95 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బామ్మ  

0

పొత్తులు, ఎత్తులు, మలుపులు, హైడ్రామా, అటెన్షన్ మధ్య సాగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరో విచిత్రం జరిగింది. ఆగ్రా జిల్లాలోని ఖెరాగఢ్ అసెంబ్లీ నియోజవకర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ముందుకొచ్చింది 95 ఏళ్ల జల్ దేవి అనే వృద్ధురాలు. ఓటేయడమే కనాకష్టమైన ఆ వయసులో.. ఏకంగా పోటీ చేయడానికే వచ్చిందా బామ్మ.

కొడుకు, లాయర్ సాయంతో చక్రాలకుర్చీలో వచ్చిన ఆమె ను చూసి అధికారులు అవాక్కయ్యారు. వెంటనే ఆమె స్ఫూర్తిని మెచ్చుకుని నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. ఆగ్రాలోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ వేసిన అనంతరం బయటకొచ్చి నవ్వుతూ విక్టరీ సింబల్ చూపించింది.

బహుశ దేశ రాజకీయ చరిత్రలోనే ఇలాంటి నామినేషన్ తొలిసారి కావొచ్చు. అయినా జల్ దేవికి ఎన్నికల్లో నిలబడటం కొత్తేంకాదు. గతంలో పంచాయితీ ఎన్నికల్లో 13వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. అవినీతి మీద పోరాడాలని జల్ దేవి పిలుపునిస్తోంది. హంగూ, ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా ప్రచారం చేస్తానని అంటోంది.

దేశమంతటా నేడు ఓటరు దినోత్సవం జరుపుకున్న వేళ 95 ఏళ్ల బామ్మ చూపిన స్ఫూర్తి ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజాస్వామికవాదులు ఆమె ధైర్యానికి అబ్బురపడ్డారు.

Related Stories

Stories by team ys telugu