెత్త‌టి ప‌రుపుల మీద హాయిగా జీవించే పిల్ల‌లెంత అదృష్టవంతులో అన్న ఆలోచ‌న క‌లుగుతుంది. ఎంత తిట్టుకున్నా.. దుర‌దృష్టంతో అంట కాగ‌క త‌ప్ప‌దు. నానా అవ‌స్త‌లు ప‌డాల్సి వ‌చ్చేది. ఓ రోజు అమీన్ చేసే టీ షాపు ఉద్యోగం కూడా పోయింది. ఓ రోజు తాను మోస్తున్న టీ ట్రే కింద ప‌డిపోవ‌డంతో ఆ ఉద్యోగం వ‌దిలేయాల్సి వ‌చ్చింది. ప‌ది గ్లాసులు ప‌గిలినందుకు ఓన‌ర్ వీపంతా ప‌గ‌ల‌గొడ‌తాడు. దానిక‌న్నా ఆ ప‌ని మానేయ‌డ‌మే మంచిది. వీపు ప‌గ‌ల‌గొట్టించుకోడ‌మే చేత‌నై ఉంటే తాను ఇన్ని క‌ష్టాల‌నెందుకు ప‌డ‌తాడు? ఇల్లెందుకు వ‌దులుతాడు?

ఇల్లూ లేదూ.. త‌ల్లీదండ్రీ లేరు.. ఉన్న చెల్లెల్ని కూడా ఇంట్లో వ‌దిలేసి వ‌చ్చేశాడు అమీన్. జీవితం ఎంత దుర్భ‌రం.. దేవుడ్ని క‌సిదీరా తిట్టాల‌ని ఉంటుందిగానీ ఆయ‌న‌తో అంత‌గా ప‌రిచ‌యం లేదు. ఇలా ఆలోచిస్తూ మ‌లాడ్ రైల్వే స్టేష‌న్ చేరాడు. అక్క‌డా అదే సీన్.. దేశంలో ఏమూల‌నైనా త‌న‌లాంటి వీధిబాల‌ల బ‌తుకు చిత్రం ఒక్క‌లాగే ఉంటుందనిపించింది. అడుక్కు తిన‌డం.. లేదంటే ప‌రిస‌రాల‌ను శుభ్రం చేయ‌డం. రాత్ర‌యితే ఓ మూల‌న దాక్కుని ప‌డుకోవ‌డ‌మే జీవితం. మ‌ళ్లీ తెల్లారితే మ‌ట్టికొట్టుకుపోతున్న బ‌తుక‌లాగే కొన‌సాగించ‌డం. ఇంతేనా.. ఇంకేం లేదా? అనిపించేది అమీన్ కి. దేవుడే ఇచ్చాడు స్టేష‌నొక‌టీ అని త‌న‌తోటి వీధిబాల‌తో అక్క‌డే అడుక్కుతిని.. అక్క‌డే ఆడి పాడేవాడు.

image


ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయ్

ఇవ‌న్నీ ఒకెత్త‌యితే సీనియ‌ర్ స్ట్రీట్ చిల్డ్ర‌న్ నుంచి త‌లెత్తే స‌మ‌స్య‌లు మ‌రొక ఎత్తు. వాళ్లు ఎంతో దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. అస‌లు వాళ్లేం చేస్తుంటారో వాళ్లకే తెలీనంతగా ఉంటారు. డ్ర‌గ్స్, స్మోకింగ్, డ్రింకింగ్‌ లాంటి చెడు అల‌వాట్లతో స‌హ‌జీవ‌నం సాగిస్తుంటారు. అక్క‌డితో ఆగ‌క త‌న‌లాంటి చిన్న పిల్ల‌ల‌ను కూడా వీటికి బానిస‌ల‌ను చేయాల‌ని చూస్తుంటారు. ఒక్కోసారి తామిచ్చింది తాగాల్సిందేన‌ని బ‌ల‌వంతంగా గొంతులో ఒంపేస్తుంటారు. త‌ర‌చూ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతుంటారు కూడా. ఏడెనిమిదేళ్ల వ‌య‌సులో ఇలాంటి దారుణాల‌ను ఎదుర్కోడానికి మించిన న‌ర‌క‌ముండ‌ద‌ని అనిపిస్తుంది. భ‌ద్ర‌త లేని బ‌తుకు భ‌విష్య‌త్ లో ఇంకెంత భ‌యంక‌రంగా ఉంటోందో అని త‌లుచుకుని కుళ్లి కుళ్లి ఏడ‌వాలనిపిస్తుంది. ఎన్నిటిక‌ని ఏడ్చేది.. క‌న్నీళ్లు కూడా స్టాక్ అయిపోవ‌డంతో క‌ళ్ల‌ల్లో దుఃఖాన్ని నింపుకుని అలాగే గ‌డ‌పాల్సిన దుస్థితి.

