25 మంది మహిళా ఆంట్రప్రెన్యూర్ల జీవిత పాఠాలు

Sunday March 06, 2016,

10 min Read


ఏ రంగంలో అయినా మహిళలకు కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఆంట్రప్రెన్యూర్ షిప్ లో కూడా అంతే. పక్షపాతం, భద్రత లేకపోవడంతో పాటు, వృత్తి, ఇల్లు, సంసారం, కుటుంబాన్ని సమతుల్యం చేసుకోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మహిళా ఆంట్రప్రెన్యూర్లు. వారి సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు తెలుసుకోవాలంటే "ఫాలో ఎవ్రీ రెయిన్ బో" పుస్తకం చదివితే చాలు. రచయిత, పరిశోధకురాలు రష్మీ బన్సాల్ రాసిన ఈ పుస్తకం 25 మంది మహిళా ఆంట్రప్రెన్యూర్ల స్ఫూర్తి గాథల సంకలనం.

ప్రేమ, ఓర్పు, సహనం, నవ్వుతో కుటుంబాన్ని, ఇటు కంపెనీని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల విజయగాథల్ని కళ్లముందు ఆవిష్కరించిన పుస్తకమిది. వ్యాపారంలో ముందుకు దూసుకెళ్లడంతో పాటు సమాజసేవలో ముందుంటున్నారు. మహిళా ఆంట్రప్రెన్యూర్లను లక్ష్మి(కుటుంబ సభ్యుల సహాయసహకారాలను పొందిన ఆంట్రప్రెన్యూర్లు), దుర్గ (అవాంతరాలను, కష్టాలను అధిగమించి విజయం కోసం తీవ్రంగా పోరాడిన మహిళలు), సరస్వతి (సొంతగా రాణించిన విద్యావంతులైన మహిళా ఆంట్రప్రెన్యూర్లు)గా వర్గీకరించారని అర్థమవుతుంది.

స్టార్టప్స్ పైన, సోషల్ ఆంట్రప్రెన్యూర్ షిప్ పైన రష్మీ బన్సాల్ చాలా పుస్తకాలే రాశారు. ముంబైలోని సోఫియా కాలేజీ నుంచి, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె రాసిన పుస్తకాల్లో తొలి అడుగులు వేస్తున్న ఆంట్రప్రెన్యూర్ల నుంచి తలపండిన పారిశ్రామికవేత్తల వరకు పరిచయమవుతారు. ఇరవై ఏళ్ల యువతీయువకుల నుంచి ఎనభై ఏళ్ల అనుభవజ్ఞుల సక్సెస్ మంత్ర తెలుస్తుంది. ఐటీ, టెక్స్ టైల్స్, ఫార్మాసూటికల్స్, ఫైనాల్స్, ఆర్ట్, సివిల్ సొసైటీ... ఇలా అన్నీ రంగాలకు చెందిన ఆంట్రప్రెన్యూర్ల గురించి సూటిగా సుత్తిలేకుండా వివరించారు. ఆంట్రప్రెన్యూర్లు కావాలనుకునేవారికి ప్రతీ అధ్యాయంలో పేజీ చివర ఏదో ఒక సందేశం ఉంటుంది. మరి ఆ పాతికమంది మహిళా ఆంట్రప్రెన్యూర్ల గురించి తెలుసుకుందామా..

మీనా బింద్రా: భారతదేశంలో అతిపెద్ద రెడీమేడ్ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ 'బిబా' వ్యవస్థాపకురాలు. ఢిల్లీలో పెరిగిన మీనా... చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. నావల్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకోవడం వల్ల భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. వాళ్ల పిల్లలు పెరిగి పెద్దైన తర్వాత గార్మెంట్స్ బిజినెస్ లో అడుగుపెట్టారామె. స్థానిక బ్లాక్ ప్రింటర్ తో కలిసి ముంబైలో తొలిసారి బ్రాండ్ ను ప్రారంభించారు. ఆ తర్వాత తన సొంత కంపెనీ ద్వారా సొంత ఔట్ లెట్లు మొదలుపెట్టారు. ఆమె కుమారులు కొంతకాలం మేనేజర్లుగా సేవలందించారు.

