బియ్యం ఊక, ఎండిన ఆకులతో 500 గ్రామాల్లో విద్యుత్ వెలుగులు

బియ్యం ఊక, ఎండిన ఆకులతో 500 గ్రామాల్లో విద్యుత్ వెలుగులు

Tuesday November 17, 2015,

5 min Read

పది మందికి మంచి చేయాలన్న ఆలోచన ఉంటే చాలు ఎన్ని అడ్డంకులను ఎదుర్కొనైనా వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని నిరూపించారు ఐదుగురు వ్యక్తులు. హిమాలయాల్లో తమ జీవితాన్ని ఆనందంగా గడుపుదామని వచ్చిన ఓ జంట.. స్థానికుల కష్టాలు చూసి కేవలం పైన్ నీడిల్స్‌తో కరెంట్ సృష్టించి ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు న్యూయార్క్ సిటీలో లక్షల కొద్దీ జీతం సంపాదిస్తున్నా.. బీహార్‌లోని తమ మారుమూల పల్లె కరెంటు కష్టాలు తీర్చడానికి తిరిగొచ్చిన ముగ్గురు వ్యక్తులు కేవలం బియ్యం ఊక సాయంతో విద్యుత్ వెలుగులు పూయిస్తున్నారు. హిమాలయాల్లోని ఆ జంటకు, బీహార్ లోని ఈ ముగ్గురు వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఎదుటివారి కష్టాలను తమ కష్టాలుగా భావించారు. అందులో నుంచే ఈ రెండు వినూత్న ఆవిష్కరణలు ఊపిరిపోసుకున్నాయి.

image


ఉత్తరాఖండ్ లో ‘అవని’ వెలుగులు

రజనీష్ జైన్, ఆయన భార్య రష్మి భారతి.. 1996లో ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో సెటిల్ అవుదామని వచ్చారు. అక్కడి పైన్ చెట్ల అందాలను చూసి మురిసిపోయారు. కానీ అవే పైన్ చెట్లు స్థానికుల పాలిట మృత్యుపాశాలవడాన్ని కూడా గమనించారు. అడవుల్లో సహజంగా పుట్టే అగ్నికి పైన్ నీడిల్స్ ఆజ్యం పోశాయి. ఆ అగ్నికీలలు అక్కడి వారి విలువైన ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతున్నాయి. మరోవైపు అవే గ్రామాలు అస్తవ్యస్త విద్యుత్ సరఫరాతో పడుతున్న ఇబ్బందులను కూడా రజ్ నీష్ దంపతులు దగ్గర నుంచి చూశారు. గ్రామీణాభివృద్ధిలోనే తన కెరీర్ వెతుక్కున్న రజనీష్.. వారి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని అప్పుడే నిశ్చయించుకున్నాడు. లక్నో యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన రజనీష్‌కు.. గతంలో పునరుత్పాదక ఇంధనం, సమగ్ర గ్రామీణాభివృద్ధి లాంటి ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవమే ‘అవని’ సంస్థ స్థాపనకు దారితీసింది. ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రజలు ఓవైపు పైన్ నీడిల్స్ (పైన్ చెట్ల ఆకులు), మరోవైపు అస్తవ్యస్త కరెంటు సరఫరాతో పడుతున్న కష్టాలకు ఒకేసారి చెక్ పెట్టాలని రజనీష్ అనుకున్నారు. మొదట్లో సోలార్ విద్యుత్‌తో 25 గ్రామాల్లో కరెంటు కష్టాలు తీర్చారు. అయితే అది వారికి సంతృప్తినివ్వలేదు. ‘మేమేదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. సోలార్ విద్యుత్‌పై ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతున్నా.. క్షేత్రస్థాయిలో అది అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ప్రజలను కూడా వ్యక్తిగతంగా, ఆర్థికంగా భాగస్వాములను చేస్తూ కొత్తగా ఏదైనా మొదలుపెట్టాలని అనుకున్నాం’ అని తమ వినూత్న ఆవిష్కరణ గురించి చెప్పుకొచ్చారు రజనీష్.

image


రెండు సమస్యలు.. ఒకే పరిష్కారం

కొత్తగా చేయాలన్న ఆ ఆలోచనే రెండు సమస్యలకు ఒకే పరిష్కారాన్ని చూపించింది. చెట్ల నుంచి రాలిపడుతూ అడవిలో అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్న పైన్ నీడిల్స్ తోనే ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేయకూడదన్న ఆలోచన ఆ జంటకు కలిగింది. ‘అడవిలో ఉన్న నీరు, పశుగ్రాసం, వనమూలికలు ఈ అగ్ని ప్రమాదాల వల్ల నాశనమవుతున్నాయి. గ్రామీణులు ఎక్కువగా ఆధారపడే వీటిని ఎలాగైనా రక్షించాలని అనుకున్నాం. అప్పుడే మాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా పైన్ నీడిల్స్‌తోనే విద్యుత్తును ఉత్పత్తి చేసే టెక్నాలజీని సృష్టించాం. ఇది గతంలో ఎవరూ చేయని ప్రయోగం. ఇది మాటలకందని అద్భుత ఆవిష్కరణ. మేం దీన్ని సాధించగలమని ఎవరూ ఊహించలేదు’ అని తమ ఆవిష్కరణ గురించి గర్వంగా చెబుతున్నారు రజనీష్. మొదట 9 కిలోవాట్ల విద్యుత్ ప్లాంట్ నెలకొల్పారు. అది విజయవంతమైంది. ఆ వెంటనే 120 కిలోవాట్ల కమర్షియల్ పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. ఇది ఎన్నో విధాలుగా సత్ఫలితాలను ఇచ్చింది. ‘కర్బన ఉద్గారాలను చాలా వరకు తగ్గించగలిగాం. మొదటగా స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడంలో విజయవంతమయ్యాం. ఇక పైన్ నీడిల్స్‌ను ఎప్పటికప్పుడు సేకరించి అడవిలో అగ్ని ప్రమాదాలను నివారించగలిగాం. కిరోసిన్, డీజిల్లాంటి ఖరీదైన, కాలుష్య కారకాలైన ఇంధన వాడకాన్ని తగ్గించగలిగాం’ అని అంటారు. 

ఈ ఆవిష్కరణ వల్ల అగ్ని ప్రమాదాలు తగ్గి అక్కడున్న 7500 మంది రైతులకు మేలు జరిగింది. స్థానికుల సంపాదన కూడా భారీగా పెరిగింది. వారు నెలకు 20 నుంచి 25 వేలకు వరకు సంపాదిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రతిష్ఠాత్మక ఎంఎన్ఏఆర్ ఈజీఏలాంటి పథకాల ద్వారా కూడా సాధ్యం కాని మొత్తం ఇది. ఇక గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత మిగిలిపోయిన బొగ్గును కూడా వంట కోసం ఉపయోగిస్తున్నారు. దీనివల్ల అక్కడి గ్రామస్థులు వంట చెరుకు కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ బొగ్గును సంస్థ వాళ్లే ఇంటింటికీ తిరిగి సరఫరా చేస్తున్నారు. అవని సంస్థ ఆవిష్కరణకు మెచ్చిన అక్యుమెన్ భారీగా నిధులను సమకూర్చింది. వీటి ద్వారా ఒక్కోటి 120 కిలోవాట్ల సామర్థ్యం గల మరో 20 పవర్ ప్లాంట్లను అవని ఏర్పాటు చేస్తోంది. రెండు సమస్యలకు తమ అద్భుత ఆవిష్కరణతో ఒకే పరిష్కారాన్ని కనుగొన్న రజ్ నీష్ దంపతులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

image


బీహార్‌లో బియ్యం ఊకతో కరెంటు

ఉత్తరాఖండ్‌లో రజనీష్ దంపతుల సక్సెస్ స్టోరీ అలా ఉంటే.. అలాంటిదే మరొక ఆవిష్కరణకు బీహార్ కేంద్రమైంది. మనోజ్ సిన్హా అనే వ్యక్తి బియ్యం ఊకతో విద్యుత్‌ను సృష్టించి వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయిన మనోజ్.. ఓ అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో చదివాడు. న్యూయార్క్‌లో లక్షల జీతమిచ్చే పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మామూలుగా మరొకరైతే ఈ జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలంటూ హాయిగా అక్కడే జీవితాంతం గడిపేసేవారు. కానీ మనోజ్ ఇందుకు భిన్నం. బీహార్‌లో తాను పుట్టిపెరిగిన మారుమూల గ్రామం అనుభవిస్తున్న కరెంటు కష్టాలను చూసి అతను చలించిపోయాడు. వెంటనే ఉద్యోగాన్ని వదిలి సొంతూరుకు వచ్చేశాడు. ‘చాలినంత విద్యుత్తును ఉత్పత్తి చేసే పరిస్థితులు మనదేశంలో లేవు. ఇప్పటికీ దేశంలోని లక్షా 25 వేల గ్రామాల్లోని 40 కోట్ల మంది కరెంటుకు నోచుకోవడం లేదు. అందులో 20 శాతం మంది బీహార్‌లోనే ఉన్నారు. 85 శాతం మంది ప్రజలు ఇంకా రాష్ట్రంలోని విద్యుత్ గ్రిడ్‌తో అనుసంధానం కాలేదు. విద్యుత్ కనెక్షన్లు ఉన్న కొంతమంది కూడా సరిగా బిల్లులు చెల్లించకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు కరెంటును నిలిపేస్తున్నారు’ అని బీహార్ లోని కరెంట్ కష్టాలను కళ్లకు కట్టారు మనోజ్ సిన్హా. దీనికి పరిష్కారం కనుగొనాలని అతను భావించాడు. అతనికి జ్ఞానేష్ పాండే, రత్నేష్ యాదవ్ అనే మరో ఇద్దరు వ్యక్తులు జత కలిశారు. పాండే తన సీఈవో పదవికి రాజీనామా చేసి వీరితో కలవడం గమనార్హం. ‘నా జీవితంలో తీసుకున్న కీలకమైన నిర్ణయం ఇది. న్యూయార్క్‌లోనే ఉండి కోట్లు సంపాదించవచ్చు. కానీ పది మందికీ మంచి చేసిన తృప్తితో చనిపోవడానికి మించిన ఆనందం ఇంకేముంటుంది’ అని మనోజ్ అంటాడు. ముగ్గురూ కలిసి విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్నో కొత్త టెక్నాలజీలను ప్రయత్నించి చూశారు. చివరికి గ్యాసిఫికేషన్ ప్రక్రియవైపు మొగ్గు చూపారు. మొదట్లో సోలార్ వైపే చూసినా.. ఖర్చు అధికమవడంతో దాన్ని పక్కనపెట్టేశారు. స్థానికంగా అధికంగా దొరికే వాటితోనే విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని భావించారు. స్థానికులే సొంతంగా నడిపేలా సులువుగా ఉండే ప్లాంట్‌ను నిర్మించాలని నిర్ణయించారు. అప్పుడే వారికి బియ్యం ఊక కంట పడింది. రైసు మిల్లుల నుంచి వ్యర్థంగా బయటికొచ్చే ఆ తవుడునే విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరుగా వినియోగించాలని అనుకున్నారు.

image


అంచనాలను మించి సక్సెస్

ఆ ముగ్గురి ఈ వినూత్న ఆలోచన ఊహకందని రీతిలో విజయవంతమైంది. గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా బియ్యం ఊకతో విద్యుదుత్పత్తిని మొదలుపెట్టారు. అది సత్ఫలితాలను ఇవ్వడంతో ఇప్పుడు ఒక్కోటి 25 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన 84 ప్లాంట్లను వారు నెలకొల్పారు. ఇవన్నీ రోజుకు ఆరు గంటల చొప్పున ఏడాదిలో 340 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేయగలవు. ఒక్కో ప్లాంట్ 400 ఇళ్లకు విద్యుత్‌ను అందిస్తోంది. మొత్తం అన్ని ప్లాంట్‌లు కలిపి 300 గ్రామాల్లోని 2 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపాయి. ఈ ఆవిష్కరణ ఎంతో కాలుష్యానికి కారణమయ్యే 42 వేల లీటర్ల కిరోసిన్, 18 వేల లీటర్ల డీజిల్ వాడకాన్ని తగ్గించింది. 215 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించి వేసింది. తద్వారా గ్రామీణ ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడింది. అందుకే ఈ ఆవిష్కరణకు యూఎన్ ఎఫ్ సీసీసీ సర్టిఫికేషన్ దక్కింది. 

‘మేం ప్రారంభించిన సమయంలో ఇలాంటి మిని గ్రిడ్‌ల గురించి ఎవరూ కనీసం వినలేదు కూడా. ప్రభుత్వం కూడా చేరుకోలేని మారుమూల ప్రాంతాలకు కూడా మేము విద్యుత్‌ను అందించగలిగాం. మేం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. అందుకే ప్రజల్లో మాపై విశ్వాసం పెరిగింది. వాళ్లిప్పుడు కరెంటు బిల్లులు సమయానికి కడుతున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి పది గంటల వరకు 95 శాతం కరెంటు సరఫరా చేస్తున్నాం’ అని మనోజ్ సిన్హా గర్వంగా చెబుతున్నారు. ప్రస్తుతం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కూడా ఖర్చు తగ్గడంతో అందులోనూ వారు అడుగుపెట్టారు. రెండు టెక్నాలజీల సాయంతో స్వచ్ఛమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక సంస్థగా ఎదిగింది. పగటి వేళ సోలార్, రాత్రి వేళ బియ్యం ఊకతో ఉత్పత్తి చేసిన విద్యుత్ 300 గ్రామాల కరెంట్ కష్టాలను తీర్చింది. బియ్యం ఊకలాంటి వ్యర్థంతో విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాదు.. ఆ తర్వాత వచ్చే వ్యర్థంతో కూడా అగర్ బత్తీలను తయారుచేసి ఆశ్చర్యపరుస్తున్నారు ఆ ముగ్గురు వ్యక్తులు. దీనికోసం ప్రతి ప్లాంట్ దగ్గర ప్రత్యేకంగా 50 మంది మహిళలను నియమిస్తున్నారు. వారు ఆ వ్యర్థాలను సేకరించి వాటితో అగర్ బత్తీలను తయారు చేస్తున్నారు. ‘గంగా అగర్ బత్తీ’ పేరుతో వాటిని బస్తీల్లో విక్రయిస్తున్నారు. దీనిద్వారా డబ్బు అర్బన్ ఏరియాల నుంచి రూరల్ ఏరియాలకు తరలివస్తోంది. ఇలా లక్షలు సంపాదించిపెట్టే తమ కెరీర్‌లను వదులుకొని తమ పల్లెల్లో వెలుగులు నింపుతున్న ఆ ముగ్గురు విజయగాథ ఎందరికో స్ఫూర్తిదాయకం. వారి ఆశయం ఓ వినూత్న ఆవిష్కరణకు దారితీయడంతోపాటు వేల మంది కరెంటు కష్టాలను తీర్చింది. మరెంతో మందికి జీవనభృతిని కల్పిస్తోంది.