అది త‌న 8వ ఏడు. ఒక రోజు అమీన్ దాద‌ర్ రైల్వే స్టేష‌న్లో ఆడుకుంటున్నాడు. అప్పుడు స‌మ‌యం స‌రిగ్గా సాయంత్రం 4గంట‌లు. ఇంత‌లో దూరంగా క్యాంటిన్ ద‌గ్గ‌ర‌ ఓ మెరుపు మెరిసింది. చూస్తుంటే త‌న చెల్లెల్లా ఉంది. అవును ఆమె త‌న చెల్లెలు స‌బీరానే.. ఆమె త‌న‌ను వెతుక్కుంటూ ఇల్లొదిలి వ‌చ్చేసింద‌ని తెలిసింది. అదే స్టేష‌న్లో త‌న చెల్లెలితో బిక్కు బిక్కుమంటూ నాలుగు రోజులు గ‌డిపేశాడు అమీన్. ఇంత‌లో త‌న ప్రార్ధ‌న ఏ దేవదూత ఆల‌కించిందో తెలీదుగానీ ఓ ర‌క్ష‌కురాల్ని పంపింది. ఆమె పేరే సెరాఫిన్. కానీ త‌న‌కేమో ఆమె మీద అనుమానం. కొంద‌రిలాగే చిన్న‌పిల్ల‌ల్ని తీసుకెళ్లి దారుణ‌మైన ప‌నులు చేయిస్తుంటారు. కొంప‌దీసి సెరాఫిన్ కూడా అలాంటిదేమోన‌ని మొద‌ట ఆమెపై రాయి విసిరాడు అమీన్. దేవుడి ద‌య వ‌ల్ల ఆమెకెలాంటి ప్ర‌మాదం క‌ల‌గ‌లేదు. మొత్తం మీద ఆమె త‌మ‌ను ఒప్పించి స్నేహ‌స‌ద‌న్ తీసుకువెళ్ల‌గ‌లిగింది.

image


జీవితంలో మొద‌టి సారి భ‌ద్ర‌త ల‌భించిన‌ట్టైంది. స్నేహ‌స‌ద‌న్ త‌న‌లాంటి అనాథ‌ల‌ను చేర‌దీసే ఆశ్ర‌మం. జీవితం మీద ఒక న‌మ్మ‌కం ఏర్ప‌డింది. రైట్ టైంలో రైట్ ప్లేస్ కొచ్చామ‌న్న సంతృప్తి ల‌భించింది. అక్క‌డి ప్ర‌తి పిల్లాడికీ మూడంటే మూడు జ‌త‌ల బ‌ట్ట‌లుంటాయి. క్రిస్ మ‌స్ వ‌స్తే కొత్త బ‌ట్ట‌లిస్తారు. అయితే త‌మ‌కు కావ‌ల్సినంత ప్రేమ‌, చ‌దువు, భ‌ద్ర‌త ల‌భించింది. త‌న‌నెవ‌రో ఆశీర్వ‌దించిన‌ట్టు ప‌దేళ్ల పాటూ అక్క‌డే ఉన్నాడు అమీన్. ఆ ప‌దేళ్లూ అత‌ని జీవితంలో మ‌ర‌పు రానివి. మ‌రీ సంతోష‌క‌ర‌మైన విష‌య‌మేంటంటే స్నేహ‌స‌ద‌న్ నిర్వాహ‌కులు మ‌త‌ప‌ర‌మైన ఆంక్ష‌ల‌కు గురిచేయ‌లేదు. త‌మ మ‌తంలోకి మార‌మ‌ని ఒత్తిడి తేలేదు. అయితే త‌మ‌కు మున్సిప‌ల్ స్కూల్లో విద్య‌నందించేవారు. అదేమంత గొప్ప‌గా ఉండేది కాదు. చ‌దువంటే ఇలా ఉండ‌కూడ‌ద‌నిపించేది. ఏదో బ‌త‌క‌డానికి ప‌నికొచ్చే చ‌దువులా ఉండ‌కూడ‌దు. కొంద‌రేమో తాము చ‌దివిన చ‌దువుతో చంద్ర‌మండ‌లం చుట్టి వ‌స్తుంటే. ఇప్పుడు తాము చ‌దువుతున్న చ‌దువుతో భూమ్మీద నాలుగు డ‌బ్బులు సంపాదించుకుని బ‌త‌క‌డానికి ప‌నికొస్తుందో లేదో తెలీద‌న్న నీర‌సం ఆవ‌హించేది. అయినా త‌న‌లాంటి వాళ్ల‌కు ఇదే ఎక్కువ‌. ఇలా నిరుత్సాహ ప‌డ‌కూడ‌ద‌ని స‌ర్ధిచెప్పుకునేవాడు అమీన్..

ఇంకా ఏదో నేర్చుకోవాలి. బొంబాయి చేరుకుంటే జీవితానికి స‌రిప‌డా నేర్చుకోవ‌చ్చేమో. ఎందుకంటే బ‌తక‌డం ఎలా? అనే కోర్సు బ్ర‌హ్మాండంగా నేర్పించే విశ్వ‌విద్యాల‌యం బొంబాయి. అనుకున్నాడు. స్నేహ‌స‌ద‌న్ వాళ్లు నేర్పించే చ‌దువు పూర్త‌య్యాక ముంబై న‌గ‌రం చేరాడు. అమీన్ 9 ఏళ్ల వ‌య‌సులో పేప‌ర్ బాయ్ గా ప‌నిచేశాడు. ఇప్పుడ‌త‌ని వ‌య‌సు 16. ఈ ఎక్స్ పీరియ‌న్స్ తో ఓ బ‌స్టాండ్ ద‌గ్గ‌ర.. బ‌ల్ల మీద పేప‌ర్ స్టాల్ ఓపెన్ చేశాడు. గొంతు చించుకుని అరిచి పేప‌ర్ అమ్మాల్సి వ‌చ్చేది. కాంపిటీష‌న్ అంత‌లా ఉండేద‌క్క‌డ‌. అదే అమీన్ మొద‌లు పెట్టిన మొద‌టి బిజినెస్.

ఫస్ట్ టర్నింగ్ పాయింట్

ఒక రోజు ఫాద‌ర్ ప్లాసీ త‌న స్టాల్ కి వ‌చ్చాడు. నువ్వు నా ఆఫీసుకొచ్చి క‌నిపించు అని ఆర్డ‌రేశాడు. అలాగే సార్ అన్నాడే కానీ వెళ్ల‌లేదు. మ‌రో సారి వ‌చ్చి సీరియ‌స్ అయ్యాడు. స‌రే వెళ్లి చూద్దాం.. ఈ రోడ్డు సైడు బ‌తుకు నుంచి ఏదైనా విముక్తి ల‌భిస్తుందేమో అనుకున్నాడు. వెళ్లాడు. అక్క‌డ ఆయ‌న చెప్పిందేంటంటే నువ్వు అస్టాస్ ఫెర్నాండెజ్ తో క‌లిసి ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని అన్నాడు. ఫెర్నాండెజ్ మ‌రెవ‌రో కాదు అమూల్ బేబీ క్రియేట‌రైన పెద్ద ఆర్టిస్ట్‌. ఫెర్నాండెజ్ ఫ్యామిలీలో ఒక మెంబ‌ర్ గా క‌లిసిపోయాడు అమీన్. మొత్తం 13 ఏళ్లు అక్క‌డే ఉండిపోయాడు. ఫెర్నాండెజ్ నుంచి ఎన్నో మంచి విష‌యాలు నేర్చుకున్నాడు. త‌నకు తండ్రిలేని లోటు.. గురువు లేని లోటు ఆఖరున ఫ్రెండ్ లేని లోటు కూడా తీర్చాడు ఫెర్నాండెజ్. క‌రెక్టుగా చెప్పాలంటే ఆయ‌న త‌న‌నో కొడుకును చూసుకున్న‌ట్టు చూసుకున్నాడు. త‌న‌కేలోటూ లేకుండా సాగిపోతున్న స‌మ‌యంలో ఫెర్నాండెజ్ మ‌ర‌ణించారు. దీంతో త‌న జీవితం మ‌ళ్లీ క‌ష్టాల్లో ప‌డ్డ‌ట్టైంది.