మంజు భాటియా: లోన్ రికవరీ కంపెనీ అయిన వసూలీ వ్యవస్థాపకురాలు. ఇండోర్ లోని ఓ వ్యాపార కుటుంబంలో జన్మించారు. మొదట్లో ఫార్మా కంపెనీలో రిసెప్షనిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత బ్యాంక్ డీఫాల్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసే అకౌంట్ రికవరీ బిజినెస్ మొదలుపెట్టారు. పురుషాధిక్య రంగమే అయినా ఓర్పు, సహనంతో ఆ రంగంలోని మెళకువలన్నీ నేర్చుకొని విజయవంతంగా కంపెనీని భారతదేశమంతా నిర్వహిస్తున్నారు.

రజ్నీ బెక్టార్: క్రెమికా పేరుతో ఓ పెద్ద ఫుడ్ ఇండస్ట్రీనే నిర్మించారామె. కరాచీలో జన్మించి కుటుంబంతో కలిసి ఢిల్లీకి వచ్చిన రజ్నీ... పిల్లలు బోర్డింగ్ స్కూల్ కు వెళ్లిన తర్వాత ఖాళీగా ఉండలేక.. క్రెమికా అనే ఫుడ్ కంపెనీ ప్రారంభించారు. మెల్లిగా ఆమె చేసే డిసెర్ట్స్ కి మంచి డిమాండ్ వచ్చింది. 1980వ దశకంలో పంజాబ్ లో హింసాత్మక వాతావరణం ఉన్నప్పటికీ మెక్ డోనాల్డ్ లాంటి ప్రముఖ కంపెనీల నుంచి మంచి కాంట్రాక్టులు లభించాయంటే ఆమె అంకితభావమే కారణం.

నిర్మలా కందాల్గవోంకర్ : వర్మీ కంపోస్టింగ్ టూల్ ప్రొవైడర్ అయిన వివం ఆగ్రోటెక్ వ్యవస్థాపకురాలు. మహారాష్ట్రలోని చిన్న పట్టణంలో పుట్టిపెరిగారు. పిల్లలు స్కూలు వయస్సుకు వచ్చిన తర్వాత గ్రామంలోనే సొంతగా సంస్థను ప్రారంభించారు. సైన్స్ డిగ్రీ చేసిన నిర్మల... వానపాముల ద్వారా ఎరువులను తయారు చేయడం మొదలుపెట్టారు. ప్రమోషన్, శిక్షణ కోసం వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రగతి మైదాన్ ఎగ్జిబిషన్ ద్వారా ప్రభుత్వం నుంచి సాయం అందింది. టై అవార్డు కూడా లభించింది. ప్రస్తుతం ఈ కంపెనీ కార్పొరేట్, స్వయం సహాయక బృందాలతో కలిసి బయో గ్యాస్ ఉత్పత్తుల తయారుచేస్తోంది.

రంజన నాయక్: స్వాన్ సూట్స్ వ్యవస్థాపకురాలు. ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ... పీఆర్, టెలీ మార్కెటింగ్ పై ఆసక్తి పెంచుకున్నారు. ఐటీ బూమ్ రావడంతో అదృష్టం కలిసొచ్చింది. సర్వీస్డ్ అకామడేషన్ బిజినెస్ లో అడుగుపెట్టారు. సర్వీస్డ్ అపార్ట్ మెంట్ రంగంలో తాజ్ స్థాయికి ఎదగాలన్నది ఆమె లక్ష్యం. ఆన్ లైన్ ఫోరమ్స్ ద్వారా ఆంట్రప్రెన్యూర్లతో పరిచయాలు పెంచుకున్నారు. నిరంతర మార్కెట్ పరిశోధన ఎంత అవసరం అన్నది ఐఎస్బీ కోర్సు నేర్పించింది. తన భర్త కూడా ఈ కంపెనీలో చేరాడు.

