దేవుడా.. వారిపై ఇంత వివక్షా..?

దేవుడా.. వారిపై ఇంత వివక్షా..?

Sunday August 14, 2016,

4 min Read

ఇది నా చిన్నప్పటి సంగతి. మేం అప్పుడు. మీర్జాపూర్ లో వుండేవాళ్లం. అటుపక్క వారణాసి ఇటు అలహాబాద్. మధ్యలో మీర్జాపూర్. నాన్న ఆదాయ పన్ను శాఖలో పనిచేసేవారు. ప్రతీరోజు సాయంత్రం తన గుమస్తాను ఇంటికి తీసుకొచ్చేవాడు. అమ్మ అతనికి టీ, స్నాక్స్ ఇచ్చేది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, అతనికి టీ పోసే కప్పు, స్నాక్స్ వేసే ప్లేటే ఎందుకో నాకు తేడాగా అనిపించేది. ఎందుకంటే అది మేం తాగే రెగ్యులర్ కప్ కాదు. మేం వాడే ప్లేటూ కాదు. పైగా అతను తాగి కడిగేసిన తర్వాత అవి ఒక మూలకు చేరిపోతాయి. వాటి గురించి నేను పెద్దగా ఏనాడూ ఆలోచించలేదు. కానీ ఒకరోజు కుతూహలం ఆపుకోలేక అమ్మను అడిగాను. అతను తాగే కప్పు, ప్లేటును ఎందుకు సెపరేటుగా పెడుతున్నారు అని..

మా అమ్మది ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక మారుమూల గ్రామం. ఆమె చదువుకోలేదు. అందుకే చాలా అమాయకంగా నాకు ఆన్సర్ చెప్పింది.. వాళ్లు దళితులు బేటా అందుకే అలా చేస్తున్నాం అని. నా వయసుకు ఆ జవాబు కనెక్ట్ కాలేదు. ఆ మాట అర్ధం చేసుకునే మెచ్యురేటీ కూడా లేదు. సరే, కాలం దొర్లిపోయింది. నేను స్కూల్ ఏజ్ నుంచి కాలేజీ వయసులోకి వచ్చాను. లోకం పోకడ అప్పుడప్పుడే తెలుస్తోంది. ముఖ్యంగా దళితుల పట్ల చూపిస్తున్న వివక్ష నాకు మెల్లిగా అర్ధమవుతోంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆ దురాగతాన్ని అంటరానితనం అంటారని అని తెలుసుకున్నాను. మా ఇంటికొచ్చే ఆ గుమస్తా అందరినీ ప్రేమగా పకలరించేవాడు. తను తాగేసిన కప్పు, ప్లేటుని తనే కడిగేవాడు. పొరపాటున కూడా మా ప్లేట్లను ముట్టుకునేవాడు కాదు.

కాలేజీ రోజులు. ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది. అమ్మాయిలు అబ్బాయిలు చాలా జోవియల్ గా ఉండేవాళ్లం. అందరూ మా ఇంటికి వచ్చిపోయేవాళ్లు. ఎవరిది ఏ కులం అని మా అమ్మకూడా పెద్దగా పాయింట్ అవుట్ చేయలేదు. అంత తీరిక కూడా లేదు కావొచ్చు. అందరం కలిసిపోయాం. ఇంకో విషయం ఏంటంటే మా ఇంటికి వచ్చే స్నేహితుల్లో ఒకరు ముస్లిం, ఇంకొక దళిత్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఈ విషయం కొన్నాళ్ల తర్వాత అమ్మకు తెలిసింది. అరుస్తుందని భయపడ్డాను. కానీ లక్కీగా ఏమీ అనలేదు. అయితే ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే.. అంటరానితనం అనే జాఢ్యం మునుపటిలా లేదు. సామాజిక కట్టుబాట్లు తెగిపోయాయి. అందరిలో చైతన్యం వచ్చింది. అందరూ మనుషులే అన్న భావన ప్రతీ ఇంట్లోనూ వచ్చింది.

మా అమ్మ కూడా మారిపోయింది. కాకపోతే దేవుడంటే తన నమ్మకం తనది. ఇక మా నాన్న. అతనొక గవర్నమెంటు ఉద్యోగి. గ్రాడ్యుయేట్. చాలా లిబరల్ గా ఉంటాడు. అలాగని అమ్మ నమ్మకాలను కాదనడు. ఆమె అభిప్రాయాలను కొట్టిపారేయడు. మమ్మీ డాడీ ఏనాడూ నా ఫ్రెండ్స్ కులమతాల గురించి పట్టించుకోలేదు. సూర్యోదయానికి ముందే లేవడం, స్నానం, జపం, పూజ, ఆ తర్వాత భోజనం. పండుగలను ఫాలో అవడం, నిష్టతో పూజచేయడం. ఇదంతా దేవుడి మీద భక్తితోనే గానీ, ఛాందసవాదమో, వేరే మతం తక్కువ అనే ఉద్దేశమో కాదు. వాళ్ల నమ్మకాలను చెరిపేసుకోకుండానే కాలంతోపాటు వారూ మారిపోయారు.

ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, గత కొంత కాలంగా కొన్ని దృశ్యాలు చూస్తున్నాను. చాలా బాధ కలిగించాయి. గో రక్షక్ దళ్ పేరుతో దళితులను చిత్రవధ చేసే సంఘటనలు మనసుని కలిచివేస్తున్నాయి. మళ్లీ నా చిన్నప్పటి సంగతలు గుర్తొస్తున్నాయి. ఇదంతా ఒక వర్గం పనిగట్టుకుని చేస్తున్న తతంగంలా అనిపిస్తోంది. గోవులను కాపాడాలి. మంచి ఉద్దేశమే. కానీ దానికి వేరే పద్ధతులున్నాయి. అంతేగానీ దళితులనే టార్గెట్ చేయడం వల్ల అనకున్నది సాధించలేరు. అంతగా వారికి గోవుల మీద ప్రేమ ఉంటే, ఎన్నో మూగజీవులు రోడ్డుమీద నిత్యం యాక్సిడెంట్ మూలంగా చనిపోతున్నాయి. అలాంటి సంఘటనల పట్ల స్పందించండి. వాటికి మెరుగైన చికిత్స కావాలని ప్రభుత్వాన్ని నిలదీయండి. దేశంలో గోమాంసం తినకుండా చట్టం తేవాలని మోడీ సర్కారుని డిమాండ్ చేయండి. పాపం, ఇక్కడ వారికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, మోడీ నాయకత్వంలోనే మన దేశం బీఫ్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉంది. ఇది తెలిస్తే గో రక్షక దళ్ తట్టుకోలేదు కావొచ్చు. ఇదంతా పక్కన పెట్టి కులం పేరుతో మతం పేరుతో ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు.

అంట‌రానిత‌నం. వేల ఏళ్లుగా హిందూ స‌మ‌జాంలో బ‌లంగా వేళ్లూనుకున్న ఒక సాంఘిక దురాచారం. నేటి స్మార్ట్ యుగంలోనూ దీని జాఢ్యం పోలేదు. అంట‌రానిత‌నం అనే సామాజిక రుగ్మ‌త దేశాన్ని ప‌ట్టి పీడిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా ద‌ళితుల బాధ మాట‌ల‌కు అంద‌నిది. ద‌ళిత స‌మాజంపై జరుగుతున్న దురాచారాలకు అంతు లేదు. వాళ్ల‌కు హ‌క్కుల‌నేవే లేకుండా చేశారు. ద‌ళితుల‌కు ఎప్పుడూ స‌మాన హ‌క్కులు క‌ల్పించిన చ‌రిత్ర లేదు. ఒక‌ర‌కంగా ప‌శ్చిమ దేశాల్లో బానిస‌త్వం, మ‌న ద‌గ్గ‌ర‌ ద‌ళితుల ప‌రిస్థితి ఒక‌టే. ఇదేంట‌ని గొంతెత్తితే.. అది మీ ఖ‌ర్మ అంటారు. గ‌త జ‌న్మ‌లో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష అనుభ‌విస్తున్నార‌ని తీర్పులిచ్చేస్తారు. ఈ జ‌న్మ‌లో మంచి చేస్తే వ‌చ్చే జ‌న్మ‌లో అయిన పుణ్యం ద‌క్కుతుందని జోస్యాలు ప‌లుకుతారు. విచిత్ర‌మేమిటంటే.. వాళ్లు బ్రాహ్మ‌ణులైనా స‌రే, పాపాలు చేస్తే ఈ జ‌న్మ‌కు న‌ర‌క‌మే అని సూక్తిముక్తావ‌ళి వినిపించే వాళ్లూ లేక‌పోలేదు.

అంట‌రానిత‌నం అమానుషం. మ‌నుషులంద‌రూ ఒక‌టే. చ‌ట్టం ముందు అంద‌రూ స‌మాన‌మే. అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు ఉండాలి. అగ్ర‌వ‌ర్ణాల వారిలా ద‌ళితుల‌కూ స‌మాన హ‌క్కులు కల్పించాలి - రాజ్యాంగంలో మహా గొప్ప‌గా రాశారు. కానీ ఏం లాభం? ఇప్ప‌టికీ స‌మాజం కుల ప్రాతిప‌దిక‌న నిట్ట‌నిలువునా చీలిపోతోంది. వేల ఏళ్ల నాటి మైండ్ సెట్ రాత్రికి రాత్రే పోతుంద‌నుకోవ‌డ‌మూ అత్యాశే.

కానీ, ఆ రాజ్యాంగ‌మే ద‌ళితుల ధైర్యం. అందులోని సూత్రాలు ద‌ళిత స‌మాజంలో న‌మ్మ‌కాన్ని నాటాయి. స‌మాన అవ‌కాశాలు, స‌మాన హ‌క్కులు, ఆత్మ‌గౌర‌వం కోసం ద‌ళితులు నిరంత‌రాయంగా గొంతెత్తుతున్నారు. కానీ అగ్ర‌వ‌ర్ణాల‌కు అది రుచించ‌డం లేదు. అదే విద్వేషాలకు కార‌ణ‌మ‌వుతోంది. ఫలితంగా ద‌ళితులు అన్యాయ‌మైపోతున్నారు. అదేమంటే, ద‌ళితుల చ‌రిత్రే అంత‌ అంటున్నారు. హ‌క్కుల గురించి మాట్లాడొద్ద‌ని హుకుం జారీ చేస్తున్నారు. స‌మాజంలో భాగ‌మైన ద‌ళితుల‌ను చీక‌ట్లోకి నెడుతున్నారు. ప్‌ుజాస్వామిక హ‌క్కుల గురించి గొంతెత్తిన ప్ర‌తిసారీ, వారి మీద క‌క్ష తీర్చుకుంటున్నారు. ఇదేనా న్యాయం?

నా త‌ల్లిదండ్రులు కూడా ఈ సామాజిక దురాచారం బాధితులే. అయినా వాళ్లెప్పుడూ ఆధునిక స‌మాజంతో పోరాడ‌లేదు. పెద్ద మ‌న‌సుతో అర్థం చేసుకున్నారు. కానీ కొంద‌రున్నారు. మ‌నుషుల్ని మ‌నుషులుగా చూడ‌లేని స‌మాజానికి వాళ్లు ర‌క్ష‌కుల‌ట‌. కాదు, ఆధునిక‌త్వానికి వాళ్లు ప‌చ్చి వ్య‌తిరేకులు. తప్ప‌దు. అలాంటి వారితో పోరాడ‌తాం. ఓడిస్తాం. ద‌ళితులంద‌రిదీ ఒకే మాట‌. మేం ఉక్కు సంక‌ల్పంతో ఉన్నాం. సామాజిక దురాచారాల‌పై యుద్ధం చేస్తాం. ఈ స‌మాజంలో, ఈ చ‌రిత్ర‌లో మా హ‌క్కుల కోసం పోరాటానికి సిద్ధం.