నా విల్ పవరే నన్ను స్టీరింగ్ పట్టేలా చేసింది- తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్ సరిత మనోగతం

నా విల్ పవరే నన్ను స్టీరింగ్ పట్టేలా చేసింది- తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్ సరిత మనోగతం

Sunday March 05, 2017,

4 min Read

సాధారణంగా బస్ డ్రైవింగ్ అంటే కేవలం మగవాళ్లు మాత్రమే చేయగలరన్న భావన సమాజంలో ఉంటుంది. అలాంటి ప్రతికూల అంశాన్ని సైతం అనుకూలంగా మార్చుకుని, మగవారికి ఏమాత్రం తగ్గకుండా రవాణారంగంలో రాణిస్తున్నారు సరిత. ఆమె దేశంలోనే తొలి మహిళా ఆర్టీసీ బస్ డ్రైవర్. ప్రస్తుతం ఢిల్లీలో పనిచేస్తున్న సరిత.. తెలంగాణ ఆర్టీసీకి బదిలీ కావాలని కోరుకుంటున్నారు. మానవీయ కోణంలో ఆలోచించి టీఎస్ ఆర్టీసీలో ఉద్యోగం కల్పిస్తే- మలిసంధ్యలో ఉన్న తల్లిదండ్రులకు దగ్గరగా ఉంటానని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా యువర్ స్టోరీ ఆమెతో ముచ్చటించింది. సీత్యా తండా నుంచి ఢిల్లీ ఆర్టీసీ దాకా సరిత సాగించిన ప్రయాణం ఆమె మాటల్లోనే..

image


మేం ఐదుగురు అక్కా చెల్లెళ్లం. నేను అందరికంటే చిన్నదాన్ని. మాది నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ దగ్గర సీత్యా తండా. 20 గడపలు కూడా లేని చిన్నపాటి తండాలో పుట్టి పెరిగాను. గంపెండంత సంసారం. అందరమూ ఆడపిల్లలమే. కష్టాలను కన్నీళ్ల మధ్య పుట్టాను. ఉన్న కొద్దిపాటి పొలంలో నాన్న వ్యవసాయం చేసేవాడు. వేణ్నీళ్లకు తోడు చన్నీళ్లు అన్నట్టు నేను కుట్టుమిషన్ నేర్చుకుని కుటుంబానికి ఆసరా కావాలనుకున్నాను. నాతోపాటు మా తండా అమ్మాయిలు కూడా నేర్చుకున్నారు. రోజుకి రూ. 20-25 వచ్చేవి. అవి ఏమాత్రం సరిపోయేవి కావు. ఇలాగైతే లాభం లేదని దేవరకొండ వెళ్లాను. అక్కడ అక్క-బావ ఉంటారు. బావ ఆటో నడిపించేవాడు. ఆయన ఆరోగ్యం కూడా ఏమంత బాలేదు. ఆటో నేర్చుకుంటాను బావా అన్నాను. ఆయన సరే అన్నాడు. ముందుగా స్కూటర్ నడపడం నేర్చుకున్నాను. కొంతకాలం తర్వాత ఆటో స్టీరింగ్ చేతికొచ్చింది. పర్ ఫెక్టుగా నడపడం వచ్చాక తిరిగి సొంతూరికి వచ్చాను. సబ్సిడీలో ఆటో కొన్నాను. సంస్థాన్ నారాయణ పూర్ టు చౌటుప్పల్. మూడేళ్లు నడిపించాను. అమ్మాయి ఆటో నడపడం ఏంటని అందరూ వెక్కిరించారు. వెకిలిచూపులు ఈటెల్లా గుచ్చుకునేవి. ప్యాసింజర్లు ఎక్కువగా ఉన్నారని డ్రైవింగ్ సీట్లోనే కొంత ప్లేస్ ఇస్తే చెప్పుకోరాని చోట తడిమేవారు. అసహ్యమేసింది. భరించాను. ఆకలికి ఓర్చుకోవచ్చు. కానీ ఆత్మగౌరవవాన్ని ఓర్చుకోలేం. దానికి దెబ్బ తాకిందంటే బెబ్బులిలా లేవాలి. తండాలో పుట్టి పెరిగిన నాకు సెల్ప్ రెస్పెక్ట్ పాలు కొంచెం ఎక్కువే.