లీలా బోర్డియా: కోల్ కతాలో పెరిగిన లీలా... కుడ్య కళాఖండాల సంస్థ 'నీరజ్ ఇంటర్నేషనల్' వ్యవస్థాపకురాలు. స్వస్థలమైన రాజస్తాన్ లోని కుమ్మరివాళ్లకు ఉపాధిని అందించేందుకు సోషల్ ఎంటర్ ప్రైజ్ ను ప్రారంభించాలని నిర్ణించుకున్నారు. ఫ్రాన్స్ కు చెందిన కొనుగోలుదారులను, మెక్సికోలో వేర్వేరు కళాకారులను కలిసిన తర్వాత నాణ్యత ప్రాముఖ్యత ఏంటో తెలిసొచ్చిందామెకు. ఫర్నీచర్, కుడ్య కళాఖండాలు, ఇతర పరికరాలను తయారుచేసి అమ్ముతూ... తన బ్రాండ్ ను విదేశాలకు పరిచయం చేస్తున్నారు. ఆమె ముగ్గురు తనయులు కూడా ఇదే సంస్థలో పనిచేస్తున్నారు.

హన్ క్వి హువా : చైనాలో గువాన్ గ్జో గువాన్యి గార్మెంట్స్ వ్యవస్థాపకురాలు. టీనేజర్ గా ఉన్నప్పుడే బైకుపై గ్రామాల్లో తిరుగుతూ కేకులు అమ్మేవారు. మొత్తం స్కాక్ అమ్మాలన్న లక్ష్యం పెట్టుకున్న ధృడసంకల్పం ఆమెది. ఆ తర్వాత టెక్స్టైల్ బిజినెస్ కి మంచి బూమ్ ఉన్న సమయంలో భర్తతో కలిసి ఈ వ్యాపారంలో అడుగుపెట్టారు. అసలు రిటైర్ అవ్వాలన్న ఆలోచన తనకు లేదంటారామె.

ప్రేమలతా అగర్వాల్: జంషెడ్ పూర్ కు చెందిన ప్రేమలతా పర్వతారోహకురాలు. 48 ఏళ్ల వయస్సులో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించారు. భారతదేశంలో ఈ ఫీట్ సాధించిన పెద్ద వయస్కురాలిగా రికార్డు సాధించారు. కూతుళ్లను టెన్నిస్ క్లాసులకు తీసుకెళ్లి ఈమె జిమ్ కు వెళ్లేవారు. ప్రముఖ పర్వతారోహకురాలు బచేంద్రీ పాల్ శిక్షణలో హైకింగ్ కాంపిటీషన్ లో ప్రైజ్ కూడా గెలుచుకున్నారు. కఠినమైన వాతావరణ పరిస్థితులున్నా శిఖరాన్ని అధిరోహించారు. మరిన్ని శిఖరాలు అధిరోహించాలన్న లక్ష్యంతో కసరత్తు చేస్తున్నారు.

పరు జయక్రిష్ణ: కెమికల్ దిగ్గజం అసాహి సాంగ్వాన్ వ్యవస్థాపకురాలు. అహ్మదాబాద్ లోని జైన కుటుంబంలో పెరిగారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన దురదృష్టవంతురాలు. ప్రముఖ వ్యాపారి తనయుడిని పెళ్లిచేసుకున్న తర్వాత ట్రావెల్, కన్ స్ట్రక్షన్ బిజినెస్ లో అడుగుపెట్టారు. తర్వాత కెమికల్స్ రంగంలోకి అడుగుపెట్టారు. కొరియన్, జపనీస్, తైవనీస్ కంపెనీల నుంచి మంచి డీల్స్ వచ్చాయి.

పట్రికియ నారాయణ: 19 ఏళ్ల వయస్సులోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ ప్రేమలో గెలిచి జీవితంలో ఓడిపోయారు. భర్త మద్యానికి బానిసవడంతో వైవాహిక జీవితం చిక్కుల్లో పడింది. కాలేజ్ డ్రాపవుట్ అయినా... వంటల్లో తనకున్న ప్రావీణ్యతతో చెన్నైలో కేటరింగ్ బిజినెస్ లో అడుగుపెట్టారు. చెన్నై నగరంలో, పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల నుంచి మంచి కాంట్రాక్టులు లభించాయి. "ఒక్కసారి మీరు మీ పనిని ఇష్టపడటం మొదలుపెడితే ఎప్పటికీ అలసిపోరు" అంటారామె. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పోర్ట్ మేనేజ్ మెంట్ తో ఒప్పందం కుదరడం ద్వారా సక్సెస్ లభించింది. విడాకులు, రోడ్డు ప్రమాదంలో కూతుర్ని కోల్పోవడం లాంటి విషాద ఘటనలు జరిగినా ఆమెను కుంగదీయలేదు. నాలుగు బ్రాండ్లతో కేటరింగ్ ను నడిపిస్తున్నారు. ఫిక్కీ అవార్డును సాధించారు.

సుదేశ్మ బెనర్జీ: కోల్ కతాలో టీచర్ గా కెరీర్ మొదలుపెట్టారు సుదేశ్మ. కొంతకాలానికి తన స్నేహితురాలితో తన భర్తకు అఫైర్ ఉందని తెలిసింది. వైవాహిక జీవితం నుంచి తప్పుకొని ఆటోక్యాడ్ ట్రైనింగ్ కంపెనీలో చేరారు. తర్వాత సొంతగా డిజీటెక్ హెచ్ఆర్ కంపెనీని ప్రారంభించారు. ఒంటరి మహిళ కావడంతో ఇల్లు అద్దెకు దొరకడం కూడా కష్టమైంది. బిజినెస్ లో పురుషాధిక్యత ఇబ్బందిపెట్టింది. అయినా ఆమె బాధపడలేదు. శ్రీలంక, దుబాయి, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి ప్రాజెక్టులు సాధించి తన సత్తా చాటారు.

జాసు శిల్పి: భారతదేశంలోని అతికొద్దిమంది మహిళా శిల్పుల్లో ఒకరు. అహ్మదాబాద్ లోని ఆంట్రప్రెన్యూరల్ కుటుంబంలో పుట్టి పెరిగారు. స్కూలు రోజుల నుంచే కళలంటే ఆసక్తి. గ్వాలియర్ లో ఝాన్సీ రాణి విగ్రహం నుంచి స్ఫూర్తి పొంది శిల్పిగా మారారు. ఓ ముస్లిం కళాకారుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విగ్రహాల కోసం ప్రభుత్వ టెండర్లు సంపాదించగలిగారు. ఆ తర్వాత గుజరాత్ లో చాలా డీల్స్ కుదిరాయి. శివాజీ, హనుమాన్ విగ్రహాలు తయారు చేయడం, యూఎస్ టూర్ వెళ్లడం గర్వించే విషయాలంటారామె.

దీపాలీ సికంద్: లెస్ కాన్సియర్ వ్యవస్థాపకురాలు. కోల్ కతాలో పెరిగారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నా... ఆ తర్వాత హెచ్ఆర్ రంగంలోకి వెళ్లారు. దురదృష్టవశాత్తూ తన వైవాహిక జీవితంలో చేదు అనుభవాలు మిగిలాయి. ఎలాంటి ఆర్థిక మద్దతు లేకుండా ఓ బిడ్డతో రోడ్డున పడింది. అయినా ఆమెలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. బెంగళూరు లాంటి నగరాల్లో హెచ్ఆర్ అసైన్ మెంట్ల కోసం తిరిగారు. ఐటీ కంపెనీల్లో బిజీగా ఉండే మేనేజర్లకు వ్యక్తిగత సహాయకుల సేవలు అవసరం అని గుర్తించింది. విప్రో, ఐబీఎం లాంటి సంస్థల నుంచి మంచి ఒప్పందాలు లభించాయి. ఇందిరానగర్ లో కైరా పేరుతో మ్యూజిక్ అండ్ డైనింగ్ వెన్యూని ప్రారంభించారు.

బీణాపాణి టలూద్కర్: పాన్సీ ఎక్స్ పోర్ట్స్ వ్యవస్థాపకురాలు. అస్సాంలో పెరిగిన బీణాపాణి చేతివృత్తుల కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచారు. స్వతహాగా అలంకరణ వస్తువులను తయారు చేస్తూ... గార్మెంట్ డిజైన్ చదివారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కూల్ ప్రారంభించారు. కానీ పిల్లల బాగోగుల కోసమని ఆమె భర్త ఒత్తిడి చేయడంతో స్కూల్ మూతపడింది. కానీ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్ పోర్ట్ కంపెనీని మాత్రం ఆపలేదు.

