వీడియో అప్‌లోడ్స్‌తో యూట్యూబ్‌లో సంపాదన ఎలా ?

వ్యూస్ అనుసరించి వీడియోలకు పేమెంట్స్ఒరిజినల్ పబ్లిషర్స్‌కే అవకాశంఆదాయం సంపాదించేందుకు చక్కని ఐడియా8 ఏళ్లలో 11 రెట్లు పెరిగిన వీడియో అప్‌లోడర్స్యూజర్లకు ఆదాయం పెంచేందుకు కొత్త ఫీచర్స్


వీడియో అప్‌లోడ్స్‌తో  యూట్యూబ్‌లో సంపాదన ఎలా ?

Tuesday June 30, 2015,

4 min Read

గంగ్నమ్ స్టైల్.... దక్షిణ కొరియా సింగర్ 'సై'... ఈ ఒక్క సాంగ్‌తో ఏ రేంజ్‌లో వరల్డ్ ఫేమస్ అయిపోయారో చాలామందికి తెలుసు. యూట్యూబ్‌లో ఈ వీడియోకు వచ్చిన క్లిక్స్ ఎన్నో తెలుసా. అక్షరాలా 200 కోట్లు. ఈ వీడియో యూట్యూబ్‌లో పబ్లిష్ చేసినందుకు లభించిన మొత్తమెంతో తెలుసా ? 4 మిలియన్ డాలర్లు...! మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 25 కోట్ల రూపాయలు. వామ్మో అనిపిస్తోందా. అదీ యూట్యూబ్ స్పెషాలిటీ. 

ఎంత ఎక్కువ మంది వీడియోలను చూస్తే... అంత పెద్ద మొత్తం మనకు దక్కుతుంది. ఒక వెయ్యి మంది వీడియోను చూస్తే... 2 డాలర్లు చొప్పున చెల్లిస్తుంది యూట్యూబ్. దీన్నే సీపీఎం(కాస్ట్ పర్ మిల్లీ) అని వ్యవహరిస్తుందీ సంస్థ. మరి అదే యూట్యూబ్ ద్వారా అందరూ సొమ్ము సంపాదించడం ఎలాగో తెలుసుకోవడంతో పాటు... ఈ అంశంపై తాజా డెవలప్‌మెంట్స్ ఏంటో కూడా అవగాహన పెంచుకోవాల్సి ఉంది.

image


77 శాతం పెరిగిన అప్‌లోడ్స్

ఇంటర్నెట్‌లో, మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలోనూ... వీడియో కంటెంట్ ఇప్పుడు విపరీతంగా పెరుగుతోంది. జనాల చేతికి స్మార్ట్‌ఫోన్స్ వచ్చాక... వాటిలో హైక్వాలిటీ కెమేరాలు ఉండడంతో వీడియోలు తీయడం తేలికగా మారిపోయింది. అలాగే 3జీ, వైఫై వంటి ఇంటర్నెట్ సదుపాయాలు పెరగడంతో... టెక్నాలజీ అరచేతిలోకి వచ్చి చేరుతోంది. ఇప్పుడు వీడియోలు తీసి, ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసి షేర్ చేయడం సులువుగా మారిపోయింది. 2006లో 16-34 ఏజ్ గ్రూప్ వ్యక్తుల్లో కేవలం 7 శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో కంటెంట్ అప్‌లోడ్ చేసేవారు. ఇప్పుడా సంఖ్య ఏకంగా 77శాతానికి పెరిగిపోయిందంటే... ఇది ఎంత వైరల్‌గా వ్యాప్తి చెందిందో అర్ధం చేసుకోవచ్చు. 

ఒక్క యూట్యూబ్ సైట్‌నే తీసుకుంటే... ప్రతీ నిమిషానికీ ఇందులో 100 గంటల నిడివి గల వీడియోలు కొత్తగా జతవుతున్నాయి. నెలకు 100 కోట్ల మంది వ్యూయర్స్ ఈ పోర్టల్‌ను విజిట్ చేస్తున్నారు. అలాగే ప్రతీ నెలా 600 గంటల వీడియోలను చూసేస్తున్నారు.


ఆదాయం ఎలా వస్తుంది ?

