అర్నబ్ మళ్లీ వస్తున్నాడోచ్.. ఛానల్ పేరు రిపబ్లిక్

యూపీ ఎలక్షన్ల ముందే రంగంలోకి..

అర్నబ్ మళ్లీ వస్తున్నాడోచ్.. ఛానల్ పేరు రిపబ్లిక్

Saturday December 17, 2016,

2 min Read

ఎవరి పేరు చెప్తే రాజకీయనేతలు హడలిపోతారో..!

ఎవరి పేరు చెప్తే ప్యానెల్ గెస్టులు భయకంపితులవుతారో..!!

ఎవరి పేరు చెప్తే స్టూడియో దడదడలాడిపోతుందో..!!!

అతనే అర్నబ్ గోస్వామి..

నేషన్ వాంట్స్ టు నో అన్న ఒక్క పదం చాలు.. అతని గురించి యావత్ జాతీ చెప్తుంది. ఇష్టపడేవాళ్లు ఇష్టపడతారు. అసహ్యించుకునేవాళ్లు దూరముంటారు. కానీ అతని గురించి మాత్రం పక్కాగా చర్చించుకుంటారు. అదే అర్నబ్ స్పెషాలిటీ. సాదాసీదా డిబేట్ ను దద్దరిల్లిపోయేలా చేయడం ఒక్క అర్నబ్ వల్లనే అవుతుంది. 

బిర్యానీ కంటే దోశ బెటరా అన్న టాపిక్ నుంచి.. నోట్ల కంటే నాణేలు మంచివా అన్న విషయం దాకా.. అనర్ఘళంగా, అలుపులేకుండా, అరిస్తే కరుస్తా అన్న రేంజిలో చర్చ జరిపి, మంటలు రేపి, పొగలు గక్కిస్తాడు. డిబేట్ అంతా వన్ వే ట్రాఫిక్. అడ్డుకుంటాడు. చెప్పనీయడు. దబాయిస్తాడు. అవసరమైతే కడిగిపారేస్తాడు. పానెల్ నుంచి వెళ్లిపొమ్మని నిర్మొహమాటంగా చెప్తాడు. వన్ మినిట్ ప్లీజ్.. లెట్ మీ ఫినిష్.. పదాలు పదేపదే అతని నోటి నుంచి వినిపిస్తాయి. డిబేట్ వస్తున్న టైంకి టీవీ పెడితే వాల్యూమ్ పెంచాల్సిన అవసరం లేదు. ఆటోమేటిగ్గా దానికదే పెరుగుతుంది. దటీజ్ అర్నబ్ మ్యాజిక్.

image


టైమ్స్ నౌ నుంచి వెళ్లిపోయాక అర్నబ్ తర్వాత ఏం చేయబోతున్నాడు అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. బిజినెస్ పెడతాడా.. లేక ఛానల్ స్థాపిస్తాడా.. అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అనుకున్నట్టే తన నెక్స్ట్ వెంచర్ ప్రకటించాడు. కాకపోతే అఫీషియల్ అనౌన్స్ కాదు. త్వరలో ఛానల్ ప్రారంభించబోతున్నా అని చిన్నా చితకా మీడియా ఔట్ లెట్లతో అన్నాడు. రిపబ్లిక్ పేరుతో వస్తున్నా అని వాళ్లతో చెప్పాడు. మొదటగా టెలిగ్రాఫ్ కోల్ కతా, తర్వాత ఎన్డీ టీవీ, అనంతరం టైమ్స్ నౌ. ఇప్పుడు ఫైనల్ గా సొంత వెంచర్- రిపబ్లిక్.

రిపబ్లిక్ అని పేరైతే ఖరారు చేశాడు గానీ, అది ఔట్ అండ్ ఔట్ న్యూస్ ఛానలా.. మరోటా అన్నది కన్ఫమ్ కాలేదు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని మాత్రం లీకులిచ్చాడు. ఒకవేళ అన్నీ అనుకున్న టైంకి పూర్తయితే యూపీ అసెంబ్లీ ఎలక్షన్ల ముందే అర్నబ్ రంగంలోకి దిగడం ఖాయం.

2016 నవంబర్ 1న టైమ్స్ నౌ, దాని సిస్టర్ కంపెనీ ఈటీ నౌ నుంచి అర్నబ్ పూర్తిగా నిష్క్రమించాడు. అప్పటికే తనకంటూ ఒక బ్రాండ్, ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దాదాపు దశాబ్ద కాలంగా ప్రతీరోజూ వాడీవేడిగా సాగిన ప్రైమ్ టైమ్ డిబేట్ న్యూస్ అవర్ లో అర్నబ్ కు కావల్సినంత పేరొచ్చింది. అదీగాక.. ఒక్క ఆ షో నుంచే 60 శాతం యాడ్ రెవెన్యూ కూడా వచ్చేది. మొన్న గమనించే ఉంటారు.. అర్నబ్ ఫేర్ వెల్ వీడియోనే ఎంత వైరల్ గా మారిందో.

వచ్చే రెండు మూడు వారాల్లో పీఆర్ ఏజెన్సీ ఫార్మల్ అనౌన్స్ చేస్తుందని అర్నబ్ తెలిపాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఛానల్ ప్రాథమికంగా ఔటాఫ్ ముంబై ఉంటుందట. ఒక మేజర్ టీవీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఒక పేరుమోసిన అడ్వర్టయిజింగ్ మీడియా ఇందులో భాగస్వాములుగా ఉన్నారని తెలిసింది.