కూతురి విజయంతో కష్టాలు మరిచిపోయాం !

కూతురి విజయంతో కష్టాలు మరిచిపోయాం !

Thursday May 14, 2015,

7 min Read

యువర్ స్టోరీ ప్రత్యేకం...

ఏడాదిలో వరుసగా రెండోసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన సానియా

ఈ మధ్యే సానియాకు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్...

ట్రావెంట్ ఏజెంట్స్, కన్సల్టెంట్స్, సపోర్ట్ స్టాఫ్ పాత్ర పోషించిన అమ్మానాన్నలు.

ఇమ్రాన్ మీర్జాతో యువర్ స్టోరీ ఇంటర్వ్యూ.


కొంత మంది విజయం కోసం అహర్నిశలూ కష్టపడి ఆపసోపాలు పడ్తుంటే.. మరికొందరికి మాత్రం విజయం వాళ్ల వెంటే పడ్తూ.. వాళ్ల అడుగు జాడల్లో నడుస్తుంది. వాళ్ల ఎదిగిన ఎత్తు నుంచి చూస్తే.. మిగిలిన వాళ్లంతా చాలా కింద కనిపిస్తారు. ఆకాశంలో మెరుస్తున్న అలాంటి నక్షత్రమే ఇప్పుడు టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలుతోంది. మామూలు ప్లేయర్స్ ఇప్పుడు అక్కడికి చేరుకోవడం.. కష్టమే కాదు.. అసాధ్యమని చెప్పడం అతిశయోక్తి కాదేమో ! ఇక మహిళా టెన్నిస్ ప్లేయర్స్ అంత దూరం ఆలోచించడానికి కూడా ధైర్యం చేయరు. అవును మీరు చదువుతున్న ఆ స్టార్.. సానియా మీర్జా. ఇప్పుడు ఆమె భారత దేశ టెన్నిస్‌కే వన్నె తెచ్చిన వనిత. ఇంతటి గొప్ప ఖ్యాతిని తెచ్చుకునేందుకు కొందరి ప్లేయర్లు ఏళ్లకేళ్లు పట్టొచ్చు. కొంత మందికి ఈ విజయం సాధించేలోపు వయసు కూడా అయిపోవచ్చు. కానీ సానియా మాత్రం అతి తక్కువ వయస్సులో ఆ ఖ్యాతి గడించింది. WTA గెలిచిన మొట్టమొదటి భారతీయ మహిళగానే కాదు.. మహిళా టెన్నిస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఆమె సంపాదించుకున్నారు. భారతీయ నారి సానియా మీర్జా.. స్విట్జర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్‌లు ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 జోడీ. డబుల్స్‌లో డబుల్ టైటిల్ ఇప్పుడు వీళ్లద్దరి సొంతమైంది. నెంబర్ ఒన్ కిరీటంతో పాటు ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్‌‌ను రెండుసార్లు గెలిచిన మొదటి ఇండియన్ లేడీ కూడా సానియానే !

image


నేనే నెంబర్  1 !

నేనే నెంబర్ 1 !


మహిళా టెన్నిస్‌లో మెరిసిన ముత్యం

2003లో అంతర్రాష్ట్ర టెన్నిస్‌లో మొదటి విజయం సాధించడం నుంచి ఆమె తన విజయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2003లో జూనియర్ వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ మొదటిది. అదే అంతర్జాతీయ స్థాయిలో అప్పటివరకూ ఆమె అత్యుత్తుమ ప్రదర్శన. అదే ఆమె రాబోయే రోజుల్లో ఆమె సృష్టించబోయే చరిత్రకు బాటలు వేసింది. ఆ తర్వాతి నుంచి ఆమె టెన్నిస్ కోర్ట్‌ క్వీన్‌గా ఒక్కో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోయింది. ఫలితంగా..సింగిల్స్‌లో టాప్ 30 స్థానానికి చేరుకున్న మొదటి భారతీయ మహిళగా పేరుతెచ్చుకుంది. సింగిల్స్‌లో ఇప్పటివరకూ సానియా అత్యుత్తమ ర్యాంక్ 27. 2012లో మిక్స్‌డ్ డబుల్స్‌పై దృష్టిసారించడం మొదలుపెట్టి.. మూడేళ్లలో అందులో నెంబర్ స్థానానికి చేరుకోగలిగింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇప్పటిదాకా 3 గ్రాండ్ శ్లాములు, 27 WTA టైటిల్స్ దక్కించుకుంది. ఈ అత్యుత్తమ ప్రతిభే ఆమెకు 'పద్శశ్రీ'ని, అర్జున అవార్డులను తెచ్చిపెట్టింది. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి మరోసారి చూపిన సానియా ఇప్పుడు దేశంలో ఎంతో మంది మహిళలకు ఆదర్శం. మన దేశంలోనే కాదు ప్రపంచంలోని చాలా మందికి ఆమె రోల్ మోడల్‌గా నిలిచారు.

