60 ఏళ్లుగా కస్టమర్ల మనసు దోచుకుంటున్న బెంగళూరు బ్రాహ్మిన్స్ కాఫీ బార్  

0

మీరెప్పుడైనా బెంగళూరుకు పోతే, పనిగట్టుకుని శంకరాపుర బసవనగుడి ఏరియాకు వెళ్లండి . ఆటోమేటిగ్గా మీ అడుగులు బ్రాహ్మిన్స్ కాఫీ బార్ దగ్గరికి తీసుకెళ్తాయి. కాఫీ బార్ అన్నాం కదాని సీటింగ్ దగ్గర్నుంచి లైటింగ్ వరకు గ్రాండ్ గా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేయకండి. అక్కడ కూర్చోడానికి కుర్చీ వుండదు. టేబులూ కనిపించదు. అయినా విపరీతమైన క్రౌడ్. పొగలుగక్కే కాఫీ రారమ్మని ముక్కుపుటాలను తాకుతుంది. వేడివేడి ఇడ్లీ మనసుని విపరీతంగా టెంప్ట్ చేస్తుంది. సౌత్ బెంగళూరులో మంచి బ్రేక్ ఫాస్ట్ చేసి, అద్భుతమైన కాఫీ తాగాలంటే బ్రాహ్మిన్స్ కాఫీ బార్ కి మించింది లేదు.

పేరు లేటెస్టుగా ఉన్నా ఈ హోటల్ ఇప్పటిది కాదు. 1960లో కాలం నాటిది. తరతరాలుగా అదే రుచి, అదే శుచి. ఒక హోటల్ కి దశాబ్దాలుగా కస్టమర్లు రావడమంటే చాలా అరుదు. కానీ ఈ హోటల్ కి అలా వచ్చేవాళ్ల సంఖ్య లెక్కపెట్టలేం. ఒకసారి కాఫీ తాగితే చాలు. అడిక్ట్ అయిపోతాం. ఒక ఇడ్లీ రుచిచూస్తే జన్మలో మరిచిపోలేం. కరకరలాడే వడతో ఇడ్లీ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్. ఇడ్లీ-వడ అన్నాం కదాని సాంబారు ప్లేట్ నిండా గుమ్మరించరు. అసలు ఆ వాసనే అక్కడ ఉండదు. కేవలం చట్నీ మాత్రమే. దాన్నే సాంబారులా తింటారు. చట్నీని సాంబారులా తినడమేంటని డౌట్ రావొచ్చు. అదే ఇక్కడ స్పెషాలిటీ. 

గత 60 ఏళ్లుగా చట్నీ తయారీలో చిన్న తేడా కూడా రాలేదు. ఘుమఘులాడే కాఫీ ఒక్కసారి టేస్ట్ చేస్తే జన్మంతా గుర్తుంటుంది. టీ కూడా అదే స్థాయిలో ముద్రపడిపోతుంది. రోజంతా నాలుక మీద అదే ఫ్లేవర్ ఉంటుంది. మెనూ పెద్దగా ఉండదు. ఇడ్లీ, వడ, కేసరిబాత్, ఖారీబాత్, కాఫీ, టీ. అంతే.. ఈ నాలుగైదు ఐటెమ్స్ కే జనం జయహో అంటున్నారు.

ఫాస్ట్ ఫుడ్ చైన్స్ పెరిగి, రకరకాల వంటలతో, రకరకాల పేర్లతో ఫుడ్ ఇండస్ట్రీ ఎక్కడో ఉన్న ఈ రోజుల్లో కూడా- ఒక సాదాసీదా హోటల్ ముందు జనం క్యూ కడుతున్నారంటే- అది కచ్చితంగా క్వాలిటీ మహిమే అని చెప్పొచ్చు.

పొద్దున్నే నాలుగున్నరకు హోటల్ పనులు మొదలవుతాయి. ఆరింటికల్లా అన్నీ రెడీ అయిపోతాయి. మిగిలిన పదార్ధాలు ఫ్రిజ్ లో పెట్టడం లాంటివేం ఉండవు. ఏ రోజుకారోజు ఫ్రెష్. కస్టమర్ల నమ్మకాన్ని దశాబ్దాలు వమ్ము చేయకుండా హోటల్ నడుస్తోందంటే కారణం యజమాని నర్సింహారావు నిబద్ధతే. తండ్రి ఆశయానికి ఏమాత్రం తలవంపులు తేకుండా హోటల్ బాధ్యతలను చూసుకుంటూ, కస్టమర్ల మనసుని గెలుచుకుంటూ వస్తున్నాడు నర్సింహారావు. ఆహారం విషయంలో ఎక్కడా రాజీపడొద్దనేది అతడు నమ్మిన సిద్ధాంతం. హోటల్ కి వచ్చేవాళ్లు ఎంతో ఆకలితో వస్తుంటారు. అలాంటి వాళ్లను నవ్వుతూ పలకరించి కావల్సినవి అందించడంలో ఉన్న ఆనందమే వేరంటారాయన. జనవరి 27, 1965న కాఫీ, టీ, కొన్ని బేకరీ ఐటెమ్స్ తో మొదలైంది. 1971లో కొన్ని దక్షిణాది వంటకాలు యాడ్ చేశారు.

ప్రచార హడావిడి లేదు. హంగూ ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా దశాబ్దాలుగా ఈ హోటల్ అదే ఆదరాభిమానాలతో నిలదొక్కుకుంది. మెత్తని ఇడ్లీ, ఒక వడ తిని, చిక్కటి కాఫీ తాగితే చాలు, రోజంతా ఆకలి మరిచిపోవచ్చంటాడో కస్టమర్. 15 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఈ హోటల్ కి వస్తున్నాను.. ఇప్పుడు నా వయసు 55 ఏళ్లు.. అయినా ఈ కాఫీ బార్ ని వదిలి ఎక్కడా తినను అని నవ్వుతూ చెప్తున్నాడు. నోరూరించే వంటకాలతో నోస్టాల్జియా గుర్తుగా మిగిలిపోయిన ఈ కాఫీ బార్ కి జొమాటో ఇచ్చిన రేటింగ్ 4.9 స్టార్స్.

పేద, ధనిక, కులం, మతం భేదం లేకుండా అందరూ ఒకేచోట నిలబడి ముచ్చట్లు చెప్పుకుంటూ ఇడ్లీ తింటూ, కాఫీ చప్పరించే ఈ హోటల్ అంటే బెంగళూరు ప్రజలకు చెప్పలేనంత అభిమానం. ఆ ప్రేమను ఇన్నాళ్లుగా నిలబెట్టుకోవడం అనేది ఇంకా గొప్పవిషయం. 

Related Stories

Stories by team ys telugu