ఇప్పటివరకూ వీడియోల రూపకర్తలకు ప్రారంభంలో, మధ్యలో వచ్చే యాడ్స్ ద్వారా ఆదాయం లభించేది. అలాగే వీడియో ప్లే అవుతున్న సమయంలో పై భాగంలో టెక్స్ట్ యాడ్స్ దర్శనమిచ్చేవి. ఇప్పుడు టెక్నిక్స్ పెరిగిపోయాయి. మార్కెటింగ్ చేసేవారు... కస్టమర్‌ను చేరుకునేందుకు మరింత మెరుగైన మార్గాలు ఎంచుకుంటున్నారు. డిజిటల్ వీడియో ప్రకటనలపై వెచ్చించే మొత్తం గణనీయంగా పెరుగుతోంది. 2013లో యూట్యూబ్‌లో ప్రదర్శించిన డిజిటల్ వీడియో యాడ్స్ విలువ 4.2 - 4.7 బిలియన్ డాలర్లుగా అంచనా(తన ప్రోడక్టులపై గూగుల్ విడిగా ఆదాయాలను ప్రకటించదు). ఇది 2015 చివరకు 6 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని నిపుణులు అంటున్నారు. మొత్తం గూగుల్ ఆదాయంలో 7 శాతం ఈ వీడియోల ద్వారానే వస్తోంది. ప్రస్తుతం వీడియోల క్వాలిటీ పెరగడంతో... వీటిని సేవ్ చేసేందుకు.. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్... చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.

యూట్యూబ్‌లో కంటెంట్ అప్‌లోడ్ చేసేవారికి... డిజిటల్ అడ్వర్టయిజ్మెంట్ల ద్వారా ఆదాయం వస్తుంది. ప్రకటనదారులు ఇచ్చే మొత్తంలో... 55శాతం వారికి, మిగిలిన 45శాతం గూగుల్‌కు దక్కుతుంది. వీడియోల ద్వారా ఆదాయం ఆర్జించడంలో 3 రకాల విధానాలుంటాయి. అందులో మొదటిది సీపీఎం(వెయ్యి వ్యూస్‌కు చెల్లించడం), సీపీసీ(కాస్ట్ పర్ క్లిక్), సీటీఆర్(క్లిక్ త్రూ రేట్). ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వ్యూయర్లు టైప్ చేసిన కీవర్డ్స్ ఆధారంగా.. యాడ్స్ ప్రకటనదారులు ఇచ్చిన యాడ్స్ ప్రదర్శితమవుతాయి.

image


అసంతృప్తి ఉన్నా అవకాశమున్నది యూట్యూబ్‌లోనే

కంటెంట్ అప్‌లోడ్ చేసేవారిలో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. కారణం గూగుల్ ఈ వీడియోలపై వచ్చే మొత్తంపై భారీగా ఛార్జ్ చేస్తోంది. మొత్తం ఆదాయంలో 45శాతం కంపెనీకే చెందుతుంది. ఏళ్ల తరబడి ఇంతమొత్తాన్ని వసూలు చేస్తున్నా.. యూట్యూబ్ వీడియోలపై వసూలు చేసే మొత్తాన్ని ఇసుమంత కూడా తగ్గించలేదు గూగుల్. అదే ఐట్యూన్స్, గూగుల్ ప్లే స్టోర్లపై వచ్చే ఆదాయంలో అయితే.. కంపెనీలు ఛార్జ్ చేసే మొత్తం 30శాతమే. అయినా సరే యూట్యూబ్ విషయంలో గూగుల్ వెనక్కు తగ్గడం లేదు. కారణం... వీడియో మార్కెట్ విషయంలో గూగుల్‌కు పోటీ ఇచ్చే సంస్థేదీ లేకపోవడమే. ప్రపంచంలోని టాప్5 సైట్లలోనే యూట్యూబ్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. అయితే మొబైల్ యాప్స్ విషయంలో పోటీ ఉన్నట్లుగా... యూట్యూబ్‌కు కాంపిటీషన్ లేదు.