image


కుటుంబ సభ్యుల ప్రోత్సాహం

తమ పిల్లకు అత్యున్నత స్థాయికి ఎదగాలని, ఇష్టమైన రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ప్రతీ తల్లీదండ్రీ కోరుకుంటారు. విజయం చేరువయ్యేందుకు వాళ్ల కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తప్పనిసరిగా ఉంటుంది. ఒకస్థాయికి వచ్చాక.. అందరూ మేమున్నామని తోడుగా ఉండడం గొప్పదనమేమీకాదు. తమ పిల్లల ఇష్టాఇష్టాలను గమనించి వాళ్ల శక్తియుక్తులను అంచనావేసి.. మొదటి అడుగు నుంచి మేమున్నామని అండగా నిలబడడం చాలా గొప్ప విషయం. ఇప్పటివరకూ సానియా సాధించిన ప్రతీ చిన్నా, పెద్దా, గొప్ప, అత్యుత్తమ, అసాధారణ విజయాల వెనుక ఆమె కుటుంబ సభ్యుల ప్రోత్సాహం పూర్తిస్థాయిలో ఉంది. ముఖ్యంగా సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా, తల్లి నసీమా, చెల్లెలి కృషి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఇంకా చెప్పాలంటే సానియా ఇప్పుడు ఈ స్థాయిలో ఉందీ అంటే అది ముమ్మాటికీ ఆమె తల్లిదండ్రుల కష్టం, అంకితభావం, త్యాగాల ఫలితమే. అంతేకాదు చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే.. సానియా బలం కూడా ఆమె అమ్మానాన్నే.

తండ్రి ఇమ్రాన్ మీర్జా, తల్లి నసీమా, సోదరితో కలిసి సానియా

తండ్రి ఇమ్రాన్ మీర్జా, తల్లి నసీమా, సోదరితో కలిసి సానియా


యువర్ స్టోరీ బృందం సానియా టెన్నిస్ అకాడమీ పరిశీలించి, ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జాతో కాసేపు ముచ్చటించింది. తనలా ఈ టెన్నిస్ ప్రపంచంలో అనేక మంది ఛాంపియన్లుగా తయారు కావాలని, భారత దేశ కీర్తిపతకాన్ని రెపరెపలాడించి.. మరింత వెన్నతీసుకురావాలనే ఉద్దేశంతోనే సానియా.. ఈ అకాడమీ స్థాపించారు.

సానియా పర్యవేక్షణలో  తన టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పిల్లలు

సానియా పర్యవేక్షణలో తన టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న పిల్లలు


అదే సానియా అసెట్

ఈ ఇంటర్వ్యూలో సానియా మీర్జా సక్సెస్ సీక్రెట్స్‌తో పాటు అనేక ఆసక్తికర అంశాలను ఇమ్రాన్ మీర్జా యువర్ స్టోరీతో పంచుకున్నారు. తమ బిడ్డ విజయాలనే.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ముందుకు పోతుంటే.. దేశ ప్రజలతో పాటు తమకూ ఎంతో గర్వకారణంగా ఉందంటున్నారు ఇమ్రాన్. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. సానియాకు ఈ ఆటపై ప్యాషన్ చాలా ఎక్కువ. ఇది ఆమెకు జీవన్మరణ సమస్య లాంటిది. అందుకే తను ఆటలో ఒక్క శాతం కూడా ప్రయత్న లోపం మనకు కనిపించదు. ఈ ఆటలో జీవిస్తేనే మజా ఉంటుంది. సవాల్ ఎంత పెద్దదైతే.. మజా కూడా అదే స్థాయిలో ఉంటుందని సానియాకు తెలుసు. అందుకే పూర్తిస్థాయి ఆనందాన్ని ఆటలోనే తను అనుభవిస్తుంది. సానియాలో ఉన్న మరో గొప్పలక్షణం ఏంటంటే ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా అత్యుత్తమ పనితీరును కనబర్చడం. తాను తెలుసుకున్న విషయం ఏంటంటే.. టెన్నిస్ కోర్టులో ఆడేటప్పుడు.. తనపై ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో.. అదే స్థాయిలో తన ప్రత్యర్థిపై కూడా ఒత్తిడి ఉంటుంది. తాను టెన్షన్‌లో ఉండే విషయాన్ని గ్రహిస్తూనే.. అవతలి వాళ్ల ఒత్తిడిని సొమ్ము చేసుకునే ప్రయత్నాన్ని చేస్తుంది సానియా.

