మగువల స్టార్టప్ ఆలోచనలకు ‘స్వయం’ ప్రోత్సాహం

స్టార్టప్ ఆలోచనలు ఉన్న మహిళలకు ప్రోత్సాహం..వ్యాపార మెళకువలతో పాటు మద్దతు..ఫిక్కీ లేడీస్ ఆధ్వర్యంలో మెంటారింగ్..హైదరాబాద్‌లో ప్రారంభమైన సేవలు..

0

కొత్తగా స్టార్టప్ మొదలు పెట్టాలనుకున్న మహిళలకు ఓ శుభవార్త. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఫ్లో) అలాంటి వారికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లోని మహిళా విభాగమే ఈ ఫ్లో. దేశంలోనే మొట్టమొదటిసారి కొద్దిరోజుల క్రితం 'స్వయం' కార్యక్రమం ప్రారంభమైంది. మగువల్లో ఆంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఫ్లో సభ్యులు చెబ్తున్నారు. 

కొత్తగా కంపెనీ మొదలుపెట్టే ఔత్సాహికులకు కావాల్సిన మార్కెటింగ్, బ్రాండింగ్ వ్యూహాలను ఫ్లో చూసుకుంటుంది. MSME ద్వారా ప్రభుత్వ స్కీములు, బ్యాంక్ లోన్స్ లాంటివి ఈ కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేయబోతున్నారు. ఈక్విటీ ఫండింగ్ , ఎమ్ఎస్ ఎంఈలాంటి ప్రభుత్వ స్కీంలు అందేలా తగు తర్ఫీజు ఇవ్వనుంది. స్టార్టప్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాలూ చూసుకునేందుకు ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్లో హైదరాబాద్ చైర్ పర్సన్ రేఖా లహోటి యువర్ స్టోరీకి వివరించారు.

మగువలకే ప్రత్యేకం

“ స్వయం అనేది మగువల కోసం దేశ వ్యాప్తంగా ప్రారంభమైన కార్యక్రమం. మగువలకు కావల్సిన వ్యాపార సలహాలను ఇవ్వడమే కాకుండా కొత్తగా వ్యాపార రంగంలోకి వచ్చేవారికి నేర్చుకొనే అవకాశం కల్పిస్తున్నాం. దీని ద్వారా సామాజికంగా, ఆర్థికంగా మగువలు ఉన్నత స్థాయికి చేరేలా వారిలో ఆంట్రప్రెన్యూర్‌షిప్ పెంపొందేలా చేయడమే మా ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ” అని రేఖ అన్నారు.

హైదరాబాద్‌లో స్వయం కోసం ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ స్టార్టప్‌కు కావల్సిన అవసరాలను అర్థం చేసుకుంటుంది. వీరికి మద్దతుగా FLO ఉంటుంది. సభ్యుల ఆలోచనలను వ్యాపారంగా మార్చే ప్రక్రియను ఈ ప్యానెల్ చేపడుతుంది. ప్రొఫెషనల్‌గా వారి వ్యాపారంలో కుదురుకునేలా చేస్తుంది. ప్యానెల్‌లో ఉన్న సభ్యులంతా వివిధ రంగాల్లో నిపుణలైన వారు ఉన్నారు.

ఎఫ్ఎల్ఓ చైర్ పర్సన్ రేఖా లహోటి
ఎఫ్ఎల్ఓ చైర్ పర్సన్ రేఖా లహోటి

“ మా సలహాలు, సూచనలతో స్టార్టప్ కంపెనీలు విజయపధం వైపు పయనించడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ” అని సుజిని దుండూ అన్నారు. ప్యానెల్ టీంకు హెడ్‌గా సుజినీ వ్యవహరిస్తున్నారు. స్వయంలో సభ్యులుగా చేరి వ్యాపారావకాశాలను వినియోగించుకొని మహిళలు మరింత ముందుకు దూసుకుపోవాలన్నదే తమ అభిమతమని సుజిని వివరించారు.

విద్యార్థుల్లో ప్రోత్సాహం

ఇటీవల కాలేజీ దశ నుంచే స్టార్టప్ మొదలు పెట్టే కల్చర్ మనం చూస్తున్నాం. అందుకే విద్యార్థులను స్టార్టప్ కల్చర్‌ వైపు ప్రోత్సహించేలా అన్ని చర్యలు తీసుకుంటోంది ఫ్లో. స్వయం సభ్యత్వానికి రూ. 1710 రూపాయిలను వసూలు చేస్తున్నారు. అయితే విద్యార్థులకు మాత్రం ఈ రుసుముని రూ. 540రూపాయిలకు కుదించారు. దీంతో స్టార్టప్ మొదలు పెట్టే ఎక్కువ మంది విద్యార్థులు స్వయంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది. అలా విద్యార్థులు ప్రోత్సహించడానికి వీలుపడుతుంది. టర్మ్ లోన్ లేదా వర్కింగ్ క్యాపిటల్ లాంటి ఫైనాన్స్ సేవల్లో కూడా విద్యార్థులకు తగు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.


ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik