సాహిత్య మేరునగధీరుడు ఇక లేడు

0

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. సినారే మృతితో సాహితీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. సినారే మృతి పట్ల సినీ, సాహిత్య, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సినారేగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి 1931 జూలై 29న పూర్వ కరీంనగర్ జిల్లాలోని హనుమాజీ పేట గ్రామంలో జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. సి.నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య వీధిబడిలో సాగింది. బాల్యంలోనే హరికథలు, జానపదాలు, జంగంకథల వైపు ఆయన ఆకర్షితులయ్యారు. కరీంనగర్ లో టెన్త్ చదివారు. హైదరాబాద్ చాదర్ఘాట్ కాలేజీలో ఇంటర్మీడియట్, ఓయూలో బీఏ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ, డాక్టరేట్ పొందారు. అనంతరం సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారు. కొన్నాళ్లు నిజాం కాలేజీలో పాఠాలు చెప్పారు. ఓయూలో ప్రొఫెసర్ గా సేవలందించారు. సినారేది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. సినారేకు నలుగురు కుమార్తెలు.

సినారే కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, సినిమా పాటలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజల్స్ వెలువడ్డాయి. కాలేజీలో ఉన్నప్పుడే శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించారు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు వంటి సాంఘిక నాటకాలు రాశారు. 1953లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సినారె తొలి ప్రచురణ. ఆ వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. 

విశ్వనాథ సత్యనారాయణ తర్వాత తెలుగులో జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన సాహితీకారుడు సినారే. 1988లో విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ్ లభించింది. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. కాకతీయ, ఆంధ్ర, అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సినారె విద్యాపరంగా, పాలనా పరంగా ఎన్నో కీలక పదవులు నిర్వహించారు. 1997లో అప్పటి రాష్ట్రపతి సినారెను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు.

సినారే కవితల్లో విశ్వంభర, మనిషి-చిలక, ముఖాముఖి, భూగోళమంత మనిషి, దృక్పథం, కలం సాక్షిగా, కలిసి నడిచే కలం, కర్పూర వసంత రాయలు, మట్టి మనిషి ఆకాశం, తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయడు, కొనగోటి మీద జీవితం, రెక్కల సంతకాలు, వ్యక్తిత్వం విశేష ఆదరణ పొందాయి. వ్యాసాల్లో పరిణత వాణి, గేయ నాటికల్లో అజంతా సుందరి, వెన్నెల వాడ ప్రసిద్ధిగాంచాయి. అప్పట్లో స్రవంతి సాహిత్య మాసపత్రికను కూడా సినారె నిర్వహించారు. సినారె రాసిన ఒక్కో సినిమా పాట ఒక్కో ఆణిముత్యం. దాదాపు 3 వేల పైచిలుకు పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. 1962లో గులేబకావలి కథతో సినారె సినీ పాటల ప్రస్థానం మొదలైంది. ఆత్మబంధువు, కులగోత్రాలు, రక్తసంబంధం, బందిపోటు, అమర శిల్పి జక్కన్న, గుడి గంటలు, చెల్లెలి కాపురం, గుడి గంటలు, బాల మిత్రుల కథ దగ్గర్నుంచి మొన్నటి అరుంధతి వరకు.. ఒకటేమిటి ఎన్నో సినిమాలకు మధురమైన గీతాలను అందించారు.

సినారె ఏదో ఒక ఇజానికి కట్టుబడకుండా సమకాలీన సంఘటనల పట్ల ప్రేరేపితమయ్యారు. ఒక కవిగా స్పందించి కణకణమండే అభ్యుదయ గేయాలు రచించారు. ఎన్ని యుగాలైనా ఇగిరిపోని కవితా సుమగంధం- సినారె. ఆ అక్షర యోధుడికి టీ న్యూస్ వినమ్రంగా నివాళులు అర్పిస్తోంది.