స్టార్టప్స్‌, వినూత్న ఆలోచనలకు ఆంధ్రా సర్కార్ అవార్డులు

0

స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే వారికి గుర్తింపు లభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపి ఇన్నోవేషన్ అవార్డుల కోసం స్టార్టప్స్ నుంచి దరఖాస్తులు కోరుతోంది.

image credit - shutter stock
image credit - shutter stock

రూ. 50 లక్షల లోపు ఆదాయం ఉన్న ఐటి కంపెనీ/ స్టార్టప్ సంస్థలు ఇందుకు అర్హులని, వాళ్లంతా ఏపి ఇన్నోవేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

''విభిన్నమైన ఆలోచనలను, సమాజంలోని కీలక సమస్యలను పరిష్కరించే ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తిస్తుంది. ఇన్నోవేషన్ అవార్డ్ కింద ఎంపికైనా స్టార్టప్స్, కంపెనీలకు లక్ష రూపాయల బహుమతి అందుతుంది'' అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

  • టెక్నాలజీ విభాగంలో - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి), SMAC, సెమీ కండక్టర్ (చిప్, డివైజ్, సిస్టమ్) డిజైన్, గ్రీన్ ఐటి
  • రంగాలు - విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ అక్షరాస్యత, గ్రామీణాభివృద్ధి, స్మార్ట్ సిటీస్, సమగ్ర నీటి నిర్వాహణ, రవాణా రంగం

వీటితో పాటు చిన్న, మధ్యతరగతి సంస్థలు రూపొందించిన ఉత్పత్తులు, పరిష్కారాలను సుమోటో ప్రపోజల్స్‌గా కూడా పంపించవచ్చని సూచించింది.

ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్టప్స్, పారిశ్రామివేత్తలు, ఎంఎస్ఎంఈ సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, ఐటి రంగాలకు చెందిన సదరు కంపెనీలు, వ్యక్తుల వార్షిక ఆదాయం రూ.50 లక్షల నుంచి రూ.25 కోట్ల మధ్య ఉండాలి. అలాంటి కంపెనీలు సుమోటో ప్రపోజల్స్‌ను ఈ క్యాటగిరీ కింద పంపవచ్చని ఐటి శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.

ఇన్నోవేషన్ అవార్డులు, సుమోటో ప్రపోజల్స్ పంపేందుకు అక్టోబర్ 30,2015 వరకూ గడువు ఉంది.

మరింత సమాచారం కోసం http://apit.ap.gov.in/pdf/Notification%20-%20Innovation%20Awwrds.pdf పరిశీలించవచ్చు.