చెత్తతో ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు.. సక్సెస్ అయ్యాడు..

చెత్తతో ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు.. సక్సెస్ అయ్యాడు..

Sunday March 20, 2016,

4 min Read


ఏముందీ చెత్తే కదా అని లైట్ తీసుకోకండి. తలచుకుంటే అదీ ఓ బిజినెస్సే. చెత్తను నమ్ముకొని బిజినెస్ లో సక్సెస్ అయిన ఆంట్రప్రెన్యూర్స్ ఎందరో ఉన్నారు. అలాంటివారిలో ఒకరు చితిజ్ అగర్వాల్. 29 ఏళ్ల యువకుడు. తన రెండో స్టార్టప్ గా స్క్రాప్ కలెక్షన్, రీసైక్లింగ్ ని ఎంచుకున్నారు పుణెకు చెందిన ఇంజనీర్ కమ్ ఆంట్రప్రెన్యూర్. దేశాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తనవంతు సాయంగా సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ ను ఎంచుకున్నారు. 

ఆక్సెంచర్, ఐబీఎం లాంటి ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీల్లో పనిచేసిన అనుభవజ్ఞుడు. ఆంట్రప్రెన్యూర్ కావాలన్న కోరిక బలంగా ఉండటమే ఇటువైపు అడుగులు వేసేలా చేసింది. 2013లో పూణెలో ఐటీ సర్వీసెస్ సంస్థ టెకీలా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు అగర్వాల్. కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత లాభాల పంట పండింది. కంపెనీ బాగా నడిచింది. ఇంకేముంది... చితిజ్ కు పూర్తి అనుభవం వచ్చింది. అయినా ఈ యంగ్ ఆంట్రప్రెన్యూర్ లో ఆకలి ఇంకా చావలేదు. అందుకే రెండో స్టార్టప్ కి రిబ్బన్ కట్ చేశారు.

సామాజిక స్పృహ

రెండో స్టార్టప్ అంటే ఎలా ఉంటుందోనని అతడి స్నేహితులు, బంధువులు ఎదురుచూశారు. కానీ ఈసారి ఆయన స్క్రాప్ ని స్టార్టప్ గా ఎంచుకున్నారు. 2015లో స్క్రాపోస్ ప్రారంభించారు. ఇది స్క్రాప్ కలెక్షన్ స్టార్టప్. స్వచ్ఛ్ భారత్ కు ఎంతో కొంత సాయం చేయడమే లక్ష్యంగా మొదలైన స్టార్టప్ ఇది. తొలి స్టార్టప్ టెకీలా ప్రారంభించడానికి ముందే సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ పై ఎన్నో కలలున్నాయి.

తనకున్న సాఫ్ట్ వేర్ స్కిల్స్ తో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పారామీటర్స్ పై వర్క్ చేశారు చితిజ్. ఓ సర్వే కంపెనీ సాయంతో మార్కెట్ స్టడీ చేశారు. ఆర్డినరీ వేస్ట్ తో డబ్బు పుట్టించొచ్చని అర్థమైంది. కానీ స్క్రాప్ డీలర్లు ఏళ్లకేళ్లుగా చేస్తున్నది అదే కదా? మరి కొత్తగా చితిజ్ చేసిందేమిటి అన్న డౌట్ రావచ్చు. అయితే అసంఘటితంగా ఉన్న ఈ రంగం నుంచి కొత్త అవకాశాలను వెతుక్కున్నారు చితిజ్. సాధారణంగా రెసిడెన్షియల్ సొసైటీలు స్క్రాప్ డీలర్లను కాలనీల్లోకి రానివ్వవు. ఎందుకంటే కొంతమంది స్క్రాప్ డీలర్ల నుంచి కాలనీవాసులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. చాలామంది స్క్రాప్ డీలర్లు అన్ని రకాల వేస్ట్ ను తీసుకోరు. సరైన ధర చెల్లించరు. బరువు తూకంలో మోసాలుంటాయి. కానీ వీరి ప్రక్రియంతా సూటిగా ఉంటుంది.

* కస్టమర్లు ఆన్ లైన్ రిక్వెస్ట్ ఫామ్ పూర్తి చేయాలి. ఎప్పుడు, ఎక్కడ స్క్రాప్ సేకరించాలో వివరాలు నమోదు చేయాలి. వీటితో పాటు స్క్రాప్ బరువు ఎంత? స్క్రాప్ లో ఏముంది? లాంటి వివరాలను నమోదు చేయొచ్చు. స్క్రాప్ బరువు ఎంతో తెలిస్తే తగిన పికప్ వాహనాన్ని ఏర్పాటు చేయడం సులువవుతుంది. ఫోన్ కాల్స్, వాట్సప్ నెంబర్ల ద్వారా రిక్వెస్ట్ లు పంపొచ్చు.

* స్క్రాపోస్ తన ఉద్యోగిని స్క్రాప్ కలెక్ట్ చేసేందుకు పంపిస్తుంది. ఎలక్ట్రానిక్ స్కేల్ ద్వారా స్క్రాప్ బరువు తూస్తారు. డబ్బులు చెల్లిస్తారు. కస్టమర్లకు లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ కు తగ్గట్టుగా సరసమైన ధరలు చెల్లిస్తారు. ఆ డబ్బు తీసుకోకుండా పలు ఎన్జీఓలు, క్యాన్సర్ ఆస్పత్రులకు విరాళాలు కూడా ఇవ్వొచ్చు.

వీళ్లతో టై-అప్ చేసుకునే స్క్రాప్ డీలర్లందరికీ పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. కస్టమర్ల దగ్గరకు వెళ్లేప్పుడు ఐడీ కార్డులు తీసుకెళ్తారు. వెరిఫైడ్ స్క్రాప్ కలెక్టర్లను కాలనీల్లోకి అనుమతిచ్చేందుకు రెసిడెన్షియల్ సొసైటీలు ఒప్పుకున్నాయి. ద బెస్ట్ రీసైక్లింగ్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది స్క్రాపోస్. చైతన్యం తీసుకొచ్చేందుకు చితిజ్ తో పాటు స్టార్టప్ టీమ్ కృషి చేస్తోంది. ప్రచారం కోసం ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటోంది. కరపత్రాలను పంచడంతో పాటు ప్రింట్ మీడియాలో ప్రకటనలు ఇస్తోందీ సంస్థ.

సవాళ్లు... కాంపిటీషన్

స్టార్టప్ ప్రారంభించిన కొత్తలో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇళ్ల నుంచి షాప్స్ వరకు చాలామంది స్క్రాపోస్ కు కాల్స్ చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమల నుంచీ చాలా కాల్స్ వచ్చాయి. ముంబై, ఢిల్లీల్లో స్క్రాపోస్ తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. తర్వాత పూణెలోని పీసీఎంసీ ప్రాంతానికి సేవల్ని విస్తరించింది.

"ప్రస్తుతం మాకు సరైన మౌలిక వసతులు లేవు, మ్యాన్ పవర్ లేదు. అందుకే నేరుగా మేమే పికప్స్ చేయట్లేదు. ఎంత సాధ్యమో అంతే ప్రయత్నించాలన్నది మా ఉద్దేశం. మేం ఇప్పుడు పుణె మొత్తం కవర్ చేయాలంటే కనీసం మరో 50 మంది ఉద్యోగులు కావాలి. అది జరగాలంటే మాకు నిధులు రావాలి" -అగర్వాల్.

నిధుల కంటే చితిజ్ ఎదుర్కొంటున్న మరో ప్రధానమైన సవాల్ ఏంటంటే... స్క్రాప్ డీలర్లకు ఐడియా వివరించి, వారితో ఒప్పందం కుదుర్చుకోవడమే. ఇక కాంపిటీషన్ విషయానికొస్తే... ప్రస్తుతం పుణెలో ఎలాంటి కాంపిటీషన్ లేదు. మేం స్థానిక స్క్రాప్ డీలర్లకు సహకరిస్తున్నాం. విన్ విన్ పరిస్థితి అన్నమాట.

image


ఈ రంగం గురించి...

పుణెలో అయితే ప్రస్తుతం ఎలాంటి కాంపిటీషన్ లేదు. కానీ ఇతర నగరాల్లో చాలా స్టార్టప్స్ ఉన్నాయి. ఇలాంటి మోడల్ తోనే పనిచేస్తూ గొప్ప విజయాన్ని అందున్నాయి ఆ స్టార్టప్స్. భోపాల్ కు చెందిన కబాడీవాలా, బెంగళూరుకు చెందిన బిన్ బ్యాగ్, చెన్నైకి చెందిన కబాడీవాలా కనెక్ట్, ఢిల్లీకి చెందిన కబాడీ ఎక్స్ ప్రెస్, జంక్ ఆర్ట్ వేస్ట్ మేనేజ్ మెంట్ స్టార్టప్స్. అయితే వాటితో స్క్రాపోస్ కు ఉన్న తేడా ఏంటంటే... ఐటీ ఇండస్ట్రీలో తనకున్న ఎనిమిదేళ్ల అనుభవాన్ని అసంఘటిత రంగానికి అప్లై చేయడమే అంటారు అగర్వాల్. వేస్ట్ మేనేజ్ మెంట్, రీసైక్లింగ్ రంగం పుంజుకుంటుండటంతో... పెద్దపెద్ద కంపెనీలకు మంచి అవకాశాలున్నాయనే చెప్పాలి. స్క్రాపోస్ ద్వారా కనీసం కొన్ని నగరాలు చెత్తలేకుండా శుభ్రంగా కనిపిస్తాయనుకుంటున్నారు అగర్వాల్.

"గతంలో చేయలేనిది మేమిప్పుడు చేస్తున్నామని కాదు కానీ... క్లీనర్, గ్రీనర్ ఇండియా కోసం మా వంతు సేవలందించడమే మా ప్రధాన ఉద్దేశం. మన దేశాన్ని శుభ్రం చేసేందుకు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా, మేం స్థిరమైన విధానంతో సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నాం" అంటారాయన.

image


భవిష్యత్తులో... కార్పొరేట్స్ తో పాటు ఇండస్ట్రీస్ కు సేవలందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో భారతదేశంలోని పది ప్రధాన నగరాల్లో వన్ స్టాప్ స్క్రాప్ కలెక్షన్ సెంటర్ గా స్క్రాపోస్ కార్యకలాపాలు పెరుగుతాయంటున్నారు చితిజ్.