భారత కీర్తిపతాకాన్ని సగర్వంగా మోస్తూ..

భారత కీర్తిపతాకాన్ని సగర్వంగా మోస్తూ..


వివాదాలు ఆమెకు కొత్తేంకాదు

కేవలం టెన్నిస్ కోర్టుల్లోనే ఆమె ఎక్కువ ఇబ్బంది పడింది అనుకుంటే పొరపాటు. నిజజీవితంలో కూడా అనేక సందర్భాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. వాళ్లందరికీ చెంపపగిలే లాంటి సమాధానాలు కూడా ఇచ్చి నోరుమూయించింది. టెన్నిస్ కోర్టుల్లో స్కర్టులు వేసుకుని ఆటడం మొదలు పాకిస్తానీ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిఖ్‌ను పెళ్లి చేసుకోవడం వరకూ చాలా సందర్భాల్లో ఆమె వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. సానియాపై అనేక సందర్భాల్లో ముస్లిం పెద్దలు ఫత్వా కూడా జారీ చేశారు. జెండాకు ఎదురుగా కాలుపెట్టి కూర్చుందని చెప్పడం మొదలు.. చివరకు ఆమె దేశభక్తిపై కూడా ఎన్నో అనుమానాలను రేకెత్తించారు. అంతే కాదు మొన్న ఈ మధ్య ఆమెను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ చేసినప్పుడు కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఎన్నిసార్లు తనపై బురద జల్లే ప్రయత్నాలు జరిగినప్పటికీ తాను ఏ మాత్రం వెరవకుండా, నిబ్బరంగా ఉంటూనే అన్నింటినీ ఎదుర్కొంటూనే వచ్చింది. రోజురోజుకూ మానసికంగా మరింత ధృడమైంది. ఎన్నో కష్టసమయాల్లో కుటుంబ సభ్యులు పూర్తిస్థాయి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తూనే వచ్చారు. తాను ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఉండేందుకు వెన్ను తట్టి ముందుకు నడవమనే చెప్పారు. కుటుంస సభ్యుల ప్రోత్సాహమే లేకపోతే ఆమెకు ఈ రోజు కష్టాలను ఎదుర్కోవడం అలవాటయ్యేది కాదు.

లక్ష్యాలను ఎదుర్కొంటూ...

ముఖ్యమైన విషయం ఏంటంటే.. సానియా టెన్నిస్ బ్యాట్ పట్టినప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొంటూ వస్తోంది. సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా చెప్పేందేంటంటే.. "తాను ఆరేళ్ల వయస్సులో రాకెట్ పట్టుకున్నప్పుడు తనకు కూడా తెలియదు.. తాను ఈ రోజు ఇంత పెద్ద స్టార్ అవుతానని, ప్రపంచ వ్యాప్తంగా తనకో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని. తాను ఆట ప్రారంభించినప్పుడు.. రోల్ మోడల్‌గా చెప్పుకునే వాళ్లు ఎవరూ లేరు. వాళ్లను చూసి ప్రేరణ పొందేందుకు దేశీయ స్థాయిలో ఈ ఆటలో ఏ ఒక్క హీరో కూడా లేడు. కానీ ఈ రోజు భారత్‌ దగ్గర ఓ అత్యద్భుత క్రీడాకారిణి ఉంది. ఆమె ఓ సూపర్ స్టార్. 125 ఏళ్లలో చరిత్రలో టాప్ టెన్నిస్ క్రీడాకారుల సరసన స్థానం సంపాదించిన మొట్టమొదటి మహిళ సానియా .. అంటూ గర్వంగా చెబ్తూ మురిసిపోతారు'' తండ్రి ఇమ్రాన్.

ఇప్పుడు దేశంలోని అమ్మాయిలంతా సానియాను చూసిన తర్వాత YES, I too can do it అనేంత ధైర్యాన్ని తెచ్చుకున్నారని చెప్పొచ్చు అంటారు ఇమ్రాన్.

