కూతురు ఆ కోర్టులో జడ్జి.. అదే కోర్టు ఆవరణలో తండ్రి చాయ్‌ వాలా..!!

కూతురు ఆ కోర్టులో జడ్జి.. అదే కోర్టు ఆవరణలో తండ్రి చాయ్‌ వాలా..!!

Friday January 01, 2016,

1 min Read

అందరి గురించి కాదుగానీ- కొంతమంది ఉంటారు! సమాజంలో తమకంటూ ఒక స్థాయి, గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరిగాక- తాము ఎక్కడినుంచి వచ్చామో అక్కడి మూలాలు మరిచిపోతుంటారు! లేకుంటే వాటిని చెరిపేసే ప్రయత్నమైనా చేస్తుంటారు. ఎందుకంటే -పొజిషన్‌ హైలెవల్లో ఉండి.. నేపథ్యమేమో అట్టడుగున ఉంటే -రెండింటికీ మ్యాచ్ కాదని. చెప్పుకుంటే నమూషీగా ఉంటుందని.

image


మీరు చదవబోయే స్టోరీ అందుకు పూర్తిగా భిన్నం. ఒక చాయ్ వాలా కూతురు జడ్జి అయింది. ఇందులో విచిత్రం ఏముంది అనుకోవచ్చు. కానీ- తనతండ్రి టీ అమ్మే కోర్టులోనే ఆమె న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించింది. అదీ విశేషమంటే!

స్మృతి తండ్రి సురీందర్ కుమార్. కొన్నేళ్లుగా జలంధర్ కోర్టు ఆవరణలో టీ కొట్టు నడిపేవాడు. కూతురు గొప్పపేరు సంపాదించాలని ఆరాటపడ్డాడు. పైసా పైసా పొదుపు చేసి చదివించాడు. తండ్రి ఆశయానికి తగ్గట్టుగానే స్మృతి కష్టపడి చదివింది. గురునానక్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేసింది. తర్వాత పటియాలాలోని పంజాబ్ యూనివర్శిటీలో లా చేసింది. పంజాబ్ సివిల్ సర్వీసెస్ (జుడీషియల్) ఎగ్జామ్స్ రాసి సింగిల్ అటెంప్డ్‌ లోనే సక్సెస్ అయింది.ఎస్సీ కేటగిరీలో స్మృతికి ట్యాప్ ర్యాంక్‌ వచ్చింది. వన్ ఇయర్ ట్రైనింగ్. తర్వాత అప్పాయింట్‌ మెంట్ లెటర్. అదికూడా తండ్రి టీ అమ్మే జలంధర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టుకు జడ్జీగా.

నాకు లీగల్ ప్రొఫెషన్ అంటే ఎంతో ఇష్టం. జడ్జిని కావాలనుకున్నాను. అయ్యాను. ఎగ్జామ్స్ కోసం రేయింబవళ్లు కష్టపడ్డాను. ఎస్సీ కేటగిరీలో టాప్ ర్యాంక్ కొట్టాను- స్మృతి

చిన్నప్పుడు ఏ కోర్టు ఆవరణలోకైతే నాన్నకోసం వచ్చేదో- ఇప్పుడు అదే కోర్టుకు న్యాయమూర్తిగా అడుగు పెట్టింది. తండ్రి ఊహించలేదు. కూతురు జడ్జి అవుతుందని- అందునా తాను టీ అమ్మే కోర్టులోకే న్యాయమూర్తిగా అడుగుపెడుతుందని. సురీందర్ ఆనందానికి హద్దుల్లేవు. కూతరుని నల్లకోటులో చూసి ఎంతగా మురిసిపోయాడో. ఆ కోర్టులో పనిచేసే అడ్వకేట్లు, ఇతర సిబ్బంది సురీందర్‌ని గుండెలకు హత్తుకుని మనస్పూర్తిగా అభినందించారు.