ఇలా భట్: సూరత్ లో పెరిగిన ఇలా భట్... సేవా సంస్థ వ్యవస్థాపకురాలు. 17 లక్షల మంది స్వయం ఉపాధి పొందిన మహిళలతో అతిపెద్ద నెట్ వర్క్ ఇది. టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ లో చేరిన ఇలా భట్... టెక్స్ టైల్ వర్కర్ తనయుడిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి మొదట్లో ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అనధికార రంగంలో స్వయం ఉపాధి పొందుతున్న మహిళల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఈ సంస్థ ద్వారా పలుమార్లు విదేశాల్లో పర్యటించారు. ఈ మహిళల సమస్యల్ని అంతర్జాతీయ వేదికపై చర్చించారు. దళిత్ రిజర్వేషన్ వివాదంతో టెక్స్ టైల్ లేబర్ అసోసియేషన్ నుంచి సేవా సంస్థ వైదొలగాల్సి వచ్చినప్పుడు కష్టాలను అవకాశాలుగా మల్చుకున్నారామె. మళ్లీ సంస్థను ప్రారంభించి సహకార, సూక్ష్మ రుణాల్లో మద్దతుగా నిలిచారు. ఆమె సేవలకు గుర్తుగా మెగసెసె అవార్డుతో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి.

షోనా మెక్ డోనాల్డ్: షోనాక్విప్ వీల్ చైర్ కంపెనీ ఫౌండర్. సౌతాఫ్రికాలో పెరిగారామె. దురదృష్టవశాత్తు తనకు పుట్టిన బిడ్డ అవిటిది. అలా సొంతబిడ్డ కోసం ప్రత్యేక వీల్ చైర్లు డిజైన్ చేసి.. తర్వాత స్పెషల్ వీల్ చైర్లతో సోషల్ ఎంటర్ ప్రైజ్ ప్రారంభించారు. నిధులు సేకరించడంలో, వ్యాపారాన్ని నిర్వహించడంలో ఇబ్బందులు తలెత్తాయి. సామాజిక ప్రయోజనంతో వ్యాపారం చేయడం వల్ల లాభాలు గడించడం కష్టమైంది.

నీనా లేఖి: బ్యాగ్ రీటైల్ బ్రాండ్ అయిన బ్యాగిట్ వ్యవస్థాపకురాలు. ముంబైలోని సోఫియా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిగా ఉన్నప్పుడే సొంతగా వెంచర్ ను ప్రారంభించారు. మొదటి సంవత్సరం పెద్దగా పట్టించుకోకపోయినా రెండో సంవత్సరంలో వెంచర్ ను చక్కగా తీర్చిదిద్దారు. 18 ఏళ్ల వయస్సులో ఓ రగ్ స్టోర్ లో పార్ట్ టైమ్ జాబ్ చేసిన నీనా... 'బ్యాగ్స్ విత్ యాటిట్యూడ్' స్లోగన్ తో 'బ్యాగిట్' బ్రాండ్ ని ప్రారంభించారు. కాన్వాస్ తో మొదలుపెట్టిన నీనా... తర్వాత సింథటిక్ లెదర్ తో బ్యాగులు తయారు చేశారు. ఒక్క షాపుతో ప్రారంభించి దేశవ్యాప్తంగా చెయిన్ నిర్వహిస్తున్నారు.

సంగీత పత్నీ: నాగ్ పూర్ లో పెరిగిన సంగీత బిట్స్ పిలానీ నుంచి గ్రాడ్యుయేట్. హెచ్ఎల్ఎల్, ఐషర్ లో పనిచేశారు. తనకున్న ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్, ఐటీ నైపుణ్యాలు, ఈఆర్పీ సాఫ్ట్ వేర్ సాయంతో... ఎక్స్ టెన్షన్ సాఫ్ట్ వేర్ ప్రారంభించారు. తర్వాత పిల్లల కోసం బెంగళూరుకు వెళ్లారు.

