రియాల్టీ షో కోసం ఉద్యోగం వదిలేశాడు !

ఆ అబ్బాయికి ఆటలంటే ప్రాణం. ఆటలే జీవితం...! ఎప్పుడూ క్రికెట్ తోనే కాలక్షేపం. అలా అని చదువులో వెనుక బెంచీలో స్టూడెంట్ ఏమీ కాదు. ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ స్టూడెంటే. సాధారణంగా గేమ్స్ అంటే పిల్లలకు అమితమైన ఆసక్తి ఉంటుంది. కానీ చివరకు ఆ ఆటలనే తన కెరీర్ లా మార్చుకున్నాడు అరవింద్ అయ్యంగార్. ఇంతకీ ఎవరీ అయ్యాగారి ఇంటి అబ్బాయి... ? ఎందుకు అతని జీవితం ఓ సక్సెస్ స్టోరీ అయింది.

రియాల్టీ షో కోసం ఉద్యోగం వదిలేశాడు !

Wednesday March 25, 2015,

5 min Read

మెకెన్సీ.. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ.. ఆ కంపెనీలో చేరేందుకు యువత ఉవ్విళ్లూరుతుంది. ఎంత కష్టపడైనా సరే.. అందులో జాబ్ కొట్టాలని రేయింబవళ్లూ జనాలు కష్టపడతారు. ఐఐటి ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అరవింద్ అయ్యంగార్ కూడా అంతే శ్రమపడ్డాడు. చివరకు కన్సల్టెంట్ గా ఉద్యోగం సంపాదించాడు. కానీ ఆ బంగారం లాంటి ఉద్యోగాన్ని ఒక టీవీ రియాల్టీ షో కోసం వదిలేసుకున్నాడు...! ఆశ్చర్యంగా ఉందా...? ఇంతకీ ఏంటా రియాల్టీ షో.. ఎందుకు అంత రిస్క్ తీసుకున్నాడు ?

2007లో ESPN స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఓ రియాల్టీ షో నిర్వహించింది. పదివేల మంది పాల్గొన్న ఆ రియాల్టీ షోలో అరవింద్ ఫైనల్ రన్నరప్ గా నిలిచాడు. ఆటలే ప్రాణంగా జీవించిన తనకు ఈ షో వేదికైంది. తనకో మార్గాన్ని చూపించి.. లక్ష్యానికి దగ్గర చేసింది. స్పోర్ట్స్ కామెంటేటర్ గా ఎదిగేందుకు బాటలు వేసింది. ఆ తర్వాత ఏడాదిపాటు ESPN లో ఆటల వ్యాఖ్యాతగా పనిచేసి.. తన ముచ్చట తీర్చుకున్న అరవింద్. జీవితంలో తర్వాతి మజిలీని చేరేందుకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చేరి ఎంబిఏ పూర్తిచేశాడు.

image


ఆటలంటే పిచ్చిపిచ్చిగా ప్రేమించిన ఈ కుర్రాడే.. ఇప్పుడు ముంబైలోని స్పోర్ట్స్ ఇంటరాక్టివ్ సంస్థకు అధిపతి అయ్యాడు. అభిమానుల అనుభవమేంటో తెలుసుకోవడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ కంపెనీ ఇప్పుడు దేశవిదేశాల్లోని వివిధ ప్రముఖ సంస్థలకు తన సేవలను అందిస్తోంది.

ఆటలపై అభిమానం మాత్రం ఉంటే సరిపోదు.. వాటితో జీవిస్తూ.. వాటినే శ్వాసిస్తే.. అద్భుతాలు చేయొచ్చంటున్న అరవింద్ తో ముఖాముఖి

యువర్ స్టోరీ - ముందు నుంచీ మీకు ఆటలంటేనే అభిమానమా ?

అరవింద్- నేను బెంగళూరులో పెరిగినా. నాకు ముందు నుంచి ఆటలంటే అభిమానం. మా అన్నతో కలిసి చిన్నప్పటి నుంచి క్రికెట్ కామెంటరీ ప్రాక్టీస్ చేసేవాడిని. ఇప్పుడిప్పుడు ఫాంటసీ గేమ్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు కానీ.. 1996 ప్రపంచ కప్ నుంచే నేను వాటిని ఆస్వాదించే వాడిని.

యువర్ స్టోరీ - అండర్ గ్రాడ్యుయేషన్ కోసం ఐఐటి బాంబే వెళ్లారు కదా.. అప్పుడు మీ కోరికలన్నింటికీ కొన్ని రోజులు పక్కనపెట్టారా ?

అరవింద్ - భారత్ లాంటి దేశంలో ఆటలపై అభిమానం ఎక్కువగా ఉన్నా దాన్ని ఎలా క్రమబద్ధీకరించి ప్రయోజనం పొందాలో స్పష్టత ఉండదు . నేను చదివే రోజుల్లో రెండే ఆప్షన్స్ ఉండేవి. అయితే డాక్టర్ లేకపోతే ఇంజనీర్. కానీ స్పోర్ట్స్ రంగాన్ని ఒక కెరీర్ మాదిరి ఎలా మలుచుకోవాలో నాకు అవగాహనే లేదు.

మా నాన్న ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. మా బంధువుల్లో చాలామంది ఐఐటియన్సే. ఆల్ రౌండ్ అభివృద్ధికి ఐఐటిలు మేలైన మార్గాలని నాకు అనిపించింది. వైవిధ్య ఆలోచనలు, విశ్లేషణాత్మక ధోరణులు నన్ను మెకానికల్ ఇంజనీరింగ్ వైపు మళ్లేలా చేశాయి. అన్నీ ఆలోచించి మనసును శాంతిపర్చుకున్నాకే ఇంజనీరింగ్ లో చేరా. కానీ లోలోపల ఆటలపై ఉన్న ప్రేమ మాత్రం అలానే ఉంది. ఆ రంగంలో ఏదో ఒక రోజు మళ్లీ కాలుమోపుతాననే గట్టి నమ్మకం.

యువర్ స్టోరీ - ఆ తర్వాత మీరు మెకెన్సీలో చేరారు. రియాల్టీ షో కోసం ఉద్యోగాన్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది ?

- అరవింద్ - మెకెన్సీలో ఉద్యోగం వదిలేసి టివి రియాల్టీ షో కోసం వెళ్తున్నానని తెలిసి నన్ను అంతా వింతగా చూశారు. అప్పట్లో ఈ రియాల్టీ షోకు జడ్జిగా వ్యవహరించిన మందిరా బేడీ కూడా ఇదే అడిగారు. ‘మంచి కాలేజీలో చదివి, మంచి ఉద్యోగం చేస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు’ అని మందిరాబేడీ నన్ను అడిగారు. నేను చాలా స్పష్టంగా ఒకటే చెప్పాను. ‘నాకు నా కుటుంబ సభ్యులతో పాటు మెకెన్సీ నుంచి కూడా పూర్తి మద్దతు, ప్రోత్సహం ఉంది. చిన్నప్పటి నుంచి ఆటలే ప్రాణంగా జీవిస్తున్న నీకు ఇదో అద్భుత అవకాశమని, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లమని సన్నిహితులంతా నన్ను ప్రోత్సహించారు. అదే నన్ను ఇక్కడికి తీసుకువచ్చిందంటూ’ సమాధానమిచ్చాను. ఒక రోజు మెకెన్సీలో మీటింగ్ పూర్తైన తర్వాత మా ఎంగేజ్ మెంట్ మేనేజర్ ని కలిసి ESPN స్టార్ స్పోర్ట్స్ రియాల్టీ షో గురించి వివరించా. ఏ మాత్రం సంకోచించకుండా వాళ్లు కూడా నా వెన్నుతట్టారు. వెంటనే ఢిల్లీ నుంచై ముంబై చేరాను. ఎనిమిది గంటల సేపు ఆడిషన్ కోసం పడిగాపులు కాస్తే కళ్లలో నీళ్లు వచ్చినంతపనైంది. చివరకు నేను అనుకున్నది సాధించాను. ఒక్కో మెట్టూ ఎక్కుతూ షో చివరి దశకు చేరాను. కానీ నేను నిర్ఘాంతపోయే విషయం ఏంటంటే.. నేను ఊహించనంత తక్కువ జీతానికి ఈఎస్పిఎన్ ఉద్యోగం ఆఫర్ చేసింది. అప్పుడే నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఇప్పుడు కనుక దీన్ని తిరస్కరిస్తే.. జీవితం బాధపడాలా అని మనస్సాక్షిని అడిగా. అప్పుడు ‘అవును’ నా అంతరాత్మ చెప్పిన సమాధానం.

నీ మనసు మాట విను అని చెప్పడం చాలా సులువు... ఆచరణే చాలా కష్టం. కానీ నా విషయంలో ధృడసంకల్పమే నన్ను ఈ స్థితికి చేర్చింది. అదృష్టం కొద్దీ అప్పట్లో అందరూ నన్ను ప్రోత్సహించారు.

యువర్ స్టోరీ - కెరీర్ ఎంపికలో జనాల ఆలోచనా విధానం మారుతోందని అనుకోవచ్చా ?

అరవింద్ - భారత యువత ఇంజనీరింగ్ - మెడిసిన్ కాన్సెప్ట్ నుంచి మెల్లిగా బయటపడ్తున్నారు. సృజనాత్మక దిశగా పిల్లలు అడుగులు వేస్తున్నారు. మైండ్ సెట్ మార్పుతో పాటు వివిధ రంగాల్లో అవకాశాలు కూడా విస్తృతంగా పెరిగాయి. ఫ్యాషన్ రంగంలోకి వెళ్లాలంటే ఇప్పుడు బోలెడన్ని మార్గాలున్నాయి. అదే స్పోర్ట్స్ అయితే, ఇప్పుడు ఫుట్ బాల్ లీగ్, కబడ్డీ లీగ్, హాకీ లీగ్ కూడా వచ్చేస్తున్నాయి. ఐపిఎల్ వంటివి యువతను మరింతగా ఆకర్షించాయి. ఐపిఎల్ తో అవకాశాలు పెరిగి, ఓ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఎంత ఎక్కువ మంది దానివైపు మళ్లితే అంత ఎక్కువ టాలెంట్ పూల్ అక్కడ తయారవుతుంది. ‘నా కొడుక్కో, నా కూతురుకో ఇక్కడ కూడా మంచి అవకాశాలున్నాయి’ అని అనిపించేంతలా పరిస్థితులు మారాలి. మెల్లిగా ఇప్పుడు పరిస్థితుల్లో అలాంటి మార్పునే గమనిస్తున్నాం.

యువర్ స్టోరీ - ESPN ను కూడా వదిలేసి మళ్లీ స్టాన్ఫోర్ట్ కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ?

అరవింద్ - ESPN చాలా గొప్పది, కాదనను. కానీ ప్రపంచంలోని పెద్ద సమస్యలన్నీ తామే పరిష్కరిస్తున్నాము అనేంతగా ఉంటుంది మెకెన్సీ వంటి వాటిల్లో పనిచేసే వాళ్ల ఆలోచన. ఇక్కడా అంతే కేవలం ఆటల గురించి మాట్లాడితే సరిపోదు. ఏదో ఒక బలమైన ముద్ర వేయగలగాలి. పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు నాకు ఇష్టమైన స్పోర్ట్స్ బిజినెస్ ప్రోగ్రామ్స్ ను స్టాన్ఫోర్డ్ అందిస్తోంది. అక్కడ చదువుతూనే NBAకు కూడా కొద్దిగా సమయం కేటాయించాను. అక్కడ సంపాదించిన అనుభవంతో స్పోర్ట్స్ ఫీల్డ్ పై మన మార్క్ ఏదైనా ఉండాలని బలంగా అనిపించింది.

యవర్ స్టోరీ – GSB తర్వాత మీరు ఇండియాకి వచ్చి స్పోర్ట్స్ ఇంటరాక్టివ్ ప్రారంభించారు. ముంబైలో వంద మంది ఉద్యోగులతో కంపెనీ మొదలుపెట్టారు. ఇంతకీ ఇండియాకు రావాలని మళ్లీ ఎందుకు అనిపించింది ?

అరవింద్ - స్పోర్ట్స్ ఇంటరాక్టివ్ కు నాయకత్వం వహించేందుకే ఇక్కడికి తిరిగి వచ్చాను. వివిధ మార్గాల్లో ఆటలపై అభిమానుల అనుభవాలను సేకరించడం, దాన్ని క్రోడీకరించడం మా ముఖ్య ఉద్దేశం. డిజిటల్, మొబైల్... ఇలా వేదిక ఏదైనా ఫ్యాన్స్ అంతరంగాన్ని ఒడిసిపట్టడమే మా లక్ష్యం. ఇందుకోసం వివిధ ప్రసార కంపెనీలతో కలిసి పనిచేశాం. ఫుట్ బాల్ ప్రపంచ కప్ కోసం మేం ఒక అద్బుతమైన ప్రొడక్టుకు రూపకల్పన చేయబోతున్నాం. అభిమానుల స్పోర్ట్ ఎక్స్ పీరియన్స్ ను మెరుగుపర్చేందుకు మేమంతా కలిసి చేస్తున్న పని నాకు మహా సరదాగా ఉంటుంది. ప్రతీ రోజూ నాకు పనిచేయాలనిపిస్తుంది. ఆ ఊహలే నన్ను ముందుకు నడిపిస్తాయి.

యువర్ స్టోరీ - యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మీరు ఇచ్చే సలహా ఏంటి ?

అరవింద్ – రంగం ఏదైనా ఫర్వాలేదు. బలమైన కోరిక, ఇష్టత ఉన్న మార్గాన్నే ఎంచుకోండి. ఎప్పుడూ దాన్నే ఆశగా, శ్వాసగా బతకండి. ఒకవేళ వేరే పని చేయాల్సి వచ్చినా సరే మీకు నచ్చినదానిపై నిత్యం ఓ కన్నువేసే ఉంచండి. మనసు పెట్టి చేసే ఏ పనినీ ఇతరవాటితో పోల్చలేం. ఏదో ఒకటి చేయాలి కదా అని చేయడం వేరు.. మనకు నచ్చింది చేయడం వేరు. అందుకే జస్ట్ గో ఫర్ ఇట్..

ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎంతవీలైతే అంత ఎక్కువ పని అందరికంటే ముందుగా చేయడమే మన విజయానికి సోపానం. విస్తృతమైన పరిశోధన చేయడం చాలా చాలా ముఖ్యం. సంసిద్ధత, సంపూర్ణ అవగాహనే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతుంది. ఉన్న నలుగురిలో మీరే ఎప్పుడూ అత్యంత చురుకైన వ్యక్తిగా ఉండడం అసాధ్యం. కానీ ముందస్తు వ్యూహాలే ఆటలో మిమ్మల్ని అగ్రభాగాన నిలుపుతాయి. ఇలాంటి చిన్నవిషయాలే రేపు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే వాటిని నిర్లక్ష్యం చేయొద్దు.

మీకు ఏదైనా ఆలోచన ఉంటే దాన్ని కార్యరూపంలో పెట్టండి. ప్రోటోటైప్ రూపొందించండి. సాధ్యమైనంత త్వరగా దాన్ని పదే పదే మెరుగుపర్చేందుకు ప్రయత్నించండి. మొదటి దశలోనే అత్యంత అద్భుతమైన, సమర్ధమైన ప్రొడక్ట్ ను తీసుకురావడం ఎవరికైనా అసాధ్యమే. అందుకే మీ ఆలోచనలకు నిత్యం పదునుపెడ్తూ ముందుకు దూసుకుపోండి. విజయం మీదే

అరవింద్ ది అద్భుతమై స్టోరీ. అతని వ్యాపార నైపుణ్యం, ఉత్సాహం మమ్మల్ని ఎంతగానో ఉత్తేజిత పరిచింది. మీరు కూడా అలాంటి స్ఫూర్తినే పొందారని అనుకుంటున్నాము .