కరెంటు అవసరం లేకుండా ఏసీ..!!

మార్కెట్లో జియోథర్మల్ టెక్నాలజీ సంచలనాలు

కరెంటు అవసరం లేకుండా ఏసీ..!!

Monday April 25, 2016,

4 min Read


దేశంలో చిన్న పట్ట‌ణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మంచిదే! కానీ ఆ ప్రాంతాల్లో వాట‌ర్, ప‌వ‌ర్ ఒక ప్రధాన స‌మ‌స్య‌గా త‌యారైంది. డిమాండ్ కు స‌రిప‌డా స‌ప్ల‌య్ లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎయిర్ కండీష‌నింగ్ వినియోగం క‌ష్ట‌మే. పెద్ద‌గా క‌రెంటు అవసరం లేకుండా ప‌నిచేసే ఎయిర్ కండీష‌న‌ర్ తెస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌.. ఒక స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌కు బాట‌లు వేసింది. 35 ఏళ్ల అరుణ్ షెనాయ్‌, 40 ఏళ్ల మంద‌ర్ క‌ప్రెక‌ర్ త‌యారు చేసిన జియో థ‌ర్మ‌ల్ టెక్నాల‌జీ గురించి ఇప్పుడు దేశ‌మంతా చ‌ర్చ న‌డుస్తోంది.

బ్రెయిన్ ఒక ఆలోచ‌న‌ల పుట్ట‌! రోజుకు అర‌వై వేల ఆలోచ‌న‌లు మానవ మెద‌డు చుట్టూ గిరికీలు కొడుతుంటాయ‌ట‌! అరుణ్, మంద‌ర్ స‌రిగ్గా అలాంటి టైపే! రొడ్డ‌కొట్టుడు బిజినెస్ చేస్తే కిక్కేముంటుంది? అందుకే ఒక డిఫ‌రెంట్ ఐడియాతో మార్కెట్లోకి వ‌చ్చారు. వినూత్నమైన ఆలోచ‌న‌ల‌తో దేశానికి ప‌నికొచ్చే టెక్నాల‌జీకి ప్రాణం పోశారు. 2010 ఏప్రిల్ లో గ్రీన్ ఇండియా బిల్డింగ్ సిస్ట‌మ్స్ అండ్ స‌ర్వీసెస్( గిబ్స్‌) ఏర్పాటైంది. ఒక చిన్న అపార్ట్‌మెంట్లోని లివింగ్ రూంలో మొదలైన ఈ కంపెనీ.. ఇప్పుడు దేశ‌మంతా విస్త‌రించింది. కంట్రీ వైడ్ గా 400 జీరో ఎనర్జీ బిల్డింగ్స్ తయారు చేసింది. సంస్థకు 90 మందితో కూడిన టీం ఉంది. 75 బ‌డా కంపెనీలు క‌స్ట‌మ‌ర్లు. గిబ్స్ కంపెనీ ఇప్ప‌టికే 40 రెట్లు వృద్ధి సాధించింది.

image


ల‌క్ష్యం వైపు ప్రయాణం..