సత్య వడ్లమాని: మూర్తి క్రిష్ణ ఫార్మా కంపెనీ వ్యవస్థాపకురాలు. ఐఐటీ ముంబై క్యాంపస్ నుంచి వచ్చిన సత్య... ఇంటర్నేషనల్ కెమికల్స్ మార్కెటింగ్ ను ప్రారంభించారు. ఇందుకు ఆమె మామగారు మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఆమెకు మద్దతుగా నిలిచారాయన. కుటుంబంతో గడిపేందుకు సమయం దొరక్కపోవడంతో బయోకెమ్ సినర్జీలో ఉద్యోగాన్ని వదులుకుని సొంతగా కంపెనీని ప్రారంభించారు. 2008 లో మాంద్యం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

శిఖా శర్మ: ఢిల్లీలో పెరిగి మెడిసిన్ చదివిన శిఖా... న్యూట్రీహెల్త్ సిస్టమ్స్ పేరుతో వెయిట్ లాస్ క్లాసెస్ సంస్థను ప్రారంభించారు. భారతదేశంలో తక్కువగా కనిపించే ప్రివెంటీవ్ హెల్త్ కేర్ అండ్ రిహాబిలిటేషన్ పై ఆసక్తి పెంచుకున్నారు. పెళ్లి చేసుకోవాలా, విదేశాలకు వెళ్లాలా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు వెయిట్ లాస్ క్లినిక్ ఆలోచన వచ్చింది. ఇది పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఓ హాస్పిటల్ లో రెంటల్ యూనిట్ ప్రారంభించారు. ఈ మోడల్ సక్సెస్ కావడంతో న్యూట్రీషియనిస్టులను నియమించున్నారు. ఆయుర్వేదిక్ పద్ధతులు పాటించారు. ఓసారి ప్రధానమంత్రికి ట్రీట్మెంట్ చేసే అవకాశం రావడం గర్వించదగ్గ విషయం అంటారామె.

దీప సోమన్: ల్యూమియర్ బిజినెస్ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలు. ముంబైలోని హిందుస్తాన్ లీవర్ తో కెరీర్ మొదలుపెట్టారు. ఆమె తండ్రి మీడియాలో ఉండటం వల్ల ఎక్కువగా చదవడం, విశ్లేషణ, పరిశోధనలపై ఆసక్తి పెంచుకున్నారు. హిందుస్తాన్ లీవర్ లో జాబ్ తర్వాత భర్తకు ఐటీ కంపెనీలో ఆఫర్ రావడంతో జమైకాకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ప్రారంభంతో ఇండియాకు వచ్చారు. తర్వాత ఆమె భర్త కూడా వచ్చి చేరడంతో ఐటీ ప్రపంచంలో తమదైన ముద్ర వేశారు.

ఒటారా గుణవర్దనె: శ్రీలంకకు చెందిన ప్రముఖ డిపార్ట్ మెంటల్ స్టోర్ చెయిన్ 'ఓడెల్' వ్యవస్థాపకురాలు. కొలంబోలో పుట్టి పెరిగిన ఈవిడ... శ్రీలంకలోనే తొలి మహిళా ఆంట్రప్రెన్యూర్ గా పేరు తెచ్చుకున్నారు. అథ్లెట్ కూడా. బయాలజీ ప్రోగ్రామ్ కోసం యూఎస్ వెళ్లారు. తర్వాత మోడలింగ్ కోసం స్వదేశం తిరిగొచ్చారు. ఓ రోజు తన ఫ్రెండ్ గార్మెంట్ ఫ్యాక్టరీలో స్టాక్ ఎక్కువగా మిగిలిపోవడంతో ఒటారా సాయం చేశారు. అలా దుస్తుల అమ్మకం, డిజైనింగ్ రంగంలో అడుగుపెట్టారు. సొంతగా టీ-షర్ట్స్ డిజైన్ చేశారు. తర్వాత భర్తతో కలిసి ఓడెల్ ని ప్రారంభించారు.

నమ్రతా శర్మ: త్రీడీ యానిమేషన్ స్టూడియో క్రేయన్ పిక్చర్స్ వ్యవస్థాపకురాలు. పూణెలో పుట్టిపెరిగిన నమ్రతా శర్మకు కళలంటే ఇష్టం. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినా కళలపై ఆసక్తి మరింత పెరిగింది. భర్తతో హాంకాంగ్ లో ఉన్నప్పుడూ డిజిటల్ మీడియా వైపు వెళ్లారు. తర్వాత మెగాసాఫ్ట్ లో బిజినెస్ డెవలపర్ గా చేరారు. పిల్లల కోసం ఉద్యోగ మానేశారు. తర్వాత సొంతగా ఏదైనా చేద్దామనుకుంటున్న సమయంలో కాంటెస్ట్స్2విన్ సీఈఓ అలోక్ కేజ్రీవాల్ తో పరిచయం ఏర్పడింది. ఆయన సాయంతో 3డీ యానిమేషన్ స్టూడియో క్రేయాన్ ను 2007లో ప్రారంభించారు.

