క్యాష్ లేకపోయినా ఫికర్‌ లేదు కార్డు గీకండి.. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్!

యువర్ స్టోరీతో ప్రత్యేకంగా ముచ్చటించిన ట్రాఫిక్ డీసీపీ అభిషేక్

క్యాష్ లేకపోయినా ఫికర్‌ లేదు కార్డు గీకండి.. బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల బంపర్ ఆఫర్!

Thursday December 08, 2016,

3 min Read


ఆ మధ్య బెంగళూరులో ఉమశ్రీ అనే ఒకావిడ ఇందిరానగర్‌లోని ఓ ఏటీఎం ముందు స్కూటీ పార్క్ చేసి క్యూలో నిలబడింది. కాసేపటి తర్వాత చూసేసరికి బండి కనిపించలేదు. బిత్తరపోయిన వెంటనే లైన్లో నుంచి బయటకొచ్చి వెతికింది. వెహికిల్ ట్రాఫిక్ పోలీసుల దగ్గర కనిపిచింది. అడిగితే నో పార్కింగ్ జోన్‌ ఫైన్ అన్నారు. ఎంత అని అడిగితే రూ. 300 కట్టమన్నారు. అంత డబ్బు ఆవిడ దగ్గర లేదు. పైసల కోసమే ఏటీఎం ముందు నిల్చున్నా అని చెప్పింది. పోలీసులు మాత్రం ఫైన్ కట్టందే బండి ఇవ్వం అని ఖరాకండిగా చెప్పారు. దేవుడా అనుకుంటూ వెళ్లి మళ్లీ క్యూ లైన్లో నిల్చుంది.

కొన్ని గంటల తర్వాత డబ్బులు డ్రా చేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఫైన్ బాపతు డబ్బులు తీసుకొని బండివ్వండి అంటూ రూ. 2వేల నోటు ఇవ్వబోయింది. దెబ్బకే పోలీసాయన అదిరిపడ్డాడు. 300 కోసం రెండు వేల చిల్లర ఎక్కడ తేవాలి అని గదమాయించాడు. ఒకపక్క పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైమవుతోంది. మరోపక్క పోలీసాయన చిల్లర లేదంటున్నాడు. ఏం చేయాలిరా భగవంతుడా అనుకుని భర్తకు ఫోన్ చేసింది. ఆఫీసులో ఎవరి దగ్గరైనా 300 చేబదులు అడిగి అర్జెంటుగా పోలీస్ స్టేషన్‌కు రండి అని చెప్పింది. ఆయన పాపం పనులన్నీ పక్కన పెట్టి ఆగమేఘల మీద చిల్లర పట్టుకొచ్చి బండి విడిపించుకున్నాడు. ఈ తతంగం అంతా పూర్తవడానికి దాదాపు ఐదు గంటలు పట్టింది.

మనీష్ శర్మ కష్టాలు కూడా ఇంచుమించు ఉమశ్రీ లాంటివే. సిగ్నల్ జంప్ చేసినందుకు కారు ఆపి ఫైన్ కట్టమన్నారు. పే చేస్తాగానీ ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులేదు.. క్యాష్ రాగానే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్లోనో లేదంటే ఆన్ లైన్‌లో కడతా అన్నాడు. కానీ వాళ్లు వినే పరిస్థితుల్లో లేరు. ఫైన్ కట్టిన తర్వాతే వెహికల్ తో కదలండి అని కీస్ తీసుకుని జేబులో వేసుకున్నారు. వారితో చాలాసేపు వాదించాడు. కానీ పోలీసులు వినే పొజిషన్లో లేరు. స్పాట్‌లోనే ఫైన్ కట్టాల్సిందే అని భీష్మించుకున్నారు. ఇంటికి నోటీస్ వస్తేనే ఆన్ లైన్లో కట్టాలి.. ఇలా దొరికితే మాత్రం క్యాష్ రూపంలో చెల్లించాల్సిందే అన్నారు. నోట్ల రద్దు ఎఫెక్టుతో శర్మ దగ్గర అప్పటికప్పుడు అంత డబ్బులేదు. గత్యంతరం లేక ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఎలాగోలా అరెంజ్ చేశాడు. ఇదంతా క్లియర్ కావడానికి దాదాపు రెండు గంటలు పట్టింది.

