గవర్నమెంట్ జాబ్ వదిలేసి మ్యాంగో జ్యూస్ అమ్మాడు.. రూ. 556 కోట్లు సంపాదించాడు !!

గవర్నమెంట్ జాబ్ వదిలేసి మ్యాంగో జ్యూస్ అమ్మాడు.. రూ. 556 కోట్లు సంపాదించాడు !!

Tuesday May 16, 2017,

3 min Read

వారణాసికి చెందిన ధీరేంద్ర సింగ్ ది సాదాసీదా మధ్యతరగతి కుటుంబం. పేరుకే ప్రభుత్వ ఉద్యోగం కానీ సంపాదనలో ఎదుగూబొదుగూ లేదు. వడోదరలో జాబ్ చేస్తున్నప్పుడే మనసులో వ్యాపారం చేయాలనే ఆలోచన మొలకెత్తింది. ఏదైనా ఫుడ్ బిజినెస్, లేదంటే బ్రివరేజెస్ లాంటిది పెట్టాలని మనసులో బలంగా నాటుకుంది.

image


ఏడాదిలోనే వ్యాపారం చేయాలన్న కాంక్ష అంతకంతకూ బలపడింది. ఇదీ సంగతి అని చెప్తే ఇంట్లో వద్దన్నారు. చక్కగా ఉద్యోగం చేసుకోకుండా, మన ఇంటావంటా లేని వ్యాపారాలెందుకు అని ప్రశ్నించారు. కానీ ధీరేంద్ర మనసులో అలా లేదు. అనుకున్నది సాధిస్తాననే నమ్మకం ఉంది. కానీ చేతిలో డబ్బులేదు. ఆస్తిపాస్తులు కూడా పెద్దగా లేవు. అయినా ధైర్యం చేసి అడుగు ముందుకు వేశాడు. ఫ్రెండ్స్ దగ్గరా, తెలిసిన వాళ్ల దగ్గరా అప్పు చేశాడు. అలా మొదలైంది మన్ పసంద్ బ్రివరేజెస్. మామిడిపళ్ల రసాలకు సంబంధించిన జ్యూస్ ఫ్యాక్టరీ. పేరు మ్యాంగో సిప్.

మొదట్లో వారణాసి చుట్టుపక్కల మార్కెట్ మీద మాత్రమే ఫోకస్ చేశాడు. టెట్రా ప్యాకెట్లలో అమ్మే మ్యాంగో జ్యూస్ పట్ల మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. దాంతో ఇక వెనక్కి తిరిగి చూడదలుచుకోలేదు. కొడుకుని రంగంలోకి దించాడు. మూలధనాన్ని కూడా పెంచాడు. ముంబైలో ఒక పాత ప్లాంట్ ఉందని తెలిసి బేరమాడి చేజిక్కుంచుకున్నాడు. అప్పటికే మార్కెట్లో పోటీగా వేరే బ్రాండ్స్ ఉన్నాయి. 

అందుకే ముందుగా యూపీలో పాపులర్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనుకున్నట్టే యూపీలో మ్యాంగోసిప్ పేరు సంపాదించింది. అలా ఉత్తర్ ప్రదేశ్ నుంచి పడిన అడుగు ఇవాళ దేశంలోని 20 రాష్ట్రాల్లో విస్తరించింది. టయర్ టూ, టయర్ త్రీ నగరాల్లో ఆల్రెడీ చొచ్చుకుపోయిన ఫ్రూటీ, జంపిన్ కి పోటీగా నిలిచింది. దాంతో టీం ఎక్స్ పాన్షన్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ పెరిగితే మార్కెట్ ని మరింత దున్నేయొచ్చనేది ప్లాన్. సుమారు 2 లక్షల రిటెయిలర్స్, రెండువేలకు పైగా డిస్ట్రిబ్యూటర్స్, 200పైచిలుకు సూపర్ స్టాకిస్టులతో 24 రాష్ట్రాల్లో మ్యాంగ్ సిప్ విస్తరించింది.

