పిచ్చివేషాలేస్తే తాట తీస్తారు..!! మ‌హిళా శ‌క్తుల‌ను త‌యారుచేస్తున్న ట్ర‌స్ట్‌ !!

0

ఒక ఘ‌ట‌న‌.. వంద‌ల ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తింది. ఒక సంఘ‌ట‌న‌.. 20వ శ‌తాబ్దంలో కూడా పాత‌రాతియుగ‌పు మ‌నుషుల జాడ‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది. మ‌రోవైపు అదే ఘ‌ట‌న మంట‌గ‌లిసిన మాన‌వ సంబంధాల విలువ‌ను చాటిచెప్పింది కూడా. అప్ప‌టిదాకా మ‌న‌కెందుకులే అనే స‌మాజాన్ని కుదిపికుదిపి నిద్ర‌లేపింది. జ‌నంలో చైత‌న్యం నింపింది. స్ఫూర్తిని ర‌గిలించింది. వారిలో జ‌వ‌స‌త్వాల‌ను నింపింది. 

అర్ధ‌రాత్రి ఢిల్లీ న‌గ‌రం న‌డిబొడ్డున జ‌రిగిన నిర్భ‌య గ్యాంగ్‌రేప్‌. మ‌నం ఎంతగా ప‌త‌న‌మైన విలువ‌ల‌తో బ‌తుకుతున్నామో చూపించింది. ఘ‌ట‌న జ‌రిగి నాలుగేళ్లు దాటుతున్నా కూడా ఇప్ప‌టికీ దాన్ని త‌లుచుకుంటే.. ఆ ఆడ‌పడుచు ప‌డ్డ వేద‌న‌ను గుర్తుచేసుకుంటే.. గుండె ర‌గిలిపోతుంది. మ‌న‌సు కకావికలమవుతుంది. ఇలా ఫీల‌య్యే వాళ్లు ఎంద‌రో.. ఆ ఘోర క‌లిని గుర్తుచేసుకుని బాధ‌ప‌డేవాళ్లు మ‌రెంద‌రో..!

చ‌ట్టాలు చేయాల‌న్నారు. దేశంలో ఆడ‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని గొంతులు చించుకుని అరిచారు. పార్ల‌మెంటులో గంటలు, రోజులపాటు చ‌ర్చ‌లు జ‌రిపారు. కానీ.. దుర‌దృష్ట‌మేమిటంటే అవి చ‌ర్చ‌ల ద‌గ్గ‌రే ఆగిపోయాయి. ఆ రోజు నుంచి ఇవాళ్టి వ‌ర‌కూ.. ఏదో ఒక చోట‌.. న‌గ‌రం న‌డిబొడ్డునో.. పంట‌పొలాల దాపునో.. పాడుబడ్డ బంగళా వెనకాలో.. ఆడ‌వాళ్ల‌పై జ‌రుగుతున్న లైంగిక దాడుల వార్త‌లు.. పేజీల నిండా చ‌దువుతూనే ఉన్నాం. బులెటిన్ల నిండా వింటునే వున్నాం. దేశమంతా అరిచి గీపెట్టినా.. కోర్టులు ప్ర‌భుత్వాల‌ను మంద‌లించినా.. పరిస్థితి ఏం మార‌లేదు. ఏమీ మార‌లేదు! 

అదే మాట ప్రియా వ‌ర‌ద‌రాజ‌న్ దగ్గర అంటే.. ఆమె ఒప్పుకోరుగాక ఒప్పుకోరు. ఎందుకంటే మారలేదు.. మారలేదు అని నెత్తినోరు బాదుకునే బదులు.. ఆ మార్పేదో మ‌ననుంచే వస్తే ఏమవుతుంది అంటారామె. అందుకే ఆ మార్పుకు నాంది తానే కావాలనుకున్నారు. ఏదైనా మ‌న చేతుల్లోకి తీసుకుంటేనే, దానికి స‌మాధానం దొరుకుతుంద‌ని ప‌క్కాగా చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. చేసి చూపిస్తున్నారు. ఎక్క‌డైనా లైంగిక వేధింపుల‌కు గుర‌యితే.. ఎలా స‌మాధానం చెప్పాలో నేర్పుతున్నారు. మ‌హిళ‌ల చైత‌న్య గీతిక అయ్యారు