నీతి థా: ఢిల్లీలో పెరిగిన నీతి... ఛత్తీస్ గఢ్ లోని ట్రైబల్ ఆర్ట్స్ పై ఫోకస్ చేసే సోషల్ ఎంటర్ ప్రైజ్ 36 ర్యాంగ్ వ్యవస్థాపకురాలు. జె.వాల్టర్ థాంప్సన్ లో ఆర్ట్ డైరెక్టర్ కావడంతో తీరిక లేకుండా పోయింది. కొన్ని నెలలు సెలవు తీసుకొని తన స్వరాష్ట్రమైన ఛత్తీస్ గఢ్ లో పర్యటించారు. స్థానిక కళను, చేతివృత్తులను ఇండియాతో పాటు విదేశాల్లోని అర్బన్ మార్కెట్స్ కి పరిచయం చేద్దామనుకున్నారు. స్థానికంగా పేపర్ మెషీన్ ట్రైనర్స్ తో ఒప్పందం కుదుర్చుకొని సంస్థను ప్రారంభించారు. ప్రభుత్వ పథకం ద్వారా జైళ్లల్లో ఉండే ఖైదీలను కార్మికులుగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడా సంస్థ చీరలు, ఎంబ్రాయిడరీ ఉత్పత్తుల్ని తయారుచేస్తోంది.

ఎ.అమీనా: పాండిచ్చెరీలో పుట్టిపెరిగిన అమీనా పరిశ్రమలకు రంపపుపొట్టు సరఫరా చేసే పీజేపీ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకురాలు. పదిహేడేళ్ల వయస్సులోనే వివాహం చేసుకొనిభర్తతో కలిసి గల్ఫ్ వెళ్లారు. పిల్లలు పెరిగిన తర్వాత ఫ్యామిలీ కెమికల్స్ బిజినెస్ లో చేరారు. అయితే బుర్ఖాలో ఉండే మహిళ ఈ రంగంలో రాణించలేదన్న అనుమానాలున్న తరుణంలో ఆమె పరిశ్రమలకు రంపపుపొట్టు సరఫరా చేసే రంగంలో అడుగుపెట్టారు. స్థానికంగా వ్యాపారులతో పరిచయాలు పెంచుకొని బిజినెస్ లో రాణించారు. మస్కిటో కాయిల్ ప్రొడక్ట్స్ తయారు చేసే గోద్రెజ్ లాంటి కంపెనీలకు సరఫరా చేస్తున్నారు.

ఇవీ మహిళా ఆంట్రప్రెన్యూర్ల విజయగాథలు. ఈ పుస్తకంలో ప్రతీ చాప్టర్ లో మరిన్ని వివరాలున్నాయి. ఈ మహిళలంతా తమ అభిప్రాయాలతో పాటు ఆంట్రప్రెన్యూర్స్ కావాలనుకునే మహిళల కోసం విలువైన సలహాలు, సూచనలు అందించారు. అవేంటో చూద్దాం...

మీకు నచ్చింది చేయండి. మీకు నచ్చినది చేస్తే ఆ పని కష్టం అనిపించదు. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండండి. విజయవంతమైన వ్యక్తుల నుంచి నేర్చుకోండి. పర్సనల్, ప్రొఫెషనల్ గ్రోత్ ను ఎప్పటికప్పుడు ఓ డైరీలో రాస్తూ ఉండాలి.

ఇంట్లో నాలుగ్గోడలకు మాత్రమే పరిమితమై కూర్చోకండి. చిన్నదైనా సరే ఏదో ఓ జాబ్ ఎంచుకొండి. కేవలం ఇంటిపనికే పరిమితమైపోకండి. పనుల్ని సులువుగా చేసేందుకు గ్యాడ్జెట్స్, పనిమనుషుల సాయం తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు, సలహాలు సూచనలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల్ని చూసుకోవడం విషయంలో ఏ లోటూ ఉండకూడదు. భారతదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల్ని మీ లక్ష్యంలో, మీ కలల్లో భాగస్వాముల్ని చేయండి. వాళ్లు ఎలా ఉపయోగడతారో, ఎలా సాయం చేయగలరో తెలుసుకోండి.