ఛార్జెస్ విషయంలో వెనక్కు తగ్గకపోయినా... వీడియో పబ్లిషర్లకు అదనపు మొత్తం దక్కేలా చేసేందుకు గూగుల్ వీలైనంగా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే వారి ఆదాయం ఎంతగా పెరిగితే... యూట్యూబ్ ద్వారా గూగుల్‌కు లభించే మొత్తం కూడా అంత వేగంగా పెరుగుతుంది. అందుకే యూట్యూబ్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. కొత్త కొత్త టూల్స్ కూడా యాడ్ చేస్తోంది. వ్యూయర్స్‌తో టచ్‌లో ఉండేందుకు గాను... కామెంట్స్, సబ్‌స్క్రయిబ్, ఛానెల్ బ్రాండింగ్, వీడియో ప్రోగ్రామింగ్, యుట్యూబ్ అనలైటిక్స్ వంటివాటిని పరిచయం చేసి, మరింతగా అట్రాక్టివ్‌గా మార్చుతోంది. గతేడాది ఐదో విడ్కాచన్ మీట్లో్ వేల మంది ఫ్యాన్స్, వీడియో క్రియేటర్స్ మధ్య... కొత్త టూల్స్ లాంఛ్ చేసింది యూట్యూబ్. నిధులు అందేందుకుగాను.. కొత్తగా వీడియో పక్కన సపోర్ట్ బటన్ యాడ్ చేసారు. దీని ద్వారా ఆయా వీడియోలు నచ్చినవారు.. ఒకవేళ చెల్లించాలని భావిస్తే గరిష్టంగా 5వందల డాలర్లవరకూ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. కిక్ స్టార్టర్, ఇండీగోగో, పాట్రన్ సహా పలు మార్గాల్లో చెల్లింపులు చేసేందుకు అవకాశమున్న ఈ ఏర్పాటు... వీడియో పబ్లిషర్లకు ఇది కొత్త ఆదాయ మార్గమనే చెప్పాలి.

image


కొత్తకొత్తగా యూట్యూబ్

గేమింగ్ థీమ్ పోర్టల్ ట్విచ్‌తో డీల్ కుదుర్చుకోనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియోలను యూట్యూబ్ పరిచయం చేయనుంది. అంటే.. వీడియోగేమ్స్‌తో సమానమైన ఫ్రేమ్స్... వీడియోల్లోనూ ఉంటాయన్నమాట. దీని ద్వారా వాటి నాణ్యత మరింత పెరగనుంది. అయితే.. వీటి సైజ్ మరింత పెరిగిపోనుండడంతో.. యూట్యూబ్‌కు ఖర్చు కూడా బాగానే పెరుగుతుంది.

వీడియోలు అప్‌లోడ్ చేసేవారి కోసం యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో పేరుతో ఒక యాప్ కూడా ఉంది. మొదట యాండ్రాయిడ్ వెర్షన్ రిలీజ్ చేసిన గూగుల్, తర్వాత ఐఏఎస్ ప్లాట్‌ఫాం వైపు మొగ్గు చూపింది. త్వరలో డెస్క్‌టాప్ వెర్షన్ కూడ తేనున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఉపయోగం కోసం.. రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేని అనేక ఆడియో ట్రాక్స్ కూడా యూట్యూబ్కుి జతయ్యాయి. అలాగే స్పీచ్ రికగ్నిషన్, అటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సబ్‌టైటిల్స్, కాప్షన్స్ ఆధారంగా.. యూజర్లు ఏ భాషలో అయినా ట్రాన్స్‌లేషన్ సబ్మిట్ చేయచ్చు. 'ది యూట్యూబ్ 15'పేరుతో ఇప్పటికే రెండు సార్లు మ్యూజిక్ కౌంట్‌డౌన్ షో కూడా నిర్వహించింది. ఇందులో ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు సంపాదించినవారితోపాటు... అప్‌కమింగ్ స్టార్స్ కూడా పాలు పంచుకున్నారు.

వీడియోలపై కామెంట్ చేయడానికి గూగుల్ ప్లస్‌తో సైన్ఇన్ చేయాలనే నిబంధన విధించింది యూట్యూబ్. ఈ కారణంగా సోషల్ మీడియాలో మరింత ప్రచారం పొందడానికి వీలు కలుగుతుంది. ఇది యూజర్లకు, యూట్యూబ్‌కు మరింత ఆదాయం సంపాదించి పెట్టే ఆలోచనగా చెప్పుకోవచ్చు. అలాగే విమియో లాంటి పోటీదార్లను మరింత వెనకపడేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే యూజర్ ట్రాఫిక్ విషయంలో... యూట్యూబ్‌కు దరిదాపుల్లో ఏ వీడియో సైట్ కూడా లేదనే విషయం మర్చిపోకూడదు. అయితే భారత దేశంలోని యూజర్లకు మానిటైజ్ చేసుకునే సదుపాయం ప్రస్తుతానికి లేదు.