దక్కన్ అందాలు చూసొద్దాం రండి..!!

నేడు జాతీయ పర్యాటక దినోత్సవం 

0

17వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు టావెర్నియర్ హైదరాబాదులో పర్యటించి ఇక్కడి ఉద్యానవనాలకు, సరస్సుల శోభకు ముగ్దడయ్యాడు. నాటి నుంచి నేటి వరకు హైదరాబాద్ అందం రెట్టింపయ్యేందే కానీ, కించిత్ తరగలేదు. అంతర్జాతీయంగా ఎప్పుడు సర్వే చేసినా.. సాహో హైదరాబాద్ అనాల్సిందే. ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు, పండుగలకు, సాహితీ సభలకు హైదరాబాద్ వేదికైంది. ఈమధ్యనే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఆకాశంలో హరివిల్లును సాక్షాత్కరింపజేసింది. టూరిజం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజంపై యువర్ స్టోరీ స్పెషల్ లుక్.

చార్మినార్. ప్రపంచంలో ఏ కట్టడమూ దీనంత ఫోటోజెనిక్ కాదు. సాలార్జంగ్ మ్యూజియం.. ఎప్పుడు సందర్శించినా చరిత్రను కొత్తగా కళ్లముందు నిలబెడుతుంది. గోల్కొండ సౌండ్ అండ్ లైట్ షో.. ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. హన్మకొండ వేయిస్తంభాల గుడి.. రాతిస్తంభాల్లో శబ్దనాదాలు వేయిభావాలు రేకెత్తించేలా ఉంటాయి. లక్నవరం చెరువు.. కళ్లలో సముద్రాన్ని ఒంపుకున్న భావన కలుగుతుంది. మరులుగొలిపే రామప్ప శిల్పాలు.. మనసుని మార్దవంగా తడిమే కుంటాల, పొచ్చర జలపాతాలు. ఈమధ్యే వెలుగులోకి వచ్చిన మల్లూరు గుట్టలు.. పాండవుల గుహలు.. భద్రాద్రి, యాదాద్రి, బాసర, వేములవాడ, కాళేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలు.. నాగార్జునసాగర్, జూరాల, మానేరు, ఎస్సారెస్పీ, కిన్నెరసాని లాంటి ప్రాజెక్టులు.. ఇలా ఒకట రెండా తెలంగాణ యాత్రాస్థలాలు, దర్శనీయ ప్రదేశాలు కోకొల్లలు. అందుకే టూరిజం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది సర్కారు.

చారిత్రక కట్టడాలకు గుర్తింపునిస్తూనే, తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఆత్మను, బాహ్యసౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలన్న ఉద్దేశంతో.. గతంలో కంటే ఎక్కువ బడ్జెట్ కేటాయించింది. ఈసారి ప్రభుత్వం టూరిజం డెవలప్ మెంట్ కోసం ఏకంగా 600 కోట్లు ఖర్చు చేయబోతోంది. 40-50 స్పీడ్ బోట్లు కొనుగోలు చేస్తున్నారు. వాటితో పాటు 4-5 క్రూయిజ్ లు కొంటున్నారు. అలీసాగర్ ప్రాజెక్టు దగ్గర 16 ఏసీ గెస్ట్ రూంలు కడుతున్నారు. ఆరు నెలల్లో అది పూర్తయితే బోటు షికారు చేయొచ్చు. ఈ మధ్యనే అసిఫాబాద్ దగ్గర సప్తహాం పేరుతో ఏడు వరుస జలపాతాలు బయటపడ్డాయి. త్వరలో వాటికి ప్రచారం కల్పించబోతున్నారు.

ఏటా పర్యాటకుల తాకిడి 15 నుంచి 20 శాతం పెరుగుతోంది. ముఖ్యంగా విదేశీ టూరిస్టులను ఆకర్షించడానికి అడ్వెంచర్ టూరిజానికి పెద్దపీట వేస్తున్నారు. భవనగిరి ఖిలా రాక్ క్లయింబింగ్ ఆల్రెడీ ఉంది. త్వరలో కేబుల్ కార్ పెట్టి, పారా గ్లెయిడింగ్ ప్రవేశపెట్టబోతున్నారు. మల్లూరు గుట్టల్లోనూ ట్రెక్కింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే భూపాలపల్లి జిల్లా రేగొండ దగ్గర మైలారం గుహలు బయటపడ్డాయి. వాటినీ అభివృద్ధి చేయబోతున్నారు. దాంతోపాటు పాండవుల గుట్టలను టూరిజం స్పాట్‌ గా డెవలప్ చేస్తున్నారు.

బుద్ధుడు బతికున్నప్పుడే ఇక్కడ బుద్ధిజం మొదలైందని బాహ్య ప్రపంచానికి చెప్పబోతోంది సర్కారు. ఆ నేపథ్యంలోనే త్వరలో వరల్డ్ బుద్దిజం సదస్సు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. భారతదేశాన్నంతా ఒక నగరంలో చూడాలంటే హైదరాబాదుకి రండి.. భారతదేశాన్నంతా ఒక రాష్ట్రంలో చూడాలంటే తెలంగాణకు రండి.. ఇదే నినాదంతో ముందుకు పోతోంది టూరిజం శాఖ.

ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెందిందంటే దానికి సూచిక.. అక్కడి ప్రజల వెసులుబాటు. పనినుంచి తీరిక దొరకిందంటే మనసు రిలాక్సేషన్ కోరుకుంటుంది. కొత్తకొత్త ప్రదేశాలు చుట్టిరావాలన్న కాంక్ష పెరుగుతుంది. లీజర్ పీరియడ్, ట్రావెల్ మూడ్.. ప్రపచంలో నడుస్తున్న ట్రెండ్ ఇదే. ఆ ట్రెండుకు తగ్గట్టే ప్రభుత్వం.. ఈ ప్రాంత గతవైభవాన్ని ఆవిష్కరిస్తోంది. ప్రపంచ పర్యాటక రంగంలో తెలంగాణ చిత్రపటానికి తరగని మెరుగులు దిద్దుతోంది.

Related Stories

Stories by team ys telugu