కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేసి పంచర్లు వేస్తున్నారు !

కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేశారు.. టైర్ పంచర్ విభాగంలో కోట్ల రూపాయల మార్కెట్ ఉందని గుర్తించారు..పంచర్ల వ్యాపారేంటి ? అని తక్కువగా చూడొద్దు అంటున్న ముగ్గురు మిత్రులు..

కార్పొరేట్ ఉద్యోగాలు వదిలేసి పంచర్లు వేస్తున్నారు !

Monday July 20, 2015,

4 min Read

21వ శతాబ్దం మొదలయ్యాక అనేక రంగాలు సంఘటితంగా మారుతున్నాయి. చివరకు నిత్యావసరాలు, సరుకులు అమ్మే రిటైల్ రంగం కూడా సంస్థాగతంగా మారిపోతోంది. గత దశాబ్దంగా ఈ వేగం మరీ స్పీడ్‌గా ఉంది. అయితే.. సర్వీస్ రంగం మాత్రం ఇంకా అసంఘటిత విభాగంగా కొట్టుమిట్టాడుతోంది.

image


సర్వీస్ సెక్టార్‌లో టైర్ కేర్ విభాగం చాలావరకూ విధానాలు లేకుండా, అసంఘటితంగా ఉంది. “సరైన విధాన నిర్మాణం లేని టైర్ల నిర్వహణ రంగాన్ని ఓ సక్రమమైన నిర్మాణ విధానంలోకి మార్చడమే... ఈ వెంచర్ వెనుక ఉన్న ఆలోచన. ఈ రంగాన్ని పారదర్శకంగాను, ఆటోమేటిక్ విధానంలోకి మార్చే యోచనతోనే పంచర్‌మేన్ ప్రారంభమైంద”న్నారు సహ వ్యవస్థాపకులు వికాస్ కౌల్.

ఆలోచనకు ఆరంభం ఇలా

పంచర్‌మేన్‌ను ముగ్గురు కలిసి ప్రారంభించారు. వికాస్ కౌల్, సౌరవ్ చౌధరీ, భాస్కర్ ఆలపాటి.. ఆ ముగ్గురు. తామంతా ఉద్యోగాల కోసం కోల్‌కతాలో పనిచేయడం యాదృచ్ఛికం అని చెబ్తారు వికాస్. ఈయన ఎయిర్‌టెల్‍లో నేషనల్ డిస్ట్రిబ్యూషన్ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. ఈ పంచర్‌మేన్‌లో ప్రవేశించేందుకు ముందు ఆయనకున్న మొత్తం 18 సంవత్సరాల ప్రొఫెషనల్ అనుభవం ఉంది. చమురు రంగంలో 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది సౌరవ్‌కు. బ్రిటిష్ పెట్రోలియం, ఎక్సాన్ మొబిల్ సహా.. పలు ఆయిల్ కంపెనీలలో పని చేశారు. 24 సంవత్సరాల అనుభవం ఉన్న భాస్కర్... అందులో 23ఏళ్లు అపోలో టైర్స్‌లోనే విధులు నిర్వహించారు.

కోల్‌కతాలోని టాలీగంజ్ క్లబ్‌లో ఓ సాయంత్రం అది. ఈ ముగ్గురూ... యువ పారిశ్రామికవేత్తల గురించి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని, జీవితాలను సులభతరం చేస్తున్న ఈ తరం యువత ప్రతిభపై వారి మాటలు జరుగుతున్నాయి. తద్వారా కొత్తమార్కెట్ అవకాశాలను సృష్టించగలుగుతున్న విషయాన్ని వారంతా ఏకకంఠంతో అంగీకరించారు.

ఈ డిస్కషన్ సీరియస్‌గా మారింది. జీవనాన్ని ఈజీగా మార్చడంలో... ఈకామర్స్ ఒకటే కాదు.. సాధారణమైన బ్రిక్ & మోర్టార్ (షాప్) విధానం కూడా ఈ పని చేయగలదనే వాదన మొదలైంది. తమ అపారమైన, సుదీర్ఘమైన అనుభవాన్ని ఉపయోగించి, ఏదైనాప్రత్యామ్నాయ పరిష్కారం దిశగా ఆలోచించారు వారంతా.

అనుభవాన్ని రంగరించి వెంచర్‌‌కు శ్రీకారం

“మనలో ఒకరికి టైర్ పరిశ్రమలో 23ఏళ్ల అనుభవం అనుభవం ఉంది. ఈ రంగంలో ఎదురయ్యే సమస్యలు అందరికీ సుపరిచితమే. దీనికో చక్కని సొల్యూషన్ చూపచ్చనే ఆలోచన వచ్చింది. అలాగా మిగిలినవారు ఇతర రంగాల నుంచి వచ్చినవారు కావడంతో మా ఆలోచనలకు పదును పెట్టేందుకు వీలైంద”ని చెప్పారు వికాస్.

ఆలోచనను అమలు చేసిన తీరు

అనుభవజ్ఞులైన ఈ వ్యవస్థాపక త్రయానికి.. తామేం చేయాలో కరెక్ట్‌గానే తెలుసు. అయితే, దీన్ని ఏ విధంగా సాధించాలో మాత్రం స్పష్టత లోపించింది. మంతనాలకే సమయం గడిచిపోతున్న సమయంలో... సైమన్ సినెక్ చూపించి 'ది గోల్డెన్ సర్కిల్స్‌ను' చూడడం సంభవించింది. ఇది వారి ఆలోచనల్లో సంపూర్ణమైన మార్పులను తీసుకొచ్చింది. సమస్యను బయట నుంచి కాకుండా... అంతర్గతంగా పరిశీలించాలనే విషయం అర్ధమైంది. “ఆ రోజు నుంచి మాకు ప్రతీ ఒక్క అంశం, గతంలో మేం అనుభవించిన విషయాలతో సహా... అన్నీ వేరే కోణంలో కనిపిస్తున్నాయి. ” అని చెప్పారు వికాస్.

image


వదిలేసి మొదలుపెట్టడమే అసలు సమస్య

పంచర్‌మేన్ ఫౌండింగ్ టీంలో ఉన్నవారంతా... తమ తమ రంగాల్లో సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారే. అలాగే అందరకూ తమ కెరీర్‌లో పీక్ స్టేజ్‍‌‌‍‌లో ఉన్నవారే. ఈ సమయంలో ఉద్యోగాలు వదిలేయడం, అది కూడా అత్యధిక వేతనాల పొందే సమయంలో విడిచిపెట్టడం అంత సులభం కాలేదు. ఉద్యోగాల్లో ఎంతోకాలం చాలా కష్టపడి ఓ స్థాయికి చేరుకున్నాక.. హఠాత్తుగా ఓ కొత్త వెంచర్ కోసం వాటిని వదిలేయడం కష్టమైన విషయం. అయితే వారి కలల ప్రాజెక్టు సాకారం చేసుకునేందుకు ఈ నిర్ణయం తప్పలేదు వారికి. నైపుణ్యం గల యువత ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారుతున్న వైనాన్ని చూసి.. వారితో పోల్చితే అనుభవం, సమస్యలను డీల్ చేయగల నైపుణ్యం తమకు ఎక్కువగా ఉంటాయని... అందుకే ఈ పంచర్‌మేన్‌ను వెంచర్ రూపంలో తెచ్చామని చెబ్తున్నారు వికాస్.

పంచర్‌మేన్ పేరుతో ప్రారంభించిన ఈ వెంచర్.. 2013అక్టోబర్‌లో లాంఛ్ అయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 నగరాల్లోని 175 కియోస్క్‌ల ద్వారా సేవలందిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూనే, హైద్రాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, గుర్‌గావ్, నోయిడా, ఫరీదాబాద్, మీరట్, బరేలీ, డెహ్రాడూన్, మథుర, ఆగ్రా, నాగ్‌పూర్, తిరుపతి, వారణాశి, గోవా, ఘజియాబాద్, మొరాదాబాద్, హల్దియాల్లో పంచర్‌మేన్ సేవలు అందుబాటలో ఉన్నాయి.

“ఫిట్టర్స్‌ను కియోస్క్ నిర్వహణకు వీలుగా శిక్షణ ఇవ్వడమే అతి పెద్ద ఛాలెంజ్. కస్టమర్లకు తగిన సర్వీస్ అందిచడమే కాదు, వారికి ప్రత్యేకమైన సేవలు అందించామనే అనుభూతి కూడా మిగలాలి. దేశం మొత్తంమీద ప్రతీనెలా లక్ష మందికి పైగా కస్టమర్లకు సేవలు అందించగలుగుతున్నాం. ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది” అన్నారు వికాస్.