నిర్భ‌య ఘోర ఉదంతం త‌ర్వాత బెంగ‌ళూరుకు చెందిన 38 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ ప్రియా వ‌ర‌ద‌రాజ‌న్‌.. సొంత‌గా ఒక సంస్ధ‌ను స్ధాపించారు. ప‌బ్లిక్ ప్లేస్‌లు.. ప‌ని ప్ర‌దేశాలు ..ఇలా ఎక్క‌డైనా స‌రే.. లైంగిక దాడుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి మ‌హిళ‌ల‌కు, అమ్మాయిల‌కు ఆత్మ‌స్ధైర్యం క‌ల్పిస్తున్నారు. అందుకు అవ‌స‌ర‌మైన‌వ‌న్నీ స‌మ‌కూరుస్తున్నారు. 2013లో ట్ర‌స్ట్‌గా కార్య‌క‌లాపాలు మొద‌లుపెట్టి.. వ‌ర్క్‌షాప్‌లు కండ‌క్ట్ చేస్తున్నారు. మూడేళ్ల‌కాలంలో చెన్న‌య్‌, బెంగ‌ళూరు, పుణె, ముంబై, జంష‌డ్‌పూర్ న‌గ‌రాల్లో 3వేల మందికిపైగా మ‌హిళ‌ల‌కు ట్రైనింగ్ ఇచ్చారు.

"ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి ముందుగా మ‌హిళ‌లకు నైపుణ్యం ఉండాలి. మొద‌టిసారి నేరం జ‌రిగిన‌పుడే దానికి స‌రైన రీతిలో స‌మాధానం చెప్ప‌గ‌లిగితే..దాని ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. మేం ప‌నిచేసే మ‌హిళ‌ల‌కు ఇదే నేర్పుతాం" అంటారు ప్రియా

ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తుల్లో మ‌హిళ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌స్తోంది దుర్గ పేరుతో న‌డిచే ఈ ట్ర‌స్ట్‌. లీగ‌ల్‌గా కూడా స‌హాయం అందిస్తుంది. రోల్‌ప్లే, ధియేట‌ర్ ఆర్ట్స్‌, సిమ్యులేటెడ్ ల‌ర్నింగ్స్ లాంటి నూత‌న ప‌ద్ధ‌తుల‌తో లైంగిక దాడుల నుంచి ఎలా ర‌క్ష‌ణ పొందాలో మ‌హిళ‌ల‌కు వివ‌రిస్తున్నారు. మూడుగంట‌ల వ‌ర్క్‌షాప్‌కు ఒకొక్క‌రి ద‌గ్గ‌ర్నుంచి రూ.500 వ‌సూలు చేస్తున్నారు. క్యాంపెయిన్ కోసం డోన‌ర్లు ఉన్నారు. నాన్‌ప్రాఫిట్ ట్ర‌స్ట్‌గా ప‌నిచేస్తున్న ఈ ట్ర‌స్ట్‌లో.. తొమ్మ‌ది మంది మ‌హిళ‌లు ప‌నిచేస్తున్నారు. నెల‌కు రెండుసార్లు స్కూళ్లు, కాలేజీలు, హాస్ట‌ల్స్‌, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేష‌న్స్‌, కార్పొరేట్ కంపెనీల్లో వ‌ర్క్‌షాప్‌లు నిర్వ‌హిస్తుంటారు.