image


త‌న ఇంటిని వెతుక్కుంటూ వెళ్లాడు అమీన్. చాలా రోజుల త‌ర్వాత త‌ల్లిని చూడ్డంలో ఆనందం వెతుక్కున్నాడు. స‌వ‌తి తండ్రి ఏ మాత్రం మారిన‌ట్టు క‌నిపించ‌లేదు. దీంతో అక్క‌డి నుంచి వ‌చ్చేయాల్సి వ‌చ్చింది. త‌ల్లి.. పాపం ఆమె మాత్రం ఏం చేస్తుంది? త‌న‌లాగే ఆమె కూడా విధివంచితురాలు. ఇక‌నైనా ఆమె సంతోషంగా ఉండాల‌ని కోరుకున్నాడు.

సెకెండ్ టర్నింగ్ పాయింట్

అంతా బాగుందిగానీ జీవితంలో ఏదో చేయాల్సింది మిగిలే ఉంది. జీవితాన్ని అందంగా ఎలాగూ గ‌డ‌ప‌లేక పోయాం. అట్ లీస్ట్ ఆద‌ర్శ‌వంతంగానైనా గ‌డ‌పలేమా? అనుకున్నాడు అమీన్. ఫెర్నాండెజ్ కొన్నిచ్చిన సెకెండ్ హ్యాండ్ కారు స‌డెన్ గా గుర్తుకు వ‌చ్చింది. దాంతో ఒక క్యాబ్ న‌డిపితే ఎలా ఉంటుంది? అని ఐడియా వేశాడు. డ్రైవ‌ర్ గా స‌రికొత్త జీవితం మొద‌లు పెట్టాడు. ఫారిన‌ర్ల‌ను త‌న కారులో ఎక్కించుకుని తిప్ప‌డంలో.. వారికి ఇండియా అంటే ఏంటో చూప‌డంలో మజా అనిపించింది. అయితే త‌న ఇంగ్లీష్ మ‌రీ బ్యాడ్ గా ఉంటుంది. వాళ్ల‌కు త‌న సైగ‌లు అర్ధ‌మ‌య్యేవిగానీ బాష తెలిసేది కాదు. ఈ టైంలో ఓ బ్రిటీష్ మ‌హిళ అమీన్ కి తార‌స ప‌డింది. అమీన్ మంచి త‌నాన్ని గుర్తించింది. నీ మార్కెట్ నేనెలా పెంచుతానో చూడంటూ లండ‌న్ వెళ్లింది. అత‌ని మీద ఓ మంచి ఇంట్రడ‌క్షన్ రాసి నెట్ లో పోస్ట్ చేసింది. దీంతో బొంబే వ‌చ్చిన ఫారిన‌ర్లు అత‌డ్ని వెతుక్కుంటూ వ‌చ్చేవాళ్లు. దీంతో అత‌ను రెండో కారు కూడా కొన‌గ‌లిగాడు.

అప్ప‌టి వ‌ర‌కూ ఇంగ్లీషంటే ఇంగ్ చేర్చి మాట్లాడ్డ‌మే తెలిసిన అత‌ను త‌ర్వాత ఎంతో ఇంప్రూవ్ అయ్యాడు. ఫెర్నాండెజ్ బ‌తికున్న రోజుల విషయానికి వ‌స్తే నువ్వేం కావాల‌ని అడిగాడాయ‌న‌. నేను ప్ర‌యాణించ‌డం వ‌ల్లే నేర్చుకుంటాను. కాబ‌ట్టి బార్సిలోనా వెళ్లాల‌ని కోరిక‌గా ఉంద‌ని అనేవాడు. ఆ మాట‌లెందుకో గుర్తుకు వ‌చ్చాయి. అవును త‌న బ‌లం ట్రావెలింగే. భిన్న‌మైన ప్ర‌దేశాల నుంచీ.. భిన్న‌మైన మ‌నుషుల నుంచీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ తాను ఎంతో నేర్చుకున్నాడు. త‌న‌కున్న ఫారిన్ ప‌రిచ‌యాల‌తో యూర‌ప్ వెళ్ల‌గ‌లిగాడు. అక్క‌డ అత‌నికి లైబ్ర‌రీలు, కాఫీ షాపులూ తెగ‌న‌చ్చేశాయి. ఇలాంటి షాపులు ముంబైలో తెరిస్తే ఎలా ఉంటుందీ? అనుకున్నాడు. తానా పెద్ద‌గా చ‌దువుకోలేదు. స‌రే పుస్త‌కాలేమైనా చ‌దివాడా అంటే అదీ లేదు. అయితే తాను సాటి మ‌నుషుల‌ను మ‌నుషులుగా గుర్తించి వారిని బాగా చూసుకోగ‌ల‌డు. వారికోస‌పం ప‌సందైన‌ వంట‌లు వండ‌గ‌ల‌డు. త‌న‌కున్న ఈ క్వాలిటీస్ తో ఓ కేఫ్ ఓపెన్ చేస్తే.. అందులో వీధి బాల‌ల‌కు ప‌నిక‌ల్పిస్తే.. ఇలా ఆలోచిస్తుంటేనే థ్రిల్లింగా ఉంది. ఇక రంగంలోకి దిగితే ఇంకెంత బావుంటుందో అనుకున్నాడు. మొత్తానికి త‌న కేఫ్ పేరు.. బొంబే టూ బార్సిలోనా లైబ్ర‌రీ కేఫ్ అని ఫిక్స్ చేశాడు.

బిజినెస్ స్టార్ట్ చేయ‌డ‌మంటే మ‌జాక్ కాదు. అందుకు ఎంతో డ‌బ్బు అవ‌స‌ర‌మ‌వుతుంది. తాను కొన్న ఇంటిని అమ్ముదామంటే అమ్మ అక్క‌డ త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఉంది. ఇక బ్యాంకులు చూస్తే లోనివ్వ‌మ‌ని చెప్పేశాయి. ఇన్నాళ్లూ త‌న‌కు ఇంట్లోని వాళ్లూ, బ్యాంకువాళ్లేం సాయం చేయ‌లేదుగా? త‌న‌కున్న ప‌రిచ‌యాలే యూరప్ వ‌ర‌కూ తీసుకెళ్లాయి. త‌నకున్న స్నేహితులే త‌న‌ను ఈ స్థాయిలో నిల‌బెట్టారు.. వాళ్ల‌ను అడిగితే ఎలా ఉంటందీ? అనుకున్నాడు. కానీ అది కూడా అంత తేలిక కాద‌ని అర్ధ‌మైంది.

ఇంత‌లో స్పెయిన్ నుంచి ఓ డాక్ట‌ర్ ఫ్రెండ్ త‌న‌కో ఫేవ‌ర్ చేసి పెట్ట‌మని అడిగింది. అదేమిటంటే ఆమెకు బార్సిలోనాలో హాస్పిట‌ల్ కోసం నిధుల స‌మీక‌ర‌ణ చేస్తోంది. తాను రాసిన పుస్త‌కం అమ్మ‌డం ద్వారా ఫండ్ క‌లెక్ట్ చేయాల‌ని చూస్తోంది. త‌న పుస్త‌కం తెలిసిన వాళ్ల ద‌గ్గ‌ర ప్ర‌చారం చేయ‌మ‌ని అడిగింది.

ఒక పుస్త‌కం అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బుతో హాస్పిట‌ల్ క‌ట్ట‌వ‌చ్చా? అవునా? పుస్త‌కంలో ఇంత మేట‌రుందా? ఇంత‌కీ పుస్త‌కం ఎలా రాస్తారూ? మ‌ళ్లీ అంత‌ర్మ‌థ‌నం మొదలైంది. పుస్త‌కం రాత‌కోత‌ల విష‌య‌మై తీవ్ర అన్వేష‌ణ సాగించాడు. ఇంత‌కీ క‌థా వ‌స్తువు ఏం తీసుకోవాలీ? అన్న ప్ర‌శ్న త‌లెత్తిన‌ప్పుడు. అత‌నికి మ‌రో మాట‌లేకుండా త‌న‌క‌థ క‌న్నా మించిన ట్విస్టుల‌తో కూడుకున్న క‌థ మ‌రొక‌టుంటుందా? అనిపించింది. దాన్నే యాజ్ ఇటీజ్ గా దింపేస్తే పోద్ది అనుకున్నాడు.