దేశంలోని ఎంతో మంది ఆడపిల్లలకు సానియా ఇప్పుడో రోల్ మోడల్

దేశంలోని ఎంతో మంది ఆడపిల్లలకు సానియా ఇప్పుడో రోల్ మోడల్


ఆట ప్రారంభం నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ మరిన్ని విషయాలను ఇమ్రాన్ పంచుకున్నారు.

'' మహేష్ భూపతి, లియాండర్ పేస్ తల్లిదండ్రులు ఏం చేశారో నేనూ అదే చేశాను. సంతోషించదగిన విషయం ఏంటంటే మహేశ్, లియాండర్, సానియా కుటుంబాలు క్రీడకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవే. ఆటలతో అందరికీ ప్రత్యక్ష సంబంధమే ఉంది. కానీ నా కుటుంబంతా క్రెకిట్‌ వైపే ఎక్కువగా ఉంది. నా కుటుంబంలోని నలుగురు పేరెన్నికగల క్రికెటర్లే. కానీ సానియా మాత్రం టెన్నిస్ రాకెట్ పట్టుకుంది, దూసుకుపోతోంది '' .

సానియాకు అందిన మెరుగైన శిక్షణలో కొంత మంది వ్యాపారవేత్తల ప్రోత్సాహం, సహకారం ఉంది. మహేష్ భూపతి తండ్రి కృష్ణ భూపతి కూడా అనేక సూచనలు ఇచ్చేవారు. అయితే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆమె తల్లిదండ్రులే కోచ్, మెంటార్ బాధ్యతలు పోషించారు. తాను, తన భార్య పడిన కష్టాన్ని మామూలు మాటల్లో చెప్పలేమంటారు ఇమ్రాన్.

'' మేము సానియా ట్రావెల్ ఏజెంట్, ఆర్థిక సలహాదార్లు, సపోర్టింగ్ స్టాఫ్, ఎయిర్ టికెటింగ్ ఏజెంట్స్, పన్ను సలహాదార్లు.. ఇలా ఒకటేమిటి అనేక బాధ్యతలను మేం పోషించాల్సి వచ్చింది. అనేక విషయాలను ఆమె కంటే ముందు మేము తెలుసుకోవాల్సి వచ్చింది. ఒక సందర్భంలో సానియా ఏడాదికి 20 నుంటి 25 దేశాలు తిరగాల్సి వచ్చింది. అప్పుడు ఆమె టికెటింగ్ మొదలు అనేక విషయాల్లో మేమే ప్లానింగ్ చేయాల్చి వచ్చేది. వీసా, ఫ్లైట్స్, రూం బుకింగ్ కూడా చూసుకునే వాళ్లం. ఒక్కో దేశంలో పన్ను విధానం ఒక్కో రకంగా ఉంటుంది. అక్కడి నిపుణులతో మాట్లాడి పన్ను కట్టడం కూడా మా బాధ్యతే.

తన కూతురు విజయాన్ని ఆస్వాదిస్తూనే మరికొన్ని విషయాలను పంచుకున్నారు ఇమ్రాన్. '' ఇతర ఆటలతో పోలిస్తే టెన్నిస్ కాస్త విభిన్నమైంది. ఇక్కడ ఆటగాళ్లకు అద్భుతమైన సపోర్టింగ్ వ్యవస్థ అవసరం ఉంటుంది. ఈ వ్యవస్థ వల్లే వాళ్లు ఆటపై దృష్టి నిలుపగలరు. పటిష్టమైన నిర్వాహణా వ్యవస్థ లేకపోతే ఆటగాళ్లు బలహీనపడ్తారు ''.

తన అనుభవం ప్రకారం ఏ ఆటగాడికైనా మెరుగైన సపోర్టింగ్ వ్యవస్థను కేవలం తల్లిదండ్రులు మాత్రమే అందివ్వగలరనేది ఇమ్రాన్ అభిప్రాయం.

image


కొత్త ఆటగాళ్లకు సలహా

కేవలం డబ్బు, ఖ్యాతి కోసమే పిల్లలు ఆటల్లోకి రావడం సరైందికాదు. అయితే పిల్లల్లో ప్రతిభ ఉన్నా కూడా కొంతమంది తల్లిదండ్రులు సరైన విధంగా చేయడం లేదని ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. సరైన టోర్నీలు ఎంచుకోవడంలో వాళ్లు విఫలమవుతున్నారనేది ఆయన మాట. ఏదైనా టోర్నీకి వెళ్లమంటే.. ఆ సమయానికి పిల్లల పరీక్షలో, లేకపోతే తల్లిదండ్రుల ఇతర కారణాలు చూపిస్తున్నారు తప్ప.. పూర్తిస్థాయి దృష్టిని కేంద్రీకరించడంలేదంటున్నారు. ఒక టోర్నమెంట్ ఆరు నెలల పాటు మిస్ అయితే.. రాబోయే రోజుల్లో ఆ ఆటగాడిపై ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడం కష్టమనేది ఆయన సలహా.