2005లో వడోదరలో సొంత మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 2007లో మరొక ప్లాంట్ అదనంగా స్థాపించారు. కొన్నాళ్లకే ఆ సంఖ్య ఐదుకి చేరింది. వడోదరలో రెండు యూనిట్లుంటే, వారణాసిలో, డెహ్రాడూన్, అంబాలలో ఒక్కో యూనిట్ ఉంది. 2018 నాటికి మరో నాలుగు కొత్త ప్లాంట్స్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో ఒకటి ఏపీలో పెట్టాలన్నది ప్లాన్.

100, 200, 500 మిల్లీలీటర్ల టెట్రా ప్యాకులు, పెట్ బాటిళ్లనే ప్రొడ్యూస్ చేశారు. ఎక్కువ శాతం తోతాపురి మామిడి పళ్లతోనే రసాలు చేస్తారు. ఎందుకంటే మిగతా వాటికంటే అవే కాస్త చవకగా దొరుకుతాయి. పల్పీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏపీ, తమిళనాడు, కర్నాటకలో తోతాపురికి కరువు లేదు.

ఫ్రూట్ ఆధారిత బ్రివరేజ్ మార్కెట్ ప్రస్తుతం 200 మిలియన్ డాలర్లుంది. వచ్చే మూడేళ్లలో అది మరో 15 శాతం పెరుగుతుంది. ప్యాకేజ్డ్ జ్యూస్ మార్కోట్లో డాబర్ 55శాతంతో లీడర్ పొజిషన్లో ఉంది. పెప్సికో మార్కెట్ షేర్ 30 శాతం. మన్ పసంద్ గ్రూప్ నుంచి 2011లో SAIF పార్ట్ నర్స్ 25 శాతం స్టేక్ తీసుకున్నారు.

image


2016 ఆర్ధిక సంవత్సరానికి మన్ పసంద్ వార్షిక టర్నోవర్ రూ. 556 కోట్లు. ఇవాళ మామిడి పళ్ల రసాల మార్కెట్ సెగ్మెంట్లో మ్యాంగో సిప్ వాటా పది శాతం. భవిష్యత్ లో 25 శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతానికి దేశంలోని బెస్ట్ బ్రాండ్స్ లో మ్యాంగో సిప్ నాలుగో స్థానంలో నిలిచింది.

రాబోయే రోజుల్లో దేశీయ, అంతర్జాతీయ కంపెనీలతో కలిసి పనిచేయాలని చూస్తున్నారు. ప్రముఖ ఫుడ్ అండ్ రెస్టారెంట్ చైన్ హావ్మర్ తో టై అప్ పెట్టుకున్నారు. బారిస్టా, బాస్కిన్స్ రాబిన్స్, మెట్రో క్యాష్ అండ్ క్యారీతో పాటు రెండువేల వరకు మాడ్రన్ రిటెయిల్ ఫార్మాట్ స్టోర్లతో కలిసి పనిచేసేందుకు చర్చలు నడుస్తున్నాయి. ఒకపక్క ప్రముఖ సంస్థలతో టై అప్ పెట్టుకుంటూనే, మరోవైపు లోకల్ మార్కెట్ ని కూడా క్యాప్చర్ చేస్తున్నారు.

గవర్నమెంటు ఉద్యోగం.. కడుపులో చల్లకదలని జీవితం.. ఈ లైఫ్ స్టయిల్ కి అలవాటు పడిన వాళ్లు వ్యాపారం జోలికే వెళ్లరు. మనకెందుకు తలనొప్ప అనుకుంటారు. కానీ ధీరేంద్ర సింగ్ అలా ఆలోచించలేదు. మనసులో నాటుకున్న సంకల్ప బలంతో బరిలోకి దూకాడు. అనుకున్నట్టే, 20 ఏళ్లు తిరిగే సరికి వందల కోట్ల సంస్థకు అధిపతి అయ్యాడు. దటీజ్ విల్ పవర్.