image


అయితే ఎంతకాలం ఇలా ఆటో. హైదరాబాద్ వస్తే ఇంకేమైనా మంచి ఉద్యోగం దొరకుతుందేమో. బంధువులు, తెలిసిన వాళ్లు ఇచ్చిన సలహాతో పట్నం బస్సెక్కాను. కొన్నాళ్లు కారు నడిపాను. ఆ తర్వాత హోలీమేరీ కాలేజీ బస్సు డ్రైవర్ గా అవకాశమొచ్చింది. ట్రయల్ చూసి ఒప్పుకున్నారు. గర్ల్స్ కాలేజీకి బస్సుకి డ్రైవర్ మహిళ అయితే బాగుంటుందని, అందరూ నాకు ఏకగ్రీవంగా ఓటేశారు. అలా బస్సు నడుపుతున్న క్రమంలోనే ఢిల్లీలోని ఆజాద్ ఫౌండేషన్ అనే ఎన్జీవో గురించి తెలిసింది. భానుశ్రీ అనే ఒకావిడ డబ్బులిచ్చి నన్ను ఢిల్లీ పంపారు. అక్కడ నాలాగే యాభై అరవై మంది అమ్మాయిలు డ్రైవింగ్ శిక్షణలో ఉన్నారు. వాళ్లలో బెస్ట్ పెర్ఫామెన్స్ కనపరిస్తే మంచి మంచి సంస్థల్లో ఉద్యోగం వస్తుంది. నేను వాళ్లు పెట్టిన టెస్టులో పాసయ్యాను. ఢిల్లీ ఆర్టీసీ నుంచి అవకాశం వచ్చింది. ఆనందానికి అవధుల్లేవు. ఆర్టీసీలో మొట్టమొదటి మహిళా డ్రైవర్ నేనే అని తెలిసి చాలా సంతోషమేసింది. ఆరు నెలలు రూట్ ట్రైనింగ్ ఇచ్చారు. హిందీ ఇంగ్లీష్ నేర్పించారు. ఫైనల్ టెస్టుకి పది మంది నిలిచారు. అందులో నేను ఒక్కదాన్నే పరీక్ష నెగ్గాను. వాళ్లు హైట్, సైట్ ఇలా రకరకాల సమస్యల మూలంగా ఫెయిలయ్యారు. కానీ వాళ్లు కూడా పాసైతే బాగుండు అనిపించింది.

ఢిల్లీ రోడ్లంటేనే హెవీ ట్రాఫిక్. అలాంటి కంజెస్టెడ్ రూట్లో బస్సు నడిపించాలంటే కష్టం. కానీ నేను చిన్న యాక్సిడెంట్ కూడా కాకుండా బండి నడిపాను. ఆరునెలల్లోనే నా ప్రతిభను మెచ్చుకుని బెస్ట్ లేడీ డ్రైవర్ అవార్డు ఇచ్చారు. ఒకసారి కిరణ్ బేడీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. మరోసారి యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ సన్మానం చేశారు.

ఆర్టీసీలో చేరిన మొదటిరోజు చాలామంది ఎగతాళి చేశారు. మగవాళ్లే తట్టుకోలేని ఈ మోటార్ ఫీల్డ్ నీవల్లేం అవుతుందని నిరుత్సాహపరిచారు. ఇలాంటి మాటలు ఎన్నో విన్నదాన్ని. అందుకే వాళ్ల కామెంట్లను సైడుకి పెట్టాను. ఏదైతే ఆడవాళ్లకు సాధ్యం కాదని మగవాళ్లు అనుకుంటారో, అదే సాధించాలని నేనంటాను. నా విల్ పవరే నన్ను నడిపిస్తుంది.

image


మీకో విషయం తెలుసా? నా బస్ కోసం వెయిట్ చేసే ప్యాసింజర్లున్నారు. ఏ బస్ వచ్చినా ఎక్కకుండా ప్రత్యేకంగా నా కోసమే ఎదురుచూసే అమ్మాయిలు ఎంతోమంది. వాళ్లంతా నేను నీ ఫ్యాన్ అన్నప్పుడల్లా చిన్నపాటి గర్వంలాంటి ఫీలింగ్ మనసుని చుట్టుముడుతుంది. నా బస్ రూట్లో ఎక్కువగా గవర్నమెంట్ ఉద్యోగులే ఉటారు. వాళ్లు నన్ను విష్ చేయందే బస్సెక్కరు. ఒక పెద్దాయనైతే, బస్సులో ఉన్న ప్యాసింజర్లను రిక్వెస్ట్ చేసి మరీ, నాకు రోజూ జ్యూస్ తాగించి వెళ్తాడు.

ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు కలత చెందాను. భయం వేసింది. అంతలోనే నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. రోజుకి 135 కిలోమీటర్లు నడిపిస్తాను. మొత్త డే షిఫ్టే. నైట్ ఉండదు. నా వేషధారణ అబ్బాయిలాగే ఉండటం ఒంటరిగా ఉన్న నాకు కలిసొచ్చింది. చిన్నప్పటి నుంచీ అంతే. మా నాన్న నన్ను మగపిల్లాడిలా పెంచారు. ఒకరకంగా చెప్పాలంటే నా డ్రస్సే నాకు ప్లస్. హెయిర్ కట్ కూడా బాయ్ లా ఉంటుంది. బతుకు సమరంలో ఈ వేషం తప్పదు. నాకూ చీర కట్టుకోవాలనీ, పొడవాటి జెడ వేసుకోవాలనీ, పూలు పెట్టుకోవాలని ఉంటుంది. కానీ పరిస్థితులు నన్నిలా మార్చేశాయి.

ఉద్యోగం హాపీగానే ఉంది. కానీ ఢిల్లీలో శాలరీ సరిపోవడం లేదు. పైగా అమ్మానాన్నను చూసుకోడానికి కుదరడం లేదు. వాళ్ల ఆరోగ్యం బాలేదు. పైగా నేను ఇక్కడికి తరచుగా రావడం కుదరడం లేదు. మూడు నెలలకోసారి వస్తుంటాను. అందుకే శాశ్వతంగా ఇక్కడే ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో, తెలంగాణ ప్రభత్వానికి అర్జీ పెట్టుకున్నారు. టీఆఎస్ ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తే.. అమ్మానాన్నను దగ్గరుండి చూసుకుంటాను. ఈ వయసులో వాళ్లను హాపీగా ఉంచడం కంటే వేరే ఆలోచన లేదు. కూతరు ఒక్కతే కష్టపడుతోందని నేనొచ్చినప్పుడల్లా గుడ్లనీరు తీసుకుంటారు. ఉన్న అరెకరం అమ్మేసి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపో అన్నారు. నేను ససేమిరా అన్నాను. ఇంకా కొన్ని అప్పులున్నాయి. అవి తీర్చాలి. తమ్ముడున్నాడు. వాడిని బాగా చదివించాలి. పెళ్లి ఆలోచన ఇప్పుడప్పుడే లేదు. తెలంగాణ సర్కారు పెద్దమనసుతో ఇక్కడి వచ్చే అవకాశం కల్పిస్తే పెళ్లి చేసుకుంటాను. మహిళలు సాధించలేనిది ఏమీ లేదు.

image


ఎక్కడ నల్గొండ జిల్లా సీత్యా తండా.. ఎక్కడ ఢిల్లీ ఆర్టీసీ. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు. పురుషాధిక్య ప్రపంచంలో ఎదురునిలబడి ప్రశ్నించడమంటే మహిళకు అంత సులువు కాదు. అందునా సరితలాంటి వెనుకడిన సామాజికవర్గం నుంచి వచ్చారంటే ఎన్నో అవమానాలు. అవహేళనలు. ఛీత్కారాలు. వెకిలి చూపులు. బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు. కానీ ఆత్మగౌరవంతో బతకాలంటే మాత్రం నిజంగా ఛాలెంజే. జీవనోపాధి కోసం ఆటో నడిపే మహిళలు చాలామందే ఉన్నారు. వాళ్లంతా అక్కడితోనే ఆగిపోయారు. కానీ సరిత మాత్రం ఆటో నుంచి బస్ దాకా వచ్చారు. సంకల్పబలం ఉండాలేగానీ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేమీ కాదనే సూక్తికి సరితే గొప్ప స్ఫూర్తి.