నేనూ ఏదో ఒకటి చేయగలనని ప్రపంచానికి చూపించేందుకే ఈ సాహసం

32 రోజులు.. 32 జిల్లాలు .. 3200 కిమీ ప్రయాణంతమిళనాడును మొత్తం కవర్ చేసిన కమల్ హజ్ఉదయం కంటెంట్ రైటర్.. రాత్రి డెలివరీ బాయ్విజువల్ కమ్యూనికేషన్ చేసి వివిధ రంగాల్లో ప్రయోగం

నేనూ ఏదో ఒకటి చేయగలనని ప్రపంచానికి చూపించేందుకే ఈ సాహసం

Thursday July 09, 2015,

4 min Read

మానవుడు ఓ అద్భుతం. అతని ఆలోచనా శక్తి, కార్యదక్షత, పట్టుదల ముందూ అన్నీ దిగదుడుపే. మనస్సులో ఏదైనా బలంగా నిశ్చయించుకుని కార్యరంగంలోకి దూకితే విజయం పాదాక్రాంతం కావాల్సిందే ! లక్ష్యమే ఇంధనంగా మనిషి సాగించే ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే కమల్ హాజ్ వ్యక్తి కూడా అలాంటి వాటే. ''నా చేతిలో ఎప్పుడైనా ఓ రూ.50 వేలు పోగైతే చాలు.. నాలో కొత్త ఆలోచన ఏదో ఒకటి మొలిచి ఉంటుంది ? వీటితో ఏం చేయగలను ? అని అనిపిస్తూ ఉంటుంది అంటాడు కమల్. అయితే ఈ సారి మాత్రం తను తమిళనాడునంతా చుట్టేయాలని అనుకున్నాడు. అది కూడా 32 రోజుల్లో. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే టూర్ అంతా సైకిల్ పైనే... ఒంటరిగా !

కమల్ హజ్, సైక్లింగ్ హీరో

కమల్ హజ్, సైక్లింగ్ హీరో


ఈ ఏడాది మే 28న దిగ్విజయవంతంగా తన యాత్రను పూర్తిచేశాడు కమల్. 32 రోజులు... 32 జిల్లాలు.. 3200 కిలోమీటర్లు. అంటే రోజుకు 100 కిలోమీటర్లు. గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో ఏడు గంటల పాటు ప్రయాణం. అది కూడా మే నెలలో. సూరీడు నడినెత్తిన నాట్యం ఆడుతూ ఉంటే తమిళనాడు లాంటి ఎండలను సైతం లెక్కచేయకుండా ! దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇతగాటిలో ఉన్న పట్టుదల ఏపాటిదో ?

కమల్‌కు ఇలాంటి ఫీట్లు అలవాటే. ఎందుకంటే తను ఏర్పాటు చేసిన స్టార్టప్ కూడా ఈ సైక్లింగ్ కాన్సెప్టే. తను మొదలుపెట్టిన స్టార్టప్ పేరు ఓఎంఆర్ పెడల్ మెసెంజర్స్. ఒన్ మేన్ ఆర్మీ. చెన్నైలో ఇది బైక్ మెసెంజర్ సర్వీస్. చెన్నైలోని తిరువన్మాయూర్ - సిరుసేరి మధ్య ఉన్న ఓఎంఆర్ ఐటి హబ్‌లో మొదటిసారిగా సేవలు ప్రారంభించారు. అక్కడి కంపెనీలు ఇచ్చే పెన్ డ్రైవ్‌లు, కవర్లను పికప్ చేసుకుని చుట్టుపక్కుల డెలివర్ చేయాలి. కమల్ స్పెషాలిటీ ఏంటంటే గంటలోనే సరుకు డెలివరీ అయిపోతుంది. దీన్ని ఓ మూడు నెలల పాటు నడిపిన తర్వాత కమల్‌కు ఏదో అసంతృప్తి. తనకి ఇది సరిపడదని తెలిసొచ్చింది. బిల్ బోర్డ్ అడ్వర్టైజింగ్‌ చేద్దామని నిశ్చయించుకున్నాడు. నాలుగు రాళ్లు వెనకేసిన తర్వాత అడ్వర్టైజింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఒక్కడే అన్ని పనులూ చేయడం వల్ల భారం పెరిగిపోయేది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కంటెంట్‌ రైటర్‌గా పనిచేస్తూ.. రాత్రి వేళల్లో తన స్టార్టప్ కోసం పనిచేసేవాడు. రెండు పనులు చేయడంతో శరీరం ఆ భారాన్ని తట్టుకోలేకపోయేది.

ఈ జర్నీని కాసేపు పక్కనబెడితే నేను రోజుకు కనీసం 60 నుంచి 100 కిలోమీటర్లు ప్రతీ రోజూ సైకిల్ తొక్కేవాడిని. నాకు అదో సరదా. 2014లో నేను చెన్నై అంతా పదివేల కిలోమీటర్లు తిరిగి ఉంటాను. యువర్ స్టోరీ, కోరా వంటి సైట్లలో ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు నాలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేది. అవి నాకు ఉత్ప్రేరకాల్లా పనిచేసేవి. అందుకే నా అన్వేషణ సాగేది''. (యువర్ స్టోరీ మీలో ఉన్న ఆసక్తిని రెట్టింపు చేసి మీ కాంక్షను మరింతగా రగిల్చినందుకు చాలా సంతోషం)