అమెరికాలోని ఒక్ల‌హామా స్టేట్‌ యూనివ‌ర్సిటీలో అరుణ్ మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో మాస్ట‌ర్స్ చేశారు. జియోథ‌ర్మ‌ల్ సిస్ట‌మ్స్ లో అనేక‌ ప‌రిశోధ‌న‌లు నిర్వహించాడు. అమెరికాలోని జియోథ‌ర్మ‌ల్ హీట్ పంప్ త‌యారీ కంపెనీ క్లైమేట్ మాస్ట‌ర్‌తో క‌లిసి ప‌నిచేశాడు. ట్రాన్స్ కంపెనీలో ప‌నిచేస్తూనే భార‌త్ పై కూడా దృష్టి సారించాడు. 2008లో భార‌త్ లో స్థిర‌ప‌డేందుకు వ‌చ్చిన అరుణ్.. ఇక్క‌డి ఇంధ‌న స‌వాళ్ల‌ను గుర్తించాడు. దానికి జియోథ‌ర్మ‌ల్ ఎన‌ర్జీ ఒక చక్కటి ప‌రిష్కారంగా ఆలోచించాడు. ట్రాన్ కంపెనీ ఇండియ‌న్ బ్రాంచ్ లో అరుణ్ కు మంద‌ర్ క‌లిశాడు. మంద‌ర్ ముంబై యూనివ‌ర్సిటీ స్టూడెంట్. ఐఐఎంబీలో ఎంబీఏ చేశాడు. బిల్డింగ్ సిస్ట‌మ్స్ విభాగం, జియో ఎక్స్‌చేంజి హీటింగ్ అండ్ కూలింగ్ సిస్ట‌మ్స్‌లో మంద‌ర్ కు 15 ఏళ్ల అనుభ‌వం ఉంది. భార‌త్‌, యూఏఈ, యూఎస్ఏలో ఉద్యోగాలు చేశాడు. సేమ్ టు సేమ్ మంద‌ర్ ది కూడా అరుణ్ త‌ర‌హా ఆలోచ‌నా విధాన‌మే! పుట్టిన గ‌డ్డ మీద ఒక పారిశ్రామికవేత్త‌గా ఎదిగేందుకు గ‌ల్ఫ్ నుంచి ఇండియా తిరిగొచ్చేశాడు. అరుణ్ తో క‌లిసి గిబ్స్ అనే సంస్థ‌ను స్థాపించాడు. ఇద్ద‌రికీ టాలెంట్ కు కొదవలేదు. అంత‌కుమించిన ఆత్మ‌విశ్వాసం ఉంది. 20 ఏళ్ల‌ జియోథ‌ర్మ‌ల్ అనుభ‌వాన్ని రంగ‌రించి ఇద్ద‌రూ కెరీర్ వైపు అడుగులేశారు.

గిబ్స్ సంస్థ వినూత్న‌మైన ఆలోచ‌న‌తో ఏర్పాటైంది. విద్యుత్ వినియోగాన్ని త‌గ్గించే ప్ర‌ణాళిక‌ల‌తో మార్కెట్లోకి వ‌చ్చింది. జియోథ‌ర్మ‌ల్ టెక్నాల‌జీతో ఎయిర్ కండీష‌నింగ్! డిఫ‌రెంట్ ఐడియా! వర్కవుట్ అవుతుందా లేదా సందేహం? కానీ అయింది. అరుణ్, మంద‌ర్ ఊహించిందే జ‌రిగింది. అన‌తికాలంలోనే వ్యాపారం వేగం పుంజుకుంది. ముంబైలో హెడ్ క్వార్ట‌ర్స్. ఆ త‌ర్వాత వ్యాపారం ఢిల్లీ, బెంగ‌ళూరు, హైద‌రాబాద్ ల‌కు విస్త‌రించింది. సింగ‌పూర్ లో బ్రాంచి ఓపెనింగ్ తో బిజినెస్ ఎక్కడికో వెళ్లింది. జియోథ‌ర్మ‌ల్ టెక్నాల‌జీ ద్వారా పెద్ద పెద్ద ఆఫీసులు, వ్యాపార‌ సంస్థ‌ల్లో ఏటా ఎనిమిది మిలియ‌న్ ఎల‌క్ట్రిక‌ల్ యూనిట్లు పొదుపు చేయ‌డమంటే మాట‌లు కాదు! కానీ గిబ్స్ సంస్థ చేసి చూపించింది. ఏటా 150 మిలియ‌న్ లీట‌ర్ల నీటిని పొదుపు చేసింది. సుమారు 400 బిల్డింగ్‌ల‌కు గిబ్స్ టెక్నాల‌జీని అందిస్తోంది.

ఏమిటీ జియోథ‌ర్మ‌ల్ టెక్నాల‌జీ?

మామూలు ఎయిర్ కండీష‌నింగ్ విద్యుత్ ఎక్కువ‌గా వినియోగించుకుంటుంది. అదే జియోథ‌ర్మ‌ల్ టెక్నాల‌జీ ద్వారా 60 శాతం దాకా విద్యుత్ ఆదా చేయ‌వ‌చ్చు. ఈ టెక్నాల‌జీలో నేల లోపలి పొర‌ల్లోని వేడిని ఉప‌యోగిస్తారు. భూమిలోని ఉష్ణశ‌క్తి ద్వారా విద్యుత్ త‌యారు చేసి, దాన్ని ఎయిర్ కండీష‌న‌ర్ల‌ల‌లోకి పంపిస్తారు. సాధార‌ణంగా ఎయిర్ కండీష‌న‌ర్లు గంట‌కు వాతావ‌ర‌ణంలోని 10 లీటర్ల నీటిని వినియోగించుకుంటాయి. జియోథ‌ర్మ‌ల్ ఎయిర్ కండీష‌న్ల‌లో ఆ నీటిని కూలింగ్ ట‌వ‌ర్ల ద్వారా విద్యుత్ వినియోగానికి ఉప‌యోగిస్తారు.

జియో థర్మల్ కూలర్

జియో థర్మల్ కూలర్


భార‌త్ లోని ప్ర‌తీ బిల్డింగ్ ను నెట్ జీరో ఎన‌ర్జీ బిల్డింగ్ గా మార్చాల‌న్న‌దే గిబ్స్ సంస్థ ల‌క్ష్యం. భ‌వ‌నాల్లోని విద్యుత్ వినియోగాన్ని సుమారు 60 శాతానికి త‌గ్గించ‌డం, ఎల్ఈడీ ద్వారా విద్యుత్ వెలుగులు అందించాల‌న్న‌ది ఆలోచ‌న‌.

జియోథ‌ర్మ‌ల్ టెక్నాల‌జీని ఇండియా లాంటి దేశాల్లో ఒక నేష‌న‌ల్ పాల‌సీగా తీసుకోవ‌డం ద్వారా దేశ విద్యుత్ డిమాండ్‌కు కొంత ప‌రిష్కారం దొరికే అవ‌కాశం ఉందంటున్నారు గిబ్స్ సంస్థ ప్ర‌తినిధులు. ఇలా చేయ‌డం ద్వారా సుమారు 35 శాతం విద్యుత్‌ను ఆదా చేయోచ్చ‌ని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక అవ‌స‌రాల‌కు 30 శాతం నీటి వినియోగం త‌గ్గించ‌డంతో పాటు 22 మెట్రిక్ ట‌న్నుల గ్రీన్ హౌస్ వాయువుల వాడ‌కాన్ని కూడా క‌ట్టి చేసే వీలుందంటున్నారు గిబ్స్ ప్ర‌తినిధులు.

మార్కెట్లో జియోథ‌ర్మ‌ల్ టెక్నాల‌జీ..

జియోథ‌ర్మ‌ల్ మార్కెట్ భార‌త్‌లో ఇప్ప‌టికే రూ. 70వేల కోట్లకు చేరింది. పారిశ్రామిక అవ‌స‌రాల‌కు మాత్ర‌మే దీన్ని విన‌యోగిస్తున్నారు. రానున్న ప‌దేళ్ల‌లో సుమారు 300 శాతం వ‌ర‌కూ జియోథ‌ర్మ‌ల్ టెక్నాల‌జీ వినియోగం పెరిగే అవ‌కాశం ఉంది. దేశంలోని జియోథ‌ర్మ‌ల్ నిపుణుల అంచ‌నా ప్ర‌కారం.. రానున్న మూడు సంవత్స‌రాల్లో జియోథ‌ర్మ‌ల్ టెక్నాల‌జీ విస్తృతంగా అందుబాటులోకి రానుంది. కేంద్ర ఇంధ‌న వ‌న‌రుల మంత్రిత్వ శాఖ 2015 ఫిబ్ర‌వ‌రిలోనే నేష‌న‌ల్ జియోథ‌ర్మ‌ల్ పాల‌సీని రూపొందించింది. అలాగే స్మార్ట్ సిటీల నిర్మాణంలో కూడా ఈ టెక్నాల‌జీని వినియోగించ‌నున్నారు.

జియోథ‌ర్మ‌ల్ స్ట్రాట‌జీ, డిజైన్లు, జియోథ‌ర్మ‌ల్ వాల్ట్‌ భార‌త్‌లోని 29 న‌గ‌రాల్లో జియోథ‌ర్మ‌ల్ డాటాకు సంబంధించిన నాలుగు పేటెంట్ల‌ను గిబ్స్ ద‌క్కించుకుంది. అలాగే 11 మందితో కూడిన జియోథ‌ర్మ‌ల్ ఎక్స్‌ప‌ర్ట్ టీం సైతం గిబ్స్‌తో కలిసి ప‌నిచేస్తోంది. రానున్న రెండు మూడేళ్ల‌లో వ్యాపార అవ‌స‌రాల‌కు జియోథ‌ర్మ‌ల్ టెక్నాల‌జీని ఎలా ఉప‌యోగించాల‌న్న దానిపై ఫౌండ‌ర్లు ప‌నిచేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ టెక్నాల‌జీకి సంబంధించిన సర్వీస్ కేంద్రాల‌ను మొహాలీ, బ‌ళ్లారిల‌లో ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ టెక్నాల‌జీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ను అందుబాటులో ఉంచింది. టెక్నాల‌జీతో స‌మ‌స్య‌ల‌ను త‌లెత్త‌కుండా జీరో టైమ్ స‌ర్వీసును అందిస్తోంది.

ప్ర‌తిభ‌కు ప‌ట్టం..

గిబ్స్ సంస్థ ప్రతిష్టాత్మక కేంద్ర సైన్స్ అండ్ టెక్నాల‌జీ మినిస్ట్రీ నుంచి అవార్డు అందుకుంది. అలాగే వర‌ల్డ్ వైడ్ ఫండ్ ఆఫ్ నేచ‌ర్ నుంచి క్లైమేట్ సాల్వ‌ర్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకుంది. మారికో ఇండియా ఇన్నోవేష‌న్ - 2016లో సత్తా చాటింది. గ‌త డిసెంబ‌ర్ లో మొహాలీలోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంప‌స్ స్మార్టెస్ట్ బిల్డింగ్ ఇన్ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది. ఈ బిల్డింగ్ లో గిబ్స్ జియోథ‌ర్మ‌ల్ ఎయిర్ కండీష‌న‌ర్స్‌ను వాడుతూ 30 శాతం విద్యుత్ ఆదా చేస్తున్నారు. ఏటా సుమారు 13 మిలియ‌న్ లీట‌ర్ల నీటిని పొదుపు చేస్తున్నారు. ఈ మొత్తం మూడున్నర ఏళ్ల పాటు ట్యాప్ క‌ట్టేయకుండా వదిలేస్తే వృథాగా పోయే నీటికి స‌మానం!

నిధుల స‌మీక‌ర‌ణ‌..

2012 నుంచి గిబ్స్ కంపెనీ పెట్టుబ‌డుల‌ను పెంచుకుంటూ వ‌స్తోంది. హైద‌రాబాద్ కు చెందిన‌ శ్రీ కాపిటల్ అనే సంస్థ నుంచి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించింది. ఇన్‌ఫ్యూస్ వెంచ‌ర్స్ నుంచి ఫండ్ రెయిజ్ చేసింది. ఇలా అనేక సంస్థ‌లు గిబ్స్ సంస్థ‌కు వెన్నుద‌న్నుగా నిలిచి ప్రోత్సాహం అందిస్తున్నాయి. రానున్న నాలుగేళ్ల‌లో రూ. 600 కోట్ల ట‌ర్నోవ‌ర్ సాధిస్తామ‌ని గిబ్స్ సంస్థ ప్ర‌తినిధులు చెప్తున్నారు.

వెబ్ సైట్