మార్కెట్‌లో ఒక్కో అడుగూ

“ఫార్చూన్ 500 జాబితాలోని నవరత్న కంపెనీ ఇండియన్ ఆయిల్‌తో ఒప్పందం చేసుకోవడం... మా వ్యాపారంలో కీలకమైన అడుగు. ఆ తర్వాత అనేక టైఅప్స్‌కు ఇది మాకు సహకరించింది”అని చెప్పారు వికాస్.

పంచర్‌మాన్ కియోస్క్‌లు అన్నిటిలోనూ ఆటోమేటిక్‌గా టైర్లు మార్చే మిషన్ ఉంటుంది. దీంతో ఎక్కడా సుత్తుల వంటి వస్తువులు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నిర్వహిస్తున్న కియోస్క్‌లలో 40శాతం 24x7 నడుస్తున్నాయని, చాలావరకూ పబ్లిక్ ప్రాంతాల్లోనే ఉంటాయి. దీంతో మహిళా డ్రైవర్లు భద్రతపై భయపడాల్సిన అవసరం ఉండదు.

“రోడ్డు పక్కన రిపేర్ షాపుల్లో టైర్, ట్యూబులకు పైనుంచి పంచర్లకు సర్వీస్ చేస్తారు. అయితే.. మా కియోస్క్‌లలో ఇది లోపలి నుంచి బయటకు ఉంటుంది. దీంతో ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవడమేకాదు... అదే ప్లేస్‌లో మరోసారి పంచర్ కాకుండా ఉంటుంద”ని తమ సర్వీస్ విధానాన్ని వికాస్ వివరించారు.

టైర్స్, ట్యూబ్స్ విప్పదీసేందుకు కియోస్క్‌లలో ఎయిర్ ప్రెజర్‌తో పనిచేసే టూల్స్ ఉపయోగిస్తారు. దీంతో రిమ్‌ల స్టీల్ కార్డ్‌‌లకు ఎలాంటి హాని జరగదు.

పంచర్లకు ₹8వేల కోట్లు

టైర్లకు పంచర్లకు సర్వీస్ పరిశ్రమ విలువ మన దేశంలో ₹8వేల కోట్లకు పైగానే. ఇప్పుడు అనేక కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇదే విభాగంలో పోటీ పడుతున్న మరో కంపెనీ ఛేంజ్‌మైటైర్. టైర్ సర్వీస్ విభాగాన్ని విధానపరంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది ఈ స్టార్టప్ కూడా.

అందుబాటులో ఉన్న గణాంకాలు, నివేదికల ప్రకారం.. అమ్ముడవుతున్న వాటిలో మూడో వంతు మాత్రమే సర్వీసింగ్ కోసం డీలర్ల దగ్గరకు వస్తున్నాయి. అనేక మంది కార్ ఓనర్లు వారి వాహనాల సర్వీస్ కోసం వన్ స్టాప్ సొల్యూషన్ కోసం వెతుకుతున్నారు. మారుతీ వంటి బడా ఆటోమొబైల్ కంపెనీలు కూడా.. 24X7 సర్వీస్ సెంటర్లను ప్రారంభించి... తమ కంపెనీ కార్లకు ఆన్ రోడ్ సర్వీసింగ్ అందిస్తున్నాయి.

“పంచర్‌మేన్ నిర్వహణకు సొంత నిధులనే వెచ్చిస్తున్నాం. మాకొచ్చే ఆదాయం కంపెనీ నిర్వహణతోపాటు, అభివృద్ధి ప్రణాళికలకు సరిపోతుందని భావిస్తున్నాం. మొత్తం ఆదాయంలో 25శాతం మార్జిన్స్ గడించడం పెద్ద విషయమే”నన్నారు వికాస్.

2015చివరినాటికి కియోస్క్‌ల సంఖ్యను 500లకు పెంచేందుకు ప్రయత్నిస్తోంది పంచర్‌మేన్. టర్నోవర్‌ను ₹50 కోట్లకు చేర్చాలన్నది వీరి ప్రధాన లక్ష్యం. త్వరలో కియోస్క్‌లలో కౌంటర్స్ ద్వారా పలు ప్రొడక్టులను విక్రయించే యోచన ఉంది. దీని ద్వారా ఆయా కియోస్క్‌లకు రెవెన్యూ పెంచాలన్నది వీరి ఆలోచన.

వెబ్‌‍‍సైట్