image


నా ప్రయాణానికీ ఎలాంటి లక్ష్యమూ లేదు. మే 3, 2015న చెన్నైలోని వేలచేరి నుంచి నా ప్రయాణం మొదలైంది. జర్నీ 28న ముగిసింది. ఇంతవరకూ ఎవరూ ఇలాంటి పనిచేయలేదు. దేశంలోని ఒక రాష్ట్ర్లాన్ని ఇలా సైకిల్ ద్వారా ప్రయాణించినవాళ్లు ఎవరూ లేరు. తమిళనాడులోని 32 జిల్లాలను నేను స్పృశించాను. అయితే ఈ జర్నీ కేవలం జాతీయ రహదారులపై మాత్రం సాగిందనుకోవద్దు. గ్రామగ్రామల్లోని జనాలను నేను చూశాను. వాళ్లను పలికరించాను. భాషాభేదాలను గుర్తించాను. మారిన ఆహార అలవాట్లన్నింటినీ అర్థం చేసుకున్నాను. స్వతహాగా ఫిల్మ్ మేకర్ కూడా అయిన నేను త్వరలో నా పర్యటనపై డాక్యుమెంటరీని కూడా విడుదల చేస్తాను'' అంటారు కమల్.

'ఆఫీస్ పనుల నుంచి ఉపశమనం లభించేందుకు ఇలాంటి ప్రయాణాలను కమల్ చేస్తుంటాడు. గౌరవ్ సిద్ధార్థ్, కార్తిక్ వర్మ, మార్క్ బ్యూమాండ్ వంటి వాళ్లే నాకు స్ఫూర్తి. మానవ సరిహద్దులు దాటి మరీ వాళ్లు సైకిళ్లపై ప్రయాణించారు. ''అంతే కాదు నన్ను నేను తెలుసుకోవడానికి ఈ జర్నీ ఉపయోగపడ్తుంది''.

అందులో ఇది తొలి పెద్ద అడుగు. రాబోయే రోజుల్లో కన్యాకుమారి నుంచి రన్ ఆఫ్ కచ్ అక్కడి నుంచి శ్రీనగర్, ఐజ్వాల్, హైదరాబాద్ మీదుగా చెన్నై చేరుకోవాలని కమల్ కోరిక. 'ఇది చేయగలను అనే నమ్మకం నాకు ఉంది. చేస్తాను. నేను కూడా చేయగలను అని రుజువు చేసి చూపిస్తాను'' అని ప్రపంచానికి తెలియజేయడానికే ఇలాంటి పర్యటనలు చేస్తుంటాను.

నాకు ఇష్టమైన సబ్జెక్టులు రెండూ కలిపేస్తున్నా

తన రాష్ట్రమంటే కమల్‌కు ఎంతో అభిమానం, గర్వం కూడా. సాధారణంగా జనాలు వాళ్ల ఊళ్లలోనో లేక ఎక్కడికైనా వెళ్లినప్పుడు సైకిల్ తొక్కుతారు. కానీ వాళ్ల రాష్ట్రం మొత్తమ్మీద సైకిల్‌లో వెళ్లరు. తమిళనాడులో విభిన్న ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులు ఉన్నాయని, వాటిన్నింటినీ తెలియజేయడం కూడా కమల్ మరో ఉద్దేశం. ''నాకు చిన్నప్పటి నుంచే ఇతరులు చేసిన దానికంటే భిన్నంగా చేయాలని ఉండేది. అందుకే నేను లయోలా కాలేజ్ నుంచి విజువల్ కమ్యూనికేషన్ పూర్తిచేసి నా కెరీర్ మొదలుపెట్టాను. నా ఆలోచనల్లా ఎప్పుడూ ట్రావెల్, ఫిల్మ్ మేకింగ్ చుట్టూనే తిరుగుతూ ఉండేది. నాకు ఇష్టమైన రెండు సబ్జెక్టులను ఇప్పుడు కలుపుతున్నా".

32 రోజుల పర్యటన ముగిసిన సందర్భంగా సరదాగా మిత్రులతో...

32 రోజుల పర్యటన ముగిసిన సందర్భంగా సరదాగా మిత్రులతో...


ఈ ప్రయాణం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నేను మారేందుకు ఇది తొలిఅడుగు. ''నేను మారాలని అనుకుంటున్నా. కొత్తవిషయాలను తెలుసుకోవడం, కరుడుగట్టిన భావాలున్న మనుషులను మార్చడం. నాకంటూ ఓ స్టార్టప్ ఉండడం, దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యే ఓ సినిమా తీయడం వంటివి నా కలలు'' అంటాడు కమల్. ఈ జర్నీ తర్వాత కొద్దిరోజులు గ్యాప్ తీసుకుని మరో స్టార్టప్ మొదలుపెట్టాలని కమల్ ఆలోచన. ఇంకా చెప్పాలంటే అతని మదిలో రోజుకో కొత్త ఆలోచన పుట్టుకొస్తూనే ఉంటుంది. వీడియో కంటెంట్ మార్కెటింగ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ ఆధారిత అడ్వర్టైజింగ్, డయాబెటిక్స్‌ను టార్గెట్‌ చేసే ఉత్పత్తులు వంటివి కొన్ని ఇప్పుడు మదిలో మెదుల్తున్నాయి. ఒక్కో దానికీ మరోదానికీ సంబంధం లేని ఐడియాలు అయి ఉండొచ్చు గాక.. కానీ కమల్ హజ్ పట్టుదలను మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే ! 

చల్ మేరే సాథీ..!

చల్ మేరే సాథీ..!


భవిష్యత్తులో ఏం చేద్దామనుకుంటున్నారు అని అడిగినప్పుడు "నా ప్రయాణానికి సంబంధించిన డాక్యుమెంటరీని సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాల్సి ఉంది. అయితే దానికి నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ నాకు ధైర్యంతో పాటు నా కుటుంబం, స్నేహితుల మద్దతు మాత్రం ఉంది'' అంటూ ముగిస్తాడు కమల్.