image



ఇలాంటి వరుస కేసులు బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారింది. దాంతో ఒక ఉపాయం ఆలోచించారు. స్పాట్లో క్యాష్ కట్టమని జనాన్ని బలవంతం చేయడం ఎంతోకాలం సాగదని వాళ్లూ ఒక నిర్ణయానొకొచ్చారు. అందుకే కార్డ్ పేమెంట్ కూడా తీసుకోవాలని సిటీ మొత్తం 100 పీవోఎస్‌లను సమకూర్చుకోబోతున్నారు.

ఇదే విషయంపై బెంగళూరు ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ గోయల్ యువర్ స్టోరీతో ముచ్చటించారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నెల రోజులుగా ట్రాఫిక్ పోలీస్ డిపార్టుమెంట్ నగదు సమస్యతో సతమతమైందని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారందరితో వాగ్వాదమే జరిగిందని అన్నారు. పెద్ద నోట్లకు చిల్లర లేక, కార్డు పేమెంట్ అందుబాటులోకి రాక చాలా కష్టపడ్డాం అని తెలిపారు.

క్యాష్ లేదంటే వెహికిల్‌ని కస్టడీలోకి తీసుకోవడం.. పే చేసిన తర్వాత బండి ఇవ్వడం.. గత రెండు వారాలుగా ఇదే రచ్చ. కొందరు ఉద్యోగులు పోలీసుల మీద అరిచిన సందర్భాలూ ఉన్నాయి. ఫ్రెండ్స్, రిలెటివ్స్ దగ్గర 300-500 రూపాయలు అప్పు తీసుకుని బండి విడిపించుకుని పోతున్నారని ట్రాఫిక్ డీసీపీ యువర్ స్టోరీతో చెప్పారు.

దీనికి పరిష్కారంగానే నగర వ్యాప్తంగా వంద పీఓఓస్‌లకు తీసుకొస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారు స్పాట్‌లో దొరికితే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు స్వైప్ చేసి ఫైన్ తీసుకుంటారు. అందుకు అవసరమైన కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసే పనిలో పడ్డారు. రెండు మూడు రోజుల్లో అది ఫినిష్ అవుతుంది. వన్స్ అమల్లోకివస్తే ఆన్ లైన్లో స్పాట్ ట్రాఫిక్ ఫైన్ తీసుకున్న మొట్టమొదటి నగరంగా బెంగళూరు అవతరించనుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులకు పెద్ద రిలీఫ్ దొరుకినట్టవుతుంది. అటు వాహనదారులకూ పేమెంట్ ఈజీ అవుతుంది. మరోవైపు నాసిక్‌లోనూ ట్రాఫిక్ జరిమానా పీఓఎస్‌ ద్వారా తీసుకునేలా పైలట్ ప్రాజెక్టు చేపట్టారు.

అప్పుడిక శర్మ, ఉమశ్రీ లాంటివాళ్లు బాధపడాల్సిన అవసరం లేదంటారు డీసీపీ అభిషేక్ గోయల్. స్వైప్ చేయగానే రెండు రిసీట్లు ఇస్తారు. ఒకటి వాహనదారుడికి. మరొకటి బ్యాంకుకి. ఇందులో ఎలాంటి అక్రమాలకు తావు లేదంటారాయన. మరో రెండు మూడు నెలల తర్వాత ట్రాఫిక్ పోలీసులందరికీ సబ్ ఇన్ స్పెక్టర్ ర్యాంక్ ఇస్తామని చెప్తున్నారు.