అంతే కాదు ఆటల ప్రారంభంలో పిల్లలు, తల్లిదండ్రులు చదువుపై మాత్రం అశ్రద్ధ చేయొద్దని సూచిస్తున్నారు. ఒక్కోసారి ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ ఆటనే పూర్తిగా వదిలేయాల్సి రావొచ్చు... ! అప్పుడు పరిస్థితి ఏంటనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే ఒక వేళ ఆటల్లో సక్సెస్ కాలేకపోయినా చదువును మాత్రం అశ్రద్ధ చేయొద్దు.

తల్లిదండ్రులు కూడా పిల్లల ఆటలపై ఎంత వరకూ ఖర్చు చేయగలరో అంతే చేయాలంటారు. కెరీర్ ప్రారంభంలోనే అంతా కుమ్మరించేస్తే.. అవసరమైనప్పుడో, లేక అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడో చేతుల్లో డబ్బులు లేక ఇబ్బందిపడ్తారని హెచ్చరించారు.

'' కేవలం కోచ్‌లపై పిల్లలను వదిలేయడం సరైంది కాదు. పిల్లల కెరీర్‌తో పాటు తల్లిదండ్రులు కూడా పయనించినప్పుడే వాళ్లు పూర్తిస్థాయిలో విజయం సాధించగలరు. నేనో లేదా నా భార్య ఎవరో ఒకరు ఖచ్చితంగా సానియాతో పాటు ప్రతీ టోర్నీలో ఉండే వాళ్లం. టోర్నీల ఎంపిక కూడా చాలా ముఖ్యం. కొన్ని తప్పక ఆడాల్సి వస్తే.. మరికొన్ని మాత్రం కేవలం అనుభవం కోసం ఆడేవి ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది .

వాళ్ల వాళ్ల ఇష్టాలను తల్లిదండ్రులు పిల్లలపై రుద్దకూడదు. పిల్లల ఇష్టాలను గమనించి వారిని సరైన మార్గంలో నడిపించాలి. భారత్‌లో అవకాశాలకు, టాలెంట్‌కు ఏ మాత్రం కొదువ లేదు. ఇక్కడ ఎంతో మందికి ఛాంపియన్లు అయ్యే సత్తా ఉంది. అయితే ఉన్న అవకాశాలన్నింటినీ పరిపూర్ణంగా వాడుకుని సద్వినియోగం చేసుకుంటేనే ప్రయోజనం ఉంటుందనేది '' ఇమ్రాన్ సలహా.

రాష్ట్రపతి చేతుల మీదుగా రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్ అందుకుంటున్న సానియా

రాష్ట్రపతి చేతుల మీదుగా రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్ అందుకుంటున్న సానియా


''కూతురి విజయం ముందు.. అన్ని ఇబ్బందులు చిన్నవిగా కనిపిస్తాయి. కూతురి కష్టంతో పాటు ఆటలపై ఉన్న అభిమానమే మేం కష్టపడేలా చేశాయంటూ ముగించారు''- ఇమ్రాన్ మీర్జా.

ఇమ్రాన్ మీర్జా మాటలు అక్షర సత్యాలు. పిల్లల విజయమే తండ్రికి తరగనంత ఆస్తి. భారత దేశంలో ప్రతీ తల్లీదండ్రీ తమకంటే గొప్పగా తమ పిల్లలను చూడాలని కలలు కంటూ ఉంటారు. ప్రముఖ హిందీ కవి, మధుశాల రచయిత హరివంశరాయ్ బచ్చన్‌ను ఒక సందర్భంలో మీ జీవితంలో మీకు నచ్చిన గొప్ప కవిత ఏంటి అని ఒకరు అడిగారు. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం.. 'అమితాబ్'.

photo credits- https://www.facebook.com/sania.mirza/photos_stream