రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ

రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ

Sunday April 30, 2017,

2 min Read

రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ తెలంగాణలో అడుగు పెట్టబోతోంది. ఇండియాలో మొత్తం 50 స్టోర్లు తెరుస్తున్న వాల్ మార్ట్ కంపెనీ.. అందులో పదింటిని తెలంగాణలో ప్రారంభించబోతోంది. ఈ మేరకు వాల్ మార్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, వాల్ మార్ట్ సీఈవో క్రిష్ అయ్యర్, వాల్ మార్ట్ ఆసియా, కెనడా సీఈవో సమక్షంలో ఈ అగ్రిమెంట్ కుదిరింది.

image


వాల్ మార్ట్ కంపెనీతో ఒప్పందం కుదరడం గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే ఐదేళ్లలో వాల్ మార్ట్ తెలంగాణ రాష్ట్రంలో 10 స్టోర్లు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఐదు, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి సిటీల్లో మరో ఐదు స్టోర్లు ప్రారంభిస్తుందని చెప్పారు. ఒక్కో స్టోర్‌లో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వాల్ మార్ట్‌కు ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తున్న ఆయన.. సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఒకేసారి ఇస్తామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే రిటైల్ పాలసీని తీసుకొస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా వాల్ మార్ట్ స్టోర్ల ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అటు వాల్ మార్ట్ కూడా తెలంగాణతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలు, చిన్న సన్న కారు రైతులతో వాల్ మార్ట్ కలిసి పనిచేస్తుందని వివరించారు. ఇండియాలో మొత్తం 50 స్టోర్లు తెరుస్తుంటే.. అందులో 20 శాతం తెలంగాణలో ఏర్పాటు చేయడం తెలంగాణ సాధిస్తున్న ప్రగతికి నిదర్శనమన్నారు కేటీఆర్.

అనంతరం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన బీఎస్‌ఈ డిజాస్టర్ రికవరీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. డిజాస్టర్ సెంటర్లో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రపంచంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్ ఒకటన్న ఆయన.. ఇక్కడి దక్కన్ పీఠభూమికి భూకంపాల ముప్పు ఉండదని చెప్పారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీలన్నీ నగరానికి వస్తున్నాయన్నారు. త్వరలోనే భాగ్యనగరంలో డేటా సెంటర్ క్యాంపస్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.