అమీన్ ఆటోబయోగ్రఫీ

11 నెల‌లు క‌ష్ట‌ప‌డి వ‌చ్చీరాని ఇంగ్లీష్ లో త‌న స్వీయ‌గాథను పుస్త‌కంగా రాసేశాడు. అందులో బోలెడు స్పెల్లింగ్ మిస్టేకులు, లెక్క‌లేన‌న్ని గ్రామ‌ర్ త‌ప్పులు. త‌న‌కు దేవుడు అమ్మా నాన్నాల‌ను స‌రిగా ఇచ్చాడో లేదో తెలీదుగానీ స్నేహితుల‌నైతే ఇచ్చాడు. వాళ్ల‌తో మొర‌పెట్టుకుంటే స‌రీ అనుకున్నాడు. త‌ప్పులు దిద్దే ప‌ని పుర‌మాయించాడు. మొత్తానికి ఓ శుభ‌స‌మ‌యంలో పుస్త‌కం రెడీ అయ్యింది. లైఫ్ ఈజ్ లైఫ్.. అయాం బికాజ్ ఆఫ్ యూ అన్న పేరిట పుస్త‌కాన్ని అచ్చు వేయించి వీధుల్లో అమ్మాడు. అదృష్టం కొద్దీ వేల‌కాపీలు అమ్ముడు పోయాయి.

image


ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌బ్లిషింగ్ హౌజ్ హాచే అమీన్ పుస్త‌కం కాపీరైట్స్ తీసుకుంది.ఫ్రాన్స్ లో పుస్త‌కం రిలీజ్ చేసింది. పుస్త‌కంలో మేట‌రుక‌న్నా దాన్ని అమ్మ‌డం ద్వారా బాంబే టూ బార్సిలోనా లైబ్ర‌రీ అండ్ కేఫ్ స్టార్ట్ చేయాలి.. అది వీధిబాల‌ల‌కు ఆస‌రాగా నిల‌వాలన్న అత‌ని ఆశ‌యం అంద‌రికీ న‌చ్చింది. యూఎస్, యూకే.. ఇలా అన్నిదేశాల్లో అమీన్ బుక్ బ్ర‌హ్మాండంగా అమ్ముడు పోయింది. ఇట‌లీలో కూడా ట్రాన్స్ లేట్ అయ్యింది. ఓ అమెరిక‌న్ డిజైన‌రైతే బుక్ సేల్స్ పెంచ‌డంలో భాగంగా ఆ పేరుతో టీష‌ర్టులు త‌యారు చేశాడు. మ‌రో యూరోప్ మిత్రుడు పుస్త‌కం మీద ఫ్రెంచ్ లో ఓ పాట రాశాడు. మొత్తానికి అమీన్ పుస్త‌కం గురించి స్పానిష్ రేడియోలో డిస్క‌స్ చేశారు. ఫ్రెంచ్ న్యూస్ పేప‌ర్లో రాశారు. త‌న కేఫ్ కి కావ‌ల్సిన డ‌బ్బులైతే క‌లెక్ట‌య్యాయి. తాను అనుకున్న పెట్టుబ‌డిలో అది 20శాతం మాత్ర‌మే. మిగిలిన 80శాతం డ‌బ్బు సేక‌రించాల్సి ఉంది. అది కూడా త్వ‌ర‌లోనే స‌మ‌కూరుతుంద‌న్న గ‌ట్టి న‌మ్మ‌క‌మైతే అమీన్ కి ఉంది.

ఎవ‌రి శ‌క్తి వాళ్ల‌కు తెలీదు. త‌మ‌కు తాము ఏం కావాల‌నుకున్నారో అది నెర‌వేర్చుకునే సామ‌ర్ధ్యం ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఉంటుంది. అది గుర్తించ‌డంలోనే అస‌లు ర‌హ‌స్యం దాగి ఉంది.. అంటాడు అమీన్. నిజ‌మే.. అమీన్ నువ్వు చెప్పింది 100 కి 1000 ప‌ర్శెంట్ క‌రెక్ట్‌. నీ కేఫ్ బాగా సాగాలి. దాన్లోంచి వ‌చ్చే లాభాలు వీధిబాల‌ల‌కు విరివిగా ఉప‌యోగ ప‌డాలి. నీ ఆశ‌యం అదుర్స్.