పిల్లలు పుట్టిపెరిగిన తర్వాతే వెంచర్లు ప్రారంభించాలని సలహాలిస్తున్నారు కొందరు మహిళా ఆంట్రప్రెన్యూర్లు. కానీ కొందరు మాత్రం అలా ఎదురుచూడాల్సిన అవసరం లేదంటారు. పిల్లలు కూడా వారి తల్లి నుంచి నేర్చుకుంటారు. అవసరం అయిన చోట సాయం చేస్తారు. అయితే దేన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. మహిళలు విజయవంతం అయితే సమాజంలో కొందరు కుళ్లుకునేవాళ్లుంటారు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడం వల్లే విజయం వచ్చిందంటారు. మీరు సొంతగా విజయం సాధించడం సాధ్యమే. కానీ కుటుంబ మద్దతు బాగా ఉపయోగపడుతుంది. మీ భాగస్వామి నుంచి మద్దతు దొరక్కపోయినా, వేధింపులు ఎదురైనా బాధితురాలిగా మిగిలిపోకండి. చేతకానివాళ్లలా ఊరుకోకండి. అడ్డంకుల్ని అధిగమించండి. మీకు మీరే సాధికారత సంపాదించుకొని ముందడుగు వేయండి. పనికిరానివాళ్లలా, ఆత్మవిశ్వాసం లేనివాళ్లలా, ప్రయోజనం లేనివాళ్లలా మిగిలిపోకండి.

చాలామంది మహిళా ఆంట్రప్రెన్యూర్లు మహిళా సంబంధిత వస్తువులవైపే ఆకర్షితులవుతారు. ప్రజానైపుణ్యాలు, మల్టీటాస్కింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్ లాంటి విషయాల్లో మహిళలు మంచి లీడర్లు. కానీ వ్యాపారంలో విజయాలన్నీ ఫైనాన్స్, లీగల్, ఆపరేషన్స్ లాంటివాటిపై ఆధారపడతాయన్న విషయం గుర్తుంచుకోండి. సాయం అడగడానికి, నిపుణుల్ని నియమించుకోవడానికి భయపడకండి. ఎందుకంటే... ఆంట్రప్రెన్యూర్ గా మీరు చాలా విషయాలు నేర్చుకోవడం, వాటిని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. గురువులు, మార్గదర్శకులు, తోటి మహిళా ఆంట్రప్రెన్యూర్ల సలహాలు తీసుకోండి.

మీ వృత్తిని, ఉద్యోగాన్ని సీరియస్ గా తీసుకోండి. లేకపోతే మీరు మహిళా జాతికే చెడ్డపేరు తీసుకొచ్చినట్టు అవుతుంది. మీరు చేస్తున్న పని విషయంలో గర్వంగా ఉండండి. క్వాలిటీ విషయంలో రాజీ పడవద్దు. మీలో ధైర్యాన్ని నింపుకోండి. అదే మిమ్మల్ని సాధారణం నుంచి అసాధారణం వైపు నడిపిస్తుంది.

కష్టపడి పనిచేయడం. ఓపిగ్గా ఉండండి. మిమ్మల్ని మొదట్లో వ్యతిరేకించినవాళ్లే తర్వాత మద్దతుగా నిలవొచ్చు. సానుకూల దృక్పథంతో ఉండండి. 'కాదు' అన్న సమాధానం రానివ్వకండి. వైఫల్యాల కారణంగా నిలిచిపోకూడదు. పురుషుల కంటే మహిళలు తక్కువ అన్న మాటను నమ్మొద్దు.

మీ సమగ్రతకు విలువ ఇవ్వండి. మీ కస్టమర్లు, ఉద్యోగుల విషయంలో నిజాయితీగా ఉండండి. నిజాయితీగా సంపాదించండి. నిజాయితీగా ఉంటే మీరు నిర్భయంగా నిద్రపోవచ్చు. ఆరోగ్యం ముఖ్యం. స్నేహపూర్వకంగా ఉండండి. కానీ స్నేహం మితిమీరితే తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. సమాజానికి ఎంతోకొంత తిరిగివ్వండి. డబ్బుకంటే ఎక్కువైనవి జీవితంలో చాలా ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు.