పంపులో నీళ్లు రావట్లేదా..? నో ప్రాబ్లం "పంప్ కార్ట్" ఉందిగా..!

దేశంలోనే మొట్టమొదటి ఆన్ లైన్ పంపుల స్టార్టప్  

0


స్థలం: అమెరికాలో ఓ పెద్ద కాన్ఫరెన్స్ హాల్.

అంశం: డిజిటల్ ఇండియాపై కాన్ఫరెన్స్

"డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్ వల్ల భారత్ వృద్ధి శరవేగంగా ముందుకు వెళ్తుంది. దీనికి చక్కటి ఉదాహరణ "పంప్ కార్ట్". ఈ సంస్థ ఆన్ లైన్ బిజినెస్ మోడల్ సామాన్యులకు దగ్గరగా ఉంటుంది..." ఈ కామెంట్ వచ్చిన వెంటనే సమావేశం హాలు మొత్తం చప్పట్లతో హోరెత్తింది.

ఫ్లిప్ కార్ట్ అనబోయి పంప్ కార్ట్ అన్నారేమోనన్న సందేహం ఒక్కరికి కూడా రాలేదు. ఎందుకంటే ఈ మాటలన్నది.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్. ఆ సమావేశంలో వేదికపై ఉన్నది భారత ప్రధాని సహా ప్రవాస పారిశ్రామికవేత్తలు, అమెరికన్ భాగస్వాములు, ఇంకా అనేక మంది ప్రవాసులు.

ఇంతకీ ఏమిటి ఈ పంప్ కార్ట్..?

గూగుల్ సీఈవోతో ప్రశంసలు పొందిన పంప్ కార్ట్ ..బిజినెస్ టు బిజినెస్ మోడల్ ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్. దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లోనూ మోటర్ పంపు ఉండటం కామన్. రోజు ప్రారంభమయ్యేది.. నీళ్లు పట్టుకోవడంతోనే అంటే అతిశయోక్తి కాదు. అంతలా భాగమైన పంపుల కోసం .. కొత్తవి కొనుక్కోవడం కోసం... కొత్త కొత్త పంపుల ఉత్పత్తును మార్కెట్లోకి తేవడం కోసం ఆవిర్భవించిన స్టార్టప్ "పంప్ కార్ట్". ఉత్పత్తిదారులకు, అమ్మకందారులకు, కొనుగోదారులందరికీ మోటార్ల అమ్మకం, కొనుగోళ్ల కోసం చక్కని ఫ్లాట్ ఫామ్ అందిస్తోంది. ఇతర ఈ కామర్స్ సైట్స్ కు తీసిపోకుండా అన్ని రకాల పేమెంట్స్ ఆప్షన్స్, క్యాష్ ఆన్ డెలివరి, ఈఎమ్ఐల ద్వారా కూడా మోటార్లను అందిస్తోంది. చండీగఢ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ స్టార్టప్ 200 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, వెయ్యి మందికిపైగా డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు చేసుకుంది.

పంప్ కార్ట్ ఫౌండర్ చండీగఢ్ నివాసి కేఎస్ భాటియా. బెంగళూరులో కెమికల్ ఇంజినీరింగ్, ఘజియాబాద్ లో ఎంబీఎ చదివారు. ఆ తర్వాత 1998లో ఎయిర్ ఫ్లూయిడ్ ఇంజినీర్స్ అండ్ ఎక్విప్ మెంట్స్ పేరుతో కంపెనీని స్థాపించారు. పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, స్టేట్ హౌసింగ్ డిపార్ట్ మెంట్, ఎయిర్ కండీషనింగ్ కంపెనీలకు పంపింగ్ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టింది. అలాగే ఫైర్ ఫైటింగ్, ఫ్లంబింగ్, సీవేజ్ కాంట్రాక్టులు కూడా చేస్తోంది.

పంప్ కార్ట్ బృందంతో కెఎస్ భాటియా
పంప్ కార్ట్ బృందంతో కెఎస్ భాటియా

ఆన్ లైన్ పంపింగ్..

తన ప్రాజెక్టుల్లో ఎంత మునిగి తేలుతున్నా కేఎస్ భాటియాకు కొత్త అలోచనలంటే అమితమైన ఇష్టం. తన పద్నాలుగేళ్ల కుమారుడు ఆగ్మన్ దీప్ ఇచ్చిన చిన్న ఐడియా విపరీతంగా నచ్చడంతో ఆన్ లైన్ స్టార్టప్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. వేగంగా దానికి సంబంధించిన కసరత్తులు పూర్తిచేసి 2014 జూన్ లో సైట్ ను లాంఛ్ చేశారు. పంపింగ్ రంగంలో విశేష అనుభవం, మంచి పేరు ఉండటంతో పంప్ కార్ట్ కు మొదటి నుంచి మంచి ఫలితాలే వచ్చాయి. ప్రొత్సాహకరమైన ఆర్డర్లు లభించాయి. దాంతో తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్ల నెట్ వర్క్ ను పెంచుకుంటూ పోయారు. ఫ్రీ ఇన్ స్టలేషన్, వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తున్నారు. ప్రారంభించిన మొదట్లో ... నెలకు ఏడు పంపులను ఆన్ లైన్లో అమ్మిన పంప్ కార్ట్.. అతి తక్కువ సమయంలోనే ఏడు వందల సంఖ్యను దాటింది. ఇప్పుడు రోజుకు నలభై నుంచి యాభై పంపులను యావరేజ్ గా అమ్ముతున్నారు.

"గత పదిహేనేళ్లుగా పంపుల పరిశ్రమలో ఉన్నాను. రోజువారీ జీవితంలో పంపుల ప్రాముఖ్యతను ప్రజలకు తెలిసేలా చేసేందుకు విపరీతంగా కృషి చేస్తున్నాను. గృహ, వ్యాపార, వ్యవసాయ అవసరాలకు తగ్గట్లుగా మెరుగైన పంపులను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాము"-కేఎస్ భాటియా  

ఆఫ్ లైన్ మార్కెట్ పైనా కన్ను..!

పంపింగ్ రంగంలో ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ కావల్సినంత మార్కెట్ ఉందని కెఎస్ భాటిగా గట్టిగా నమ్ముతున్నారు. అందకే ఆఫ్ లైన్ రంగంలోని పంప్ కార్ట్ బ్రాండ్ పేరుతోనే షాపులు ఓపెన్ చేస్తున్నారు. మొదటి ఫ్లాగ్ షిప్ స్టోర్ ను చండీగఢ్ లో గత ఫిబ్రవరిలోనే ప్రారంభించారు. ఫ్రాంఛైజీ మోడల్ ద్వారా వచ్చే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా వంద స్టోర్లను ప్రారంభించాలనే ఆలోచనలో కేఎస్ భాటియా ఉన్నారు. విభిన్నమైన వ్యాపార వ్యూహాలను ఇందుకోసం సిద్ధం చేసుకున్నారు.

ఇన్వెస్టర్లకు అవకాశం

పంప్ కార్ట్. కామ్ ప్రస్తుతం కెఎస్ భాటియా సొంత సంస్థ ఎయిర్ ఫ్లూయిడ్ ఇంజినీర్స్ అండ్ ఎక్విప్ మెంట్స్ ద్వారా ఫండింగ్ చేస్తున్నారు. కొంత వ్యక్తిగత సొమ్ము కూడా పెట్టుబడిగా పెట్టారు. కోటీ పాతిక లక్షలకుపైగా ఇప్పటికే ఇన్వెస్ట్ చేశారు. టెక్నికల్ సపోర్ట్, ఆన్ లైన్ ప్రమోషన్, కస్టమర్ సపోర్ట్, లాజిస్టిక్స్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగాల్లో ఇరవై మంది టీంతో ప్రస్తుతం నడుస్తోంది. తమ బిజినెస్ మోడల్ కు విపరీతమైన హైప్ రావడంతో... పంప్ కార్ట్ ను దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పెట్టుబడుల సమీకరణలో భాగంగా పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నారు.

" ఈ విభాగాన్ని ఇంత వరకూ ఎవరూ టచ్ చేయలేదు. డిస్కౌంట్లు ఇచ్చి.. తక్కువ ధరలకు అమ్మి మా జేబుల నుంచి సొమ్ము పెట్టడం మా విధానం కాదు. తక్కువ సమయంలో లాభాలను సాధించడమే మా లక్ష్యం"-కేఎస్ భాటియా 

విస్తరణకు వినూత్న మార్గాలు

మార్కెట్ ను పెంచుకునేందుకు పంప్ కార్ట్ అవకాశం ఉన్న అన్ని మార్గాలనూ ఉపయోగించుకుంటోంది. త్వరలో శానిటరీ వేర్, హార్డ్ వేర్, ప్లంబింగ్ షాపులతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వ్యూహం రెడీ చేసుకుంటున్నారు. సర్వీస్ మోడల్ ను పూర్తిస్థాయిలో అందుబాటులో తెచ్చేందుకు రిపేరింగ్ ఇండియా.కామ్ ను వచ్చే మూడు నాలుగేళ్లలో ప్రారంభించాలని భావిస్తున్నారు. భారత్ లోని రూరల్, సబర్బన్ ఏరియాలన్నింటినీ కవర్ చేసేలా దీన్ని తీర్చిదిద్దాలనే ప్రణాళికలు వేస్తున్నారు.  

ప్రభుత్వం మెచ్చి ఇచ్చిన కాంట్రాక్టులు

పనితీరు నచ్చడంతో భారత ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా రెండున్నర లక్షల కియోస్క్ లను ప్రారంభించేందుకు పంప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. కెన్ రిసెర్ట్ సంస్థ అధ్యయనం ప్రకారం భారత పంపుల మార్కెట్ ఏటా 17.5 శాతం పెరుగుతోంది. గ్రామీణ, సబర్బన్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెంచే లక్ష్యంతో కేంద్రం కూడా నిధులను వినియోగిస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో మోటార్ పంపుల అవసరం అంతకంతకూ పెరిగేదే కానీ తగ్గదని మార్కెట్ వర్గాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి. గత ఏడాది మూడు కోట్ల టర్నోవర్ సాధించిన పంప్ కార్ట్ ఈ ఏడాది పాతిక కోట్లకు గురిపెట్టింది. ప్రస్తుతం పంపుల అమ్మకాల్లో ఆన్ లైన్ లో పయనీర్ గా ఉన్న పంప్ కార్ట్ కు ఈ లక్ష్యం సాధించడం పెద్ద కష్టమేం కాదు.

As an IT engineering graduate... i am passionate to know about new and innovative ideas and explore them.....

Related Stories

Stories by SOWJANYA RAJ