"దుర్గ అనేది ఉద్య‌మం. అన్ని ప్ర‌దేశాల్లో త‌మ‌లాంటి మ‌రెంతో మందిని తీర్చిదిద్దుకునేలా మ‌హిళ‌ల‌ను త‌యారుచేస్తాం. నీకు నువ్వే పోలీస్‌గా ఉండేలా.. నీలాంటి స‌మ‌స్య ప‌క్క‌నవారికి వ‌స్తే.. సాయ‌ప‌డేలా ట్రైనింగ్ ఇస్తాం"- ప్రియా

ఐ యామ్ దుర్గా క్యాంపెయిన్‌

ఈ మ‌ధ్య‌కాలంలో వ‌రుస‌గా బెంగ‌ళూరు బ‌స్సుల్లో రేప్‌లు జ‌రిగాయి. అప్పుడే ప్రియా వ‌ర‌ద‌రాజ‌న్‌కు బ‌స్‌ల‌లో దుర్గ అలారం పెట్టాల‌నే ఐడియా వ‌చ్చింది. మహిళపై ఎలాంటి దాడి జ‌రిగినా స‌మాచారం అందించ‌డానికి అది ఉప‌యోగ‌ప‌డుతుంది. గ‌త ఏడాది కాలంలో 5 బీఎంటీసీ బ‌స్సుల్లో దుర్గా అలార‌మ్‌ను ఇన్‌స్టాల్ చేశారు. అయితే, అది అంత ఈజీ కాలేదు. బెంగ‌ళూరు పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీని క‌లిసి.. ఆ త‌ర్వాత వైట్‌ఫీల్డ్ రైజింగ్‌ ద‌గ్గ‌ర్నుంచి ప‌ర్మిష‌న్ తీసుకుని ఈ అలార‌మ్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సి వ‌చ్చింది. పైల‌ట్ ప్రాజెక్ట్ అనుకున్న స‌మయంలో బీఎంటీసీ కూడా పెద్ద‌గా సుముఖ‌త చూప‌లేదు. అన్ని అనుమ‌తులు వ‌చ్చాక‌.. బెంగ‌ళూరులోని ఎం.ఎస్ రామ‌య్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీకి చెందిన కొంత‌మంది స‌హాయంతో ఈ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకువెళ్లారు.

గ‌తంలో డెలాయిట్‌, ఇన్ఫోసిస్‌లాంటి మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీల‌తో ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న ప్రియా..బెంగ‌ళూరులో.. బ్రిటీష్ ప్ర‌భుత్వానికి లైఫ్ సైన్స్ లీడ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

"నా స్ధానం నాకు ద‌క్కింది. నేను దుర్గా అనే క్యాంపెయిన్‌ను ఏడాది మొత్తం నిర్వ‌హించాల‌ని అనుకున్నాం. త‌మ‌కు ఎదురైన స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రించుకున్నామో చెప్పే క‌థల సంక‌ల‌న‌మే ఈ క్యాంపెయిన్‌. కాలేజీ అమ్మాయిలను టార్గెట్ చేసిన ఈ క్యాంపెయిన్‌.. వారిలో చైత‌న్యం నింప‌డానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది."-ప్రియా

BMC స‌హ‌క‌రించ‌క‌పోయినా.. దుర్గ అలారం కాన్సెప్ట్‌కి క‌ర్నాట‌క ర‌వాణా శాఖ మంత్రి నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది, కార్నొరేట్ సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకువెళ్లాల‌ని ట్ర‌స్ట్ భావిస్తోంది. కొంత‌మంది స్టార్ట‌ప్‌ల‌తో క‌లిసి దుర్గా అలార‌మ్‌ని క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా లాంచ్ చేయాల‌ని అనుకుంటున్నారు. టీవీ9 లాంటి సంస్ధ‌లు కూడా ఈ కాన్పెప్ట్‌కు స‌హ‌కారం అందించ‌డానికి ముందుకు వ‌చ్చాయి. చెన్న‌య్‌, ముంబై న‌గ‌రాల్లో కూడా ప్ర‌త్యేక టీమ్‌లు త్వ‌ర‌లో ప‌నిచేస్తాయి.

Related Stories

Stories by Karthik Pavan